చిత్రకి తెలుసు ఈశ్వర్ ఆ విషయాన్ని తేలికగా తీసుకోడు.
ఏదో రక్తపాతం జరుగుతుందని ఆమెకి ఏదో సిక్త్స్ సెన్స్ చెబుతోంది ఈశ్వర్ ఆవేశం ఎలాంటిదో ఆమెకి కొత్తకాదు.
అతన్ని ఆపాలి. తొందరపడకుండా ఆపాలి.
అతనికోసం ఆ రోజంతా అందుకనే ఆతృతగా ఎదురుచూసింది. ఆ రోజు జరిగిన పరాభవం సామాన్యమైంది కాదు.
తను గనుక సరిపోయింది. తట్టుకోగలిగింది.
అదే మరో ఆడపిల్ల గనక తనున్న స్థితిలో ఉంటే, ఓదార్చలేని స్థితిలో పడిపోయి ఏడుస్తూ వుండేది.
నిజానికి ఆమెకి కూడా గుండెకి నిప్పు అంటించినట్టుగా ఉంది. గుండె భగ భగ మండుతోంది.
కానీ తనిలా బింకంగా ఉండటానికి కారణం డాడీ ఇచ్చిన ధైర్యమే. డాడీ..... ఎంత మంచివాడు. డాడీకి తెలుసు..... తను తొందరపడుతుందేమో కానీ పొరపాటు పని మాత్రం చేయదని. ఆయన అండదండలు తనకున్నాయి.
అంతకంటే జెన్నీగాడికి తను భయపడినట్టు కనబడకూడదు.
వాడసలే వెధవ! అతనికంటే ఏ అడవి జంతువైనా నయమే.
వస్తున్నాడు.....
వస్తున్నాడు జెన్నీ. హీరోననుకొంటున్నాడు పశువు! ఆమె కింది పెదవిని గట్టిగా నొక్కిపట్టింది మునిపంటితో. కోపంతో ఆమె మనసు రగిలిపోతోంది. కానీ ఆ కోపాన్ని ఆమె ప్రదర్శించదలచుకోలేదు. అణచుకుంటోంది. లేని నవ్వుని, రాని నవ్వునీ పెదవులపైకి తెచ్చి పెట్టుకుంది. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. హెచ్చరించాలి. అదే ఆమె ఉద్దేశం.
"హలో!" అన్నాడు జెన్నీ దగ్గరగా వచ్చి చిత్రని పలకరిస్తూ.
అతని వెనకే చిదంబరం, రాజ్ కుమార్, వెంకోజీ, ఫిలిప్స్.....
"హలో" అంటూ స్టీరింగ్ ముందు కూర్చుని వెనక్కి వంగి బాక్ డోర్ తెరిచి.
"గెట్ ఇన్" అంది చిత్ర.
"అందుకోసమే వచ్చాం" అంటూ సిగరెట్ వెలిగించి ఓ సారి కారిడార్ వేపు అందరూ చూశారో లేదో నన్నట్టుగా చూసి కారెక్కాడు జెన్నీ. అతని వెనకే మిగిలిన వాళ్ళు ఎక్కి ఇరుకుగా కూర్చున్నారు.
"వెనక బాగా ఇరుగ్గా ఉంది. ముందుకి రానా?" అడిగాడు జెన్నీ.
"ముందు సీటు రిజర్వు అయిపోయింది. అక్కడే అడ్జస్టు అవండి" అంది కారు స్టార్ట్ చేస్తూ చిత్ర.
"అర్హతలేని వాళ్ళకోసం సీటు రిజర్వ్ చేయడం తెలివితక్కువతనం చిత్రా! మేం నీ శ్రేయోభిలాషులని నాకూ తెలుసు కదా!"
కారు కాలేజీ గేటులోంచి విసురుగా బయటికి తిరిగింది.
చిత్ర కారులో జెన్నీ ముఠా ఎక్కి వెళ్ళడం చూసి నిర్ఘాంతపోయారు రాజు, ముకుందం, చలపతి.
అప్పటికప్పుడే ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాలని నిశ్చయించుకున్నారు వాళ్ళు. వాళ్ళతో వెళ్ళడం వల్ల చిత్రకేదన్నా ప్రమాదం కలుగుతుందని భయపడిపోయారు.