Read more!

English | Telugu

సినిమా పేరు:బాణం
బ్యానర్:త్రీ ఏంజెల్స్ స్టూడియో
Rating:2.50
విడుదలయిన తేది:Sep 16, 2009
నక్షలైట్ నాయకుడు చంద్రశేఖర్ పాణిగ్రాహి (షాయాజీ షిండే) పోలీసులకు లొంగిపోతాడు. అతని కొడుకు భగత్ పాణిగ్రాహి (నారా రోహిత్) గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూంటాడు. ఐ.పి.యస్. ఆఫీసర్ అవ్వాలన్నది అతని జీవితాశయం. ఆ ఊర్లో శక్తి పట్నాయక్ (రణధీర్)అనే గూండా ఉంటాడు. అతనెంత దుర్మార్గుడంటే కన్నతండ్రినే చంపేటంత. అతనికి సాధు పట్నాయక్ (పిళ్ళా ప్రసాద్) అనే బాబాయ్ ఉంటాడు. వీళ్ళిద్దరికీ పడదు. సుబ్బలక్ష్మీ(వేదిక) అనే ఒకమ్మాయికి పెళ్లవుతుంది. కట్నం డబ్బులు ఇవ్వలేదని ఆమెను రైల్వే స్టేషన్‌లోనే వదిలేసి వెళ్తారు ఆమె అత్త, మామ, భర్త. ఆమె డబ్బులు తెస్తానని వెళ్ళిన తన తండ్రి కోసం ఉదయం నుండీ సాయంత్రం వరకూ అమాయకంగా ఎదురుచూస్తూ ఉంటుంది. సుబ్బలక్ష్మిని గమనించిన భగత్ ఆమె ఇంటికి ఫోన్ చేస్తే ఆమె తండ్రి మరణించాడనే వార్త తెలుస్తుంది. ఈ విషయం ఆమెకు చెప్పకుండా ఆమె అత్తారింటికి ఆమెను తీసుకెళ్తాడు. కానీ వాళ్ళామె తమకు అక్కర్లేదని చెపుతారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో భగత్ ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. ఆమెను కాలేజీలో చేర్పించి చదివిస్తుంటాడు భగత్. ఒకరోజు ఆమె భర్త ఆమెను ఒక లాడ్జికి రమ్మని లెటర్ వ్రాస్తాడు. ఆ లెటర్ తీసుకుని ఆమె అత్తగారింటికి వెళ్తాడు భగత్. సుబ్బలక్ష్మీ అక్కడ తన మెడలోని తాళిని తీసివేస్తుంది. ఆమె భగత్ మోటర్ బైక్ మీద ఎక్కటం చూసిన సుబ్బలక్ష్మి భర్త మందుకొడుతూ తన స్నేహితుడి వద్ద తన భార్యని తనకు కాకుండా చేసిన భగత్ గురించి చెపుతాడు. అతని సాయంతో శక్తి అసిస్టెంట్‍గా ఉండే సాహు దగ్గరికి వెళతాడు. అతన్ని తీసుకుని భగత్ ఇంటికి వెళ్తాడు సుబ్బలక్ష్మి భర్త. అక్కడ సాహుని ముఖం పగిలేలా కొడతాడు భగత్. దాంతో పగబట్టిన సాహు మరికొంతమందితో భగత్ మీద దాడి చేయటానికి వెళ్తాడు. ఇద్దరిని తనతో తీసుకుని మిగిలిన వాళ్ళను వెళ్ళమంటాడు సాహు. భగత్ కొట్టిన దెబ్బలకు సాహు చస్తాడు. దాంతో పోలీసులు అతన్ని అరేస్ట్ చేస్తారు. తన అసిస్టెంట్‍ని భగత్ చంపాడని తెలుసుకున్న శక్తి ఆ కేసుని విత్ డ్రా చేసుకుంటాడు. భగత్ గ్రూప్ వన్ ఇంటర్ వ్యూ కి వెళ్ళి సెలెక్టవుతాడు. అతను ట్రయినింగ్ కి వెళ్తూండగా శక్తి తన మనుషులతో వచ్చి భగత్ ని బాగా కొడతాడు. ఆ దెబ్బల నుంచి కోలుకున్న భగత్ తనకు నలుగురు ట్రైనింగ్ అవుతున్న పోలీసాఫీసర్లనిమ్మని, వాళ్లతో ఆ శక్తిని అంతం చేస్తానని ఆ ట్రైనింగ్ క్యాంప్ అధికారి (భానుచందర్)ని అడుగుతాడు. ఆ అధికారి అతనడిగినట్లే నలుగుర్ని ఇస్తాడు. ఆ తర్వాత ఏంజరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ కథని సినిమా తీయటమనేది ఒక ఛాలెంజ్‍. అదీ ఆసక్తికరంగా ఇలాంటి ఒక విభిన్నమైన కథని సినిమాగా తీయటం మరీ కష్టం. రొటీన్ ఫార్ములా సినిమాల నుంచి విభిన్నత కోరుకునే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే ఈ సినిమా కాస్త నిదానంగా నడుస్తున్నట్లనిపిస్తుంది. మామూలుగా అన్ని సినిమాల్లో ఉండే కమర్షియల్ హంగులీ చిత్రంలో కనిపించవు. దర్శకత్వం బాగుంది. దర్శకుడు చైతన్య దంతులూరి టేకింగ్ బాగుంది. ఈ చిత్ర కథనంలో ఇంకొంచెం స్పీడ్ పెంచి ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. అది విలన్ కావచ్చు, హీరో కావచ్చు, లేదా మరే పాత్రన్నా కావచ్చు, ఈ చిత్రంలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం ఉంది. కాకపోతే ఎంటర్‍టైన్‌మెంట్ లోపించటం ఈ సినిమాకి పేద్ద లోపం. