Read more!

English | Telugu

అతను మ్యూజిక్‌ చేసిన సినిమాల్లో సగానికిపైగా ఆ ముగ్గురు డైరెక్ట్‌ చేసినవే!

రమేష్‌నాయుడు.. మధురమైన సంగీతాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన అందించే సంగీతం మరే ఇతర సంగీత దర్శకుడి పాటల్ని పోలి ఉండదు. తనకంటూ ఒక శైలి ఉంది. ఒక పాట విని.. అది రమేష్‌నాయుడు ట్యూన్‌ చేసిందే అని చెప్పేంతగా ముద్ర వేసేవారు. 1957 నుంచి 1987 వరకు 30 సంవత్సరాలపాటు తన మధురమైన సంగీతంతో అందర్నీ అలరించారు. వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న కొందరి జీవితాలను పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్థాయి నుంచి ఇంతటి ఉన్నత స్థాయికి ఎలా రాగలిగారు అనిపిస్తుంది. సంగీత దర్శకుడు రమేష్‌నాయుడు జీవితంలో ఎన్నో మలుపుల  తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. 

సినిమాల మీద మోజుతో ఇంట్లో చెప్పకుండా ముంబాయి వెళ్లిపోయిన రమేష్‌నాయుడు అక్కడ ఫుట్‌పాత్‌లపైనే చాలా కాలం గడిపారు. ఆ తర్వాత ఓ సంగీత వాయిద్యాల షాపులో బోయ్‌గా చేరారు. అక్కడ వివిధ వాయిద్యాలను వాయించడంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. అక్కడికి వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులు వచ్చేవారు. వారితో పరిచయాల్ని పెంచుకున్నారు. అలా సంగీతంపై ఒక అవగాహన ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత 16 ఏళ్ళ చిరు ప్రాయంలోనే ‘బంద్వల్‌ పహీజా’ అనే మరాఠీ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని అందించారు. 1957లో ‘దాంపత్యం’ చిత్రానికి సంగీతం అందించడం ద్వారా టాలీవుడ్‌లో ఎంటర్‌ అయ్యారు. అయితే తెలుగులో ఐదారు సినిమాలకు మాత్రమే సంగీతాన్ని అందించి మళ్లీ కలకత్తా వెళ్లిపోయారు. అక్కడ పలు బెంగాలీ, నేపాలి, ఒరియా చిత్రాలకు సంగీతం అందించారు. అలా దాదాపు 10 సంవత్సరాలు టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు రమేష్‌నాయుడు.

ఆ తర్వాత 1972లో వచ్చిన ‘అమ్మమాట’ చిత్రం కోసం రమేష్‌నాయుడుని టాలీవుడ్‌ రప్పించారు దర్శకుడు వి.రామచంద్రరావు. ఈ చిత్రం మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ‘మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు..’, ‘ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్‌..’, ‘ఎవరైనా చూశారా ఏమనుకుంటారు..’, ‘ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా..’ వంటి అద్భుతమైన పాటలతో రూపొందిన ఈ సినిమాతో తెలుగులో రమేష్‌నాయుడు సంగీతానికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఇక అక్కడి నుంచి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా సినిమాలు చేస్తూ.. వీనుల విందైన పాటల్ని అందించారు. 

ఆ మరుసటి సంవత్సరమే దర్శకరత్న దాసరి నారాయణరావు మొదటి సినిమా ‘తాతమనవడు’ విడుదలైంది. ఈ సినిమా కోసం రమేష్‌నాయుడు చేసిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అక్కడి నుంచి 1987లో వచ్చిన స్వయంకృషి వరకు రమేష్‌నాయుడు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి.  రమేష్‌నాయుడు చేసిన సినిమాల్లో సగానికి పైగా దాసరి నారాయణరావు, విజయనిర్మల, జంధ్యాల దర్శకత్వంలో వచ్చినవే ఉండడం విశేషం. దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మేఘసందేశం’ చిత్రానికిగాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు రమేష్‌నాయుడుని ఎంపిక చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సినిమాకి  ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది అవార్డును అందించింది. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ చిత్రంలోని ‘తల్లి గోదారికే ఆటుపోటుంటే..’ అనే పాటకు ఉత్తమ నేపథ్యగాయకుడుగా రమేష్‌నాయుడు నంది పురస్కారాన్ని అందుకున్నారు. 

రమేష్‌నాయుడు చివరగా సంగీతం అందించిన సినిమా చిరంజీవి, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వయంకృషి’. ఈ సినిమా సెప్టెంబర్‌ 4, 1987లో విడుదలైంది. అయితే అంతకుముందు రోజు అంటే సెప్టెంబర్‌ 3న రమేష్‌నాయుడు తుదిశ్వాస విడిచారు.