"ఔరా రాజారావూ __ తిరుగులేని ఎత్తు వేశావు గదా!" అనుకున్నాడు రమాకాంతం మనసులో.
"మాట్లాడావేమయ్యా _ కుర్రకారంతా ఇదే అభిప్రాయంలో ఉంది. మనలో మనకు పోటీలు శ్రేయస్కరమూ కాదు __ వాటివల్ల ప్రయోజనమూ ఉండదు. మనమంతా కలసి ఒక నిర్ణయానికొస్తే ఈసారి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశముంది. రాజారావుగా రెన్నికల్లో నిలబడితే నర్సన్న కూడా తగ్గిపోతాట్ట ...." అన్నాడు చలమయ్య.
అంటే రాజారావు నర్సన్నతో కూడా చేతులు కలిసాడన్నమాట. ఇది తెలియగానే అంతరాంతరాల్లో రాజారావు పట్ల ద్వేషం పెరగసాగిందాయనకు. కానీ తానిప్పుడు అసహయుడు. ఊరు ఊరంతా ఒక్కటై తనకు వ్యతిరేకమయిపోతోంది.
రమాకాంతం గుండె దిటపుచేసుకుని తాపీగా అన్నాడు __ "చూడండి చలమయ్యగారూ __ మీరన్నట్లు నాకూ వయసు ముదురుతోంది. ఆరోగ్యమూ ఈమధ్య అంత బాగుండడం లేదు. ఎన్నికల్లో నిలబడ్డా పదవికి న్యాయం చేకూర్చగలనా అనిపిస్తోంది అయితే అనుభవం కలవాడ్ని కాబట్టికొన్నాళ్ళు పదవిలో లేకుండానే చేయొచ్చు గదా __ అంటున్నారు మీరు. మీరేలాగంటే అలాగే చేద్దాం. అందులోనూ రాజారావు వంటి యోగ్యుడి విషయంలో నా కభ్యంతర మేముంటుంది? అసలాయన బలవంతం వల్లనే నేను నిలబడుతున్నాను తనకు ప్రెసిడెంటుగిరీ కావాలంటే నేను వద్ద౦టానా? ఎటొచ్చీ సూటిగా నాతో చెప్పకుండా, ఇలా చాటుమాటు రాయబారాలు పంపడమే నాకు బాధగా ఉంది. ఆయనంత పదవీవ్యామోహం ఉన్నప్పుడు - నన్నెందుకు నిలబడమని ప్రోత్సహించాలో మీరే చెప్పండి ....."
చలమయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. __ "రమాకాంతం _ నా సంగతి నీకూ _ నీ సంగతి నాకూ కొత్త కాదు. రాజారావు మనలాంటి వాడు కాదు. ఆయనకు పదవీ వ్యామోహం లేదు. కుర్రకారు బలవంతం మీద ఆయనకు తెలియకుండా నేనే అయన తరపున రాయబారం వచ్చాను. ఏకగ్రీవంగా ప్రెసిడెంటు నేన్నుకోగలిగితే అది మనూరికే పెద్ద విశేషం అనిపించింది. ముందు నిన్నోప్పిస్తే _ ఆ తర్వాత మీరంతా పట్టుబడితే _ రాజారావుగారూ ఒప్పుకుంటాడు. ఆయనకు పోటీ యిష్టముండదు. నువ్వు నిలబడి తీరాలనుకుంటే అయన పోటీకి రాడు. కానీ కుర్రకారంతా కలసి నిన్నోడించడానికి కృషి చేస్తారు. నేను నిన్ను బెదిరించడం లేదు. పరిస్థితి చెబుతున్నాను......"
రమాకాంతం ముభావంగా ఆ మాటలు విన్నాడు.
"ఏ మాలోచించినా మన తరం అయిపోయింది. కుర్రాళ్ళు మన మాటలు వినేలా లేరు. నా మటుకు నాకు మన కంటె వాళ్ళే తెలివైన వాళ్ళని పిస్తున్నారు. ...." అన్నాడు చలమయ్య మళ్ళీ.
"సరే _ ముందుగా ఓసారి నేనూ రాజారావుగారితో మాట్లాడతాను. మేమిద్దరం కలసి ఏ నిర్ణయానికి వచ్చినా మీరు కాదనకూడదు __ " అన్నాడు చలమయ్య.
"అరి చలంయ్యా ! నన్ను దెప్పేటంత వాడివయ్యావు గదా .... నీ బ్రతుక్కి నువ్వూ నన్ను వెటకారం చేయడమే!" అంటూ తనలో తనే మధనపడి __ "తప్పకుండా అలాగే చేయండి. మీకు జయమవుతుంది __ " అన్నాడాయన చలమయ్యతో.
