Read more!

English | Telugu

సినిమా పేరు:180
బ్యానర్:SPI Cinemas and Aghal Films
Rating:2.50
విడుదలయిన తేది:Jun 25, 2011

కథ - ఒక పిల్లాడు వారణాశిలో తన తండ్రికి పిండ ప్రదానం చేసి వెంటనే తన బొమ్మ కారుతో ఆడుకుంటుంటాడు. ఆ పిల్లాడే సిద్ధార్థకి స్ఫూర్తిగా నిలుస్తాడు. తన అసలు పేరు ఎజె (అజయ్ కుమార్)ని మార్చేసి ఆ పిల్లాడి పేరు మనూ అన్న పేరుతో చెన్నైకి వెళ్లి హ్యాపీగా బ్రతుకుతూంటాడు. అక్కడ అతనికి ఒక ఫొటో జర్నలిస్ట్ విద్య(నిత్య మీనన్) పరిచయమవుతుంది. ఆమె అతన్ని ప్రేమిస్తున్నానంటుంది. ఆ సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అవటంతో ఆమెను అమెరికా తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమెను కాపాడటానికి అతను అమెరికా తీసుకెళతాడు. ఫ్లాష్ బ్యాక్ లో సిద్ధార్థ అమెరికాలో ఒక డాక్టర్. అతనికి ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఇంటీరియర్ డిజైనర్, ప్రియాతి ప్రియమైన భార్య (ప్రియా ఆనంద్) ఉంటుంది. చాలా హ్యాపీగా సాగుతున్న జీవితంలో మూడు నెలలు గడిచేసరికి క్యాన్సర్ కారణంగా సిద్ధార్థ ఆరు నెలల (180 రోజులు) కన్నా ఎక్కువ రోజులు బ్రతకడని తెలుస్తుంది. దాంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్టు అమెరికాలో భార్య ప్రియా ఆనంద్ కి కలరిచ్చి చెన్నైకి వచ్చి హ్యాపీగా బ్రతికేస్తుంటాడు. నిత్య మీనన్ కోసం అమెరికా తిరిగి వచ్చిన సిద్ధార్థ ఏం చేశాడు....? తన భార్యని కలిశాడా...? అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - దర్శకత్వం - ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జయేంద్ర గతంలో యాడ్ ఫిలింస్ కి దర్శకత్వం వహించారు. అంటే యాడ్ ఫిలింస్ లో 25 సెకండ్లలో చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాలి. కానీ సినిమా అలాకాదు. ఈ రెంటికీ ఉన్న తేడాని జయేంద్ర బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇక ఈ సినిమా దర్శకత్వం విషయానికొస్తే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త స్పీడ్ గానే గడిచినా సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఒక విధంగా దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. ఇక సిద్ధార్థకి తనకు క్యాన్సర్ అని తేలిసిన తర్వాత వికృతంగా ఉండే ఒక భారీ నీగ్రో కనపడుతూంటాడు. అంటే మృత్యువులా అతన్ని సింబాలిక్ గా చూపించారు. కాని ఈ ప్రక్రియను "అందమైన అనుభవం" అనే సినిమాలో కె.బాలచందర్ ఎప్పుడో చూపించారు. జయప్రదను ఒక వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని ఆ సినిమాలో వెంటపడుతూంటాడు. మొత్తానికి చాలా క్లాస్ గా ఒక ప్రయోజనాన్ని ఆశించి తీసిన సినిమాగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. మరి మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకూ నచ్చుతుంది అనే దాని మీద ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

నటన - సిద్ధార్థ తన శక్తి వంచన లేకుండా నటించినా, అతని నటనలో కొన్ని సందర్భాల్లో...అంటే తనకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తన భార్యతో ప్రవర్తించే తీరులో కమల్ హాసన్ ప్రభావం కాస్త స్పష్టంగానే కనపడుతుంది. ఇక నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ లు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. ప్రియా ఆనంద్ బాగా నటించటానికి బాగానే కష్టపడింది. ఇక గీత, మౌళి, తనికెళ్ళ భరణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఈ సినిమాలోని సంగీతం గురించి ప్రత్యేకంగా వ్రాయాలి. శరత్ ఈ సినిమాకి రొటీన్ కు భిన్నంగా ఉండేలా ప్రత్యేకమైన సంగీతాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో చాలా వరకూ సఫలీకృతుడయ్యాడు. పాటలన్నీ బాగున్నా "నీ మాటలో మౌనం నేనేనా" అమ్మ పాట మనసుకు హత్తుకుంటుంది. రీ-రికార్డింగ్ సందర్భోచితంగా ఉండి బాగుంది.

సినిమాటోగ్రఫీ - ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ అని చెప్పాలి. సినిమా ఓపెనింగ్ లో సిద్ధార్థ కాశీలో గంగలోంచి పైకి లేచే సీన్లో షాట్లు అద్భుతంగా ఉన్నాయి. అలాగే పేపర్ బోయ్స్ తో సిద్ధార్థ పాడే పాటలో కూడా ఫొటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది. ఇవి ఉదాహరణగా మాత్రమే చెప్పాను. కానీ ఇలాంటి చక్కని షాట్స్ సినిమా అంతా బోలెడున్నాయి.

పాటలు - పాటల్లో సాహిత్యం సినిమా కథను క్యారీ చేస్తూ బాగుంది.

మాటలు - ఈ సినిమాలోని మాటలు గొప్పగా లేకపోయినా రీజనబుల్ గా ఉన్నాయి.

ఎడిటింగ్ - బాగుంది.

ఆర్ట్ - చక్కగా ఉంది.

కొరియోగ్రఫీ - ఈ సినిమాలోని కొరియోగ్రఫీ సింపుల్ గా, నీట్ గా ఉంది.

యాక్షన్ - ఈ సినిమాలో హింస, రక్తపాతాల్లేవు కనుక ఈ సినిమాలో యాక్షన్ కి తావే లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తెలుగువన్ ఫైనల్ వర్డ్ - ఇదొక విభిన్నంగా ఉండే క్లీన్ మువీ. ఏ అసభ్యత, అశ్లీలతా లేని కుటుంబ సభ్యులతో చూడతగిన కొద్దో గొప్పో మంచి సినిమా ఇది. కానీ ఇలాంటి మంచి సినిమాలను మనం పెద్దగా చూడం కదా మరి.....