Read more!

English | Telugu

బాలీవుడ్ లో 'లవ్ టుడే' అంటోంది ఎవరో తెలుసా!

గత ఏడాదంతా కన్నడ చిత్రాల హవా నడిచింది. నేషనల్ వైడ్ గా కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతారా చిత్రాలు అద్భుతాల‌ను న‌మోదు  చేశాయి. అలాగే  కోలీవుడ్ నుంచి ఈసారి తెలుగులో హంగామా చేసిన చిత్రాల‌లో క‌మ‌ల్‌హాస‌న్‌-లోకేష్ క‌న‌క‌రాజ్ ల కాంబోలో వ‌చ్చిన విక్ర‌మ్ సంచ‌ల‌నం సృష్టించింది. కానీ తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన 'లవ్ టుడే' సినిమా అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లు సాధించింది. నేటి తరం ప్రేమికుల మధ్యలోని అనేక రకాల సమస్యలను తీసుకొని ఒక చిన్న పాయింట్ తో మంచి కథను అల్లుకున్న దర్శకుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తనే హీరోగా నటించి అద్భుతమైన సినిమాను తెరపైకి తీసుకొని వచ్చారు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన లవ్ టుడే ను హిందీ లో కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ ముంద‌స్తు ప్లానింగ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ముందుగా ఊహించ‌క‌పోవ‌డం వ‌ల్ల అక్క‌డ కూడా డ‌బ్బింగ్ చేయ‌లేదు. కానీ అక్కడ రీమేక్ చేయాలి అని మరి కొంతమంది యువ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నిర్మాతలు  హిందీ రీమేక్ హ‌క్కుల‌ను అమ్మ‌డానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. 

హిందీ హీరోల విషయానికి వస్తే హిందీలో ఈ మూవీలో ఎవరు హీరోగా నటించబోతున్నారు అనే విషయం వైరల్ గా మారింది. హీరో వరుణ్ ధావన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకుముందు వరుణ్ ధావన్ తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు.  ఇప్పుడు ఈ హీరో లవ్ టుడే సినిమా రీమేక్ చేయడానికి తండ్రితో చ‌ర్చ‌లు జరుపుతున్నట్టు సమాచారం. వరుణ్ దావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తెరపైకి తీసుకొని వచ్చారు. పలు విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే లవ్ టుడే సినిమా రీమేక్ తెరపైకి తీసుకొని వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తిగా హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా కంటెంట్ లో కొంత మార్పులు కూడా చేయబోతున్నారట. ఇక మరోవైపు వరుణ్ ధావన్ అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.