English | Telugu

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘ఆది దంపతులు’?

 రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘ఆది దంపతులు’?

ప్రస్తుతం మీడియాలో మారుమోగుతున్న పేర్లు దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి. వీరిద్దరి వ్యహారం వల్ల శ్రీనివాస్‌కి తన భార్య వాణితో విభేదాలు మొదలయ్యాయి. అది చిలికి చిలికి గాలివానగా మారి ఇంటి వ్యవహారం కాస్తా వీధికెక్కింది. ఓ వారం రోజులపాటు మీడియాకు కావాల్సినంత స్టఫ్‌ దొరికింది. ఇదిలా ఉంటే.. ఇటీవల మాధురి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. శ్రీనివాస్‌తో సినిమా చెయ్యాలని మాధురి స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయిన నేపథ్యంలో ఆ సినిమా ఎలా ఉండబోతోంది? దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 

అసలు సినిమా తియ్యాలని మాధురి ఎందుకు అనుకుంటోంది అనే దానిపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. శ్రీనివాస్‌కి హీరో అవ్వాలనే కల ఉండేదట. ఆమధ్య వచ్చిన ‘వాలంటీర్‌’ అనే సినిమాలో శ్రీనివాస్‌ ఓ కీలక పాత్ర పోషించారు. అయితే హీరో అవ్వాలన్న కోరిక తీరలేదని చాలా సార్లు తన దగ్గర బాధపడ్డాడని చెప్పారు మాధురి. ఇప్పుడు అతని కోరికను తీర్చే బాధ్యతను ఒక స్నేహితురాలిగా ఆమె తీసుకుంది. శ్రీనివాస్‌ను హీరోగా ఎలివేట్‌ చేసే మంచి కథతో ఎవరైనా వస్తే తనే సొంతంగా సినిమా తియ్యడానికి రెడీ అని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ని శరవేగంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. 

వాస్తవ సంఘటనల ఆధారంగా కల్పిత కథతో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించిన రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక కథను ఓకే చేసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ‘ఆది దంపతులు’ అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్‌ చేసారని తెలుస్తోంది. వైసీపీ కోసం రెండు సినిమాలు రూపొందించిన వర్మ ఈ సినిమాకి కూడా పూర్తి న్యాయం చేస్తారనే నమ్మకంతో ఆ వర్గాలు ఉన్నాయట. మరి సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు. 

 రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘ఆది దంపతులు’?