Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 9


                                    ప్రేమలేఖ
                                                                   ---వసుంధర    


    కాబరే చూస్తున్నాడు డిటెక్టివ్ కిల్లర్.
    నాట్యం నరాలు జివ్వుమనిపిస్తోంది.
    ఆ సమయంలో "హలో!" అన్న పిలుపు నెమ్మదిగా చెవిలో వినపడింది కిల్లర్ కి. అతడులిక్కిపడి పిలుపు వినపడినవైపే తిరిగాడు.
    సన్నని వెలుతురులోకూడా మిలమిల మెరిసిపోతున్న సుందరి ఆమె!
    అంతవరకూ ఆమె తన పక్కన వున్నదని కూడా గుర్తించలేదతడు.
    "హలో!" అన్నాడతడు నెమ్మదిగా.
    "మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా?" అందామె.
    "లేదు-" అనడానికి మనసొప్పక-"అవును"-అనడానికి మొహమాటపడి యిబ్బందిగా ఊరుకున్నాడు కిల్లర్.
    "మీరు నాతో బయటకు రాగలరా?" అందామె.
    కిల్లర్ చెవులామెను చూస్తూనే ఉన్నా కళ్ళు కాబరే తారనే గమనిస్తున్నాయి. ఆమె వంటి సొంపులు సంగీతంతోపాటు లయబద్ధంగా కదులుతున్నాయి. ఆ దృశ్యం శరీరంలో వేడిని పుట్టిస్తున్నప్పటికీ కూడా మనోహరంగా వుంది.
    "ప్లీజ్-మీరు నాతో బయటకు రావాలి-" అందామె మళ్ళీ.
    "ఎందుకు?"
    "బయటకు వచ్చేక-పొగొట్టుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది మీకు!" అందా యువతి.
    కిల్లర్ చటుక్కున ఆమె వంక చూశాడు.
    కాబరే యువతికంటే ఎన్నో రెట్లు అందంగా వుందామె.
    "సారీ- నువ్వు పొరబడ్డావు. నాకు నీ అవసరం లేదు-" అన్నాడతడు నెమ్మడిగా.
    "కానీ నాకు మీ అవసరముంది. అందుకు ప్రతి ఫలంగా మీరు నన్నే అడిగినా యిచ్చుకోగలనని చెప్పడం నా ఉద్దేశ్యం..."
    "అంటే?"
    "ప్లీజ్-బయటకు వెళదాం...."
    "ఎందుకు?"
    ఆమె చటుక్కున-"నేను ప్రమాదంలో వున్నాను" అంది.
    కిల్లర్ వెంటనే లేచి నిలబడి-"పద-పోదాం.." అన్నాడు.
    అప్పుడే కాబరే తార దుస్తులు విప్పడం ప్ర్రారంభించింది. సంగీతం స్థాయి మారింది.
    కిల్లర్ అటువైపు చూడలేదు. ప్రమాదం పేరు వినగానే అతడి మనసటే తిరుగుతుంది.
    ఇద్దరూ హోటల్లోంచి బయటకు వచ్చేక-"మీ యింటికి వెడదాం...." అందా యువతి.
    "నా యిల్లిక్కడే!" అన్నాడు కిల్లర్.
    "ఇక్కడే అంటే...."
    కిల్లర్ దగ్గర్లో పార్కుచేసి వున్న మొబైల్ వ్యాన్ దగ్గరకు నడిచాడు. వెనుకనుంచీ తలుపు తాళం తీశాడు.
    ఆ యువతి లోపలకు చూసి ఆశ్చర్యపడింది.
    ఓ చిన్న సైజు డ్రాయింగు రూంలా వుందక్కడ
    "ఇదే నా వంటగది ఇదే నా డైనింగ్ రూం ఇదే నా బెడ్రూం-" అన్నాడు కిల్లర్.
    ఇద్దరూ లోపలకు వెళ్ళారు. కిల్లర్ తలుపులు దగ్గరగా వేశాడు.
    ఆ యువతి సోఫాలో కూర్చుంది. కిల్లర్ ఆమెకు యెదురుగా సోఫాలో కూర్చున్నాడు.
    "ఈ రాత్రికి నేనిక్కడే వుండిపోవచ్చా?" అందామె.
    "నో-" అన్నాడు కిల్లర్.
    "ఎందుకని?"
    "ఈ గది నా కోసం. నా ఒక్కడికోసం....రెండో మనిషికిందులో స్థానం లేదు.." అన్నాడు కిల్లర్.
    "మరి మీ భార్య?"
    "నాకు పెళ్ళి కాలేదు..."
    "పెళ్ళి చేసుకుంటే?"
    "నేను పెళ్ళి చేసుకోను...."
    "ప్రపంచంలో స్త్రీకి పురుషుడూ, పురుషుడికి స్త్రీ తోడు కావాలి...."
    "నువ్వు నన్ను పెళ్ళి గురించి ఒప్పించడానికే వచ్చి వుంటే తక్షణం వెళ్ళిపోవచ్చు. నీ అందం నా మీద ప్రభావం చూపించగలదని అనుకుంటే అది పెళ్ళివరకూ దారితీయదన్నవిషయం ముందే హెచ్చరిస్తున్నాను...."
