"నికో లవ్ లెటర్ ఇస్తాను. దాన్ని ఈశ్వర్ నీకు రాశాడని ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇవ్వాలి."
ఆ మాటలు వినగానే ఆమెకి కాళ్ళకింద భూమి కంపించినట్టయింది.
భయంగా బెదురుతున్న కళ్ళతో చూసింది. ఓ పక్క వూపిరి ఆడ్డంలేదు.
"భయపడకు నీ వెనక జెన్నీ ఉంటాడు. ఆ ఈశ్వర్ గాడి పీక పిసికేస్తాను" అన్నాడు ఆమెని విడిచిపెట్టకుండా కొన్ని నిమిషాలపాటు ఆమె అతని బంధనలోనే ఉండడంతో అతనిలో తెలీకుండానే ఉద్రేకం కలుగుతోంది.ఆమెకేసి ఓసారి చూసి నోటిమీద నుంచి చేతిని తీసి ఆమెని రెండు చేతులతో చుట్టేశాడు.
మొహంమీదకి ఒంగి ముద్దు పెట్టుకున్నాడు.
"ఛీ, ఏమిటిది?" విదిలించుకొంది స్వర్ణ.
అతను అసహ్యంగా నవ్వాడు.
"నేను చెప్పినట్లు వినకపోతే ఏం చేస్తానో జస్ట్ శాంపిల్ చూపించాను. పిచ్చి వేషాలు వేశావో పూర్తి కార్యక్రమం జరిపించేస్తాను. అండర్ స్టాండ్?"
స్వర్ణకి తనకి తెలీకుండానే ఓ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టు అర్ధం అయిపోయింది.
ఎంత అవమానం......
ఒంటిపైన తేళ్ళూ, జెర్రులూ పాకుతున్నట్టుగా ఉంది.
ఇంకా అతను విడిచిపెట్టలేదు.
అతని మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తాడన్నది నిర్వివాదాంశము.
అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని విడిపించుకోడానికి ప్రయత్నం చేసింది.
ఆమె శక్తి చాలలేదు.
అతని పట్టు మరింత బిగిసింది.
ఇంకా విడిచిపెట్టడే?
ఏం చేద్దామనుకుంటున్నాడు?
ఇంత పబ్లిగ్గా!
కేకలు పెట్టి ప్రయోజనం లేదు.
అల్లరవుతుంది అంతే.
చులకన అవుతుంది.
ఇవాళ వీడు.
దీన్ని అలుసుగా తీసుకొని రేపు మరొకడు. తనపైన మరోడు..... మరోడు..... దౌర్జన్యం చేసి..... ఇలా..... ఇలా చేస్తూ పోతూంటారా?
ఏడుపొస్తోంది.
చేతికి ఏదన్నా ఆయుధం దొరికితే వాడి బుర్ర పగిలేలా కొట్టాలనుంది. చంపెయ్యాలనుంది.
ఈశ్వర్ని అల్లరి చేయటం ఎంత అన్యాయమో ఆమెకి తెలుసు.
అదెంత మాత్రం సమాజసం కాదు.
ఈ గొడవల్లో ఇరుక్కోవడం ఆమె కెంతమాత్రం ఇష్టంలేదు. కానీ తప్పనిసరిగా జెన్నీ యిరికిస్తున్నాడు తనని. ఎలాంటి భయంకర పరిణామాలని ఎదుర్కోవలసి వస్తుందోనని ఆమె కలవరపడిపోతోంది.
ఈ గొడవల మధ్య అసలు కాలేజీ మానుకోవడం మంచిది నిజానికి.
జెన్నీ రావణాసురుడు లాంటివాడు.
వాడు చెప్పినట్టు వినకపోతే ఇంటిపైన పడగల సమర్ధుడు.
అతనేదో చేస్తున్నాడు. ఛీ....
ఏమిటి?
ఇంకా విడిచిపెట్టడే.
అక్కడ ఎవరూ లేకపోవడం ఎంత దురదృష్టం. ఆమెకి తెలీదు జెన్నీ ఆ కార్నల్లోకి ఎవరూ రాకండా ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నాడని.