ఎదురుగా తల వంచుకుని నించున్న మేనల్లుడినీ, అతని ముఠానీ చూసి గుబురు మీసాల్లోంచి నవ్వాడు అంకయ్య.
"దెబ్బలు బాగా తగిలాయా?"
ఒళ్ళు చీరుకుపోయి, బట్టలు చిరిగిపోయి, దిక్కుతోచక నించున్న వాళ్ళని పరామర్శించాడు అంకయ్య.
"నీ చచ్చు సలహా యింత పని చేసింది" ఉక్రోషంగా అన్నాడు జెన్నీ.
అంకయ్య అతని భుజంపైన చేత్తో తట్టాడు.
"చిన్న విషయానికే ఇలా బిక్కచచ్చిపోకూడదురా అబ్బీ! చెట్టు మీద కాయని కొడతానికి రాయి విసురుతాం.
ఆ దెబ్బకి కాయ పడవచ్చు లేదా ఆ రాయే తిరిగొచ్చి మనకే తగలవచ్చు.
కాయపడితే మన గురి కరెక్టు. రాయి మనకి తగిలితే మన గురితప్పని తెలుసుకోవాలి. తిరిగి ఆ కాయని కొట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. అదీ పద్ధతి."
"అప్పుడు కానీ బుర్ర పగలదు" అన్నాడు చిదంబరం. అంకయ్య అతని మాటలకి చిద్విలాసంగా నవ్వాడు.
"బుర్ర పగిలినా అది అనుభవంలోకే వస్తుంది. ఎందుకో తెలుసా?
ఒక మనిషి రౌడీ కావాలంటే సామాన్య విషయం కాదురా అబ్బాయిలూ.
ఒకటికి పదిసార్లు దెబ్బలు తిన్నవాడే రౌడీ గానీ, గూండా గానీ కాగలడు."
"అదేమిటి?" ఆశ్చర్యంగా చూశాడు జెన్నీ.
"అదంతే. దెబ్బలు తినడానికి అలవాటు పడిపోయాక, ఎలాంటి దెబ్బ కొట్టడానికైనా తెగింపూ, సాహసం వస్తాయి. అప్పుడే రౌడీ అన్న బిరుదొస్తుంది. అప్పుడు ఎదుటివాడు వాణ్ని చూసి భయపడేది. కొట్టిన దానికన్నా, తిన్న అనుభవమే రౌడీకి ప్రారంభదశలో కావాలి."
"ఇప్పుడేం చెయ్యమంటావు?"
"డాక్టర్ కి ఫోన్ చేస్తాను. ఇంజక్షన్లు చేయించుకొని దెబ్బలకి మందు రాయించుకోండి ఆ తరువాత....."
"తరువాత......?" అడిగాడు జెన్నీ.
అంకయ్య నవ్వాడు.
"ఆపైన నీ మేనమామ అంకయ్య ఉన్నాడు" అంటూ తిరిగి నవ్వాడు.
"ఉన్నాడని తెలుసు. కానీ ఏం చెయ్యమంటావో కూడా చెప్పు." విసుగ్గా అడిగాడు జెన్నీ.
"మీ కుర్ర రాజకీయాలకి, మాలాంటి రాజకీయనాయకుల రాజకీయాలకీ బోలెడంత తేడా ఉంటుందిరా అబ్బీ! ఇప్పుడీ రెంటికీ ముడిపెట్టడమే నా రాజకీయం.
మీ రెండు వర్గాల్లోనూ నీ పక్కన బలం పెరగాలి. అంటే ఆ ఈశ్వర్ గాడిని గాడిదని చెయ్యాలి" అన్నాడు అంకయ్య.
"దానికి నేను ఆల్ రెడీ ముహూర్తం పెట్టాను. రేపే వాడికి బుద్ధొచ్చేలా చేస్తాను" అన్నాడు జెన్నీ పళ్ళు కొరుకుతూ. కానీ తగిలిన దెబ్బకి 'అబ్బా' అనుకోకుండా ఉండలేకపోయాడు.
"ఏమిటిది?" అడిగాడు అంకయ్య.
"స్వర్ణ అనే అమ్మాయిని భయపెట్టి లొంగదీసుకున్నాడు. అది రేపు నేనివ్వబోయే ప్రేమలేఖని పట్టుకెళ్ళి తనకి ఈశ్వర్ రాశాడని ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తుంది. దాంతో ఈశ్వర్ అల్లరై పోతాడు."
"సెభాష్" అన్నాడు అంకయ్య.
కానీ బాల్కనీలో నించుని ఆ మాటల్ని అశ్వని విన్నదన్న సంగతి ఆ క్షణంలో వాళ్ళకి తెలీదు.
10
స్వర్ణకి గుబులుగా ఉంది. కాలేజీకి వెళ్లాలంటే చచ్చేంత భయంగా వుంది.
జెన్నీ ఈ రోజు విడిచిపెట్టడు. అతను చెప్పినట్టు చెయ్యకపోతే అతనేం చేస్తాడో స్వర్ణకి తెలుసు. ఆమెకి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది.