English | Telugu

అపరాధి మూవీ రివ్యూ

అపరాధి మూవీ రివ్యూ

 

నటీనటులు: ఫహాద్ ఫాజిల్, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌, సౌబీన్ షాహిర్ తదితరులు
రచయిత: సునీల్ యాదవ్
ఎడిటింగ్:  షమీర్ మహమ్మద్
సినిమాటోగ్రఫీ: జోమన్ టి జాన్
మ్యూజిక్: శ్రీరాగ్ షాజీ
నిర్మాతలు: ఆంటో జోసెఫ్, జోమన్ టి జాన్
దర్శకత్వం: నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్
ఓటీటీ:  ఆహా

 

కథ:
అలెక్స్ (సౌబిన్ షాహిర్‌) ఓ రైట‌ర్ క‌మ్ బిజినెస్‌మెన్‌. అత‌డు రాసిన న‌వ‌ల పెద్ద హిట్ట‌వుతుంది. అదే సమయంలో అర్చ‌న(ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌) అనే లాయ‌ర్‌ను ప్రేమిస్తాడు అలెక్స్‌. ఆమెతో క‌లిసి స‌ర్‌ప్రైజ్ వీకెండ్‌ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్‌లోనే అర్చ‌న‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌నుకుంటాడు. అయితే ఈ ట్రిప్‌కు ఫోన్స్ తీసుకురాకూడ‌ద‌ని అలెక్స్‌, అర్చ‌న కండీష‌న్స్ పెట్టుకుంటారు. ట్రిప్‌కు వెళుతోండ‌గా...వ‌ర్షం కార‌ణంగా ఓ కొండ ప్రాంతంలో అలెక్స్ కారు ట్ర‌బుల్ ఇస్తుంది. ద‌గ్గ‌రలో ఓ ఇళ్లు క‌నిపించ‌డంతో రాత్రికి అందులోనే ఉండాల‌ని అనుకుంటారు. ఆ ఇంట్లో ఉన్ని(ఫ‌హాద్ ఫాజిల్‌) ఒంట‌రిగా క‌నిపిస్తాడు. అలెక్స్‌, అర్చ‌న‌ల‌కు షెల్ట‌ర్ ఇవ్వ‌డానికి అంగీక‌రిస్తాడు. ఆ తర్వాత వారి లైఫ్ లో ఏం జరిగిందనేది మిగతా కథ.

 

విశ్లేషణ:
కథలని భిన్నంగా ఎంచుకోవడంలో మలయాళం సినిమాలు ముందు ఉంటాయి. ఈ సినిమా అదే కోవలోకి చెందుతుంది. ఎందుకంటే ఇందులో మూడు పాత్రలే ఉంటాయి. సినిమా నిడివి గంటన్నర మాత్రమే. అందులోనే సస్పెన్స్ థ్రిల్లర్ ని మేళవించి చక్కగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. నవలలు రాసే ఓ రచయిత లైఫ్ లో జరిగిన ఓ థ్రిల్లింగ్ మూమెంట్స్ ని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు తీసుకెళ్ళారు. 

ఇంట్లో డెడ్ బాడి కన్పించే వరకు సినిమా స్లోగా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. ఆ తర్వాత కథ ఫాస్ట్ గా వెళ్తుంది. ఒకరిపై ఒకరు చెప్పుకోవడం.. అందులో ఏది నిజమో ఏది తప్పో తెలుసుకోవడంలో హీరోయిన్ చేసిన నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. 

క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తక్కువ పాత్రలతో .. తక్కువ నిడివిలో బలమైన కంటెంట్ తో పలకరించిన సినిమా ఇది.  అయితే ఇది అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే గంటన్నర పాటు మూడు క్యారెక్టర్లనే చూడటం కాస్త బోరింగ్ అనిపిస్తుంది. శ్రీరాగ్ షాజీ మ్యూజిక్ బాగుంది. జోమన్ టి జాన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. 

 

నటీనటుల పనితీరు:
అలెక్స్ పాత్రలో సౌబిన్ షాహిర్, అర్చన పాత్రలో దర్శన రాజేంద్రన్, ఉన్ని పాత్రలో ఫహాద్ ఫాజిల్ ఒదిగిపోయారు. 

 

ఫైనల్ గా..
భిన్నమైన సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. వన్ టైమ్ వాచెబుల్.

 

రేటింగ్ : 2.5/5

 

✍️. దాసరి మల్లేశ్