విశ్వం చటుక్కున లేచి నిలబడి-"మీకు సాయపడాలనుకోవడం నా తెలివితక్కువ. అయితే మీ పెళ్ళి ముహూర్తం కుదిరేలోగా అనూరాధను బయటకు లాగలేనంతటి తెలివితక్కువవాణ్ణి మాత్రం కాను...." అన్నాడు.
4
అది సుందరేశన్ కంపెనీ. బిజినెస్ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్న వ్యాపారం. ఏయే ప్రాంతాల ఏయే వస్తువులకు గిరాకీ ఉన్నదీ-ఒకే వస్తువుకు వివిధ కంపెనీలు నిర్ణయించిన వివిధ ధరలు-షేర్ మార్కెట్ తీరుతెన్నులు-ఇలా ఒకటేమిటి-వ్యాపారానికి సంబంధించిన యెన్నో వ్యవహారాల్లో అకక్డ సమాచారం, సలహా, సంప్రదింపులు లభిస్తూంటాయి.
అక్కడి ఆఫీసులో మొత్తం నలభైమంది ఉద్యోగులున్నారు. నాలుగు సెక్షన్లున్నాయి.
విశ్వం ఆ ఆఫీసులో అడుగుపెట్టి రిసెప్షనిస్టును కలుసుకున్నాడు. ఆమె ఇరవై ఏళ్ల అందమైన యువతి. మామూలుగానే నవ్వుతున్నట్లుండే ముఖం. చిరునవ్వు నవ్వినప్పుడు చూడగానే-ఆ చిరునవ్వుకోసం మళ్ళీ మళ్ళీ ఆ ఆఫీసుకు రావాలనిపిస్తుంది.
"వాట్ కెనైడూ ఫర్ యూ-...." అందామె.
"ఇక్కడ పనిచేస్తున్న అనూరాధ అనే అమ్మాయి గురించి తెలుసుకుందుకు వచ్చాను..." అన్నాడు విశ్వం.
"మీరు లోపలకు వెళ్ళి శ్రీమన్నారాయణగారిని కలుసుకోండి...." అందా అమ్మాయి వెంటనే.
విశ్వం లోపలకు వెళ్ళాడు. శ్రీమన్నారాయణ గురంచి తనకు కనబడిన ఫ్యూన్ ని అడిగాడు.
శ్రీమన్నారాయణ ఓ సెక్షన్ కి హెడ్ ఫ్యూన్ విశ్వాన్ని శ్రీమన్నారాయణ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
శ్రీమన్నారాయణ ఫుల్ సూటులో వున్నాడు. గది పూర్తిగా ఎయిర్ కండిషన్డు, విశ్వం అక్కడి యేర్పాట్లూ చూసి-"అనూరాధ గొప్ప కంపెనీలోనే పని చేసేదన్నమాట...." అనుకున్నాడు.
అంతకుముందు అతడెన్నడూ ఆ కంపెనీ ఆఫీసులో అడుగుపెట్టలేదు. అనూరాధ అందుకతడిని ప్రోత్సహించనూ లేదు.
"మీ కంపెనీలో పనిచేసే మిస్ అనూరాధ గురించి తెలుసుకోవాలని వచ్చాను..." అన్నాడు విశ్వం.
"ఏం తెలుసుకోవాలి?"
"ఆమె విద్యాభ్యాసం యెక్కడ జరిగిందోనని.....మీ దగ్గర సర్టిఫికెట్సుంటాయి గదా..."
"మీరు పోలీసులా?" అన్నాడు శ్రీమన్నారాయణ..
"అలాగే అనుకోవచ్చు...."
"మీకు సహకరించాల్సిన బాధ్యత నాకుంది-కానీ మీకాట్టే సహకరించలేనని నా భయం...." అన్నాడు శ్రీమన్నారాయణ.
అనూరాధ సుమారు ఏన్నర్ధం అక్కడ పనిచేసింది. పదిరోజుల క్రితమే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇకపోతే ఆమె అక్కడ చేసే ఉద్యోగానికి యే సర్టిఫికెట్లూ అవసరం లేదు.
"ఎందుకంటే ఒకోసారి యే సర్టిఫికెట్సూ లేనివారు ఉన్న వారికంటే బాగా పనిచేయగల్గుతారు. సర్టిఫికెట్సుకు ప్రాముఖ్యతనిస్తే-అలాంటి వారిని సెలక్టుచేయడానికిబ్బంది. అందుకని మేము ఇక్కడకు వచ్చిన వారిని పరీక్షిస్తాము. పనికొస్తారనుకున్నవారికి మేమే శిక్షణకూడా యిచ్చుకుంటాము..." అన్నాడు శ్రీమన్నారాయణ.
"అంటే మీవద్ద అనూరాధ అనే పేరుతో పని చేస్తున్న అమ్మాయి పేరు మనోరమ అయ్యే అవకాశం కూడా వుందన్నమాటే!" అన్నాడు విశ్వం.
శ్రీమన్నారాయణ కర్ధం కాలేదు. విశ్వం వివరించాడు-"సర్టిఫికెట్లడగరు మీరు. అంటే ఆమె తనే పేరు చెబితే అదే నమ్ముతారు. సర్టిఫికెట్లలో తన పేరు మనోరమ అనే వున్నా-ఆమె మీకు అనూరాధ అని తన పేరు చెబితే మీరదే ఆమె పేరనుకుంటాను....."
"కావచ్చు...."
అనూరాధ గురించి ఇంకేమైనా చెప్పగలరా?"
