Previous Page Next Page 
మహాశక్తి పేజి 10

    "నీకేమన్నా పిచ్చి పట్టిందా? మేం అసలు యిక్కడ నించోడానికే సిగ్గుపడి చస్తున్నాం" అంది అశ్వని.

    అశ్వనికేసి నవ్వుతూ చూసింది చిత్ర.

    "నా పక్కన నించోడానికా?" అడిగింది.

    "ఛ. అదికాదే మొద్దూ! చూడు ఎంత అసహ్యంగా వేశారో?"

    చిత్ర ఆమె భుజం మీద చెయ్యి వేసింది.

    "చూడు! పవిత్రమయిన ఆలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి. వాటిని మనం పవిత్రంగానే స్వీకరిస్తున్నాం. కళాశాల అనేది కూడా పవిత్రమయిందే నా దృష్టిలో!  మనం యిక్కడికొచ్చి విద్య నేర్చుకుంటాం! అందుచేత యిలాంటి కళాఖండాలని యిక్కడ మన చిత్రకారులు చిత్రీకరించడం చూసి అభినందించాలే తప్ప, ఏడవకూడదు. భయపడకూడదు."

    "నీ తలకాయలా ఉంది నీ కంపారిజన్" కోపంగా అంది భారతి.

    "నాకంటే అందమయినవాళ్ళు, సీనియర్లు, జూనియర్లు ఎందరో వున్నారు కాలేజీలో ఎవరికన్నా యిలాంటి అదృష్టం కలిగిందా? రియల్లీ. బాగా వేశారు."

    "నీ బొంద! ఇది అదృష్టమా?" అశ్వని రుసరుసలాడింది.

    "దీనికిదంతా చూసేసరికి మతి పూర్తిగా పోయింది. అందుకే యిలా వాగుతోంది వేదాంతం చెబుతున్నట్టు" జడ్జిగారమ్మాయి నసీం అన్నది.

    "నా మాటలు విని వెంటనే రిపోర్టు యివ్వు" అశ్వని సలహా ఇచ్చింది.

    చిత్ర విచిత్రంగా చూసింది అశ్విని కేసి.

    "రిపోర్టు అంటూ యిస్తే ఎవరిమీద యివ్వాలో నీకు తెలుసా?" అడిగింది చిత్ర.

    "తెలుసు. ఇది జెన్నీ వాళ్ళ పని" అంది అశ్వని ఖచ్చితంగా.

    "గుడ్! నీ ఊహాశక్తి గొప్పదే. కానీ నేను ఎవరిమీదా రిపోర్టు చెయ్యను. ఎలాగూ నా ప్రేమ కధని ప్రతి వెధవనీ పిలిచి చెప్పుకొనే ఓపిక నాకు లేదు. వాళ్ళు నాకు బోలెడు సాయం చేశారు. అంటే నా హృదయంలో యింకే గాడిదకీ వేకెన్సీ లేదని తెలిసిపోతుంది కదా?"

    "ఇవాళ నీకు జరిగింది. రేపు మాకు జరుగుతుంది. నీకున్న ధైర్యం మాకుండొద్దూ? నువ్వంటే సమర్ధురాలివి" సాగదీసింది సుబ్బలక్ష్మి.

    "నీ మొహం! పోయి పోయి నీ గురించి ఎవరు రాస్తారే?" స్వర్ణ హేళనగా అంది.

    దాంతో సుబ్బలక్ష్మి మూతి ముప్పై వంకరలు తిప్పింది.

    చిత్ర మెట్లు ఎక్కబోతున్న అటెండరు బసవయ్యని పిలిచింది.

    "ఏంటమ్మగోరు?" బసవయ్య వినయంగా వచ్చాడు.

    "నా కారు డిక్కీలో బొగ్గుల బస్తా ఉంది. దాన్ని తీసుకొచ్చి పెట్టు" అంది.

    చిత్ర ఏం చేయబోతున్నదీ ఎవరికీ అర్థం కావడంలేదు.

    బసవయ్య కారు డిక్కీలోంచి బొగ్గుల బస్తాని తీసుకొచ్చి వరండా దగ్గర పెట్టాడు.

    పర్స్ తీసి అందులోంచి ఇరవై రూపాయలు అతనికిచ్చింది చిత్ర.

    "ఇది నువ్వుంచుకో బసవయ్యా! నువ్వు నాకు చేయవలసిన సహాయం ఒక్కటే! మన కాలేజీ అబ్బాయిలందరికీ యీ బొగ్గుల్ని సప్లయ్ చెయ్."

    "దేనికమ్మా?"

    చిత్ర నవ్వింది.

    ఆమె ముఖం ఎర్రబడింది.

    ఆమెది నవ్వుకాదు.

    జరిగిన అవమానం ఎలాంటిదో ఆమెకి తెలుసు. కానీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ, గాంభీర్యాన్ని నటిస్తూ, ఆనందాన్ని నటిస్తోందామె.

    "నా గురించి చాలా తక్కువ చరిత్ర రాశారు. అది నాకు ఇన్ సల్ట్ గా ఉంది. ఇంకా చాలా క్లాస్ రూమ్ గోడలూ, కాంపౌండ్ గోడలూ మిగిలిపోయాయి. వాటిమీద కూడా రాసుకోమని చెప్పు.

    వాల్ పోస్టర్లు, పాంప్లెట్స్ వేసినా కూడా నాకు అభ్యంతరం లేదు. ఖర్చులకి డబ్బులు కావాలంటే రమ్మను. పడేస్తాను."

    బసవయ్య నీళ్ళు నమిలాడు.

    "ఏంటమ్మా యిదంతా? బుద్ధిలేని నా కొడుకులు రాస్తే మీరింకా వాళ్ళని ప్రోత్సహిస్తారా? వాళ్ళెవరో తెలుసుకుని కాళ్ళు విరగ్గొట్టించాలి కానీ."

    "నువ్వు చదువుకోలేదు. వాళ్ళు చదువుకున్నారు. నీకయితే ఓ మాట చెప్పేదాన్ని. కానీ వాళ్ళకి.... చెప్పకూడదు. అంతే."

    "ఎంత దొడ్డ మనసమ్మా నీది?"

    ప్రిన్సిపాల్ వి.కె.ఆర్. గబగబా కిందకు వచ్చాడు.

    గోడలన్నింటినీ చూసి - "ఏమ్మా! ఏమిటిదంతా?" ఆందోళనగా అడిగాడు.

    "చూస్తున్నారు కదా! ఆ బొమ్మలో ఈశ్వర్ నన్ను ముద్దుపెట్టుకుంటున్నాడు. అటు చివరబొమ్మలో నేను ఒంటిమీద బట్టలు లేకుండా ఈశ్వర్ని గట్టిగా కౌగలించుకున్నాను.

     ఇక ఆ బొమ్మ చూడండి సర్!

    సృష్టికార్యం జరుగుతోంది.

    ఇక ఆ కాప్షన్స్ మాటంటారా?

    అవి అక్షరాలు కావు. మదమెక్కిన జంతువుల రాక్షస వినోదం"

    "ఏమిటా కేర్ లెస్ సమాధానం? నువ్వు ఆడపిల్లవి" ప్రిన్సిపాల్ అరిచాడు ఇంగ్లీషులో.

    చిత్ర కోపంగా చూసింది.

 Previous Page Next Page