"పిట్ట భలే జారిపోయింది గురూ!" రాజ్ కుమార్ దిగులుగా అన్నాడు విస్కీ సిప్ చేస్తూ.
"పిట్టాలేదు - బుట్టాలేదు. బ్రతికి బయటపడినందుకు సంతోషించు. రాక్షస చంపేస్తుందనుకున్నాను" అన్నాడు చిదంబర నేలపైన బోర్లా పడుకుని.
జెన్నీ ఎదురుగా టీపాయ్ మీద వున్న విస్కీ గ్లాసుని చేతిలోకి తీసుకుని రెండు గుక్కల్లో తాగేశాడు. అతను రొప్పుతూ చూశాడు మిత్రులకేసి
"నాన్సెన్స్! తన ప్రజ్ఞ చాటుకోవడానికి, ఎదుటి వాడిని భయపెట్టడానికి బురద పాము కూడా బుస్సుమంటుంది. అంత మాత్రాన అది నాగుపాము కాలేదు. పిట్ట ఎక్కడికిపోదు. దాని పొగరణిచేస్తాను."
"గురువా! దాని జోలికిపోతే ఈశ్వర్ గాడు చేతులు కట్టుకు కూర్చోడు తెలుసా?" చిదంబరం హెచ్చరించాడు పక్కకి దొర్లుతూ.
"ఏం! ఈశ్వర్ దిగొచ్చాడా?" జెన్నీ పకపక నవ్వాడు.
అదే సమయంలో-
తలుపు భళ్ళుమని తెరుచుకొంది. గుమ్మంలో నడుంమీద చేతులు పెట్టుకుని ఛార్జి చెయ్యడానికి సిద్దంగా ఉన్న బెబ్బులిలా నిలబడ్డాడు ఈశ్వర్. అతన్ని చూడగానే ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అందరిలో ఒక విధమయిన తత్తరపాటు.
"తెలుసా అని అడగనవసరం లేదు. నేను ఏం చెయ్యబోతున్నానో తెలుసుకోలేకపోవడం మీ అవివేకానికి నిదర్శనం జెన్నీ!"
"అనవసరంగా మాతో పెట్టుకోకు. వచ్చిన దారినే వెళ్ళు. జెన్నీని తక్కువగా అంచనా వేయకు!"
"పుట్టలో విషనాగుంటుందని తెలిస్తే చెయ్యిపెట్టరెవరూ! కానీ దాని కోరలు పీకి, ఆడించే వాడిని పుట్టలో చెయ్యి పెట్టినా ఏమీ చెయ్యలేదు ఆ విషప్పురుగు!"
"గెటౌట్!" అరిచాడు జెన్నీ వూగిపోతూ. తాగిన విస్కీ అతని పైన ప్రభావాన్ని బాగా చూపిస్తోంది.
ఈశ్వర్ మరొ మాటకి తావివ్వలేదు. గాలిలోకి ఎగిరి పల్టీలు కొడుతూ వచ్చి కాళ్ళతో జెన్నీ గుండెపైన తన్నాడు. ఆ దెబ్బకి అతని చేతిలోని గ్లాసు ఎగిరి పక్కనపడి పగిలిపోయింది. జెన్నీ వెల్లకిలా పడిపోయాడు.
అతని పెదవి చిట్లి రక్తం కారుతోంది.
జెన్నీపైకి లేవబోతూ చూశాడు.
గుమ్మంలో సైకిల్ చైన్ లు పట్టుకుని రాజు, ముకుందం, చలపతి నుంచుని వున్నారు!
జెన్నీకి పరిస్థితి అర్ధం అయింది. ఇలా జరుగుతుందని ఏ మాత్రం పసిగట్టిగా ముందు జాగ్రత్త పడేవాళ్ళు. కానీ యిప్పుడు ఆ అవకాశం లేదు.
ఆయుధాలతో వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో ప్రతిఘటించటం అంత తేలిక కాదని అతనికి తెలుసు! కానీ మొండితనం, కసి, కోపంతో జెన్నీ వూగిపోయాడు.
జెన్నీ పక్క పక్కగా జరుగుతూ గబుక్కున విస్కీ సీసాని చేతిలోకి తీసుకుని భళ్ళుమని పగలకొట్టి దాన్ని పట్టుకుని వికృతంగా నవ్వుతూ ఈశ్వర్ మీదికి దూకాడు.
ఈశ్వర్ మెరుపువేగంతో పక్కకి జరిగాడు. లేకపోతే అది అతని పొట్టలోకి పేగులని చీల్చివేసేది. అంత ప్రమాదం నుంచి అతను అరక్షణంలో తప్పించుకున్నాడు.
గురి తప్పి ముందుకి వెళ్ళిన జెన్నీని వెనక్కి తిరగకుండానే నడుం విరిగేలా కాలితో తన్నాడు ఈశ్వర్.
బలంగా తగిలిన ఆ దెబ్బకి గోడపైన పడ్డాడు జెన్నీ. ముక్కుదూలం విరిగిరక్తం కారుతోంది.
గాలిలో సర్ సర్ మని చప్పుడు చేస్తూ సైకిల్ చైనులు తిరుగుతున్నాయి.
"అమ్మో చచ్చాం!" అరుస్తున్నారు జెన్నీ ఫ్రెండ్స్. పది నిముషాల్లో అందరూ నేలకరిచారు.
జెన్నీ గుండెపైన కాలితో నొక్కుతూ అన్నాడు ఈశ్వర్ -
"జెన్నీ! నేనెందుకు నీపైన దాడిచేశానో నీకు తెలుసు - నాకు తెలుసు. యిలాంటి పరిస్థితిని కల్పించింది నువ్వేనని నీకూ తెలుసు జెన్నీ! మన మధ్య ఎలాంటి వైరమున్నా అకారణంగా గొడవలకి దిగడం నా అలవాటు కాదు, పద్ధతీ కాదు. నువ్వు నా మీద గురిపెట్టిన ఆయుధంతోనే నిన్ను చీరెయ్యడానికిప్పుడు నాకో అరక్షణం చాలు. కాని నిన్ను విడిచిపెడుతున్నాను. మరోసారి పిచ్చివేషాలేస్తే...... మీ బతుకులకి చరమగీతం పాడవలసి వస్తుంది" అంటూ బూటుకాలితో అతనిగెడ్డం మీద తన్నాడు ఈశ్వర్. ఆ దెబ్బకి జెన్నీ పళ్ళు కదిలిపోయాయి. ఈశ్వర్ అతని స్నేహబృందం అక్కడి నుంచి బయటికి నడిచారు.
జెన్నీకి లేవడానికి సాయం పట్టాడు వెంకోజీ. మావయ్య చెప్పిన ప్లాన్ యిలా బెడిసికొట్టడంతో జెన్నీ కోపంతో రగిలిపోయాడు.