Read more!

English | Telugu

సినిమా పేరు:మగధీర
బ్యానర్:గీతా ఆర్ట్స్
Rating:3.50
విడుదలయిన తేది:Jul 31, 2009
హర్ష (రామ్ చరణ్‍ తేజ)అనే కుర్రాడు సాహస ప్రియుడు. అతను బైక్ రేసుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. అతను ఒకసారి అనుకోకుండా ఇందు (కాజల్‍ అగర్వాల్‍) అనే అందమైన అమ్మాయిని తాకుతాడు. ఆమెను అలా టచ్ చేయగానే అతనికితెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అతనికి పూర్వజన్మ గుర్తుకు వస్తుంది. దాంతో అతను ఆమె ప్రేమలో పడతాడు. రఘువీర్ అనే అతను కూడా ఇందు వెంటపడుతూంటాడు. నిజానికి హర్ష పోయిన జన్మలో కాలభైరవుడనే యోధుడు. అది నాలుగు వందల సంవత్సరాల క్రిందటి సంగతి. 1609లో ఉదయ్ ఘడ్ అనే రాజ్యానికి సైనిక శిక్షకుడిగా కాలభైరవుడుండేవాడు. అతన్ని ఆ రాజు (శరత్‌బాబు) కుమార్తె యువరాణి మిత్రవింద (కాజల్‍ అగర్వాల్‍)కాలభైరవుణ్ణి ప్రేమిస్తుంది. కానీ రాజుకు బంధువైన సేనాధిపతి రణధీర్ (దేవ్ గిల్‍) మిత్రవిందను కామిస్తాడు. ఉదయ్‌ఘడ్‌ను ఆక్రమించాలని షేర్‌ఖాన్ (శ్రీహరి) అనే ముస్లిమ్ చేసే ప్రయత్నంలో రణధీర్‌ అతనికి సహకరిస్తాడు. కానీ ఆ యుద్దంలో కాలభైరవుడు వీరోచితంగా పోరాడి అశువులు బాస్తాడు. శత్రువైనా అతని ధైర్య సాహసాలకు, వీరత్వానికి షేర్‌ఖాన్ జోహారు చేస్తాడు. అయితే అప్పుడు జరిగిన యుద్ధంలో అందరూ మరణిస్తారు. వారంతా నాలుగొందల సంవత్సరాలకు మళ్ళీ జన్మించటం విశేషం. అయితే అప్పుడు కలవలేకపోయిన కాలభైరవుడు, మిత్రవిందలు, ఇప్పుడు హర్ష, ఇందులుగా కలుస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది కథ.
ఎనాలసిస్ :
దర్శకుడిగా రాజమౌళికి ఇంతవరకు పరాజయం లేదు. దానికి అతని దీక్ష, అంకితభావం, సినిమా అంటే అతనికి ఉన్నపిచ్చి ప్రేమ, శ్రద్ధ, అతని క్రమశిక్షణ, అభిమానమే కారణాలు కావచ్చు. తెలుగు సినిమా చరిత్రలో అతనికి ఒక సముచిత స్థానం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ రేంజ్‍కి అతనిప్పుడే ఎదిగాడని చెప్పవచ్చు. కాకపోతే ఈ సినిమాలో మనకు కొద్దిగా "మిత్" చిత్రం లక్షణాలు కనపడతాయి. అయినా దానికీ దీనికీ ఎక్కడా సంబంధం ఉండదు. అతని సినీ కేరీర్‌లో ఇది ఒక ఆణి ముత్యంలా నిలిచిపోతుంది. ఇక ఈ చిత్రం టేకింగ్ పరంగా మనకు హాలీవుడ్ చిత్రాలను తలపిస్తుంది. ఈ మధ్య కాలంలో రాని ఒక అద్భుత చిత్రంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని 40కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆ రిచ్‌నెస్‌ ఈ చిత్రంలో అణువ అణువునా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్బుతంగా వున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: హీరో రామ్ చరణ్‍కి ఇది రెండవ సినిమా మాత్రమే. మొదటి చిత్రం "చిరుత"కీ ఈ చిత్రానికి అతని నటనలో చాలా పరిణితి కనపడింది. అతని బాడీ లాంగ్వేజ్‍లే కానీ, డైలాగ్‌ మాడ్యులేషన్‌లో కానీ, డిక్షన్‌లో కానీ, డ్యాన్సుల్లో కానీ, ఫైట్స్ లో కానీ చాలా మంచి అభివృద్ధి కనపడింది. ఇక గుర్రపు స్వారీలో అతని నేర్పరితనం మెచ్చుకోవాల్సిందే. అతని గాత్రం గతంలో చిరంజీవి హీరోగా నటించిన తోలి నాళ్ళల్లోని గాత్రంలా ఉన్నట్లుంది. గత చిత్రంతో పోలిస్తే అతని నటనలో చక్కని ఈజ్ కనపడింది. దానికి తోడు అతని కండలు తిరిగిన శరీరాకృతి కాలభైరవుడి పాత్రకు అతికినట్టు సరిపోయింది. అలాగే మోడ్రన్ యువకుడిగా కూడా అతను నేటి యువతరానికి ప్రతీకగా, రోల్‍ మోడల్‍గా కనిపిస్తాడు. హీరోయిన్ కాజల్‍ అగర్వాల్‍ మిత్రవింద పాత్రలో ఆ పాత్ర కోసమే పుట్టిందన్నట్టుగా ఉంది. బహుశా ఆ పాత్ర ఆమె కలల పాత్ర కాబట్టే ఆమె అలా లీనమై నటించిందేమో. విలన్‌గా బాలీవుడ్ నటుడు దేవ్‌గిల్‍ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఇక శ్రీహరి షేర్ ఖాన్ గా శ్రీహరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతని డైలాగ్ మాడ్యూలేషన్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్‍ కానీ చూడాలి తప్ప మాటల్లో చెప్పలేం. అలాగే రెండవ జన్మలో అతను మాట్లాడే శ్రీకాకుళం యాస ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఉన్నది అతికొద్ది సేపే అయినా అఘోరా సాధువుగా రావు రమేష్ మెరుపులు మెరిపిస్తాడు. నటుడికి ఎంత పెద్ద పాత్ర లభించింది అనేది కాదు, ఎంత శక్తివంతమైన పాత్ర లభించిందనేది ముఖ్యం. అది రావు రమేష్ కి ఈ చిత్రంలో లభించింది. బ్రహ్మానందం, హేమ, సునీల్‍ ప్రేక్షకులను నవ్వించటానికి గట్టి ప్రయత్నమే చేసినా, వీరిలో సునీల్‍ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. మిగిలిన వాళ్ళంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో కనిపించి ఆయన అభిమానులకూ, ప్రేక్షకులకు కనువిందు చేశారు. సంగీతం-: కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. పాటలన్నీ సందర్భోచితమైన సంగీతంతో ఆకట్టుకుంటాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించటమే కాక ఒక పాట కూడా వ్రాయటం విశేషం. "నీ కోసం జుట్టు పీక్కుంటే" అనే పాట ఆయనే రచించి స్వరబద్ధంచేశారు. యువతనాకట్టుకునేలా ఉన్న ఈ పాటకు, "పంచదార బొమ్మ" అనే చక్కని మెలోడీ పాటకూ ప్రేక్షకుల నుంచు మంచి స్పందన లభించగా, పాతికేళ్ళక్రితం కీరవాణే స్వరబద్ధం చేయగా, చిరంజీవి నటించిన "ఘరానామొగుడు" చిత్రంలోని "బంగారు కోడిపెట్ట" అనే పాటకు మరింతగా ప్రేక్షకులు స్పందించారు. ఇక్కడ క్లిక్‌ చేస్తే