"అయితే రంగా యేమంటాడో ఇప్పుడు...." అంది నర్సమ్మ సాలోచనగా.
"ఏమన్నప్పటికీ రంగాను పిలిచి మాట్లాడ్డం మంచిదేమో...." అన్నాడు విశ్వం.
"మనని బాగా తిడతాడు-" అంది నర్సమ్మ.
"తిట్టినా తప్పదు..." అన్నాడు విశ్వం.
6
పడక కుర్చీలో వెనక్కు వాలి పడుకుని కళ్ళు రెండూ మూసుకుని-"అంటే-నీ పెళ్ళాం పారిపోయిందన్న మాట" అన్నాడు రంగా.
"ఊఁ" అన్నాడు విశ్వం.
"పట్టుమని పదిరోజులైనా కాపురం చేయలేదు-" అంది నర్సమ్మ.
"ఎందుకు పారిపోయింది?" అన్నాడు రంగా.
"తెలియదు..."
"చూడు విశ్వం ఆపిల్ల నిన్ను ప్రేమించింది. తల్లి దండ్రుల్నెదిరించి మరీ నిన్ను పెళ్ళి చేసుకుంది. నువ్వే ప్రపంచమనుకుని నీతోనే వుండిపోవాలనుకుంది. అలాంటి పిల్ల ఉన్నట్లుండి ఎందుకు పారిపోతుంది?" అన్నాడు రంగా.
"అదే నాకూ అర్ధం కావడంలేద. అసలు తనిలా పారిపోవచ్చు ననిపించేలా కూడా నా వద్ద ప్రవర్తించలేదు. పైగా తను పేరు మార్చుకుంది...తన పేరిప్పుడు మనోరమ అంటోంది...."
"నా అభిప్రాయంలో అనూరాధ వేరు. మనోరమ వేరు. ఎందుకంటే హిందూ స్త్రీ-భర్తనంత సులభంగా విడిచిపెట్టదు. విడిచిపెట్టినా హిందూ స్త్రీకి అంత సులభంగా వివాహం కాదు. ఈ రెండూ జరుగుతున్నా యంటే ఆమె తప్పకుండా వేరే యువతి అయుండాలని నేను నమ్ముతున్నాను...."
"అయితే అనూరాధ ఏమయుంటుంది?"
"అదే నేను నిన్నడగుతున్నాను...."
"అంటే?" కంగారుగా అన్నాడు విశ్వం.
"నీకు నీ భార్యంటే ప్రేమ ఏర్పడింది. ఆమెనెక్కడో దాచావు...."
"దాచడమెందుకు?"
"ఎందుకో నువ్వే ఆలోచించు..." అన్నాడు రంగా.
విశ్వం కాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా "రంగా-నువ్వు నన్ను నమ్ము, నా భార్యను వెతికే మార్గం చెప్పు..." అన్నాడు.
"మెలకువగా వున్న వాళ్ళను నిద్ర లేపడమెంతకష్టమో-తప్పిపోయిన వాళ్ళను వెతకడమూ అంత కష్టం. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అసలేం జరిగిందో చెప్పు...."
"నేను నీకు నిజమే చెప్పాను...."
"అయితే నేను చెప్పినట్లు చేస్తావా?"
"చేస్తాను...."
"మాట తప్పకూడదు...."
"తప్పను....."
"ఇంతకీ మావాడినేం చేయమంటావ్ బాబూ!" అంది నర్సమ్మ.
"మళ్ళీ పెళ్ళి చేసుకోమంటాను...."
"మళ్ళీ పెళ్ళా?" విశ్వం గుటకలు మింగాడు.
"ఏం- సంతోషించడానికి బదులు భయపడతావేం?"
"రెండోసారి పెళ్ళిచేసుకోవడం నేరం కదూ!"
"నీకు మొదటిసారి పెళ్ళి జరిగితే కదా-రెండో పెళ్ళి చేసుకునేందుకు...." అన్నాడు రంగా.
"అంటే?"
"ముందు మీరిక్కన్నించి మకాం మార్చేస్తారు. నీకు పెళ్లైనట్లు సాక్ష్యాలేమున్నాయి...."
"పెళ్ళి ఫోటోలు...."
"అవి మన దగ్గరే వున్నాయి కదురా-" అంది నర్సమ్మ.
"అవును-అత్తవారింట్లో అడిగితే-నెగెటివ్సున్నాయి-ప్రింటు చేయించి పంపిస్తానని చెప్పాను తప్పితే వాళ్ళ కివ్వలేదు-" అన్నాడు విశ్వం.
"అయితే చాలా మంచి పబ్ని చేశావు. ఆ ఫోటోలూ నెగెటివ్సూ ఇలా తీసుకురా. ఇప్పుడే ఇక్కడే తగులెట్టేద్దాం..." అన్నాడు రంగా.
"అవి మన దగ్గరే ఉంటే నష్టమేమిటి?" అన్నాడు విశ్వం.
