"ఒరేయ్ చిదంబరం! భారతంలో శకుని పాత్రకున్న ప్రాముఖ్యం ఎంతటిదో, మా గ్రూపులో నీకు అంత ప్రాముఖ్యమూ ఉంది.
ఎందుకో తెలుసా?
పిల్లి ఎదురొస్తే ఎంత ప్రమాదమో, నీ సలహాని మేం పాటిస్తే అవతలవాడికి అంత ప్రమాదం. కనకనే నిన్ను ముద్దుగా 'పిల్లి' అని పిలుచుకుంటున్నాం. మన కాలేజీలో ఎన్ని పిల్లులున్నా నీలాంటి ఇంటలిజెంట్ కాట్ మరోటి లేదు. అందుకే మన గ్రూపులో నీకంత ఇంపార్టెన్స్ ఉంది." అన్నాడు జెన్నీ.
"థాంక్స్ అన్నా! నా తెలివిమీద నీకు నమ్మకం ఉంటే అంతే చాలు!
ఇప్పుడు చెప్పు. ఏకంగా న్యూడ్స్ వేసేస్తాను."
"బట్టలు లేకపోతే చిత్ర ఎంత అందంగా ఉంటుందో తెలుసా?" అడిగాడు జెన్నీ సగం కళ్ళుమూసి.
"నేను చూడలేదు. నువ్వుగానీ చూశావా?" అడిగాడు చిదంబరం.
"షటప్. బట్టలు లేకపోతే అది ఎలా వుంటుందో అలా వెయ్యాలి."
"యీ ఐడియా ముందే ఉంటే కలర్స్ తెచ్చేవాడివి."
"పోనీ నేను వెళ్ళి తీసుకురానా?" అడిగాడు రాజ్ కుమార్.
"యీలోగా తెల్లారిపోతుంది మీ మొహాలని వాచ్ మన్ గుర్తు పట్టేస్తాడు. ఈశ్వర్ గాడొచ్చి మిమ్మల్ని ఫుట్ బాల్ ఆడేస్తాడు యీ బొగ్గులతోనే ఏడవండి. క్విక్! త్వరగా రాయండి" అన్నాడు జెన్నీ తొందరచేస్తూ.
అరగంటలో గోడలపైన, క్లాస్ రూమ్ దగ్గర ఇష్టం వచ్చినట్టు బూతు బొమ్మలు గీసి వాటికి ఈశ్వర్, చిత్ర అని నామకరణం చేశారు
"వెరీగుడ్. రేపు పేకాడిస్తాను రాస్కెల్ ని! పదండి" అన్నాడు జెన్నీ కసిగా.
జెన్నీ వెనకనే నడుస్తూ చిదంబరం అన్నాడు.
"బొమ్మతో సరిపెట్టావు. నిజంగా చిత్రని మనం అలా చూడలేమంటావా?" అని
ఆ మాటలకి జెన్నీ వికారంగా నవ్వాడు.
5
"హలో డి.ఆర్. హియర్. ఎవరు కావాలి?" హుందాగా పలికాడు క్రిమినల్ లాయర్ డి.ఆర్.
"నువ్వే!"
"ఏం కావాలి? ఎవరు నువ్వు?"
"నీ శ్రేయోభిలాషిని. నీ కో గుడ్ న్యూస్ చెబుదామని."
డి.ఆర్. భ్రుకుటి ముడిపడింది.
ఆయనకి ఏదో అనుమానం కలిగింది.
దానిక్కారణం అవతలి గొంతులో ధ్వనిస్తూన్న హేళనే.
అంతలో చిత్ర లోపలినుంచి వచ్చి "డాడీ" అంటూ ఆయన భుజాల చుట్టూ చేతులు వేసింది.
కూతురికేసి చూసి నవ్వి "ఏదో గుడ్ న్యూసట. విందాం" అన్నాడు.
"నాకేమన్నా లాటరీలో బంపర్ ప్రైజ్ వచ్చిందా?"
"లేదు."
"పోనీ నేను జడ్జిని అవుతున్నానా? అది నా కెలాగూ ఇష్టం లేదు కనక అది గుడ్ న్యూస్ కాదు."
"కాదు."
"కొంపదీసి యీ వయసులో నాకేమన్నా పిల్లనిగానీ ఇస్తున్నావా?"
"ఎగతాళిగా ఉందా డి ఆర్?" కోపంగా ధ్వనించింది అవతలి గొంతు.
లేచింది మొదలు పడుకొనే వరకూ నాకు కనబడేది నేరస్తుల మొహాలు. నేను వినేది వాళ్ళ గొంతులు నీ గొంతు స్పష్టం చేస్తోంది చిల్లర నేరస్తుడివని. కానీ నేను చిల్లర కేసులు తీసుకోను ఆ సంగతి నీకు తెలుసో తెలీదో?"
అవతల నుంచి పెద్ద నవ్వు వినబడింది.
"నువ్వు చిల్లర కేసులు తీసుకోకపోవచ్చు. చిల్లర ఏడుకోకపోవచ్చు. కానీ నీ కూతురు?"
"నా పక్కనే ఉంది నా స్వీట్ బేబీ" అన్నాడు డి.ఆర్. నవ్వుతూ.
"నీ పక్కనే ఉన్నదో మరోడి పక్కలోనే ఉన్నదో నా కనవసరం. కానీ దాని జాతకాన్ని కాలేజీ గోడలనిండా రాశారు."
"ఐ.సీ. అయితే నా బిడ్డ గొప్ప జాతకురాలే. ఇంతకూ యీ గొప్పతనం నీదేనా?"
"అవును."
"నీ గొంతు వింటే తెలుస్తుందిలే ఇంతకీ వార్తా విశేషాలు చెప్పలేదు."
"నీ కూతురు ఈశ్వర్ అనేవాడితో విచ్చలవిడిగా తిరుగుతోంది."