Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 7


    "అంటే-అనూరాధా?"
    "అవును-ఆమే!"
    "ఇందువల్ల ఆమెకు ప్రయోజనం?"
    "ప్రయోజనమేమిటీ-నీకింకా అర్ధం కాలేదా? ఆమెకు మన గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడామె మన ప్రయోజనాలకి అద్దం వస్తుంది....."
    "మొత్తంమీద ఈ పెళ్ళి చెడగొట్టింది...." అంది నర్సమ్మ.
    "పెళ్ళెక్కడ చెడింది-? ఈ పెళ్ళి జరిపించే బాధ్యత నాది!" అన్నాడు రంగా లేచి నిలబడుతూ.
    "పెళ్ళికూతురి తండ్రి వచ్చి ముఖంమీద కుండబద్దలు కొట్టినట్లు మీ సంబంధం వద్దని చెప్పిపోయాక కూడా-ఇంకా పెళ్ళి జరుగుతుందంటావేమిటీ? నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా?" అంది నర్సమ్మ.
    "ఈ దేశంలో ఆడపిల్లల సంగతి మీకంటే నాకు బాగా తెలుసు-" అన్నాడు రంగా.
    "పెళ్ళి కుదిరితే మాత్రం - అనూరాధ నన్నొదిలి పెడుతుందనుకోను. ఆమె సాక్ష్యాలు పట్టుకొని బయల్దేరిందంటే నేను జైలు పాలవుతాను-" అన్నాడు విశ్వం.
    "ఎందుకని?"
    "ఒక భార్య బ్రతికుండగా రెండో భార్యను తెచ్చుకోవడం చట్టరీత్యా నేరమని నీకు మాత్రం తెలియదా?" అన్నాడు విశ్వం.
    "అదా నీ భయం?" అని నవ్వాడు రంగా - "నీకు నేను హామీ యిస్తున్నాను. నీకు మాలతితో వివాహమయ్యేసరికి అనూరాధ బ్రతికుండదు-"
    నర్సమ్మ, విశ్వం ఉలిక్కిపడి రంగా వంక చూశారు. అతడి కళ్ళలో వారికి హెచ్చరిక కనబడింది.

