ముత్యాల్రావుకు మనసు చివుక్కుమంది. ఏదో తప్పు చేస్తున్నానన్న భావం అతడిక్కలిగింది. అతడింకేమీ మాట్లాడలేదు.
"నీ జాతకం చెప్పు ముహూర్తం పెట్టించి కబురు చేస్తాను..." అంది వేదవతి.
ముత్యాల్రావామెకు తను పుట్టిన తేదీ, సమయం చెప్పాడు. వేదవతి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా అతడికి నిద్రపట్టలేదు.
8
"ఇంత రాత్రివేళ యెక్కడికిరా బయల్దేరావ్?" అంది మాలతమ్మ కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ-"సెకండ్ షో సినిమాకా?"
"కాదమ్మా-" అన్నాడు ముత్యాల్రావు-"మా ఆఫీసులో ఒకతనికి ట్రాన్సుఫరై వెళ్ళిపోతున్నాడు. రాత్రి మేమంతా స్పెషల్ పార్టీ చేసుకుంటున్నాం. నేనింక ఉదయమే ఇంటికి వస్తాను...."
"స్పెషల్ పార్టీ అంటే?" అంది మాలతమ్మ.
ముత్యాల్రావు కళ్ళముందు తను, వేదవతి ఒకరి కౌగిలిలో ఒకరు ఐక్యమైపోతున్న దృశ్యం కనబడుతున్నది.
"స్పెషల్ పార్టీ అంటే స్పెషల్ పార్టీ యే..." అని ఇంట్లోంచి బయటపడి - టైము చూసుకున్నాడు. తొమ్మిదిన్నరయింది. వేదవతి ఇల్లు చేరుకోనడానికి అరగంట కంటే పట్టదు.
ముత్యాల్రావు జేబులు తడుముకున్నాడు. తాళిబొట్టు తగిలింది.
ఇందులో ఏమీ మోసం లేదు కదా!
తను తాళి కడుతూందగా ఎవరైనా రహస్యంగా ఫోటో తీస్తే...
తను జాగ్రత్తగా పరిసరాలు గమనించాలి. గదిలో అన్ని తలుపులూ, కిటికీలతో సహా మూసేయాలి. ఆపైన గదిలో యెక్కడా కెమెరా అమర్చబడలేదని ధృవ పర్చుకోవాలి. గదిలో దీపం ఆర్పేసి ఆ చీకట్లో ఆమె మెడలో తాళి కట్టాలి. చీకట్లో తాళి కడుతూండగా ఎవరైనా ఫోటో తీసే మాటైతే ప్లాష్ తళుక్కుమంటుంది. అదీకాక చీకట్లో తామెక్కడ ఉంటారో కెమెరా పట్టుకున్నవాడికి ఎలా తెలుస్తుంది?
పదిగంటలకల్లా వేదవతి ఇల్లు చేరాడు ముత్యాల్రావు.
అంతా తన అదృష్టం! ఇంటివాళ్ళు అనుకోకుండా ఊరికి వెళ్ళారు. వేదవతి ఈ రోజుకు ముహూర్తం పెట్టింది. ఇంత త్వరగా తనకిలాంటి అవకాశం వస్తుందని ముత్యాల్రావు అనుకోలేదు. ఎటొచ్చీ అవకాశం ఉపయోగించుకున్నాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడతడు. వేదవతిని మోసం చేయవచ్చుగా-కూడదా?
తలుపులు ఓర వాకిలిగా వేసి వున్నాయి. గదిలో దీపం వెలుగుతున్నట్లు తెలుస్తున్నది. ముత్యాల్రావు తలుపులు తీసి ఆశ్చర్యంగా ఆగిపోయాడు.
గదిలో మంచం మంచంమీద వేదవతి ఆమె చేయి ఒకటి క్రిందకూ వేలాడుతున్నది. వంటిమీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సూటిగా గుండెల్లోకి దిగిన కత్తి పిడి పైకి కనబడుతున్నది. రక్తం ధారగా ప్రవహించిన సూచనలున్నాయి.
సుమారు నెలరోజుల క్రితం తను చూసిన దృశ్యానికీ ఈ దృశ్యానికీ పెద్దగా తేడా లేదు.
ముందు ఆశ్చర్యపోయినా ధైర్యం తెచ్చుకున్నాడు ముత్యాల్రావు.
ఒకసారి వేదవతి ఇలాగే తనను పరీక్షించింది. మోహన్ వంటి అఖండుడామెను ప్రేమిస్తూండగా ఎవరూ ఆమెను హత్యచేయలేరు. అయినా ఎవరైనా ఆమెను హత్య చేయాలని ఎందుకనుకుంటారు?
సందేహం లేదు-ఆమె మళ్ళీ తనతో నాటకమాడుతున్నది.
ముత్యాల్రావు నాలుగడుగులు ముందుకువేసి ఆమెను సమీపించి-గుండెలవద్దనున్న రక్తాన్ని తాకాడు. రక్తం జిగురుగా వున్నదనిపించింది.
