Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 5


    "నా పరిస్థితుల్లో యెవరైనా అలాగే అనుకుంటారు. ఆమె యెంతో అమాయకంగా మాట్లాడింది. నావంక జాలిగా చూసేది. నామీద జాలిపడేది...." విశ్వం స్వరం తగ్గించి-"రంగా-ఇంతకంటే ఏం చెప్పను? ఆమె నామీద జాలితో నన్ను తన నగ్న శరీరాన్ని రెండుమూడుసార్లు చూడనిచ్చింది-" అని రంగాకు మాత్రమే వినపడేలా చెప్పాడు.
    "అనూరాధను పరీక్షించిన ఆ లేడీ డాక్టరు ఎవరు?"
    "డాక్టర్ ప్రభాదేవి."
    "ఆమె బాగా పేరున్న డాక్టరు...." అన్నాడు రంగా-"అంటే నీ భార్య చాలా చాలా తెలివైనదయుండాలి. అంత అందమైన ఆడదానికన్ని తెలివితేటలున్నాయంటే నమ్మశక్యం కాకుండా వుంది."
    "ఇప్పుడేం చేయాలి?"
    "నీ భార్యకన్ని తెలివితేటలుండడానికి వీల్లేదు. ఎవరో తెలివైన వాళ్ళామెకు సాయపడ్డారు. యెవరు వాళ్ళు?"
    "రంగా-నువ్వు చెప్పేవన్నీ వింటూంటే నాకు భయం వేస్తోంది...." అన్నాడు విశ్వం.
    రంగా అతడి వంక అనుమానంగా చూస్తూ-"తప్పు చేసినవారే భయపడతారు.." అన్నాడు.
    "అంటే?"
    "నీ భార్యకు సాయపడగల తెలివైన వాడివి నువ్వే నని నా అనుమానం.." అన్నాడు రంగా.
    "ఇది చాలా అన్యాయం. నేను తెలివితక్కువవాడినని ఇందాకా నువ్వే అన్నావు!"
    "తెలివితక్కువ వాడినని భ్రమింపజేయడం కూడా ఒకవిధమైన తెలివే!" అన్నాడు రంగా.
    "ప్లీజ్ రంగా! నన్ను నమ్ము. నువ్వేం చెబితే అది చేస్తాను."
    రంగా సాలోచనగా-"వ్యవహారం చాలా తిరకాసుగా వుంది. మనం వేయబోయే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఏది యేమైనా నువ్వు పెళ్ళికి సిద్దపడాలి..." అన్నాడు.
    "నువ్వేం చెబితే దానికి నేను సిద్ధం. కానీ ఇందులో ఎలాంటి ప్రమాదమెదురైనా నువ్వే నన్ను రక్షించాలి" అన్నాడు విశ్వం.
    "నన్ను నమ్మిన వాళ్ళను నేను రక్షించగలను.." అన్నాడు రంగా. తర్వాత అతడు విశ్వానికి పరిస్థితి వివరించి చెప్పాడు.
    అనూరాధకు విశ్వం గురించిన రహస్యం విశ్వం ద్వారా తెలియడానికి లేదు. ఆ రహస్యమామెకు ఎలాగో తెలిసి తెలివిగా అతడి నుంచి తప్పించుకుంది. అసలు పెళ్ళిచేసుకోకముందే ఆమెకీ విషయం తెలిసుండాలి. జరుగనున్న పెళ్ళిని ఓ నాటకంలా భావించి ఆమె అందుకు సిద్దపడింది. తర్వాత ఒకరోజున పుట్టింటి వంకపెట్టి పారిపోయింది. ఆమె యెందుకలా చేసిందో ప్రస్తుతానికి తెగే విషయం కాదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆమె చాలా తెలివైనది. తనను మోసంచేయాలనుకుంటున్న వ్యక్తిని, తెలిసికూడా పెళ్ళి చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా అతడి మోసం తనకెక్కడా తెలియదన్న భ్రమ నతడికి కలిగించింది. పెళ్ళి ఫోటోల నెగటివ్సుతోసహా పారిపోయింది.
    ఇప్పుడామె ఏదైనా సాధించాలనుకుంటోందా?
    "అనూరాధ తన్ను తాను రక్షించుకునేందుకిలా చేసి వుంటే ఆమెతో మనకి సంబంధంలేదు. అలాకాక మన జోలికి వచ్చిందా.." అని రంగా ఒక్క క్షణం ఆగి "నే నేమంటానో అని కుతూహలపడుతున్నావు కదూ! అదిప్పుడు చెప్పను-" అన్నాడు.
    
