"అందానికి మారు రూపానివి నువ్వు. నువ్వు నా భార్యవు కావడం - ఎన్నో జన్మల అదృష్టం-" అన్నాడు విశ్వం.
"అదృష్టం మీది కాదు - నాది!" అంది మాలతి.
విశ్వం ఆమె పక్కగా కూర్చుని - "నాది పొరపాటే! ఇకమీదట జీవితంలో - నీ, నా అని వేరే లేవు. అన్ని అనుభవాలూ మనవి!" అన్నాడు.
మాలతి మాట్లాడలేదు. అతడామె నడుంచుట్టూ చేయివేసి - "ఇన్నాళ్ళకు నాటకాల్లోనేకాక నిజంగా కూడా ఓ భార్యను సంపాదించుకున్నాను-" అన్నాడు.
మాలతికి నాటకాలనగానే మధ్యాహ్నం వచ్చిన అనూరాధ గుర్తుకొచ్చింది. ఆమె మృదువుగా అతడిచేయి నడుంమీంచి తీసి - "నన్ను మీరు క్షమించాలి. నా ఆరోగ్యం బాగాలేదు...." అంది.
"ఏమయింది నీకు?" అన్నాడు కంగారుగా విశ్వం.
"ఏమయిందో చెప్పలేను. ఏదోలాగుంది...." అంది మాలతి.
"తొలిరేయి కదా - అలాగే వుంటుంది-" అన్నాడు విశ్వం.
"అలాకాదండీ - వళ్ళంతా సూదులు గుచ్చినట్లు ఏదో బాధ. మీరు వంటిమీద చేయివేయగానే పుండుమీద కారం జల్లినట్లుగా అనిపించింది...." మాలతి తన బాధను వర్ణించి చెప్పసాగింది.
విశ్వం ఆమె వంక అనుమానంగా చూసి - "ఈ బాధనీకిప్పుడే ప్రారంభమైందా?" అన్నాడు.
"లేదండీ-చాలా రోజుల్నించి వుంది. మా అమ్మకు చెప్పకుంటే వినేదికాదు. మా నాన్న గారిక్కూడా చెప్పుకున్నానాఖరికి. అప్పుడాయన నన్నీ ఊరే తీసుకోద్దామనుకున్నారు. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఈ ఊళ్ళో డాక్టర్ ప్రభాదేవి అని ఒకామె ఉన్నారుట. మీరు అనుమతీస్తే రేపొక్కసారి ఆ డాక్టర్ని చూద్దాం...." అంది మాలతి.
డాక్టర్ ప్రభాదేవి పేరు వినగానే విశ్వానికి కళ్ళుతిరిగినట్లనిపించింది. ఇంచుమించు ఇలాగే జరిగింది మొదటి భార్య విషయంలోకూడా.
"సరే-నీ యిష్టం...." అని అతడు మంచంమీద ఓ మూలగా జరగికూర్చున్నాడు. మాలతి అక్కడే కూర్చుంది. భర్త ఇంకేమీ అనకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అలా కాసేపు గడిచాక విశ్వం మంచంమీద నడ్డి వాల్చాడు. అతడు భార్యవైపు చూడను కూడా చూడలేదు.
మాలతి ఆలోచనలో పడింది. పాపం-అతడు నిరుత్సాహ పడినట్లున్నాడు. కానీ ఎంత మంచివాడు? తన కారోగ్యం బాగోలేదని తెలియగానే ఏమీ బలవంతం చేయలేదు.
అతడు బలవంతం చేయకపోవడానికి కారణం వేరే వుందని ఆమెకు తెలియదు. మాలతి ఆరోగ్యం బాగోలేదనీ, డాక్టర్ ప్రభాదేవిని కలుస్తానని అనగానే అతడి కేదో అపశృతిలా తోచింది. మాలతికి తనగురించి యేదో సమాచారం తెలిసిందనీ-తననుంచి ఆమె ఏదో రాబట్టాలనుకుంటోందనీ అతడికన్మానం కలిగింది. ఆమె పోలీసుల మనిషి కాదుగదా అనికూడా అతడు అనుమానించాడు. అందుకే అతడు తీవ్రాలోచనలోపడ్డాడు.
"ఏమండీ!" అంది మాలతి.
విశ్వం ఆలోచనల్లోంచి తేరుకుని ఉలిక్కిపడి-"ఊఁ" అన్నాడు.
"కోపం వచ్చిందా?" అంది మాలతి మళ్ళీ.
"ఎందుకు?"
మాలతి క్షణమాత్రం తటపటాయించి - "భార్యా భర్తల మధ్య రహస్యాలుండకూడదంటారు. కానీ మీరు నా దగ్గర చాలా దాచారు...." అంది.
"ఏం దాచాను?" అన్నాడు విశ్వం తనలో కలిగిన కలవరపాటును బయటపడకుండా వుండాలని అతడు పొడిగా ఆ ప్రశ్న వేశాడు.
"అనూరాధ గురించి నాకు చెప్పలేదు...."
"అనూరాధ....అనూరాధ ఎవరు?" అన్నాడు విశ్వం. ఈసారి దాచుకుందామన్నా అతడి గొంతులో కలవరపాటు దాగలేదు.
"అదే-జీవితమనే నాటకంలో మీ పక్కన పెళ్ళి కూతురుగా కూర్చున్న అమ్మాయి...." అంది మాలతి అమాయకంగా.