మీరు "బంగారు కోడిపెట్ట...'' సాంగ్‌ చూడవచ్చు. ఇంకేందుకు ఆలస్యం క్లిక్‌ చేయండి మరి. ఇవన్నీ ఒకెత్తయితే "ధీర ధీర మగధీర" అనే టైటిల్‍ సాంగ్ మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో రాజమౌళి పనితనం ఎక్కువ కనపడుతుంది. ఈ పాటను పిక్చరైజేషన్ చేసిన తీరు మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక రీ-రికార్డింగ్ కానీ, సౌండ్ ఎఫెక్టులు కానీ ప్రేక్షకులను ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి. సినిమాటోగ్రఫీ-: సెంథిల్‍ మనకు అంటే తెలుగు తెరకు దొరికిన ఒక మణిపూస. అతని కేమెరా పనితనం అద్భుతం. రాజమౌళికి ఏం కావాలో, ఎలా కావాలో బాగా తెలిసిన వ్యక్తి సెంథిల్‍. వాళ్ళిద్దరి వేవ్ లెంత్ అలా కలవబట్టే ఈ చిత్రం ఇంతద్భుతంగా వచ్చిందనుకోవాలి. గ్రాఫిక్స్ కానీ, త్రీడి ఎఫెక్టులు కానీ ఈ చిత్రంలో సహజంగా కనపడతాయి. ఈ చిత్రంలోని కొన్ని షాట్స్‌ చూస్తుంటే ఒరిజినల్‌ షాట్‌కి, గ్రాఫిక్స్‌ షాట్‌కి తెడా తెలియడం లేదు. అంటే గ్రాఫిక్‌ షాట్‌ కూడా అంత నీట్‌గా తీసినందుకు సెంథిల్‍ని అభినందించక తప్పదు. అతని సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్‍. ప్రతి ఫ్రేం లోనూ అతని శ్రద్ధ, కష్టం మనకు కనపడుతాయి. ఈ చిత్రాన్ని చారిత్రక దృశ్య కావ్యంలా మలచటానికి అతని కృషి శ్లాఘనీయం. మాటలు-: యమ్.రత్నం మాటలు సందర్భోచితంగా చాలా బాగున్నాయి. పాటలు-: పాటలన్నీ బాగున్నాయని చేపితే చర్విత చర్వణమే అవుతుంది. ఆర్ట్ , స్టైలింగ్ -: ఈ చిత్రానికి మరో ప్లస్ ఆర్ట్. రవీందర్ ఆర్ట్ పనితనం గురించి ఎంత రాసినా తక్కువే. అవి నిజంగా సెట్టింగులా లేక అలాంటి కోటదగ్గరకెళ్ళి షూట్‍ చేశారా అన్నట్టుగా ఉంది ఆర్ట్ పనితనం. అలాగే స్టైలింగ్ కూడా. శ్రీమతి రమారాజమౌళి కాస్టూమ్స్ డిజైనింగ్ కూడా. నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం మనుషులు ఎలాంటి బట్టలు వేసుకుంటారో మనం ఊహించటం చాలా కష్టం. అలాంటిది నిజంగా ఆ రోజుల్లో అలాగే ఉండేవారేనేమో అన్నట్టుగా కాస్టూమ్స్ ఉన్నాయి. యాక్షన్-: సాంకేతికంగా తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందనటానికి ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు చూస్తే చాలు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు కాలానికి తగ్గట్టుగా మనకు కనపడతాయి. ఇందుకు రామ్-లక్ష్మణ్‍, పీటర్ హెయిన్స్ లను అభినందించాలి. వీరిద్దరూ పోటా పోటీగా యాక్షన్ సీన్లను కంపోజ్‍ చేశారు. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన చిత్రం. చూడకపోతే ఒక మంచి చిత్రాన్ని మీరు మిస్సయినట్లే. ఒకసారి చూస్తే రెండోసారి మీరే మళ్ళీ చూస్తారు.