"నాకు అంత తీరుబడి లేదు. అదుపులో పెట్టాలన్న ఆలోచన కూడా నాకు లేదు కారణం అది నా బిడ్డ గనక!"
"పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుంది. అది గుడ్డితనం డి.ఆర్.!"
"నీకెందుకురా గాడిదా బాధ?
మా చిత్ర ఎవరితోనో తిరుగుతుంది. ఓకే. తిరగనియ్. ప్రేమంటుందీ, ఓ.కే. ప్రేమించనీ, రేపు పెళ్ళి చేసుకొంటుంది.
ఓ.కే. చేసుకోనీ.
దీవించవలసిన వాడిని నేను.
అది పాడై పోతుందని నువ్వు ఏడవకు" అన్నాడు డి.ఆర్.
"మాటలు మర్యాదగా రావడం మంచిది"
"వార్నింగా? పిచ్చివెధవా? విను తెలిసిన కుక్కని కూడా గౌరవిస్తాడీ డి.ఆర్.! కానీ నీలాంటి నక్కజాతి మనుషుల తోళ్ళు ఎలా ఒలవాలో డి.ఆర్. కి తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు.
ఎప్పుడో ఒకప్పుడు నీకు కటకటాలు తప్పవు. "ఫోన్ పెట్టేసి కూతురికేసి ప్రేమగా చూశాడు డి.ఆర్.
"ఏమిటి డాడీ, వ్వాట్ హేపెండ్?" సగం అర్థం అయి మిగిలింది అర్థం కాక అడిగింది చిత్ర.
"నీ గురించి బొమ్మలతో నవల రాశారటమ్మా కాలేజీ గోడలనిండా" నవ్వుతూ అన్నాడు డి.ఆర్.
"వ్వాట్?" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసింది చిత్ర.
"ఫెంటాస్టిక్! ఏం రాశారో వెంటనే వెళ్ళి చూడాలి."
"ఈశ్వర్ గురించీ, నీ గురించీ బూతులు రాసి ఉంటారు." దానికి ఏవిధమైన ప్రాముఖ్యమూ ఇవ్వనట్టుగా ఫైలు చూసుకోవడం మొదలుపెట్టాడు డి.ఆర్.
తండ్రి భుజాలపైన చేతులు వేసి ఆయన మెడమీద నుంచి మొహంలో మొహం పెట్టి - "నీకు కోపం రాలేదా డాడీ" అడిగింది.
"దేనికి?"
"ఇలా జరిగినందుకు."
సిగరెట్ ని ఏష్ ట్రేపైన పెట్టి చిత్ర చెంపల్ని అరచేతుల్లోకి తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు డి.ఆర్.
"జాతి రత్నాన్ని చూసి హేళన చేసినంత మాత్రాన ఆ రత్నం విలువ తగ్గదమ్మా!
ఈశ్వర్ గురించి నా కెప్పుడో చెప్పావు. నేను ఓ.కే. చేశాను.
ఈ రోజు యీ వెధవలు ఏదో వెధవరాతలు రాశారని నాకేం కోపంలేదు ఐ పిటీ దోస్ ఫూల్స్. ఇంతకీ ఇది ఎవరు చేసి ఉంటారో గెస్ చెయ్యగలవా?" అడిగాడు డి.ఆర్.
"జెన్నీ, అతని ఫ్రెండ్స్ అయుంటారు డాడీ!"
"జెన్నీ అంటే అంకయ్య మేనల్లుడు కదూ?"
"ఎస్ డాడీ?"
ఆయన తల పంకించాడు.
"చూడు బేబీ నేరం చెయ్యడం కంటే ఆ నేరాన్ని ప్రోత్సహించడం న్యాయస్థానం దృష్టిలో పెద్దనేరం అవుతుంది.
అంకయ్య ఆగడాలు నాకు తెలుసు.
నా చేతిలో గూండాలకీ, హంతకులకీ తక్కువలేదు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం నీ డాడీకి నిమిషాల పని.
కానీ కుక్కలు మొరిగాయని ఏనుగు పట్టించుకొంటే అవి మరింత రెచ్చిపోతాయి.
అల్ప జంతువులు!
వాటిని మునిసిపాలిటీ బండితో యీడ్చేస్తారు. నువ్వీ విషయానికి పెద్దగా ప్రాముఖ్యాన్నివ్వకు. బాధపడకు.
ఈశ్వర్ కి కూడా చెప్పు. తొందరపడవద్దని."
"ఓ.కే. డాడీ."
"బై ది బై. నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఓ బస్తా బొగ్గులు తీసుకెళ్ళు."
చిత్ర ఆశ్చర్యంగా చూసింది.
"మిగిలిన గోడలమీద కూడా రాసుకోమని చెప్పమ్మా. జస్ట్ సప్లయ్ చెయ్యమ్మ పాపం పూర్ ఫెలోస్."
"ఓ.కే. డాడీ" అంది చిత్ర డాడీని ముద్దు పెట్టుకొంటూ.
6
కారు దిగి కారిడార్ దగ్గరకి చిత్ర నడిచి వస్తుంటే ఏం మాట్లాడాలో తోచక మౌనం వహించారు విద్యార్థినులు.
కొంతమంది అబ్బాయిల మొహాలలో ఆనందం కనబడుతోంది. ఆమె ఎంతో అందుబాటులో ఉన్న వస్తువులా అనిపిస్తోంది కొందరికి.
కానీ చిత్ర యిదేం పట్టించుకోలేదు.
అసలు ఏమీ జరగనట్టుగానే అక్కడి కొచ్చింది.
అక్కడ గోడలమీద వేసి వున్న బొమ్మలని, రాతల్ని చూసి ఏదో అద్భుతమయిన విశేషాన్ని చూసిన దానిలా "ఫెంటాస్టిక్" అని అరిచింది చిత్ర.