Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 10


    "మరిప్పుడేం చేస్తావు?"
    "మీరేం చెబితే అది చేస్తాను...."
    "అయితే మనిద్దరం కలిసి మీ యింటికి వెడదాం.."
    "మా యింటికి వద్దు"
    "ఎందుకని?"
    "నా భర్త అనుమానిస్తాడు. మనకు లేనిపోని సంబంధం అంటగట్టి - ఈ కారణంగా నన్ను తన పనులకు మరింత బలవంత పెడతాడు...."
    "అతణ్ణి నేను హెచ్చరిస్తాను...."
    "లాభంలేదు...."
    కిల్లర్ గంభీరంగా-"భర్తను వదిలితే నీ బ్రతుకు కుక్క చింపిన విస్తరి అవుతుంది. అతడిని నేను సరైన మార్గాన పెట్టగలనన్న నమ్మకం నాకుంది-" అన్నాడు.
    "ఆ నమ్మకం నాకు లేదు-...." అందా యువతి.
    "నా సంగతి నీకు తెలియదు...." అన్నాడు కిల్లర్.
    "నిజమే కానీ నా భర్త సంగతి మీకు తెలియదు."
    కిల్లర్ క్షణంపాటు అలోచించి-"నీకు అయిదు నిమిషాలు వ్యవధి యిస్తున్నాను. నీ నిర్ణయం చెప్పు మనిద్దరం కలిసి నీ యింటికి వెడదాం! అందుకు నీకిష్టం లేకపోతే నన్ను మరిచిపో ఇంకెవరినైనా సాయమపేక్షించు-" అన్నాడు.
    "గడువు అయిదు నిముషాలు చాలదు. ఈ రాత్రికి నన్నిక్కడ వుండనివ్వండి..."
    "లాభంలేదు. అయిదు నిమిషాల్లో నీ నిర్ణయం చెప్పాలి...."
    ఆమె మౌనం వహించింది. కిల్లర్ కూడా మౌనంగా గడియారం వంకే చూసుకున్నాడు. సరిగ్గా అయిదు నిముషాలు కాగానే-"మనం వెడదామా?" అన్నాడు.
    ఆమె లేచి నిలబడి-"నేను వెడుతున్నాను. ఇంకెవరి సాయమైనా ఆపేక్షిస్తాను...." అంది.
    కిల్లర్ నవ్వాడు. ఆమె వెళ్ళిపోయింది.

