English | Telugu

మెగా హీరోతో 'రాధేశ్యామ్' డైరెక్టర్ మూవీ!

మెగా హీరోతో 'రాధేశ్యామ్' డైరెక్టర్ మూవీ!

 

గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' సినిమాతో రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2015లో వచ్చిన ఈ చిత్రం మోస్తరుగానే ఆడినప్పటికీ.. తన స్టైలిష్ మేకింగ్ తో డైరెక్టర్ రాధాకృష్ణ ఆకట్టుకున్నాడు. దీంతో 'జిల్' చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేషన్స్.. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో 'రాధేశ్యామ్' చేసే అవకాశాన్ని ఇచ్చింది. కానీ, రాధాకృష్ణ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'రాధేశ్యామ్'.. 2022 మార్చిలో విడుదలై ఘోర పరాజయం పాలైంది. 

 

'రాధేశ్యామ్' డిజాస్టర్ కావడంతో.. మూడేళ్లయినా రాధాకృష్ణ మూడో సినిమాకి ముహూర్తం కుదరలేదు. మధ్యలో గోపీచంద్ తో సినిమా చేసే అవకాశముందని వార్తలొచ్చాయి. మొదటి సినిమా యావరేజ్, రెండోది డిజాస్టర్ అయినప్పటికీ రాధాకృష్ణ ప్రతిభపై నమ్మకంతో యు.వి. క్రియేషన్స్ ఆయనకు మూడో అవకాశం ఇచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. కొంతకాలంగా రాధాకృష్ణకి సంబంధించిన న్యూసే రావట్లేదు. ఇలాంటి సమయంలో సడెన్ గా ఆయనకు కొత్త ఓకే అయిందన్న వార్త ఆసక్తికరంగా మారింది.

 

మెగా హీరో వరుణ్ తేజ్ ని కలిసి ఇటీవల రాధాకృష్ణ ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో వరుణ్ తేజ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. వరుణ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కొరియన్ కనకరాజ్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తుండటం విశేషం. దర్శకుడు రాధాకృష్ణ.. యు.వి ద్వారానే వరుణ్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు టాక్. ఇది లవ్ స్టోరీ అని, దీనిని కూడా యు.వి. క్రియేషన్స్ నిర్మించనుందని అంటున్నారు.

 

వరుణ్ తేజ్ కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ మూడేళ్ళలో గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వంటి ఘోర పరాజయాలు పలకరించాయి. అందుకే 'కొరియన్ కనకరాజ్'తో సత్తా చాటి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే ఇలాంటి సమయంలో.. 'రాధేశ్యామ్'తో డిజాస్టర్ అందుకున్న రాధాకృష్ణతో సినిమా చేయడానికి సిద్ధపడటం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. మరి ఇది వరుణ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.