English | Telugu

తల్లులుగా మారుతున్న గ్లామర్‌ హీరోయిన్లు.. ఆ విషయంలో తగ్గేదేలే!

తల్లులుగా మారుతున్న గ్లామర్‌ హీరోయిన్లు.. ఆ విషయంలో తగ్గేదేలే!

ఏ సినిమాకైనా హీరో, హీరోయిన్‌ ఇద్దరూ ప్రధానమే. హీరో విషయానికి వస్తే.. అతను చేసే యాక్షన్‌, చెప్పే డైలాగ్స్‌.. అంటే ప్రేక్షకులు ఇష్టపడతారు. ఇక హీరోయిన్‌ విషయానికి వస్తే.. పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉన్నా గ్లామర్‌ని ఎక్కువగా చూస్తారు. హీరోయిన్‌ అంటే పాటలకే పరిమితం అనుకునేవారు. అయితే కొన్ని సినిమాల్లో వారి నటనకు ప్రేక్షకాదరణ లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాత రోజుల్లో గ్లామర్‌ హీరోయిన్లకు పెళ్ళి కానంత వరకే ఎక్కువ ఆదరణ ఉండేది. పెళ్లి తర్వాత వారికి ఆదరణ తగ్గడం, తద్వారా సినిమా అవకాశాలు కూడా తగ్గడం కొంతమందిలో చూశాం. కొందరు పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లుగా చలామణి అయినవారు ఉన్నారు. అయితే వారి శాతం చాలా తక్కువ. ఇక 1980వ దశకం వచ్చేసరికి హీరోయిన్లు గ్లామర్‌కే పరిమితమైపోయారు. ప్రేక్షకులు వాళ్లని అలా చూసేందుకే ఇష్టపడేవారు. నిజజీవితంలో పెళ్లి చేసుకోవడం కాదు కదా సినిమాల్లో కూడా పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లిగా నటిస్తే ప్రేక్షకులు చూసేవారు కాదు. అందుకే తల్లి పాత్రలకు హీరోయిన్లు సాధ్యమైనంత దూరంగా ఉండేవారు. 

ప్రేక్షకుల అభిరుచుల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ వుంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమాల ట్రెండ్‌ కూడా మారుతూ వచ్చింది. హీరోయిజం, గ్లామర్‌ మాత్రమే కాదు, సినిమాల్లో కథాబలం కూడా బాగుండాలి అనే ఆలోచన ప్రేక్షకుల్లో వచ్చేసింది. అందుకే దానికి అనుగుణంగానే సినిమాలు రూపొందిస్తున్నారు. బలమైన కథ, మంచి క్యారెక్టరైజేషన్‌ ఉంటే సినిమాలో నటించే ఆర్టిస్టులు ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకులు చూస్తున్నారు. హీరోయిన్లు అంటే గ్లామర్‌ మాత్రమే కాదు, వారిలోని నటనను కూడా చూడాలంటున్నారు. ఈ ధోరణి గత కొన్నేళ్ళుగా చిత్ర పరిశ్రమలో కనిపిస్తోంది. అందుకే గ్లామర్‌ హీరోయిన్లు తల్లి పాత్రలు పోషించేందుకు వెనుకాడడం లేదు. స్టెప్పులు వేయడం ద్వారానే కాదు, పిల్లల తల్లి పాత్రల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. 

ఇటీవలికాలంలో ఆ తరహా పాత్రల్లో మెప్పించిన హీరోయిన్‌ నయనతార. స్టార్‌ హీరోయిన్‌గా ఉంటూనే తల్లి పాత్రలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇక సమంత విషయానికి వస్తే.. చాలా కాలం నుంచి అలాంటి పాత్రలు చేస్తూనే ఉంది. తాజాగా ఓటీటీలో వచ్చిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో కూడా తల్లి సామ్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే మరో గ్లామర్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ కూడా తల్లి పాత్రలు పోషించారు. రవితేజ హీరోగా వచ్చిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ క్రాక్‌లో ఓ కొడుకుకి తల్లిగా నటించి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక త్రిష కూడా గతంలో వచ్చిన ఎంతవాడుగానీ, ఇటీవల విజయ్‌ హీరోగా వచ్చిన లియో చిత్రంలోనూ తల్లిగా నటించారు. ఈ తరహా పాత్రలు పోషించిన వారిలో ఇప్పటి యంగ్‌ హీరోయిన్లు కూడా ఉండడం విశేషం. లక్కీ భాస్కర్‌ చిత్రంలో మీనాక్షి చౌదరి ఒక అబ్బాయికి తల్లిగా నటించి మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ కూడా నలుగురు పిల్లలకు తల్లిగా నటించడం విశేషం. ఇలా ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు గ్లామర్‌ కంటే సినిమాలోని తమ క్యారెక్టర్‌కి ఉన్న ప్రాధాన్యం ఎంత అనేది చూస్తున్నారు. తల్లి పాత్రలు చేయడం వల్ల గ్లామర్‌ హీరోయిన్‌ అనే ముద్ర పోతుంది అనుకోకుండా ఆయా పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.