                                       2

    ఉదయం ఆరుగంటలకు క్వార్ట్ వాచ్ లో అలారం విని లేచాడు కిల్లర్ ఒక్కసారి వళ్ళు విరుచుకుని- "రాత్రి బాగా నిద్రపట్టింది-" అనుకున్నాడు.
    అక్కణ్ణించి ఎదురుగా ఉన్న హోటలుకు వెళ్ళాడు. పదిరూపాయలు చెల్లించి స్నానంతో సహా మొత్తం కాలకృత్యాలన్నీ తీర్చుకుని ట్రిమ్ గా తయారయ్యాడు. అప్పుడతడికి రాత్రి తనని కేబరేలో పలకరించి తనతో మొబైల్ వ్యానులో గడుపుతానన్న యువతి గుర్తుకు వచ్చింది.
    "ఆడవాళ్ళు రకరకాలు!" అనుకున్నాడు కిల్లర్.
    ఎందుకో అతడికామెపై రవంతకూడా జాలి కలగలేదు. ఆమె చెప్పినవన్నీ అబద్దాలనే అతడు భావించాడు ఆమెకు పెళ్ళికూడా అయుండదని అతడి నమ్మకం.
    చేతిలో డబ్బుంది. ఇంట్లో అదుపులేదు. ఏ కేబరేకో వచ్చి అక్కడ బ్లూ ఫిల్ము చూసి ఆవేశపడి వచ్చిన మగవాణ్ణి ఏదో వంకపెట్టి పలకరించి - కుంటిసాకులు చెప్పి ఒక రాత్రి అతడితో గడపడం....
    ఆధునికత పేరు చెప్పి వెర్రితలలు వేస్తున్న కొందరాడవాళ్ళ విపరీత ప్రవర్తన యిది! కిల్లర్ ఆమెను ముందే అనుమానించి దూరంగా వుంచడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రమాదం పేరు చెప్పి అతణ్ణి ఆకర్షించింది. అప్పుడతడామెవద్ద భర్త ప్రసక్తి తీసుకువచ్చి బెదరగొట్టాడు.
    ఆమెకు భర్తలేడు. ఉన్నా అతడినామె కిల్లర్ కు చూపదల్చుకోలేదు.
    రాత్రి కిల్లర్ ఆమెను పేరుకూడా అడగలేదు. అడిగినా అసలు పేరు చెప్పదని అతడి నమ్మకం.
    కిల్లర్ కిప్పుడు పనేమీ లేదు.
    తనేమిటో ఆ యువతి తెలుసుకోవాలి. ఈ రోజామె గురించి మొత్తం ఆరాతీసి ఆ వివరాలతో కలుసుకోవాలి. ఆ తర్వాత ఆమె మళ్ళీ తఃనవంటి వారి జోలికి వెళ్ళదు. పైగా తన మార్గం మార్చుకునే అవకాశంకూడా వుంది.
    రాత్రి కిల్లర్ బాగా అలసట ఫీలయ్యాడు. అందుకే ఆమె ననుసరించలేదు. ఇప్పుడీ మహా మ్గరంలో ఆమె గురించిన వివరాలు తెలుసుకునేదెలా?
    ఏ కేసుకైనా ముందుకు వెళ్ళడానికి ఒకటే పద్ధతి! ముందామె చెప్పినవన్నీ నిజంగా భావించడం.....
    అంటే ఈపాటికి ఆమె చంపబడి వుండాలి.
    కిల్లర్ నవ్వుకుంటూ హోటల్లో రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్ళాడు.
    ఆమె నవ్వుతూ-"వాట్ కెనైడూ ఫర్ యూ-" అంది.
    "ఫోన్!" అన్నాడు కిల్లర్.
    "మీరే చేసుకోండి-..." అంటూ ఆమె నవ్వింది.
    కిల్లర్ ఓ నెంబరు తిప్పి-"హలో-ఇన్ స్పెక్టర్ జగ్గారావుగారేనా? మీ ఏరియాలో అందమైన యువతి ఎవరైనా హత్యచేయబడిందా?" అన్నాడు.
    "లేదు-ఎవరు మీరు?" అంది అవతలి గొంతు.
    "కిల్లర్...." అని ఫోన్ పెట్టేశాడతడు.
    రిసెప్షనిస్టతడి వంక ఆశ్చర్యంగా చూసి-"పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కిల్లర్నని చెబుతున్నారు. మీ రూపం నాకు బాగా గుర్తుంది. వాళ్ళు ఎంక్వయిరీ చేస్తే బొమ్మకూడా గీసివ్వగలను-..." అంది.
    కిల్లర్ నవ్వి-"వాళ్ళు ఎంక్వయిరీ చేసినప్పుడు నన్ను తల్చుకుంటే-వెంటనే మనిషినే ప్రత్యక్షమవుతాను. మీకు బొమ్మగీసే శ్రమ తగ్గుతుంది-"అంటూ మరో నంబరు తిప్పాడు.
    ఈసారి ఇన్ స్పెక్టర్ విశ్వనాథ్ బదులిచ్చాడు.
    మూడో నంబరుకూడా అయి నాలుగో నెంబరు తిప్పుతూన్న సమయంలో "ఇక్కడ ఫోన్ ఛార్జి రెండ్రూపాయలు-"అంది రిసెప్షనిస్టు ఖంగారుగా.
    కిల్లర్ జేబులోంచి పదిరూపాయల నోటుతీసి ఆమె కందించి-"మళ్ళీ గుర్తుచేస్తే యింకో పదిస్తాను....." అన్నాడు.
    ఆమెకతడి ధోరణి అర్ధం కాలేదు.
    "హలో-ఇన్ స్పెక్టర్ గోవర్ధన్ స్పీకింగ్...." అంది అవతలి గొంతు.
    కిల్లర్ తన ప్రశ్నను రిపీట్ చేశాడు.
    "హూ ఆర్ యూ స్పీకింగ్ ప్లీజ్!" అన్నాడు గోవర్ధన్.
    "కిల్లర్...."
    "కిల్లర్ అంటే...."
    "డిటెక్టివును గురూ!"
    "ఓహ్....డిటెక్టివ్ కిల్లరా? జరుగబోయే హత్య గురించి మీకెలా తెలుసు?"
    "హత్య నిజంగా జరిగిందా?"
    "అవును కానీ హత్య కాదు ఆత్మహత్య....స్పాట్ నించి నేను వచ్చి పదిహేను నిమిషాలే అయింది...."
    "అయ్ సీ.....నేనోసారి వచ్చి హతురాలిని చూడవచ్చా?"
    "ష్యూర్...."
    "ఇప్పుడే వస్తున్నాను...." అంటూ ఫోన్ పెట్టేశాడు కిల్లర్.
    రిసెప్షనిస్టు అతడి ముందుకు ఓ పుస్తకంతోసి-"ఇందులో మీ పేరు, చేసిన ఫోన్ నంబర్లు వ్రాయండి" అంది.
    "మీరు నా బొమ్మకూడా వేయగలనన్నారు. వివరాలు మీరే రాసుకోలేరా?" అన్నాడు కిల్లర్.
    "మీకు రెండ్రూపాయలు తిరిగి వస్తాయి-" అందామె.
    "మీ దగ్గరే వుంచండి. మళ్ళీ రేపు ఫోన్ చేసుకుంటాను...."
    రిసెప్షనిస్టు కుతూహలంగా-"మీరెవరు? హంతకుడా, డిటెక్టివా, గూఢచారా?" అంది.
    "నే నెవరినైనప్పటికీ మీకో చిన్న సలహా ఇస్తాను" అన్నాడు కిల్లర్.
    ఆమె కుతూహలంగా అతడివంక చూసింది.
    "ఫోన్ ఛార్జి రెండ్రూపాయలన్న విషయం నంబరు తిప్పడానికే ముందే చెబుతూండండి..."అని అక్కన్నించి వెళ్ళిపోయాడు కిల్లర్.
    రిసెప్షనిస్టు చిత్రంగా అతడు వెళ్ళినవైపే చూస్తూండి పోయింది.
    
