Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 6


    "ఒక్కటే అనుమానం వదినగారూ! అసలీ ఫోటో యెలా తయారయిందంటారు?" అంది వియ్యపురాలు.
    నర్సమ్మ బుర్ర చురుగ్గా పనిచేసింది- "మావాడు నాటకాల్లో వేషాలేస్తూంటారు. అందులోదేమోనని నా అనుమానం. నాకు నాటకాలంటే చిరాకు. మా ఇంట్లో వాడి నాటకాల ఫోటోలు చాలా వున్నాయి. ఒక్కటి కూడా నేను చూడలేదు...."
    "ఇప్పుడు నా శంక పూర్తిగా తీరిపోయింది-...' అంటూ వియ్యపురాలు అప్పటికప్పుడు - ఫోటోనీ, ఉత్తరాన్నీ, కవర్నీ - అగ్గిపుల్లతో అంటించేసింది. తర్వాత ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు.
    అప్పటికి పెళ్ళికూతురు వచ్చి కూర్చుంది. ఆమె చాలా అందంగా వుంది. విశ్వం ఆమె వంకనే రెప్పలార్పకుండా చూస్తున్నాడు. ఆమెకూడా ఓరకంట అతడిని గమనిస్తూనే వుంది. వాటం చూస్తే ఒకరికొకరు నచ్చినట్లే కనబడుతోంది.
    నర్సమ్మ కొడుకుతో కొద్దిక్షణాలు మాట్లాడి-"మళ్ళీ వెళ్ళి ఉత్తరాలు రాస్తామనే సంప్రదాయంకాదు మాది. అబ్బాయికి పిల్ల నచ్చింది. సింపుల్ గా వివాహం జరిగే యేర్పాట్లు చేయండి. మంచి ముహూర్తం నిర్ణయమయ్యేక మాకు కబురు పెట్టండి-" అంది.
    