"ఏమి రంగు వాడిందో-నిజం రక్తంగానే ఉన్నది" అని మనసులో అనుకుని-"వేదవతీ-ఇంకా నీ నాటకం కట్టిపెట్టి-లే!" అన్నాడు.
ఆమె కదలలేదు.
అతడామెను పట్టుకుని కుదిపాడు.
అప్పుడు కదిలింది వేదవతి-అతడు కుదపడంవల్ల. మోకాళ్ళమీద వంగి కుదపడంవల్ల నేమో-ఆమె అతడి మీద పడింది.
ముత్యాల్రావు వెల్లకితలా పడ్డాడు. అతడి మీద వేదవతి పడింది.
తనమీద మనిషికాక శవమే పడినట్లు అనిపించింది ముత్యాల్రావుకు.
వేదవతి శవం బిగుసుకుని ఉన్నది. శరీరం కాస్త చల్లబడినట్లున్నది.
ముత్యాల్రావు కెవ్వుమని కేకవేసి వేదవతిని తనమీద నుంచి తొలగించాడు. అతడిలో కంగారు ప్రారంభ మయింది. అతడామె గుండెల్లో దిగిన కత్తి పిడిని తాకాడు. అతడి బట్టలు రక్తసిక్తాలయ్యాయి. అక్కడ మడుగు కట్టిన రక్తంలో అతడి పాదముద్రలు పడ్డాయి.
అతడి కేక వినడం వల్లనో ఏమో కొంతమంది జనం ఆ యింటిముందుకు వచ్చారు. వారిలో ఒకడు లోపలకు తొంగిచూసి- "హత్య.....హంతకుడు...." అంటూ పెద్దగా కేకలు పెట్టాడు.
అది విని ముత్యాల్రావు ఉలిక్కిపడి అటు చూసి-"నో....నో....నేను హతకుణ్ణి కాదు...." అంటూ అరిచాడు.
9
"నువ్వామెను బలవంతాన పెళ్ళాడాలనుకున్నట్లు నీ జేబులోని తాళిబొట్టు చెబుతోంది. ఆమె నీ కోరికను కాదన్నందుకు ఆవేశపడి ఆమెను చంపేశావు. కత్తిపిడి మీద నీ వేలిముద్రలున్నాయి. అన్నింటికీ మించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డావు. మర్యాదగా నేరం ఒప్పేసుకో....లేనిపక్షంలో నీ చేత ఒప్పించాల్సి ఉంటుంది...." అన్నాడు పోలీసు ఇన్ స్పెక్టర్.
"నాకేం తెలియదు. నేను నిర్దోషిని-" అరిచాడు ముత్యాల్రావు.
"హత్యచేసిన ప్రతివాడూ నీకులాగే అంటాడు తప్పితే నేరం ఒప్పుకోడు. నేరం ఒప్పించడానికి మేమెలాంటి పద్ధతులవలంభిస్తామో నీకు తెలియదు. ఆ పద్ధతుల వల్ల నేరం చెయ్యనివాడు కూడా చేశాననే పరిస్థితి ఏర్పడుతూంటుంది. బాగా ఆలోచించుకో-నీకు మరొక్క గంట వ్యవధి ఇస్తున్నాను-ఆ తర్వాత నేను మనిషిని కాను..."
ముత్యాల్రావు భయం భయంగా ఇన్ స్పెక్టర్ వంక చూశాడు-"సార్! ఎలా మిమ్మల్ని నమ్మించాలో నాకు తెలియడం లేదు. నిజంగా నేను నిర్దోషిని. మీరు నన్ను ఉరికంబమెక్కిస్తే-అసలు హంతకుడు దర్జాగా సమాజంలో తిరుగుతూ మరి కొన్ని హత్యలు చేస్తాడు....ప్లీజ్ ఇన్ స్పెక్టర్....నేను హంతకుణ్ణి కాను...."
"అలా అంటూండు. సరిగ్గా ఓ గంట తర్వాత అసలు నిజం నీచేత చెప్పిస్తాను...." అన్నాడు ఇన్ స్పెక్టర్ కసిగా.
"అతడు నిజమే చెబుతున్నాడు ఇన్ స్పెక్టర్!" అన్న గొంతు వినిపించి ఇన్ స్పెక్టర్, ముత్యాల్రావు కూడా అటు తిరిగారు.
అక్కడ మోహన్ నిలబడి ఉన్నాడు.
"మీరెవరు?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"వేదవతిని చంపినవాడిని...." అన్నాడు మోహన్ "మీరు నన్ను ప్రశ్నించాలని రెండ్రోజులుగా ప్రయత్నిస్తున్నారు. నేను దొరకలేదు. ఈ రోజు నేనే మీ దగ్గరకు వచ్చేశాను. అడక్కుండానే అన్నీ చెప్పేస్తాను. నా వాగ్మూలం తీసుకోండి..."
