Read more!

English | Telugu

సినిమా పేరు:మొగుడు
బ్యానర్:లక్ష్మి నరసింహ
Rating:2.00
విడుదలయిన తేది:Nov 4, 2011

కథ - ఈ సినిమా కథ విషయానికొస్తే "నిన్నే పెళ్ళాడుతా" ఫ్లేవర్ మార్చి కథని పాడుచేస్తే ఈ సినిమా కథవుతుంది. ఆంజనేయ ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) దివి సీమలోని అవనిగడ్డ నుంచి హైదరాబాద్ కి వచ్చి, తనకు తెలిసిన వ్యవసాయంతో కృషీవలుడిగా రాష్ట్రపతి అవార్డునందుకుని, పెళ్ళిచేసుకుని నలుగురు పిల్లలను (ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి) కని, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకుంటాడు. ఆంజనేయ ప్రసాద్ కొడుకు బుజ్జి (గోపీచంద్) కొడుక్కి నచ్చిన చాముండేశ్వరి అనే రాజకీయ నాయకురాలి కూతురు రాజరాజేశ్వరి (తాప్సి) అనే అమ్మాయితో పెళ్ళి చేస్తాడు. అప్పగింతల్లో జరిగిన అర్థం లేనిఒక భారీ గొడవ కారణంగా పెళ్ళి కూతురు తాళి తెంచి పెళ్ళి కొడుకు ముఖాన కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - ఈ సినిమాలో అక్కడక్కడ ఒకటి రెండు సీన్లలో కృష్ణ వంశీ మార్కు కనపడుతుందే కానీ ఇది కృష్ణ వంశీ సినిమా అని గట్టిగా చెప్పలేం. ఒక విధంగా చెప్పాలంటే టి.వి.సీరియల్ కి సినిమా ఫ్లేవర్ అద్దే ప్రయత్నం చేశాడు కృష్ణ వంశీ. చాలా సందర్భాల్లో కృష్ణవంశీ రాజీ పడ్డాడని అతని సినిమాలు చూసే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకలా రాజీపడ్డాడో కారణాలు తెలియవు. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉండటం ఈ చిత్రానికి ప్రథాన మైనస్. అందులోనూ ఈ కథ ఇంట్రవెల్ బ్యాంగ్ లో అప్పగింతలప్పుడు గౌరీ దేవిని తీసుకు రమ్మని పెళ్ళి కూతుర్ని ఆంజనేయప్రసాద్ అడగటం, ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ కాస్త కృతకంగా ఉన్నా, అర్థం లేని ఎమోషన్ క్యారీ అయ్యేలా చూశాడు దర్శకుడు...

ఇక మారిషస్ ఎపిసోడ్ లో శ్రద్ధా దాస్, గోపీచంద్, తాప్సిల మధ్య జరిగే సీన్లు ఆడియన్స్ కి నచ్చే స్థాయిలో పండినట్లు కనిపించవు. అక్కడ వేణు మాధవ్ కామెడీ అస్సలు పండలేదు...అలాంటి కామెడీ ట్రాక్ లు నిజానికి కృష్ణవంశీ శైలికి విరుద్ధం. మరి అలాంటిది ఎందుకు పెట్టాడో అర్థం కాదు. ఇక క్లైమాక్స్ లో హీరో గోపీచంద్ పాత్ర తన్నులు తినటం, ఆ పాత్ర ప్రవర్తించే తీరూ, రోజా పాత్ర బిహేవియర్, తల్లిని కూతురు కొట్టటం, తాప్సి తన సోదరుణ్ణి "బాస్టర్డ్" అని తిట్టటం వంటివి కాస్త ఇబ్బంది కలిగించినా మొత్తానికి అమాయక ప్రేక్షకులకు ఫరవాలేదనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు మాత్రం కృష్ణవంశీ సినిమా రేంజ్ లో లేవు...

నటన - హీరో గోపీచంద్ నటన బాగున్నా, ఎమోషనల్ సీన్లలో డైలాగ్ మాడ్యులేషన్ మీద ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. విచిత్రంగా ఈ సినిమాలో తాప్సి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పటం ప్రశంసించాల్సిన విషయం. నటన పరంగా తాప్సీ ఒ.కె. కానీ డైలాగ్ మాడ్యులేషన్ లో గోపీచంద్ లానే తను కూడా జాగ్రత్త తీసుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ తన పాత్రకు చక్కగా న్యాయం చేశాడు. ఆయన చాలా మంచి నటుడు. ఆయన ఈ సినిమాలో కన్నా "ఎర్రమందారం, పుణ్యస్త్రీ, ఆ నలుగురు" వంటి అనేక చిత్రాల్లో ఇంకా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు. కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు మహానటుడు యస్.వి.రంగారావుతో దర్శకుడు కృష్ణ వంశీ ఆయన్ని పోల్చటం మాత్రం అతిశయోక్తిగా, అసహజంగానూ అనిపించింది...దీన్ని బట్టి చూస్తే కృష్ణ వంశీకి నటన మీద ఉన్న అవగాహనా రాహిత్యానికిది నిదర్శనం. నరేష్, రోజా నటన ఒ.కె. ఆహుతి ప్రసాద్ గుక్కతిప్పుకోకుండా చెప్పిన దీవెన రీల్ వేస్టనిపించేదే కానీ ఆకట్టుకోలేదు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఇందులో ఆహా...అని చెప్పుకోతగ్గ గొప్ప పాటలేం లేవు...రీ-రికార్డింగ్ చూస్తే ఏదైనా సర్కస్ లో ఆర్కెస్ట్రా వాయించే మనిషితో చేయించినట్టుగా ఉంది.

సినిమాటోగ్రఫీ - ఇది యావరేజ్ గా ఉంది. సెల్లార్ లో జరిగే యాక్షన్ సీన్లో ఎందుకు గ్రీన్ టింట్ వాడారో అర్థం కాదు. ఇలా చెప్పాలంటే...ఎందుకులెండి....!

మాటలు - చాలా యావరేజ్ స్థాయిలోనే ఉన్నాయి ఈ చిత్రంలోని మాటలు. "తాళి ఆడదాని గుండెల మీద మగాడి గుండెల్లోనూ ఉండాలి"అనే మాట మాత్రం బాగుంది.

పాటలు - ఈ చిత్రంలోని పాటలు సాహిత్యపరంగా సగటు, అంతకన్నాతక్కువ స్థాయిలోనే ఉన్నాయి.

ఎడిటింగ్ - ఇంకా షార్ప్ గా కట్ చేసి ఉండాల్సింది. ఆర్ట్ - ఈ సినిమాలో ఈ డిపార్ట్ మెంట్ కాస్త ఎఫిషియంట్ గా పనిచేసిందని చెప్పాలి.

కొరియోగ్రఫీ - ఫరవాలేదు...డ్యూయెట్లో కూడా సివంగిలు, చిరుతపులి వాడొచ్చని ఈ సినిమా తెలియజెప్పింది.

యాక్షన్ - ఒ.కె.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మానవ సంబంధాలు మెరుగుపరుస్తూ, మొగుడనేవాడెలా ఉండాలో చూపించే ప్రయత్నం చేశాననీ, సమాజాన్ని ఉద్ధరించే సినిమా అనేలా యాడ్లు తయారుచేసిన కృష్ణవంశీ ఆ ప్రయత్నంలో ఎంతవరకూ సఫలీకృతుడయ్యాడో , సాహసంతో ఈ సినిమా చూసి ప్రేక్షకులే తెలుసుకోవాలి.