Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 52

 

      నర్సన్న ఆలోచనలు పూర్వపు దారి తొక్కాయి. తను ప్రెసిడెంటు కాకుంటే కాకపోయే .... రమాకాంతం ప్రెసిడెంట్ కాకూడదు ....

    రమాకాంతానికి రాజారావు అండ ఉంది. అది చాలా బలమయిన అండ. ఆ అండ పోవాలి. అంటే __ ఆ ఇద్దర్నీ విడగొట్టాలి.

    ఇలాంటి ఆలోచన తనకు ముందుగా తట్టనందుకు బాధపడినప్పటికీ, చేతులు కాలకుండానే ఆకులూ పట్టుకోగలిగానని సంతోషించాడు నర్సన్న.

    ఇప్పుడు రమాకాంతంలో అనుమాన బీజం మొలకేత్తాలి. రాజారావుకు ప్రెసిడెంటు కావాలన్న కోరికతో ఉన్నాడని ఆయనకు తెలియాలి. అందుకు గరవయ్యనుపయోగించుకోవాలి.
   
    గరవయ్యను పంచాయితీ మెంబరుగా చేయమని రాజరావే రమాకాంతానికి సలహా ఇచ్చినట్లూళ్ళో చెప్పుకుంటున్నారు. తనిప్పుడా గరవయ్యలో రమాకాంతానికి వ్యతిరేక భావాలు సృష్టించాలి. అదెలాగో కూడా అతడు పథకం వేసుకున్నాడు. ఆ వెనువెంటనే పలేరుతో గరవయ్య కోసం కబురంపాడు.

    పాలేరు గరవయ్యను వెంటబెట్టుకుని వచ్చాడు.

    "ఎరా బాగున్నావా __ కూర్చో _ మెంబరు వౌదామనుకుంటున్నావటగా _ " అంటూ నర్సన్న గరవయ్యను పలకరించాడు.       

    "అవును ...." అంటూ నసిగాడు గరవయ్య.

    "బాగుందిరా _ నీలాంటి కుర్రాళ్ళు కాకపోతే నాలాంటి ముసిలాళ్ళే౦టీ _ మెంబర్లు కావాల్సింది! వయసయిపోతోంది _ మేమేం చెయ్యగలం చెప్పు ..... మాకున్నదల్లా అనుభవం. అది మీకు లేకపోతేనేం __ ఇలా చెయ్య౦డిరా అని చెప్పడానికి మేమున్నాం కదా __ ఏదయినా కొంపలుములిగే వ్యవహర మొస్తే మీరు మాత్రం మమ్మల్నడక్కుండా ఉంటారా? అందుకే ఇక ముసిలాళ్ళు పదవుల్లో ఉండకూడదరా _ నీలాంటి కుర్రాళ్ళే ముందుకు రావాలి __"అన్నాడు నర్సన్న.

    గరవయ్య తలాడించాడు.

    "అందుకనే కదురా _ నేనింకా ఎన్నికల జోలికి రావడం లేదు. ఏమిటో _ ఆ రమాకాంతానికే ఇంకా భ్రమ తీరలేదు..."

    "రాజకీయాలా కాయన వయసేం ఎక్కువ కాదు ....." బాగానే చెప్పావు ఒప్పుకున్నను. కానీ అది మనిషిని బట్టి వుంటుంది. డైబ్భై ఏళ్ళు దాటినా గాంధీగారు పుస్తకాలు కూడా రాశాడు మన రమాకాంతనికి అప్పుడే ఆలోచనా శక్తి తరిగిపోయింది. ఎవడో వచ్చి సీఐడీ నంటే నమ్మి, ఆశ్రయమిచ్చి అన్ని సదుపాయాలూ సమకూర్చాడు ....." అని ఆగి __ "ఏదో ఆ రాజారావుగారు కాశాడు కాబట్టి కానీ, లేకపోతె ఈపాటికి మనమెక్కడు౦డాల్సిన వాళ్ళమో __ " అన్నాడు నర్సన్న.

    గరవయ్య దీనికి బడులివ్వకుండా ఆలోచనలో పడ్డాడు

    "అయినా ఒరేయ్ గరవయ్యా __ నివ్విన్నాళ్ళుగా చూస్తున్నావు గదా __ రమాకాంతం ఊరి బాగోగుల గురించి ఎప్పుడయినా పట్టించుకున్నాడ్రా? అయినా అలాంటిది పుట్టుకతో రావాలి గానీ _ అభ్యాసం వల్ల వచ్చేది కాదు. నిన్నగాక మొన్నోచ్చిన ఆ రాజారావుగార్ని చూడు __ ఊరు గురించి ఎంత తపనో ! అసలు సిసలు ప్రజా సేవకులంటే .... వాళ్ళే!"

    "ఇంతకీ నువ్వనేదేమిటి?" అన్నాడు గరవయ్య అనుమానంగా.

    "ఓరి ఎర్రిమొగమా! రాజారావుగారు మీ కుటుంబాని కెంతుపకారం చేశాడు? ప్రత్యుపకారం గురించి మీరెవరాయినా అలోచించేర్రా ఆయనకు పెద్ద కోరికల్లేకపోవచ్చు. ఉన్నా ఒకవేళ బయటపడకపోవచ్చు. ఈ రోజు నువ్వు నలుగురిలోనూ తలెత్తుకుని గర్వంగా తిరగ్గల మొనగాడివయ్యావంటే అయన చలవే కదరా ..... అంటుంవంటాయన్ను ప్రెసిడెంటు చస్తే మనూరు బాగుబడుతుంది. __ మీ ఋణమూ  తీరుతుంది ...."

