Read more!

English | Telugu

రిలీజ్ కి మూడు నెలల ముందే 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్

బాలీవుడ్ కపుల్ రణ్‌ బీర్‌ కపూర్‌, ఆలియా భట్ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పలు భాగాలుగా తెరకెక్కనుంది. బ్రహ్మాస్త్ర పార్ట్-1 'శివ' పేరుతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు దాదాపు మూడు నెలల ముందే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తుండటం విశేషం.

బ్రహ్మాస్త్ర పార్ట్-1 సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. విడుదలకి మూడు నెలల ముందే ఈ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. రణ్‌ బీర్‌, అయాన్‌ తో కలిసి సింహాచలం, విశాఖపట్నంలో ఈరోజు రాజమౌళి సందడి చేశారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది.

మూడు నెలల ముందే గ్రాండ్ గా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన 'బ్రహ్మాస్త్ర' టీమ్.. ట్రైలర్ ని కూడా ముందుగానే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది సర్ ప్రైజ్ చేసింది. ట్రైలర్ ని జూన్ 15న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా టీజర్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. 30 సెకన్ల నిడివి గల ఆ వీడియో విజువల్ ట్రీట్ లా ఉంది. సౌత్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు నార్త్ లో సత్తా చాటుతున్న వేళ.. హిందీ సినిమా సౌత్ లో భారీస్థాయిలో విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. రాజమౌళితో చేతులు కలపడం సౌత్ లో ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సత్తా చాటుతుందో చూడాలి.