Previous Page Next Page 
మహాశక్తి పేజి 17

    "అసలు నాకెందుకు సాయం చేయాలనుకొంటున్నావు."

    "నీలాంటి అమ్మాయికి సేవచేయని జీవితం వ్యర్ధం అనిపింస్తుంది" జెన్నీ నవ్వాడు.

    "నేను అంత అందంగా ఉంటానా?" చిత్ర ఓరగా చూస్తూ అంది.

    "గుడ్డివాడు కూడా నీ ముందు నించుంటే నీ అందాన్ని వర్ణించగలడు" చిదంబరం అన్నాడు.

    "అసలు నిన్ను చూస్తుంటే మాకేం అనిపిస్తోందో తెలుసా?" అన్నాడు జెన్నీ.

    "ఊ చెప్పు. ఆలస్యం దేనికి?"

    జెన్నీ స్నేహితుల కేసి ఓసారి చూసి చిన్న మందహాసం చేసి -

    "మేం అయిదుగురం. నువ్వు ఒక్కదానివి" అన్నాడు.

    "అంటే?" అర్ధం కానట్టుగా అన్నది చిత్ర.

    "నువ్వు ద్రౌపదిలా అనిపిస్తావు" అన్నాడు జెన్నీ.

    "ద్రౌపది మహా పతివ్రత" అన్నాడు చిదంబరం

    చిత్ర నవ్వింది.

    "ఈజిట్. కానీ  ఐ హేట్ పాండవాస్" అన్నది.

    "పాండవుల నిష్టపడని ద్రౌవదివా?" రాజ్ కుమార్ ఎగతాళిగా అన్నాడు.

    "ఈ భీముడి దెబ్బ తెలీక అంటోంది" వెంకోజీ అన్నాడు.

    "నాకు దుర్యోధనుడంటే ఇష్టం బాబూ!" అంది చిత్ర వెటకారంగా.

    "అదేం టేస్ట్?" ఆశ్చర్యంగా అన్నాడు జెన్నీ.

    "జెన్నీ! నీకు మహాభారతం గురించి తెలీదనుకొంటాను. చెప్పనా?" అంది.

    జెన్నీ అతని మిత్రులు మొహమొహాలు చూసుకొన్నారు.

    వాళ్ళని చూసి చిత్ర నవ్వుతోంది ఎగతాళిగా.   

    చిత్ర ఒక్కసారి వాళ్ళ మొహాల్లోకి చూసింది.

    ఎగతాళిగా చూస్తున్నారు వాళ్ళు.

    చిత్రకి ఒళ్ళు మండిపోతోంది. కానీ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చెబుతోంది.

    "దుర్యోధనులు రారాజు.

    అతనికతనే సాటి. అతను ధర్మయుద్ధం చేసి స్వర్గాన్ని చేరిన గొప్పవాడు. ఘనుడు.

    కానీ పాండవులు? అధర్మయుద్ధం చేశారు.

    శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముణ్ని సంహరించారు. రథం దిగి నిస్సహాయస్థితిలో ఉన్న కర్ణుణ్ని హతమార్చారు.

    అశ్వద్ధామ చనిపోయినట్లు నమ్మించి, ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తే ఆయన శిరస్సును ఖండించారు. గదాయుద్ధంలో అధర్మంగా తొడలు విరగ్గొట్టి దుర్యోధన చక్రవర్తిని చంపారు.

    దుర్యోధనుడు రారాజు. చక్రవర్తి అనిపించుకున్నాడు. అందుకే ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. కారణం అతనే రియల్ హీరో భారతంలో. ఏమంటారు అభినవ పాండవుల్లారా?" అన్నది చిత్ర.

    జెన్నీ మాట్లాడలేదు మాట్లాడ్డానికి అతనికి మాటలుండవని ఆమెకి తెలుసు. వాళ్ళకెలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంది.

    "ఇప్పుడు నేను మీకు మరో చిన్న ముచ్చట చెపుతాను" అంది.

    "ఏమిటి?" అడిగాడు జెన్నీ.

    "మీ అయిదుగురి ప్రాణాలూ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి."

    "అంటే?" జెన్నీ కోపంగా అడిగాడు. అతని మొహంలో రంగులు మారుతున్నాయి.

    అతని ప్రశ్నకి ఆమె కనీసం తన కూడా తిప్పి చూడలేదు. మీదు మిక్కిలి కారు వేగాన్ని పెంచింది. కాదు అతివేగంగా పరుగుతీస్తోంది.

    "మనతో వేళాకోళానికి అంటోందిరా." అన్నాడు రాజ్ కుమార్ నవ్వుతూ.

    "ఛ. వేళాకోళం కాదురా బ్రదర్, సరసానికి" అన్నాడు వెంకోజీ సిగరెట్ పొగని గుప్పున విడుస్తూ.

    "సరసమాడ్డానికే అయితే వేరే ఏదన్నా ప్లేస్ కి వెళితే బాగుంటుందనుకుంటాను." చిదంబరం.

    "ఇరుకైన చోటులోనే సరసానికి రంజుగా ఉంటుంది" ఫిలిప్స్ వాగుతున్నాడు.

    చిత్ర పళ్ళు కొరికింది.

    కారును తీసుకెళ్ళి ఎదురుగా వస్తున్న లాటరీని గుద్దేయాలనిపించిందామెకి. రోషంతో ఆమె మొహంలోకి రక్తం పొంగింది.

 Previous Page Next Page