                                         3

    "ఆమె పేరుసీను..." అన్నాడు గోవర్ధన్.
    "శవం ఎక్కడుంది?" అన్నాడు కిల్లర్ ఆత్రుతగా.
    "వాళ్ళిట్లోనే వుంది...."
    "ఎందుకని?"
    "శవాన్ని పోస్టుమార్టం చేయవద్దని కోరాడామె భర్త...."
    "అయితే?"
    "ఇంట్లో ఫ్యాన్ కు ఉరిపోసుకొని చనిపోయిందామె. పోయేముందుత్తరం కూడా రాసిపెట్టింది. నిస్సందేహంగా ఇది ఆత్మహత్య అలాంటప్పుడు శవాన్ని మళ్ళీ ముక్కలుగా కోయడమెందుకు? ఆమె భర్త కోరికను మన్నించడానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాను..."
    కిల్లర్ నిట్టూర్చి-"ఆమె సీమ కాదు-" అని మనసులో అనుకున్నాడు. పైకి-"ఆత్మహత్యకు కారణమేమిటి?" అనడిగాడు.
    "సీమ ప్రవర్తన మంచిది కాదు. పెళ్ళికి ముందే ఆమెకు వేరే యువకుడితో పరిచయముంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్ళి చేసుకుందామె. అయినా పాతప్రియుణ్ణి మరిచిపోలేకుండా వుంది. పాతప్రియుడి జాడ లేదు. అతడు చివరిసారిగా వ్రాసిన ఉత్తరాన్నామె భద్రంగా దాచుకుంది. చనిపోయేటప్పుడా ఉత్తరమామె జాకెట్లో దాచుకుంది. భర్తతో కాపురం చేయలేక యుడిపై మమతను చంపుకోలేక-ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది-" అన్నాడు గోవర్ధన్.

 Previous Page Next Page