Read more!

English | Telugu

మనసు మీదే మనసు పడిన ‘మనసు కవి’ ఆచార్య ఆత్రేయ!

మనం చేస్తున్న పని సక్సెస్‌ అవ్వాలంటే దాని మీద మనసు పెట్టమని చెబుతారు మన పెద్దలు. అలా చేస్తే విజయం వరిస్తుంది అంటారు. కానీ, ఆయన మాత్రం మనసు కోసమే పనిచేస్తారు. ఆ తర్వాత ఆ మనసు మీదే మనసు పడ్డారు. ఆయనే ఆచార్య ఆత్రేయ. ఆయన అసలు పేరు కిళాంబి వెంకటనరసింహాచార్యులు. పేరులోని చివరి అక్షరాలను ముందుకు తీసుకొచ్చి దానికి తన గోత్రనామాన్ని జోడిరచి ‘ఆచార్య ఆత్రేయ’గా మారారు. మనిషి, మనసు, మమత, దేవుడు, విధి, ప్రేమ, విరహం ఇవి ఆత్రేయ కవితా వస్తువులు. వాటితోనే మనసును తాకే పాటలు రాశారు. విచిత్రమేమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాటయ్యేది. మామూలు పదాలు రాసినా పదికాలాల పాటు నిలిచే గీతమయ్యేది. చిన్నతనంలోనే మేనమామ వదదాచార్యులు దగ్గర తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్నారు ఆత్రేయ. నాటకాలు, నాటికలు, కథలు, సినిమాకు పాటలు, కొన్ని సినిమాలకు మాటలు, పాటలు రాశారు. అంతేకాదు, నాటక రంగానికి కూడా ఆయన ఎంతో సేవ చేశారు. 

సినిమాల విషయానికి వస్తే దసరాబుల్లోడు, ప్రేమనగర్‌, మూగ మనసులు, మంచి మనసులు, వెలుగునీడలు, ఆరాధన, ఆత్మబలం.. ఇలా ఎన్నో సినిమాల్లో హృదయానికి హత్తుకునే పాటలు రాసి అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఆరోజుల్లో ఆత్రేయ రచయితగా ఎంతో పాపులర్‌ అయిపోయారు. రచయిత పేరును చూసి సినిమాకి వెళ్ళడం అనే సంప్రదాయం ఆత్రేయతోనే ప్రారంభమైంది. మనసులోని భావాలను తన పాట రూపంలో ఆవిష్కరించే ఆత్రేయ మనసు కవిగా పేరు తెచ్చుకున్నారు. ‘మరోచరిత్ర’ చిత్రంలోని ‘పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు..’, ‘గుప్పెడుమనసు’ సినిమాలోని ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా..’ ‘మూగమనసులు’లోని ‘పాడుతా తీయగా.. చల్లగా..’ వంటి పాటలు జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. 

మనిషికీ, మనసుకీ వున్న అనుబంధం గురించి గొప్పగా చెప్పిన రచయితల్లో ఆత్రేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగునాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే! మనసు లేకుండా బతికేయడమంటే అది నరకంతో సమానం ‘సెక్రటరీ’ చిత్రంలోని ‘మనసులేని బతుకొక నరకం..’  పాటలో ప్రియురాలి సొగసును ఎంతగా వర్ణించారో అంతకు రెట్టింపు ఆమెను ఘాటుగా విమర్శించారు. ఇలాంటి పాటలు ఆయన కలం నుంచి ఎన్నో వచ్చాయ. ‘కన్నెమనసు’ లోని ‘ఓ హృదయం లేని ప్రియురాలా..’, ‘అభినందన’ చిత్రంలోని ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం..’, ‘ఆడబ్రతుకు’ సినిమాలోని ‘తనువుకెన్ని గాయాలైనా..’ వంటి పాటల్లో ప్రియురాలిని ఎంత పదునైన మాటలతో దూషించారో తెలుస్తుంది. 

ఒక పాట రాయాలంటే ఆత్రేయ ఎంత మనోవేదనకు గురవుతారో, అది ఒక అద్భుతమైన గేయంగా బయటికి రావడానికి ఎంత సమయం తీసుకుంటారో ఆ పాటలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే ఒక పాట రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఆత్రేయ. తన పాటల్లోని వేదనతో ప్రేక్షకుల్ని ఏడిపించే ఆత్రేయ.. ఆ పాటను సరైన సమయంలో ఇవ్వకుండా నిర్మాతను కూడా అంతే ఏడిపిస్తారనే విమర్శ ఆయనపై ఉంది. ఆయన చివరి దశలో ఓసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దాన్ని కూడా ఆయన భావాలతో ముడిపెట్టారు. తనకోసం వచ్చిన వాళ్ళందర్నీ ఉద్దేశిస్తూ ‘ఇన్నాళ్ళూ నేను హృదయం లేని మనిషినంటూ అందరూ నన్ను ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఆత్రేయకు కూడా హృదయం ఉందని రుజువైంది కదా’ అని సరదాగా అన్నారట. అంతే కాదు, ‘నాకూ, చావుకి అస్సలు పడదు... నేనున్న చోటకి అదిరాదు.. అదొస్తే నేనుండను’  అని ఛలోక్తులు విసిరేవారట ఆత్రేయ. ఆ తర్వాత మరణం ఆయనకు చేరువైంది. దాని వల్ల ఆయన మనకు దూరమయ్యారు తప్ప పాటల రూపంలో ఎప్పుడూ అందరి మనసుల్లో జీవించే వుంటారు. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు.. వున్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు’ అంటూ జీవిత పరమార్థాన్ని తెలియజెప్పిన ఆచార్య ఆత్రేయ జయంతి మే 7. ఈ సందర్భంగా ఆ మనసు కవికి నివాళులర్పిస్తోంది తెలుగువన్‌.