    "భలేవాడివి పెదనాన్నా _ ఆయనకు పదవులంటే అయిష్టం !"

    "అదంతా మొగమాట౦. ఈ రోజుల్లో పదవులంటే ఇష్టంలేని వాడుండడు. మీ కుర్రకారంతా చేరి బలపరిస్తే ఆయనే ఉంటాడు ...."

    గరవయ్యకు నర్సన్న చెప్పిందాంట్లో సబబు కనపడింది. అతడికి రమాకాంతమంటే పెద్దగా ఇష్టంలేదు. అతడు వెంటనే ఇంటికి వెళ్ళి తండ్రితో ఈ విషయం మాట్లాడలేదు.

    గరవయ్య గురించి ఈమధ్య చలమయ్య కెంతోసంతృప్తిగా ఉంటో౦ది. తాగుబోతునీ నిరసించబడ్డ గరవయ్యానాడు __ ఊరి పెద్దల్లో చేరుతున్నాడు. ఇదంతా రాజారావు చలన. తను బట్టి మంత్రం వేసి సాదించాడో? తనవిషయంలో మటుకు .... తనను మనిషిని చేశాడు.

    అన్నివిధాల రాజారావుకు ఋణపడి ఉన్నానన్నభావం చలమయ్యలో ఉంది. కొడుకు చెప్పిన మాటలు  వినగానే అయన రామాకాంతం ఇంటికి వెళ్ళాడు.

    "రమాకాంతం _ నువ్వూ పెద్దవాడివయిపోతూన్నావు ..... ఎన్నికల్లో కుర్రాళ్ళకి అవకాశమివ్వకూడదూ?" అన్నాడు చలమయ్య.

    "ఏమిటి మీరనేది?" అన్నాడు రమాకాంతం ఉలిక్కిపడి.

    "అదే _ మనూరికో కుర్ర ప్రెసిడెంటు కావాలి!"

    "కుర్రాడయితే నర్సన్న ధాటికాగలేడండీ _ ...."

    "నర్సన్న  ధాటికాగే కుర్రాళ్ళు మనూళ్ళో లేరంటావా _ బాగా ఆలోచించు ....."

    రమాకాంతనికి రాజారావు గుర్తుకొచ్చాడు. అయన గుండె గుభేలుమంది కానీ రాజారావు తన్ను మనస్పూర్తిగా బలపరుస్తున్నాడు. మరి చలమయ్య దృష్టివరి మీదుందో? గరవయ్యను ప్రెసిడెంటు చేయాలనుకుంటున్నాడా?

    "అలా అడుగుతే ఏం చెబుతాను. మీ మనసులో ఎవరయినా ఉంటే చెప్పండి . ఆలోచిద్దాం __ " అన్నాడు రమాకాంతం. అంటూనే చలమయ్య రాజారావు పేరు చెప్పకూడదని కోరుకున్నాడు. కానీ చలమయ్య ఆ పేగే చెప్పగానే అయాన షాక్ తిన్నాడు.

    "అలోచించడానికేముందీ _ మన రాజారావు గారున్నారుగా __" అన్నాడు చలమయ్య.

    రమాకాంతానికా షాకు నించి తేరుకునేందుకు కాసేప్పట్టింది. తన కెన్నో ఉపకారాలు చేసినట్టే చేసి, మంచి స్నేహితుడిగా నటించి చివరకు రాజారావు చేసిందిదా? ఆయనకు ఆషాడభూతి గుర్తుకువచ్చాడు.

    సరిగ్గా అప్పుడే అంతకుమునుపు తాము కలుసుకున్నప్పుడు రాజరావన్న మాటలు గుర్తుకొచ్చాయాయనకు _ "పదవీ వ్యామోహ౦లేని మీవంటి వారే ఈ ఊరికి నాయకులుగా ఉండాలని నా కోరిక __"

    మరి __ తనకు పదవీ వ్యామోహ౦లేదా? లేకపోతె తనకింత బాధ ఎందుకు? పదవీ వ్యామోహం కూడా వ్యసనమే? ఆ వ్యసనానికి తాను బానిస. అప్పట్లో రాజరావా మాటని తనను ఎత్తిపొడిచాడా?

    అంతే అయుండాలి. ఇంతకాలం తనెం చేసినా పదవి కోసమే చేశాడు. ఇన్నాళ్ళపరిచయంలో రాజరావా విషయం గ్రహించే ఉంటాడు . ఆ విషయమే పదేపదే అంటే తనలో పరివర్తన కలిగి తనకు తానె __ "పోనీ _ రాజారావుగారూ __ మీరే నించోకూడదూ ...." అంతాడేమోనని ఆశపడి ఉంటాడు. ఇన్నాళ్ళూ వేచిచూసి, ఈనాడు చంయ్యచేత రాయబారం పంపాడు. ఒకనాడు చలమయ్య తనకు బాగా దగ్గర స్నేహితుడు కానీ క్రమంగా తనే అతడ్ని వీలయినంత దూరంలో ఉంచాడు. ఈనాడు రాజారావు చలమయ్యకు ఆత్మీయుడు. వీళ్ళిద్దరూ కలిస్తే ఊళ్ళో తనకు ఓటమి తథ్యం!

 Previous Page Next Page