Read more!

English | Telugu

భారీ సినిమా సెట్టింగ్‌ను త‌ల‌పించే జెనీలియా ఇల్లు!

 

టాలీవుడ్‌లో 'బొమ్మ‌రిల్లు' సినిమాలో చేసిన హాసిని క్యారెక్ట‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా మారిన జెనీలియా డిసౌజా.. ఆ త‌ర్వాత త‌ను ప్రేమించిన బాలీవుడ్ యాక్ట‌ర్ రితీశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని, న‌ట‌న‌కు తాత్కాలికంగానైనా దూర‌మై, గృహిణిగా మారిపోయింది. ఆ జంట‌కు రియాన్‌, ర‌హీల్ అనే ఇద్ద‌రు కొడుకులు. ముంబైలో జెనీలియా కుటుంబం భ‌వంతిని చూస్తే లార్జ‌ర్‌-దేన్‌-లైఫ్ హోమ్ అనిపించ‌క మాన‌దు.

స‌ర్క్యుల‌ర్ బీమ్స్‌, వైడ్ డోర్స్‌, స్ప్లిట్ స్టైర్‌కేస్ లాంటి వాటిని చూస్తుంటే, సినిమాల్లో చూపించే భారీ ఇంటి సెట్టింగ్స్ గుర్తుకు వ‌స్తాయి. మెట్ల‌కు ఎదురుగా గోడ మీద మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఫొటో క‌నిపిస్తుంది. ఆయ‌న జెనీలియా మామ‌గారు.

ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌ల్లో మాదిరిగానే జెనీలియా-రితీశ్ ఇంట్లో ఫొటో షూట్ కోసం నిర్దేశించిన స్టూడియో కూడా ఉంది. ఫొటో స్పాట్‌లో బ్లాక్ వాల్ అందంగా క‌నిపిస్తుంది. అక్క‌డ్నుంచి తీయించుకున్న ప‌లు ఫొటోలు జెనీలియా ఇన్‌స్టా హ్యాండిల్‌లో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆ ఇంటిని 18వ శ‌తాబ్దం నాటి లుక్‌తో రితీశ్ తండ్రి, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ క‌ట్టించారు. అయితే ఆయ‌న మృతి చెందాక‌, త‌మ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లు ఇంటీరియ‌ర్‌ను మోడ‌ర‌న్ ఫ‌ర్నిచ‌ర్‌తో, డిజైన్స్‌తో తీర్చిదిద్దుకున్నారు జెనీలియా, రితీశ్ క‌పుల్‌. అయితే వైట్ బీమ్స్‌, వెడ‌ల్పాటి డోర్స్‌ను మాత్రం అలాగే ఉంచేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, యాక్ట‌ర్ కావ‌డానికి ముందు రితీశ్ ఆర్కిటెక్చ‌ర్‌లో డిగ్రీ చేశాడు. అందువ‌ల్ల భార్య ఆస‌క్తుల‌కు అనుగుణంగా ఇంటీరియ‌ర్‌ను అత‌ను తీర్చిదిద్దాడు. జెనీలియా చాలా కాలం త‌ర్వాత తిరిగి తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతోంది. గాలి జ‌నార్ద‌న‌రెడ్డి త‌న‌యుడు కిరీటి హీరోగా న‌టిస్తోన్న సినిమాలో ఆమె ఓ కీల‌క పాత్ర చేస్తోంది. ఒక్క‌సారి వాళ్ల అంద‌మైన భ‌వంతి లోప‌ల ఎలా ఉంటుందో లుక్కేద్దాం...