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: నారా రోహిత్‌కు ఇది తొలి చిత్రమైనా ఆ తడబాటు అతనిలో కనిపించదు సరికదా అతని నటనలోకానీ, డైలాగ్ డెలివరీలో కానీ అతని ఆత్మవిశ్వాసం బలంగా కనిపిస్తుంది. భగత్ పాత్రకు అతను సరిగ్గా సరిపోయాడు. అతని రూపంలో తెలుగు తెరకు రొటీన్ కి భిన్నంగా ఒక మంచి హీరో లభించాడని చెప్పవచ్చు. అతని కళ్ళు చిన్నవైనా చూపులో పదునుంది. అతని గాత్రంలో గంభీరత ఉంది. హీరోగా అతనికి మంచి భవిష్యత్తుంది.ఇక వేదిక హీరోయిన్ గా ఒ.కె. ఇక నక్షలైట్‍ నాయకుడిగా షాయాజీ షిండే ఆ పాత్రలో చక్కగా నటించాడు.పోలీసాఫీసర్ గా రాజీవ్ కనకాల నటన ప్రేక్షకులనాకట్టుకుంటుంది. విలన్ పాత్ర ధారి రణధీర్ కూడా బాగా నటించాడు. ఎ.వి.యస్. కామెడి పెద్దగా పండలేదనే చెప్పాలి. సంగీతం -: చాలాకాలానికి మణిశర్మ నుంచి ఈ చిత్రం ద్వారా మంచి సంగీతం వినవచ్చు.పాటలన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కొంచెం విభిన్నంగా సాగింది. అయినా బాగుంది. మాటలు-: ఈ చిత్రానికి మాటలు చాలా ప్లస్సయ్యాయని చెప్పాలి. గంధం నాగరాజు కలం ఎలాంటిదో "గమ్యం" చిత్రమే చెప్పింది. ఈ చిత్రంలో ఆ కలం పదును మరింత పెరిగింది. వేదిక "మేం బ్రాహ్మలం. మీరెవరు...?" అనడిగితే "300 సంవత్సరాల నుంచీ అదే గోల" అని షాయాజీ షిండే అనటం, "శక్తి కొట్టింది నా శరీరాన్నే కానీ, నా ధైర్యాన్ని కాదు. ఇంటికెళ్ళేటప్పుడు వెతుక్కోండి మీరు పారేసుకున్న ధైర్యం ఎక్కడన్నా దొరుకుందేమో" అనే హీరో డైలాగ్, "నా కొడుకు ఒక గూండాని చంపితే, మీరు డబ్బులు తీసుకోకుండా ఫరవాలేదంటూ మమ్మల్ని అవమానిస్తున్నార్రా. ఆ గూండాలని కాదు కొట్టాల్సింది. మిమ్మల్ని కొట్టాలి. మీలోని భయం పోయేదాకా కొట్టాలి." షాయాజీ షిండే అనేటటువంటి మాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని మాటలు, క్లుప్తంగా, అర్థవంతంగా, సూటిగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ-: చాలా బాగుంది. ఈ సినిమాని ఆహ్లాదకరంగా చూపించటంలో కేమెరా పనితనం బాగుంది. అంతేగాక చక్కని లొకేషన్లను మరింత అందంగా చూపించటంలో ఫొటోగ్రఫీ నయనానందకరంగా ఉంది. ముఖ్యంగా పాటల్లో. ఆర్ట్-: బాగుంది. ఎడిటింగ్-: క్రిస్ప్ గా కట్‍ చేశారు. చాలా బాగుంది. యాక్షన్-: రామ్-లక్ష్మణ్‍ ఈ చిత్రంతో తొలిసారి సహజ సిద్ధంగా ఉండేలా యాక్షన్ సీన్లను కంపోజ్‍ చేశారు. ఉన్న రెండు ఫైట్లూ బాగున్నాయి. కొరియోగ్రఫీ-: చాలా నీట్‍గా ఉంది. పిచ్చి పిచ్చి స్టెప్పుల్లేవు. మైధుసంగమానికి వెంపర్లాడే జంతు కదలికలు అస్సల్లేవు. అనవసరంగా పక్కన ఓ పాతికమంది అమ్మాయిలూ, ఓ పాతిక మంది అబ్బాయిలూ కలసి హీరో, హీరోయిన్ల పక్కన పూనకం పూనిన వారిలా ఎగరాటాల్లేవు (ఒక్కపాటలో తప్ప). రొటీక్‌ ఫార్ములా సినిమాల నుంచి విభిన్నత కోరుకునే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే ఈ సినిమా కాస్త నిదానంగా నడుస్తున్నట్లనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి సినిమాని మాస్ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో ఓ రెండు వారాల తర్వాత గానీ చెప్పలేం.