"చాలా మంచి వర్కర్ వెరీ సిన్సియర్ మా కంపెనీకి ఆమె లేకపోవడం ఒక తీరని నష్టం...." అన్నాడు శ్రీమన్నారాయణ.
"అనూరాధ గురించి ఆఫీసులో ఇంకా చెప్పగల వారెవరైనా ఉంటారా?"
శ్రీమన్నారాయణ మందహాసం చేసి-"మేము చేస్తున్నది వ్యాపారం. ఇది గవర్నమెంటాఫీసు కాదు. అందుకే ఇక్కడ నియమమేటంటే-ఈ కంపెనీలో పనిచేస్తున్న వారంతా యెవరికివారే యమునాతీరే అన్నట్లుండాలి. ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. ఆఫీసు బయటకూడా ఎవరూ ఎవరితోనూ స్నేహ సంబంధాలు పెంచుకోకూడదు. అటువంటిదేమైనా మా దృష్టికివస్తే-ఆ ఉద్యోగులు హెచ్చరింపబడతారు. అందువల్ల అనూరాధతో ఇక్కడింకెవరికైనా పరిచయమున్నప్పటికీ వారా విషయం మీకు చెప్పరు. మేమే కూపీలాగడానికెవరినో నియమించామనుకుని భయపడతారు" అన్నాడు.
"చాలా తమాషాగా వుంది...." అన్నాడు విశ్వం.
"వ్యక్తిగత జీవితానికీ ఆఫీసుకూ యేమి సంబంధముండకూడదు. అంటే ఇళ్ళలో యేదైనా శుభం జరిగితే స్వీట్సు పంచిపెట్టడంకూడా మేము ప్రోత్సహించము."
"ఇలాగైతే ఇక్కడెవరూ యెక్కువకాలం పనిచేయరు..."
శ్రీమన్నారాయణ నవ్వి-"మేమిచ్చే జీతాలు ఎక్కువ. అందుకని ఎవరూ ఇక్కన్నించి వెళ్ళిపోవాలనుకోరు. అయినా ఆఫీసుకు వచ్చేది నియమిత కాలంలో అప్పగించబడిన పనిచేయడానికి తప్పితే ఊసుపోక కబుర్లకూ వాటికీ కాదు కదా! మా ఆఫీసులో యెవరెప్పుడు ఉద్యోగం మానేసినా బాధలేదు. మా దగ్గర అన్ని రకాల ఉద్యోగాలకీ-వెయిటింగు లిస్టులో రకానికో వందమంది చొప్పున ఉన్నారు...." అన్నాడు.
విశ్వం లేచి-"థాంక్స్!" అన్నాడు.
5
విశ్వం దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు. తల్లి నర్సమ్మ అక్కడకొచ్చి-"ఏరా-కోడలుపిల్ల కబురు తెలిసే అవకాశం లేదా?" అంది.
"నీ కోడలుపిల్ల మళ్ళీ పెళ్ళి చేసుకుంటోంది...." అన్నాడు విశ్వం.
"అది చేసుకుంటానంటే మాత్రం చేసుకుందుకెవడైనా సిద్దంగా వుండాలి కదా!"
"ఉన్నాడమ్మా -ఇప్పుడు దాని పేరు అనూరాధ కాదు-మనోరమ!"
"ఏమిటీ-అది పేర్లుకూడా మారుస్తోందా-అమాయకంగా కనపడేది-దానికన్ని తెలివితేటలొచ్చాయా?" అంది నర్సమ్మ.
"ఇప్పుడూ అమాయకంగానే కనబడుతోందమ్మా.." అన్నాడు విశ్వం. అతడు తల్లికి నెమ్మదిగా అంతకు జరిగిన అనుభవమూ, సత్యనారాయణ గురించీ చెప్పాడు.
నర్సమ్మ ముక్కుమీద వేలేసుకుని-"ఇక్కడ నిన్ను పెళ్ళి చేసుకుని మళ్ళీ అక్కడింకో పెళ్ళికి తయారవుతోందా-చాలా విడ్డూరంగా ఉందే!" అంది.
"ఇప్పుడు నేనేం చేయాలో చెప్పమ్మా!" అన్నాడు విశ్వం దీనంగా.
"నువ్వు చవట దద్దమ్మలా ఊరుకున్నా నేనూరుకోను. ఇప్పుడే ప్రయాణమై వెళ్ళి-ఇంటిల్ల పాదినీ నిలదీసి జుట్టుపట్టి మరీ దాన్ని కాపురానికి తీసుకొస్తాను-" అంది నర్సమ్మ కోపంగా.
"మనం వాళ్ళనేం నిలదీస్తామమ్మా-వాళ్ళే మనల్ని నిలదీసేలాగున్నారు. పదిరోజుల్లో మనం అనూరాధ ఆచూకీ చెప్పకపోతే వాళ్ళు పోలీసు కంప్లయింట్ కూడా యిస్తామని బెదిరించారు...."
పోలీస్ కంప్లయింట్ పేరు వినగానే నర్సమ్మ కూడా కంగారు పడింది.
"అయితే దాని ఆఫీసుకు వెళ్ళి కనుక్కోలేకపోయావా" ఈ పేర్ల తిరకాసేమిటో తెలిసేది...." అంది నర్సమ్మ.
"నీకు చెప్పకుండా ఈ రెండ్రోజూలూ నేను చేసిందదే! ఏమీ ప్రయోజనం లేదు. అది మనకంటే తెలివైనది. దెబ్బతినేశాం...." అన్నాడు విశ్వం.