                                  9

    రంగా అంచనా తప్పుకాలేదు. అతడు విశ్వాన్ని తీసుకొని మళ్ళీ మాలతి యింటికి వెళ్ళాడు. స్వయంగా మాలతితో మాట్లాడాడు. విశ్వం శీలాన్నీ గుణగణాల్నీ విపరీతంగా పొగిడాడు.
    విశ్వం మాలతితో - "నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నాకు భార్యగా నువ్వు సుఖం తప్ప మరొకటి రుచి చూడవు. ఆ ఫోటోలు వట్టి నాటకం. వాటిని చూసి మనసు పాడుచేసుకోకు-....." అన్నాడు.
    మాలతి అతడి మాటలకు కరిగిపోయింది. ఆ యిల్లొక నరకంలా ఉన్నదామెకు. ఏదోవిధంగా అందులోంచి బయటపడాలనుకుంటోంది. విశ్వం మోసగాడైతే తర్వాత చూసుకోవచ్చు.
    "ఈ పెళ్ళి నాకిష్టమే!" అని చెప్పిందామె. విశ్వం మాలతి తండ్రితో - "మీ అమ్మాయిష్టపడింది. ఆమెకు మైనారిటీ తీరిపోయింది కాబట్టి మేమిద్దరం మిమ్మల్నెదిరించికూడా వివాహం చేసుకోగలం-" అన్నాడు.
    పెద్ద ఇబ్బందేమీ లేకుండా ఆ రాత్రే అక్కడ గుళ్ళో పెళ్ళి జరిగింది. విశ్వం మాలతిని తీసుకొని పెళ్ళయి పోయిన మర్నాడే తన యింటికి వచ్చేశాడు. నర్సమ్మ యింట్లో కోడలికి స్వాగతం పలికి-"నన్ను పిలవకుండా నే పెళ్ళి చేసుకొచ్చేశారూ-" అంది కొడుకుతో. కానీ ఆవిడ ముఖంలో బాధలేదు.
    మాలతికి అంతా విచిత్రంగా వుంది.
    ఇలాంటి పెళ్ళెక్కడైనా వుంటుందా?
    తండ్రి లోకాపనిందకు భయపడి ఈ పెళ్ళి వద్దన్నాడు. తనేమో నరకంలోంచి బయటపడాలని ఈ పెళ్ళికి ఒప్పుకుంది. ఒప్పుకున్న మరుక్షణం పెళ్ళి. అటుపైన అత్తవారింటికి ప్రయాణం. పెళ్ళికి అత్తగారు రానేలేదు.
    మాలతికి సందేహాలకు చాలవన్నట్లు "నీకు పెళ్ళయిందని గానీ - నువ్వు మా అబ్బాయి భార్యవని గానీ చుట్టుపక్కల ఎక్కడా అనకు-" అంది నర్సమ్మ కోడలితో-ఆమె కాపురానికి వచ్చిన ఓ గంట అనంతరం.
    "ఎందుకని?"
    "అన్నీ నీకే అర్ధమవుతాయి తొందర్లో...." అంది నర్సమ్మ.
    విశ్వం బయటకు వెళ్ళి పోయాడు. ఇంట్లో అత్తాకోడళ్ళు మిగిలారు. మధ్యాహ్నం రెండింటికి నర్సమ్మ నిద్రపోయింది. మలతికేమీ తోచక దొరికిన పుస్తకమొకటి తీసింది.
    అప్పుడెవరో గుమ్మం దగ్గర నిలబడ్డారు.
    మాలతి తలెత్తి చూసింది. ఓ అందమైన యువతి. ఆమె నెక్కడో చూసినట్లుంది.
    "కంగ్రాట్యులేషన్స్ మిసెస్ మాలతీ!" అందాయువతి.
    "నువ్వెవరో నాకు తెలియదు...." అంది మాలతి. "మా అత్తగారిని పిలుస్తాను."
    "పాపం-ఆవిడ మంచి నిద్రలో వుంటుంది. ఇప్పుడు లేపకు. నేను నీ కోసమే వచ్చాను. నన్ను నువ్వింకా గుర్తుపట్టలేదా? నీ శ్రీవారితో నాటకంలో వేషం వేశాను" అందా యువతి.
    మాలతికి గుర్తొచ్చింది. తమ వీధిలో పంచిపెట్టబడిన పెళ్ళి ఫోటోలో విశ్వం పక్కన పెళ్ళికూతురిలా కూర్చుందామె.
    "నీ పేరు?"
    "అనూరాధ.."
    "మీరిద్దరూ వేసిన ఆ నాటకం పేరేమిటి?"
    "జీవితం-" అంది అనూరాధ.
    "ఆ ఫోటో చూడ్డానికి నాటకం ఫోటోలా లేదు. అచ్చం నిజం పెళ్ళి ఫోటోలాగుంది.." అంది మాలతి.
    "చెప్పానుగా-ఆ నాటకం పేరు జీవితమని!" అంది అనూరాధ.
    "నిలబడే వున్నావు. కూర్చో!" అంది మాలతి.
    "ఈ యింట్లో నిలబడవలసినదాన్ని నేను. కూర్చో వలసినదానివి నువ్వు.." అంది అనూరాధ.
    మాలతి ఆమె వంకే పరీక్షగా చూస్తూ-"నువ్వు చాలా అందంగా వున్నావు. నాటకాలేం కర్మ-ప్రయత్నిస్తే నీకు సినిమా ఛాన్సుకూడా తగలొచ్చు.." అంది.
    అనూరాధ నవ్వి-"అందం ఆడదానికి వరమని నువ్వు భావిస్తున్నట్లున్నావు. ఆడదానికి పెళ్ళయితే ఆ వరం మగాడిదే అవుతుంది-" అంది.
    "నీకు పెళ్ళయిందా?" అంది మాలతి.
    "ఆఁ నాటకంలో.." అంది అనూరాధ - "నేను నీ అదృష్టానికి నిన్నభినందించాలని వచ్చాను. పెళ్ళిఫోటోలో మా యిద్దర్నీ చూడ్డంవల్ల నీక్కలిగిన అపోహలేమైనా వుంటే తొలగించాలని వచ్చాను.."
    "చాలా థాంక్స్!" అంది మాలతి.
    "ఎందుకూ అనడగనంటే నాదో సలహా నీకు..." అనాగింది అనూరాధ.
    మాలతి ఆమె వంక కుతూహలంగా చూసింది.
    "నీ వంట్లో అనారోగ్యంగా వున్నదని చెప్పి నీ భర్తను కొంతకాలంపాటు దగ్గరగా రానివ్వకు. నీ భర్త నమ్మకపోతే లేడీ డాక్టర్నికలు. డాక్టర్ ప్రభాదేవికి నా పేరు చెప్పావంటే నువ్వు కోరిన రిపోర్టిస్తుంది..." అంది అనూరాధ.
    మాలతి తెల్లబోయి-"ఇదంతా ఎందుకు?" అంది.
    "నా సలహా అయిపోలేదు. నీ పెళ్ళి సింపుల్ గా జరిగినా పెళ్ళిఫోటోలు తీశారుగదా? వాటి నెగెటివ్సు సంగ్రహించి దాచుకో."
    "ఎందుకు?"
    "అవన్నీ నేను మళ్ళీ నిన్ను కలిసినపుడు చెబుతాను. ప్రస్తుతానికి నేను చెప్పినది తూచా తప్పకుండా పాటించాలి..."
    "పాటించకపోతే?"
    "అది నీ దురదృష్టం. నేను నీ మేలుకోరి చెబుతున్నాను. గుర్తుంచుకో. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను...." అని చటుక్కున వెనక్కు తిరిగి చరచరా వెళ్ళిపోయింది అనూరాధ.
    
                                  10

    గదిలో మల్లెల పరిమళం గుప్పుమంటోంది. మంచం మీద ముడుచుకుని కూర్చుంది మాలతి.
    రాత్రి పదింటికి విశ్వం గదిలో అడుగుపెట్టి తలుపులు వేశాడు.
    మాలతి గుండె దడదడా కొట్టుకుంది.
    విశ్వం ఆమెను సమీపించి చుబుకం పైకెత్తాడు. మాలతి బరువుగా కనురెప్పలు వాల్చేసింది.

 Previous Page Next Page