Previous Page Next Page 
మహాశక్తి పేజి 18

    అప్పటివరకూ చాలా స్పోర్టివ్ గా బిహేవ్ చేసినా ఇక ఆమె ఉద్రేకాన్ని అణుచుకోలేకపోతోంది.

    తల వెనక్కి తిప్పకుండా రోడ్డుకేసి విండ్ స్క్రీన్ లోంచి చూస్తూ అంది చిత్ర ఆవేశంగా -

    "యూ ఆర్ ఆల్ రోగ్స్. ఐ హేట్ యూ. నేను మీ నక్కజిత్తులను తెలుసుకోలేని ఫూల్ని కాదురా బేవకూఫ్."

    "ఏమిటే వాగుతున్నావు?" అన్నాడు రాజ్ కుమార్ ముందుకు వంగుతూ.

    "కేవలం వాగడం కాదురా కుయ్యా! నేను ఏమిటో మీకు తెలియ చెప్పాలనే మిమ్మల్ని తీసుకొచ్చాను. అంతేకానీ ఆ పిల్లిగాడి మాటలు నమ్మి మీతో ఊరేగింపుకి రాలేదు. మీ అయిదుగుర్నీ చావగొట్టాలంటే క్షణంలో వెయ్యోవంతు చాలు నాకు. తెగించి కారును దేనికైనా ఢీ కొడితే కిక్కురుమనకుండా చచ్చి ఊరుకుంటారు" అంది చిత్ర.

    ఆ మాటల్ని ఆమె ఎంత కసిగా అన్నదంటే "నిజంగా అన్నంత పనీ చేస్తాను సుమా" అన్నట్టుగా వాళ్ళకి అనిపించింది. చిదంబరానికి ఎక్కడలేని వణుకూ పుట్టుకొచ్చి జెన్నీ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. జెన్నీ వెనక నుంచి చేతిని చాచి చిత్ర భుజంపైన వేసి గట్టిగా నొక్కుతూ "ముందు కారు ఆపు" అన్నాడు.

    "చేయి తియ్."

    "తియ్యకపోతే?"

    "అన్నంతపనీ జరిగిపోతుంది. పోస్టుమార్టం చేయడానికి కూడా పనికిరాకుండా తుక్కు తుక్కు చేస్తాను మీ శరీరాలని." ఆమెలో తెగింపుకి వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    "మాతో పాటు నువ్వు చస్తావ్" జెన్నీ హెచ్చరిక చేస్తున్నట్టుగా అన్నాడు.

    అతని చేతిని విదిలించి కొట్టింది చిత్ర.

    "పిచ్చివాడా! నీ కింతకు ముందే చెప్పాను. నేను ఫూల్నికాదు! కారు ఏక్సిడెంట్ చేసేముందు కనురెప్పపాటులో నేను తప్పించుకోగలను. చూస్తావా?" ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అడిగింది.

    ఆమె తెగించిందని కారు వెళుతున్న పద్ధతే చెబుతోంది. వాళ్ళలో తెలీకుండానే కలవరం ప్రారంభమయింది. జెన్నీకేసి భయంగా చూశారు మిత్రవర్గం.

    మతి స్థిమితం లేని మనిషి పిచ్చిగా గోడ్డుమీద అడ్డదిడ్డంగా పరుగెత్తుతున్నట్టు ఆమె కారుని రోడ్డుమీద కేర్ లెస్ గా పరుగెత్తిస్తోంది.

    ఎదురుగా లారీ..... ఒక్క గజం దూరంలో దాన్నించి సర్రుమని చప్పుడు చేస్తూ పక్కకి కట్ చేసింది. ముందు వెళుతున్న రెండు బస్సులని, ఎదురుగా వస్తున్న వాహనాలనీ లక్ష్యం చెయ్యకుండా ఓవర్ టేక్ చేస్తోంది చిత్ర! కారు చక్రాలు కీచుమని అరుస్తున్నాయి.

    "కారాపు" అన్నాడు జెన్నీ అతనికి భయంగా వుంది!

    "ఏం భయంగా ఉందా?" హేళనగా అడిగింది చిత్ర. అప్పటికే కారు నేషనల్ హైవేలో వుంది. సిటీ దాటి పదిహేను కిలోమీటర్లు వచ్చేసింది. కాలేజీలో పేరు చెబితే సింహ స్వప్నంగా చెలామణి అయ్యే జెన్నీ బోనులో పెట్టిన పులి తీరులో వున్నాడు.

    "కాలేజీ గోడలమీద రాతలు, బూతుబొమ్మలు రాసిందీ, గీసిందీ మీరేనని నాకు తెలుసు! రేపు మీ అక్క చెల్లెళ్ళనీ అలాగే బొమ్మలు వేసి చూసుకుని ఆనందించండి" అంటూ జెన్నీ తదితరులు వూహించనంత వేగంగా కారును రోడ్డు పక్కకి కట్ చేసి తిరిగిరోడ్డు మీదకి ఎక్కించి సడన్ బ్రేక్ వేసింది.

    ఆ కుదుపుకు సీటులోంచి ముందుకి ఒకరిమీద ఒకరు పడిపోయారువాళ్ళు.

    "గెటవుట్! మరోసారి పిచ్చివేషాలేస్తే ఐ విల్ సీ యు బి హైండ్ బార్స్" అరిచింది చిత్ర.

    డోర్ తీసి గబగబా దిగేశారు జెన్నీ, అతని ఫ్రెండ్స్.

    వాళ్ళతో మరో మాట కూడా మాట్లాడకుండా సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో హైవేలో వదిలి వెళ్ళిపోయింది చిత్ర.

    "ఇదేంటి గురువా! ఒక ఆడదాని చేతిలో మన బతుకిలా అయిపోయింది" చిదంబరం అంటుంటే యింకా మాట్లాడనివ్వకుండా అతని నోటిని చేత్తో నొక్కేశాడు జెన్నీ.

    ఆ క్షణంలో జెన్నీ నవ్వాడు.

    ఆ నవ్వు మామూలు నవ్వు కాదు. విషపు నవ్వు! నిలువెల్లా కాలకూట విషం కక్కుతూ నవ్విన నవ్వది. ఆ నవ్వుకి ఎదుటివాడు మాడిపోవాల్సిందే.
   

 Previous Page Next Page