Previous Page Next Page 
మహాశక్తి పేజి 13

    "ఎవడో పుణ్యాత్ముడు. పోనిద్దూ" నవ్వింది.

    "పుణ్యాత్ముడు కాదు. పరమ పాపాత్ముడు. ఆ ఈశ్వర్ గాడే ఇదంతా చేశాడు."

    "ఈశ్వరా?" ఆశ్చర్యంగా చూసింది చిత్ర.

    "అవును. వాడే, ఇలా చేస్తే నువ్వు అల్లరిపాలైపోతావని నీకు పెళ్ళి అవదని అప్పుడు చచ్చినట్టు నువ్వు వాడికే దొరుకుతావని"

    "నిజంగానా తమ్ముడూ?"

    "నీకంటే పెద్దవాణ్ని తమ్ముడూ అనకు"

    "బావయ్యా అని పిలవనా?"

    చిదంబరం వెకిలిగా నవ్వాడు.

    "నాకు జరిగిన యీ అవమానానికి నీకు ప్రతీకారం తీర్చుకోవాలని లేదా బావయ్యా"

    "ఎందుకు లేదూ ఈశ్వర్ గాణ్ని కాళ్లు విరగ్గొట్టి పడేయాలనుంది"

    "ఇంకా ఆ పని చెయ్యలేదే మరి. అయితే ఏ సొంత మరదలినో, మేనకోడలినో అయితే ఏం చేసేవాడివి?"

    "చంపేస్తాను" అన్నాడు.

    "కరెక్ట్ శిక్ష కూడా చెప్పావు. కాలేజీ అవగానే నన్ను కలుసుకుంటావా?" అడిగింది చిత్ర.

    "దేనికి?"

    "ఈశ్వర్ని ఏం చెయ్యాలో నీకు చెప్తాను."

    "అలాగే" అని చిదంబరం వెళ్ళిపోయాడు.

    "ఏమిటే ఇదంతా మళ్ళీ" అంది చిత్ర ప్రక్కనే ఉన్న స్వర్ణ.

    చిత్ర నవ్వింది.

    పడీ పడీ నవ్వింది.

    "ఎవర్ని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు."

    "తెలిసే ఇంకా ఊబిలోకి వెళ్ళకు" మందలింపుగా అన్నది స్వర్ణ.

    "నేను క్రిమినల్ లాయర్ డి.ఆర్. రాజు కూతుర్ని. యూ నో. యీ వేధవల్ని నేను విడిచిపెడతానని అనుకోకు" అంది చిత్ర విసురుగా లైబ్రరీలోకి నడుస్తూ.

    "ఇలాంటి ధైర్యం నాకెందుకులేదు?" అని ప్రశ్నించుకొంది స్వర్ణ.

    మెల్లగా ఆమె లైబ్రరీలోకి నడిచింది. బీరువాల చాటుగా వెళ్ళి పుస్తకాలు చూస్తోంది స్వర్ణ. ఆమె భుజంమీద ఓ చెయ్యి పడింది. ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.

    జెన్నీ వికృతంగా కనబడ్డాడు. ఆమె చలిజ్వరం వచ్చినట్టు వణికిపోయింది. భయంతో ఆమె కెవ్వుమని అరవబోయింది. జెన్నీ ఆమె నోరు నొక్కేశాడు.

    స్వర్ణ పెనుగులాడ్డం మొదలుపెట్టింది.

    జెన్నీ ఆమెకి అరవడానికి అవకాశం ఇవ్వకుండా ఒక చేత్తో నోరు నొక్కేసి రెండో చేత్తో ఆమె పొట్టని నడుం వెనకనుంచి చుట్టేశాడు.

    అతని చేతికి తగులుతోన్న ఆమె గుండె అంచులని ముంజేత్తో నొక్కుతూ అన్నాడతను.

    "నోరు మూసుకుని చెప్పింది విను."

    స్వర్ణ భయంగా చూసిందతన్ని.

    "ఏం మాట్లాడవు?" అదిలించాడు.

    ఆమె బేలగా గింజుకొంటోంది.

    ఎలా మాట్లాడ్డం?

    ఓ పక్కన మాట్లాడకుండా నోటిని చేత్తో నొక్కేశాడు.

    ఆమెకి ఊపిరి ఆడ్డంలేదు.

    అతన్నించి విడిపించుకోవాలి.

    అసహ్యంగా ఉంది.

    కంపరంగా ఉంది.

    ఆమె గుండెలు పైకి కిందికీ ఎగిరిపడుతున్నాయి ఆవేశంతో కానీ తనేం చెయ్యలేదు.

    అతనెలాంటివాడో ఆమెకి బాగా తెలుసు.

    బరితెగించి ఇంత దౌర్జన్యం చేస్తున్న అతన్ని ప్రతిఘటించనూలేదు.

    అతనేదో వినమంటున్నాడు.

    ఏమి చెప్పబోతున్నాడు.

    అసలు తన నించి ఏం ఆశిస్తున్నాడు?

    వినాలి.
 

 Previous Page Next Page