ఇన్ స్పెక్టర్ కంతా ఆశ్చర్యంగా వుంది. మోహన్ వాంగ్మూలం తీసుకునేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు జరిగాయి.
"నేను వేదవతిని ప్రేమించాను. కానీ ఆమె ముత్యాల్రావును ప్రేమించింది. పెళ్ళికి ముందే తన్ను తానర్పించుకునేందుకామె సిద్దపడింది. దాపరికం లేకుండా ఉన్నదున్నట్లు ఎప్పటికప్పుడు నాకు చెప్పెది. నాలో కసి బయల్దేరింది. నాకు దక్కని వేదవతి ముత్యాల్రావుకీ దక్కకూడడని ఓ పధకం వేశాను. ఓ రోజామెను చనిపోయినట్టు నటించమన్నాను. ఆ తర్వాత అది నటన అని ముత్యాల్రావుకు తెలిసేలా చేయమన్నాను.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు ఐక్యం కావాలని నిర్ణయించుకున్న రోజున ఆమెను చంపేశాను. అంతకు మునుపులాగే వేదవతి నటన అని నమ్మి ముత్యాల్రావు అక్కడ రక్తం ముట్టుకున్నాడు. వేలిముద్రలు వదిలాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. నా తెలివి తేటలలో వేదవతినీ, ముత్యాల్రావునూ పరలోకానికి పంపే ఏర్పాట్లు చేశాను. కానీ ఈ రెండ్రోజుల్లోనూ నాకో విషయం తెలిసింది...."
"ఏమిటి?"
"వేదవతి లేచి ఈ ప్రపంచం నాకు శూన్యంగా తోస్తున్నది. మరో లోకమంటూ వుంటే అక్కడ వేదవతి, ముత్యాల్రావు కలుసుకుని ఒకటవుతారన్న అసూయభావం నన్ను దహించి వేస్తున్నది. నా నేరం ఒప్పేసుకుని నేనే సరాసరి వేదవతి వద్దకు వెళ్ళి పోవాలని నిశ్చయించుకున్నాను...." ఇన్ స్పెక్టర్ అతడిని చాలా ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ మోహన్ సమాధానాలు చెప్పాడు. తనే ఆ హత్య చేసినట్లు నమ్మడానికి అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సూచించాడు. ఇన్ స్పెక్టర్ కి అతడే హంతకుడని నమ్మకం కుదిరింది.
10
ముత్యాల్రావుకి అంతా కలలా వున్నది. అతడు తనకు ఉరిశిక్ష ఖాయమనీ ప్రాణాలు పోయినవనే అనుకున్నాడు. కానీ చిత్రంగా మోహన్ తనకు తానే వచ్చి తన ప్రాణాలు రక్షించాడు.
విడుదలై ఇంటికి వచ్చిన కొడుకును కౌగలించుకొని భోరున ఏడ్చింది మాలతమ్మ.
ముత్యాల్రావు అదొకలాగున్నాడు. వేదవతి ప్రేమ ఎంత గొప్పది? ఆమెకోసం మోహన్ ప్రాణాలు వదలడానికి నిర్ణయించుకున్నాడు. అనవసరంగా ఆ అమరప్రేమికుల మధ్య తను ప్రవేశించి-ఇద్దర్నీ ఈ లోకంలో లేకుండా చేశాడు.
వేదవతి తనను ప్రేమించకుండా ఉండాల్సింది.....
ముత్యాల్రావు రాత్రి ఒక్కడూ తన గదిలో కూర్చున్నాడు. నిద్రవచ్చేలా లేదతడికి....
ఉన్నట్లుండి అతడి కనులముందు వేదవతి ఉన్నది.
అతడు ఉలిక్కిపడి-"ఎలా వచ్చావ్?" అన్నాడు.
"నా ప్రేమ బలాన్ని ఋజువు చేసుకుంటున్నాను. మోహన్ ని నా వైపు ఆకర్షించుకుని తన నేరాన్ని ఒప్పుకునేలా చేసి-చనిపోయాక కూడా నీకు సాయపడ్డాను. ఇంతకంటే ఏ విధంగానూ నా ప్రేమ బలాన్ని ఋజువు చేసుకోలేను...." అంది వేదవతి.
"వేదవతీ.....నువ్వు బ్రతికే వున్నావు. జరిగిందంతా నాటకం. అవునా?" అని అరిచాడు ముత్యాల్రావు.
అతడి ఎదురుగా వేదవతి నవ్వుతున్నది.
వెనుకనుంచి అతడి భుజంమీద ఎవరిదో చేయిపడింది. చటుక్కున వెనక్కు తిరిగాడు.
మాలతమ్మ...."నాకెవ్వరూ కనబడ్డం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావురా?" అన్నదామె.
"ఇదీ గతంలోలాగే నాటకమైతే బాగుండును-" అనుకున్నాడు ముత్యాల్రావు. కానీ అది నాటకం కాదు.
-:అయిపోయింది:-