    "అంటే?"
    "నేను నిన్ను పెళ్ళి చేసుకోను...."
    ఆమె నవ్వి-"నన్నెలా పెళ్ళి చేసుకుంటారు? నాకు పెళ్ళయింది!" అంది.
    కిల్లర్ తెల్లబోయి-"నీకు పెళ్లయిందా? మరిలా ఎందుకొచ్చావు?" అన్నాడు.
    "నా గురించి మీరేమి అనుకొంటున్నాడో చెప్పండీ" అందామె.
    "కాబరేలో ఓ తార తన వంపు సొంపులు చూసి రెచ్చగొడుతోంది. ఆ సమయంలో నన్ను పలకరించి అంతకంటే ఎక్కువ దొరుకుతుందన్నావు. నా యింటికి వచ్చి నా గదిలో ఈ రాత్రి ఉండిపోతానన్నావు. నీకు డబ్బు కావాలనుకుంటున్నాను. లేదా కండకావరమైనా అయుండాలి...."
    "రెండూ కాకపోతే...."
    "అంతకు మించి నే నాలోచించలేదు...."
    "మిమ్మల్ని పలకరించే ముందు మీ గురించి నే నే మాలోచించానో తెలుసా?"
    "చెప్పు!"
    "ఎత్తైన విగ్రహం మీది. చురుకుతనమున్న కళ్ళు అన్నిటికీ మించి మీ మీసాలు ఆ మీసాలకే నే నాకర్షించబడ్డాను...."
    "మీసాల్లో ఆకర్షణ ఏమిటి?"
    "మీ మీసాల్లో నాకు రక్షణ కనబడింది. ఆ మీసాలే మీరు అసలయిన మగధీరుడని నేననుకునేలా చేశాయి...."
    కిల్లర్ రవంత సిగ్గుపడి-"నీకు రక్షణ ఎందుకు?" అన్నాడు.
    "చెప్పానుగా-నేను ప్రమాదంలో ఉన్నాను...."
    ప్రమాదమనగానే కిల్లర్ లో మళ్ళీ కొత్త ఆసక్తి పుట్టింది.
    "ఏమిటి నీ ప్రమాదం!" అన్నాడతడు-"పెళ్ళయిందంటున్నావు ప్రమాదం నుంచి నీ భర్త నిన్ను రక్షించలేడా"
    "ప్రమాదం నా భర్త నుంచే అయితే!"
    కిల్లర్ ఉలిక్కిపడి - "అదెలా సాధ్యం?" అన్నాడు.
    "నా భర్త నన్ను చంపాలనుకుంటున్నాడు...."
    "ఎందుకు?"
    "ఆయనకు నేనంటే యిష్టంలేదు...."
    "మరి పెళ్లెందుకు చేసుకున్నాడు?"
    "అప్పుడు నేనంటే యిష్టముంది...."
    "మరిప్పుడేమయింది?"
    "ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుంది...."
    "అయితే?"
    "ధన సంపాదనకు నా అందాన్ని వినియోగించుకుంటాడు...."
    కిల్లర్ తెల్లబోయి-"భార్య నిలా వేధించేవాడుంటారా?" అన్నాడు.
    "ఆయన అసలు ఎత్తు నాకు తెలిసింది రెండు మూడు సంవత్సరాలపాటు నా అందంతో లక్ష లార్జించి ఆ తర్వాత నా ప్రవర్తన మంచిది కాదు కాబట్టి విడాకులు పుచ్చుకుంటాడు. అప్పుడో అమ్మాయిని పెళ్ళి చేసుకుని స్థిరంగా కాపురం చేస్తాడు-..."
    "అలా ఏ భర్తా అనుకోడు! నువ్వు పొరబడ్డావు...." అన్నాడు కిల్లర్.
    "ఆయనతో కాపురం చేస్తూ గ్రహించిన సత్య మిది, మీరు కేవలం నా మాటలు విని ఇది నిజం కాదంటున్నారు-..." అందా యువతి.
    "ఇలాంటి వాడిని నువ్వసలెలా పెళ్ళి చేసుకున్నావు?"
    "కట్నం లేకుండా ఏరి కోరి పెళ్ళిచేసుకున్నాడు.."
    కిల్లర్ నిట్టూర్చి - "ఇప్పుడు నేనేం చేయాలి?" అన్నాడు.
    "నా భర్త నుండి నన్ను రక్షించాలి...."
    "ఎలా?"
    "నిన్న రాత్రే ఆయన నన్ను చంపాలనుకున్నాడు. నేనది గ్రహించి ముందే గది తలుపులు లోపల్నుంచీ వేసుకుని పడుకున్నాను. ఉదయం ఆయన బయటకు వెళ్ళేదాకా తలుపులు తీయలేదు. ఆయన వెళ్ళిన వెంటనే ఇంట్లోంచి బయటపడ్డాను. నేనెప్పుడూ కేలరీలకు వెళ్ళలేదు. నా భర్తకు దొరక్కూడదనే ఆయన ఊహించని స్థలాల్లో తిరుగుతున్నాను..."
    "ఊహించని స్థలాలంటే?"
    "సినిమాలంటే నాకు తలనొప్పి-ఈ రోజు నూన్ షో, మ్యాట్నీ ఫస్టు షో వరుసగా చూసేశాను. నేను సినిమాలు చూడనని నా భర్తకు తెలుసు. ఆ తర్వాత కేబరే షో'కి నేను వెడతానని ఆయన ఊహించలేడు...." అందా యువతి.

 Previous Page Next Page