"భలేవాడినే.....రేపే కారణం చేతయినా పోలీసులీ యిల్లు సెర్చిచేస్తే- ఆ ఫోటోలు దొరక్కూడదు. అసలు అనూరాధనే పేరుగల యువతి ఈ యింట్లో యెన్నడూ అడుగుపెట్టలేదు. నీ పెళ్ళి రహస్యంగా జరిగింది. ఆ పెళ్ళికి సాక్షిని నేనే! అనూరాదనీ యింట్లో కొద్ది రోజులెవరైనా చూసి వుండవచ్చు. కానీ ఆమె నీ భార్యగా ఇక్కడెవ్వరికీ పరిచయం చేయబడలేదు. ఎవరో అమ్మాయి చుట్టపు చూపుగా వచ్చి ఉందని అంతా అనుకుని ఉంటారు. అదీకాక మీరిక్కన్నించి మకామెలాగూ మార్చేస్తున్నారు...."
విశ్వం లోపలకు వెళ్ళి తిరిగివచ్చాడు. అతడి చేతుల్లో ఓ కవరుంది-....."ఇవీ ఫోటోలు...."
రంగా అందుకుని-ఫోటోలను చూసి- "గుడ్!" అన్నాడు. అతడు కుడిచేత్తో వాటిని పట్టుకొని ఎడంచేత్తో సిగర్ లైటర్ వెలిగించి-ఆ ఫోటోలను అంటించాడు. గుప్పున మండాయవి. వాటిని నేలమీదకు జారవిడుస్తూ-"నెగెటివ్స్ కూడా యివ్వు!" అన్నాడు.
విశ్వం తల వంచుకుని-"నెగెటివ్స్ కనిపించడంలేదు" అన్నాడు.
"వాట్!" అన్నాడు రంగా.
"నేను ఫోటోల నొకచోటా నెగెటివ్సొకచోటా భద్రంగా దాచాను. ఇప్పుడు నెగెటివ్సు కనిపించడం లేదు...."
"నువ్వు నిజమే చెబుతున్నావా?"
"ఊఁ."
"నెగెటివ్స్ ఎప్పట్నించి కనబడ్డం లేదు....?" అన్నాడు రంగా.
"నెగెటివ్సు వేరేపెట్టానని చెప్పానుకదా-ఫోటోలు వచ్చేక ఫోతోలనే మళ్ళీ వాటికోసం చూడలేదు. ఇదే చూడ్డం...."
"అంటే ఒక వేళ నీ భార్య తను వెళ్ళిపోతూ వాటిని తీసుకునిపోయే అవకాశముందా?" అన్నాడు రంగా.
విశ్వం ఉలిక్కిపడి-"ఇది నాకు తట్టనేలేదు. అలాగే జరిగుండవచ్చు-" అన్నాడు.
"అలాగే ఎందుకు జరుగుతుంది?" అన్నాడు రంగా.
విశ్వం మాట్లాడలేదు.
"విశ్వం-నువ్వు నన్ను మోసమైనా చేస్తూండాలి. లేదా నీవల్ల పెద్ద పొరపాటైనా జరిగుండాలి. నీ భార్య ఇక్కన్నించి వెళ్ళిపోతూ కూడా నెగెటివ్సు తీసుకుని వెళ్ళాలని ఎందుకనుకుంది? అసలు తనిక్కన్నించి వెళ్ళిపోవాలన్న ఆలోచనకెందుకొచ్చింది?"
"నువ్వు నన్నీ ప్రశ్న లెందుకడుగుతున్నావు?"
"నీ భార్యకు నీ గురించి తెలిసిపోయిందా?"
"ఆ అవకాశం లేదు. అబ్బాయి తన జాగ్రత్తలో తనున్నాడు-"అంది నర్సమ్మ తను కొడుకు తరఫున మాట్లాడుతూ.
"అబ్బాయి తన జాగ్రత్తలో తనుండడం సహజం. ఎందుకంటే రహస్యం అబ్బాయికి తెలుసు కాబట్టి. కానీ అమ్మాయికూడా తన జాగ్రత్తలో తనుందని నాకిప్పుడనిపిస్తోంది. అలా ఎందుకు జరిగిందీ అని ఆలోచిస్తున్నాను."
విశ్వం చటుక్కున-"రంగా-నువ్వు చెప్పింది నిజం. ఆమె తన జాగ్రత్తలో తఃనుందని నాకిప్పుడర్దమవుతోంది" అన్నాడు.
"అంటే?"
"మాకిద్దరికీ వివాహమైనా మేము భార్యాభర్తల్లా కలిసి జీవించలేదు. తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పింది. డాక్టరు వద్దకుకూడా తీసుకొని వెళ్ళాను. ఆమె అనూరాధను పరీక్షించి నెలరోజులపాటు సంసారజీవితానికి దూరంగా వుండాలని చెప్పింది...."
రంగా తెల్లబోయి-"విశ్వం-నువ్వు తెలివితక్కువ వాడివని తెలుసు. కానీ మరీ యింత ఫూల్ వనుకోలేదు-" అన్నాడు.