33
పదవులకోసం పేరున్న నాయుకులే నానాగడ్డీ కరుస్తున్న ఈ రోజుల్లో తనను పదవి వెతుక్కుంటూ రావడం రాజారావుకు చిత్రంగా ఉంది. ఏ అశతో , ఆశయంతో తనీ ఊళ్ళో అడుగుపెట్టాడో అదిప్పుడు నెరవేరబోతొంది.
చలమయ్య చెప్పింది విని _- "మంచిది చలమయ్య గారూ! మీలాంటి పెద్దలు నాపై యింతటి భారాన్ని మోపాలనుకుంటే కాదనడం నాకూ బాగుండదు. రేపు వూళ్ళోని ముఖ్యలందర్నీ కచేరీ సావడిలో సమావేశపర్చండి. అన్ని విషయాలూ అక్కడ సావకాశంగా చర్చిద్దాం. ఊళ్ళోని అన్ని పక్షాలవారూ అక్కడుండాలి. శత్రుత్వాలు మరచి మాట్లాడుకోవాలి. అప్పుడు మనమంతా కలసి ఏకగ్రీవంగా ఓ నాయుకుడి నేన్నుకుందాం. ఆ నాయుకుణ్ణి నేను కావచ్చు, నర్సన్న కావచ్చు __ లేదా రమాకాంతంగారే కావచ్చు. ఇక మీదట వూళ్ళో పార్టీలే ఉండకూడదు. అంతా కలసికట్టుగా ఉందాం. ఇంతకీ కాబోయే ఆ నాయుకుడేవరో నాకు తెలుసు . కాని యిప్పుడు చెప్పను ....." అన్నాడు రాజారావు.
రాజారావు మాటలకు చలమయ్య బాగా ఆశ్చర్యపడ్డాడు. అతడు చెప్పినట్లే చేస్తానని వెళ్ళిపోయాడు.
చలమయ్య వెళ్ళగానే రాజారావు హుషారుగా ఈలవేసి పరగున లోపలకు వెళ్ళి __ "వసూ!" అని పిలిచాడు. వసంత తన వద్దకు వచ్చేలోగానే తనే ఆమెను సమీపించి _ బలంగా కౌగలించుకున్నాడు.
వసంతకు ఊపిరి సలపలేదు __ "ఏమిటండీ యిది __ పాప కూడా చూస్తోంది ...." అంది నెమ్మదిగా.
రాజారావు చటుక్కున ఆమెను వదిలి __ " ఈరోజు సుదినం . అదో అజ్ఞాతశక్తి నాకు సాయపడుతోంది. అన్నీ అమర్చినట్టు జరిగిపోతున్నాయి. రేపు నా కలలు పండే రోజు. చాలాకాలంగా నేనేదురుచూసిన రోజు. నేను తలపెట్టిన కార్యక్రమానికి చరమగీతం పాడే రోజు. చిరకాలంగా నా హృదయంలో గూడుకట్టుకున్న ఆవేదన తొలగిపోయే రోజు. ఆ రోజు రేపేనని ఈ రోజు నాకు తెలిసింది. అందుకే ఈ ఉత్సాహం ...." అన్నాడు.
'ఇంతకీ ఏమయిందో _ అది చెప్పండి ...."
"ఊరంతా ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంటును చేయాలనుకుంటో౦ది ఎన్నికల్లో పోటీ ఉండదు."
"అందుకు మీరేమన్నారు.?"
"రేపు ఊరి పెద్దలందర్నీ సమావేశపర్చమన్నాను. ఎందుకో నీకూ తెలుసు!" అన్నాడు రాజారావు.
వసంత ఆశ్చర్యంగా _ "మీరు కోరిన రీతిలో యీ అవకాశం రావడం నాకే వింతగా ఉంది. ఇది మనకు శుభశకునం ...." అంది.
రాజరావింకేమీ మాట్లాడకుండా కూతురి వద్దకు పరుగెత్తి ఓసారి గాలిలో కేగరేసి పట్టుకున్నాడు.
కెరి౦తాలు కొట్టింది నీల!
34
"ఇంతకాలం మనూళ్ళో కక్షలూ, పార్టీలూ రాజ్యమేలుతున్నాయి. నారయ్యవంటి మహాత్ముడున్న మన గ్రామంలో ఐకమత్యం లేకపోవడం విచారించవలసిన విషయం. అందుకే ఈ సమావేశం ఏర్పాటుయింది. ఈసారి పోటీల్లో రమాకాంతం, నర్సన్నకూడా పోటీ చేయరు. వారిద్దరికీ నచ్చిన రాజారావుగారే మన గ్రామాధ్యక్షులవుతారు" అన్నాడు చలమయ్య సమావేశాన్ని ప్రారంభిస్తూ.