                                        7

    విశ్వం, నర్సమ్మ బస్సు దిగారు. బస్ స్టాండులో రిక్షా వాళ్ళు వాళ్ళ చుట్టూమూగారు. విశ్వం తామెక్కడికి వెళ్ళాలో చెప్పాడు. నర్సమ్మ రిక్షా బేరమాడింది.
    ఇద్దరూ రిక్షా ఎక్కారు. రిక్షా శరవేగంతో దూసుకుని పోయి ఓ ఇంటిముందాగింది.
    అక్కడ ఇంట్లో చాలా హడావుడిగా వుంది. ఎవరో ఓ చిన్న కుర్రాడొచ్చి - "పెళ్ళి వారొచ్చేశారు-..." అన్నాడు. అప్పుడో ముసలాయన బయటకు వచ్చి విశ్వాన్ని చూసి-"రా-నాయనా!" అన్నాడు. నర్సమ్మకు చేతులు జోడించి నమస్కరించాడు.
    తల్లీకొడుకు లిద్దరూ లోపలకు వెళ్ళి ఆడపెళ్ళి వారు చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడ పరస్పర పరిచయాలయ్యాయి.
    వియ్యపురాలు నర్సమ్మ దగ్గరకొచ్చి-"మాలతి నా సవతి కూతురని అంతా అంటారు. కానీ నాకలా అనిపించదు. కన్నబిడ్డలకంటే ప్రేమగా పెంచాను దాన్ని" అంది.
    నర్సమ్మ చిరునవ్వు నవ్వి - "ఈ లోకపుతీరే అంత! మంచితనానికి పెడార్ధాలు తీస్తుంది. మా అబ్బాయికి కట్నం, లాంచనాలు అంటే అసహ్యం. ఆర్భాటాలంటే అసహ్యం. కానీ ఖర్చులేకుండా దండలు మార్చుకుంటే అది పెళ్ళి కాదా అంటాడు. దీనికందరూ పెడర్ధాలుతీసి వాడికి పెళ్ళే కాదని భయమేమీ అంటారు..." అంది.
    ఫలహారాలు వచ్చాయి. విశ్వం, నర్సమ్మ ఫలహారాలు తీసుకున్నారు, విశ్వం దృష్టంతా పెళ్ళికూతురిమీదే వుంది. ఆమె చాలా అందగత్తె అని విన్నాడతను. ఇప్పుడు చూడబోతున్నాడు.
    ఇంకా పెళ్ళికూతురు రాలేదు.
    "తొందరగా అమ్మాయిని తీసుకొని రండమ్మా!" అంది నర్సమ్మ.
    "ఈలోగా మీతో ఓ విషయం మాట్లాడాలి వదిన గారూ!" అంది వియ్యపురాలు ఆమె సైగచేయగా నర్సమ్మ ఆమెతో కలిసి లోపలకు వెళ్ళింది.
    వియ్యపురాలు గది తలుపులు వేసింది. తన బొడ్లోంచి తాళం చెవులు తీసి - అక్కడున్న బీరువా తలుపులు తెరుస్తూ-"ఈ యింట్లో నేను తప్ప ఎవ్వరూ ఈ బీరువాను తాకడానికికూడా వీల్లేదు...." అంది.
    ఆమె చెప్పదల్చుకున్న దేమితా అని నర్సమ్మ ఎదురుచూస్తోంది.
    వియ్యపురాలు బీరువా అరలోంచీ ఓ మూలగా పెట్టిన కవరొకటి తీసింది. ఆ కవర్లోంచి ఓ కాగితంతీసి నర్సమ్మ కిచ్చి-"ఇది చదవండొదినగారూ..." అంది.
    నర్సమ్మ ఆ కాగితం చదివింది. అందులో విశ్వానికి అంతకుముందే వివాహమైందన్న విషయం వ్రాసి వుంది.
    "అబద్ధం!" అంది నర్సమ్మ అప్రయత్నంగా.
    అప్పుడు వియ్యపురాలు కవర్లోంచి ఓ ఫోటోకూడా తీసి నర్సమ్మకిచ్సింది. అది చూస్తూనే నర్సమ్మ గుడ్లు తేలేసింది. ఏం మాట్లాడాలో ఆమెకర్ధంకాలేదు.
    "ఇదంతా ఏమిటి వదినగారూ....." అంది వియ్యపురాలు.
    "ఏమో-నాకేమీ అర్ధం కావడంలేదు...." అంది నర్సమ్మ.
    "ఈ రోజుల్లో చాలామంది ఫోటోగ్రఫీలో ట్రిక్స్ చేస్తున్నారు. నా కూతురికి పెళ్ళి కుదిరిందని అసూయపడి కొందరీ పెళ్ళి చెడగొట్టడానికి కుతంత్రం చేస్తున్నారు. అవునా?"
    "అవును...." అనేసింది నర్సమ్మ వెంటనే.
    "నేనలాగే అనుకున్నాను. అయినా సవతి తల్లిని కదా నేను చెబితే ఈ మాటెవరూ నమ్మరు. అందుకే మిమ్మల్నడిగి తెలుసుకుంటున్నాను..." అంది వియ్యపురాలు.
    "మీరు చాలా మంచివారు...."
    "అలాగనకండి, మీది చాలా మంచి సంబంధం. మీలాంటి అత్తగారినీ, మీ అబ్బాయిలాంటి భర్తనూ పొందాలంటే మా అమ్మాయి గత జన్మలో ఏ బంగారప్పూలతోనే పూజచేసుకొని వుంటుంది. మీనుంచి నిజం తెలుసుకున్నాక నాకిప్పుడెంతో సంతోషంగా వుంది. ఇక మా మాలతికేలోటూ వుండదు...."
    నర్సమ్మ అనుమానంగా-"మీరు నమ్మినా మిగతా వాళ్ళిది నమ్ముతారా?" అంది.
    "అదే మాలతి అదృష్టం. ఈ ఉత్తరం పోస్టుమాన్ స్వయంగా నాకే యిచ్చాడు. నేనుకాక వేరెవరైనా ఇది చూసివుంటే ఈ పెళ్ళికి ఒప్పుకునే
వారు కాదు. నాకున్న నిధానం మా ఇంట్లో ఇంకెవ్వరికీ లేదు...." అంది వియ్యపురాలు.    
    "మీవంటి వారితో వియ్యమందుతున్నామంటే మాదీ అదృష్టమే కదా!" అంది నర్సమ్మ.

 Previous Page Next Page