                                   8

    "మా పథకానికి తిరుగుండదు...." అన్నాడు రంగా.
    "ఆవిడ ఆ ఫోటో చూపించినప్పుడు నేను చాలా కలవరపడ్డాను. కానీ ఆవిడే నాకు దారి చూపించింది.." అంది నర్సమ్మ.
    "ఎందుకు చూపించదరా? ఆ పిల్లనెలా వదుల్చుకోవాలా అని చూస్తోందావిడ. సవతి కూతురంటే బొత్తిగా పడదామెకు. చాలా మంచి సంబంధాలే వచ్చాయా అమ్మాయికి. సవతి కూతురెక్కడ సుఖపడిపోతుందోనని తిరగ్గొట్టిందా యిల్లాలు...." అన్నాడు రంగా-"ఇప్పుడావిడ తనే పట్టుపట్టి విశ్వంతో పెళ్ళి జరిపిస్తుంది మాలతికి...."
    "కానీ...." అంది నర్సమ్మ-"ఆ ఫోటోను వాల్ కెవరు పంపివుంటారు? అనూరాధ కాదుగదా...."
    విశ్వం భయంగా-"అనూరాధే అయుండాలి. నెగెటివ్సు ఆమె దగ్గరే వున్నాయి...." అన్నాడు.
    రంగా నవ్వి-"మీ భయం అర్ధం లేనిది. అనూరాధ తన్ను తాను రక్షించుకుందుకే ఆ నెగెటివ్స్ కూడా పట్టుకు పోయింది తప్పితే-ఆమె వాటితో ప్రింట్సుతీసి విశ్వాన్ని బెదిరించదు.....అదామెకు క్షేమంకాదు...." అన్నాడు.
    "అయితే ఆ నెగటివ్సు-ఇంకా యెవరి దగ్గరైనా వున్నాయంటావా?"
    "వెర్రివాడా - అది కొత్త ప్రింటు కాదు. పాత ప్రింటే! నీ పెళ్ళి ఫోటో ఒకటి నా దగ్గరున్న విషయం మరిచావా?" అన్నాడు రంగా.
    "అంటే?"
    "ఈ పెళ్ళి కుదరాలని నేనే ఆ ఫోటో నీక్కాబోయే అత్తగారి పేరిట పంపించాను. ఆ ఫోటోయే ఈ పెళ్ళి కుదిర్చింది...." అన్నాడు రంగా.
    విశ్వం తెల్లబోయి-"నువ్వు అసాధ్యుడివి-" అన్నాడు.
    "నేను అసాధ్యుడనైతే సరిపోదు. నువ్వూ అలాగే వుందాలి. ఆ ఫోటో గురించి యెప్పుడెవరడిగినా - అది నాటకంలోని దృశ్యమని చెప్పడం మరిచిపోకు-" అన్నాడు రంగా.
    "చెప్పడానికి నా యింట్లోకూడా అలాంటి ఫోటో లుండాలి కదా.....అసలు మా ఇంట్లో నేను నాటకాల్లో వేషాలేసిన ఫోటోలే లేవు....."
    నర్సమ్మ చిరాగ్గా-"బాగుంది-ఇదేమైనా కోర్టనుకున్నావా - సాక్ష్యాధారాలన్నీ తెచ్చి చూపించడానికి-ఆల్భం ఏ ప్రయాణంలోనో పోయిందనొచ్చు...." అంది.
    "చూడు-మీ అమ్మను చూసి తెలివి పెంచుకో -" అన్నాడు రంగా.
    వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూండగా చటుక్కున యెవరో లోపలకు వచ్చారు. విశ్వం వచ్చిన వ్యక్తిని చూసి కంగారుగా లేచి నిలబడి - "అరే - మామయ్య గారు-" అన్నాడు.
    "అప్పుడే నన్నలా పిలిచేయకు బాబూ!" అన్నాడాయన.
    "ఏమిటన్నయ్యగారూ-హడావిడిగా కనబడుతున్నారు! అప్పుడే ముహూర్తం పెట్టించుకొని వచ్చేశారేమిటి?" అంది నర్సమ్మ.
    ఆయన తన లాల్చీ పక్క జేబులోంచి ఓ కవరుతీసి విశ్వాని కందించి - "ఇందులో మొత్తం పది ఫోటోలున్నాయి. వాటి గురించి నువ్వే చెప్పాలి-" అన్నాడు.
    విశ్వం ముందు కాబోయే మామగారికి కుర్చీ చూపించి తనప్పుడా ఫోటోలను చూశాడు. అవన్నీ అతడికీ, అనూరాధకూ వివాహమైన పెళ్ళి ఫోటో కాపీలు విశ్వం ఆ ఫోటోలను మౌనంగా రంగాకు అందించాడు. రంగా ఆ ఫోటోలు చూసి తడబడుతూ - "ఇవి మీకెలా వచ్చాయి?" అన్నాడు.
    మా యింటిపక్క అటు అయిదిళ్ళు, ఇటు అయిదిళ్ళవాళ్ళకి వచ్చాయివి-" అన్నాడు వచ్చినాయన.
    ఆయన చెప్పిందాన్ని బట్టి వాళ్ళకర్ధమైన విషయమేమిటంటే-ఎవరో ఆ పదిమందికీ ఈ ఫోటోతోపాటు ఓ ఉత్తరం కూడా ఇచ్చారు-అందులో "ఇలాంటి ఫోటోలే మాలతి తల్లికీ పంపాం. కానీ ఆమె సవతి తల్లి కదా! అందుకని మాలతి పెళ్ళి ఆ పెళ్ళైన వాడితోనే జరిపేయబోతోంది. ఇరుగూ పొరుగూ అయిన మీరైనా కలగజేసుకొని ఈ పెళ్ళి ఆపాలి..." అని వుందిట. వాళ్ళంతా మాలతి ఇంటిమీద దాడిచేసి సవతి తల్లిని నానామాటలూ అనడమేకాక-మాలతి తండ్రినికూడా-నువ్వు తండ్రివా. కసాయివాడివా అని దూషించారుట. అటు లోకాపవాదుకీ ఇటు కూతురి భవిష్యత్తుకీ భయపడి ఆయనిలా పరుగున వచ్చాడుట.
    విశ్వం వెంటనే-"నేనో నాటకంలో వేషం వేశాను. ఆ ఫోటోలా నాటకంలోనివే! నా నాటకాల ఫోటో ఆల్భం మొన్న ప్రయాణంలో పోయింది-" అన్నాడు.
    "అయితే ఈ ఫోటో లెవరు పోస్టుచేశారు-ఎందుకు చేశారు?" అన్నాడు వచ్చినాయన.
    "ఈయన నా మిత్రుడు. పేరు రంగా. ఇతడే ఆ ఫోటోలన్నీ పోస్టుచేశాడు. అబ్బాయిమీద చెడ్డ అభిప్రాయం ఏర్పడితే సవతి తల్లి ఈ పెళ్ళికి తప్పక ఒప్పుకుంటుందని ఇతడభిప్రాయం..." అన్నాడు విశ్వం.
    వచ్చినాయన వెర్రిముఖంవేసి-"ఇలాంటి పని శత్రువులే తప్ప మిత్రులు చేయరు-..." అన్నాడు.
    రంగా వెంటనే - "అయ్యా! మీ యింట్లో కథ అందరికీ తెలుసు. ఆ యింట్లో మీ ఆవిడమాటతప్ప ఇంకెవ్వరిదీ చెల్లదు. అబ్బాయి గురించి అనుమానాలుంటే ఆవిడకిష్టం. అమ్మాయి సుఖపడితే మీకిష్టం. మీరీ పెళ్ళి కాదనకండి. ఆవిడ కాదనదు. ఉభయతారకంగా ఉంటుందీ ఫోటోలవల్ల...." అన్నాడు.
    వచ్చినాయన కంగారుగా-"నేను కన్న తండ్రినే కానీ కసాయివాణ్ణి కాదు. ఈ పెళ్ళి కొప్పుకొని నలుగురి చేతా ఛీ అనిపించుకోలేను. మీ వ్యవహారం చాలా తిరకాసుగా వుంది. వస్తాను..." అనేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    ముగ్గురికి ముగ్గురూ తెల్లబోయారు. ముగ్గురిలోకీ ముందు నర్సమ్మే తేరుకొని-"కొరివితో తలగోక్కోవడమంటే ఇదే.....వాళ్ళకీ ఫోటోలు పంపడం చాలా తెలివితక్కువ పని-" అంది.
    "నేనేమంత తెలివితక్కువవాన్నికాదు. ఈ ఫోటోలు నేను పంపలేదు-" అన్నాడు రంగా.
    "ఇందాకా నువ్వే పంపానన్నావు!" అన్నాడు విశ్వం.
    "అందుక్కారణముంది-" అన్నాడు రంగా-"నువ్వసలే పిరికివాడివి. ఆ ఫోటో లెవరో పంపారని తెలిస్తే వాళ్ళ సంగతెలాగున్నా ముందు నువ్వే భయపడి పెళ్ళి వద్దంటావని భయపడి అలా చెప్పాను. దాంతో నువ్వు ఆ తర్వాత నీ మామగారు తెచ్చిన ఫోటోలు కూడా చూసి అవీ నేనే పంపి ఉంటాననుకున్నావు....."
    "అయితే ఈ ఫోటో లేవరు పంపారంటావు?"
    "ఇంకెవరు? నెగెటివు లెవరిదగ్గరున్నాయో-వాళ్ళు!"

 Previous Page Next Page