"ఏమిటి నువ్వంటున్నది?" అన్నాడు విశ్వం.
అప్పుడు మాలతి అతఃడికి అనూరాధ మధ్యాహ్నం ఇంటికి వచ్చి తఃనతో మాట్లాడిన విషయం చెప్పి-"ఆమె నాతో అలా యెందుకు మాట్లాడిందో అర్ధంకాలేదు. అయినా ఆమె చెప్పినట్లే చేశాను. కానీ మిమ్మల్ని చూస్తే జాలేసి నిజం చెప్పేశాను...." అంది.
"అనూరాధ ఇక్కడికి వచ్చిందా?" అన్నాడు విశ్వం. ఆ ప్రశ్న అతడు మాలతి నుద్దేశించి వేయలేదు. తనలో తానే ఆశ్చర్యంగా గొణుక్కున్నాడు. తర్వాత మాలతిని మధ్యాహ్నమేం జరిగిందని శతవిధాల ప్రశ్నలు వేశాడు. అవన్నీ వినగానే అతడికర్ధమైపోయింది. అనూరాధ తను తప్పించుకుపోవడమే కాక-మాలతిని కూడా ఇక్కన్నించి తప్పించాలనుకుంటోంది. తనే విధంగా తప్పించుకుందో అదే విధంగా మాలతినీ తప్పించబోతోంది.
ఎందుకు?
తన గురించి పూర్తిగా తెలిసికూడా ఆమె తనను పెళ్ళెందుకు చేసుకుంది? అటుపైన మాలతితో తన వివాహాన్ని భగ్నం చేయడానికెందుకు ప్రయత్నించింది? తమ వివాహం జరిగినా మాలతీనింకా వదిలిపెట్టదేం?
ఆమె మాలతికింకా యేమైనా చెప్పిందా అన్న అనుమానం విశ్వాన్ని పీడిస్తోంది. కానీ మాలతి యెంత అడిగినా తనకింకేమీ తెలియదనే చెబుతోంది. ఆమె ముఖం చూస్తూంటే నిజమే చెబుతోందనిపిస్తోంది. అయితే ఒకప్పుడు తనిలాగే అనూరాధను నమ్మి మోసపోయాడు. కానీ మాలతి అనూరాధ వంటిది కాదు. లేకుంటే మధ్యాహ్నం అనూరాధ వచ్చిన విషయం తనకెందుకు చెబుతుంది?
"ఏమండీ? ఆ అమ్మాయి నాకలా యెందుకు చెప్పిందంటారు?" అంది మాలతి విశ్వాన్ని కుతూహలంగా చూస్తూ.
"ఎందుకా?" అన్నాడు విశ్వం. అతడి బుర్ర చురుగ్గా పనిచేసింది.
అనూరాధ విశ్వాన్ని ప్రేమించింది. విశ్వమామెను ప్రేమించలేదు. నాటకాల్లో వేషం వేసినప్పటికీ అతడామెపై సోదర భావాన్నే ప్రకటిస్తూ వచ్చాడు. తనకు విశ్వం ద్వారా లభించిన సౌఖ్యం యే అమ్మాయికీకూడా లభించరాదన్న భావంతో ఆనూరాద మాలతీకలా చెప్పివుంటుంది. డాక్టర్ ప్రభాదేవి ఆమెకు స్నేహితురాలు.
మలతికీ సమాధానం నచ్చి"-అంతే అయుంటుంది" అంది.
విశ్వం చటుక్కున లేచి కూర్చుని ఆమెకు దగ్గరగా జరిగి నడుంచుట్టూ చేయివేసి-"పుండుమీద కారం చల్లినట్లు లేదుకదా!" అన్నాడు.
"లేదు కాబట్టే-మీకు ముందబద్ధం చెప్పినా తర్వాత నిజం చెప్పేశాను...." అంది మాలతి.
"మాలతీ-నువ్వు నా అదృష్ట దేవతవు-" అంటూ విశ్వం ఆమెను తనవైపుకు తిప్పుకుని బలంగా కౌగలించుకున్నాడు.
ఆ తర్వాత మలతిమీద ఇంకేమైనా అనుమానాలుంటే అవన్నీ పూర్తిగా తొలగిపోయాయతడికి. ఆమె అమాయకురాలన్న విషయంలో అతడింకేమీ సందేహం మిగల్లేదు.
11
మర్నాడుదయం ఉత్సాహంగా నిద్రలేచాడు విశ్వం. ఇదివరకటి పెళ్ళిలాంటిది కాదీసారి. ఇప్పుడు తన భార్య నిజంగానే తనకిల్లాలయింది. అతడికెంతో సంతోషం గానూ, మనసు తేలిక గానూ వుంది.
ఇప్పుడు మాలతి గతంలోని అనూరాధలాకాక తన కాలికింద చెప్పులా పడి వుంటుంది. తనేం చెబితే అది చేస్తుంది. అనూరాధ అనుకోకుండా తనను దెబ్బతీయడంతో మళ్ళీ తనకిలాంటి అవకాశం వస్తుందా అని భయపడ్డాడు. కానీ అదృష్టం తనను వరించింది.
నాలుగైదేళ్ళలోనే తను బంగళా కొంటాడు. కారు కొంటాడు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వదిలి కాలుమీద కాలువేసుకుని దర్జాగా జీవిస్తాడు. బహుశా అప్పుడు తను వేరే పెద్దింటి పిల్లను పెళ్ళికూడా చేసుకోవచ్చు.