సీత ఆలోచిస్తున్నది. సీత ఆలోచిస్తున్నదని తెలియని రావుగారు మెత్త మెత్తగ చివాట్లు పెడుతున్నారు.
"చాల్లెండి మీ వుపన్యాసం. అది వాళ్ళాయన గురించి ఆలోచిస్తున్నది." నవ్వుతూ అంది సక్కుబాయమ్మ.
"మనూ! ఆలోచిస్తున్నావా?" రావుగారు అడిగారు.
"అవును నాన్నగారూ! మా వూరికి ఇప్పుడే ప్రయాణమై వెళదామా! సాయంత్రం వెళదామా అని ఆలోచిస్తున్నాను" సీత సిగ్గుపడుతూ చెప్పింది.
"అదేమిటే సీతా! నీవు వచ్చి రెండు గంటలు కాలేదు అప్పుడే ప్రయాణమా! అదేం కుదరదు నాలుగురోజులు విశ్రాంతి తీసుకుని వెళ్లాల్సిందే" అంది సక్కుబాయమ్మ.
"చూడండి నాన్నగారూ! మీరెలా చెపితే అలా." అంది సీత.
"మనూ! నీవు నీ సొంత నిర్ణయంమీద బయలుదేరి వచ్చావు. ఎప్పుడు వెళ్ళాలన్నది కూడా నీవే నిర్ణయించుకోటం మంచిది" రావుగారు గంభిర్యంగ అన్నారు.
"సాయంత్రం కాఫీ తాగి వెళతాను" సీత చెప్పింది.
"మంచిది" అన్నారు రావుగారు.
"లేడికి లేచిందే పరుగు" గొణిగింది సక్కుబాయమ్మ.
36
సీత రైలు దిగింది.
సీత స్టేషన్ బయటికి రాబోతుంటే రామకృష్ణ స్టేషను లోపలికి రాబోతున్నాడు. ఎదురెదురు పడ్డారు.
"సీతూ!" అన్నాడు రామకృష్ణ ఆశ్చర్యంగ.
"ఏమండీ!" అంది సీత అంతకన్నా ఆశ్చర్యంగ.
"ఊరినుంచా!" అడిగాడు రామకృష్ణ.
"ఊరికా?" అడిగింది సీత.
"నీ కోసం బయలుదేరాను." అన్నాడు రామకృష్ణ.
"మీకోసం వచ్చాను" అంది సీత.
సీత నవ్వింది. రామకృష్ణ నవ్వాడు. ఆ తర్వాత ఆటో ఎక్కేసి ఇరువురు యింటికి వచ్చారు.
ఆ రాత్రి.
"మిమ్మల్ని క్షమించమని అడిగితే బాగుంటుందేమో?" సీత అడిగింది.
"వద్దు లేద్దూ మరీ సిల్లీగ వుంటుంది" అన్నాడు రామకృష్ణ.
సీత నవ్వింది.
రామకృష్ణ నవ్వాడు.
ఆ తర్వాత
తను ఈ యింటికి గడప దాటిన దగ్గరనుంచి మళ్ళి ఈ రోజు ఈ గుమ్మంలో అడుగుపెట్టిందాకా ఏ నిమిషాన ఏమీ జరిగింది సీత వివరంగ రామక్రిష్ణకి చెప్పింది చెప్పి.....
"నేను జోగారావుకి చిత్రకి యింకా పెద్ద శిక్ష వేద్దామనుకున్నాను. నాకు చాతనైనది చేశాను. అలా కాదు వాళ్ళకి యింకా పెద్ద శిక్ష పడాలి. ఏం చేద్దాం చెప్పండి" అంది సీత.
"ఇలాంటి విషయాలు రేపు చర్చించుకుందాము. ఈ కేసు రేపటికి వాయిదా వేశాను" రామకృష్ణ అన్నాడు.
"భగవంతుడన్నవాడు వున్నాడు కాబట్టే సోమసుందరంగారు ఊరికి బయలుదేరటము నేను వెంటనే ఇంటికి తిరిగి రావటం వల్ల. రెండు ముఖాల మనిషిని చూడటం జరిగింది. నిజంగ యిది భగవంతుడి.......
సీత యింకా ఏదో చెప్పబోయింది. "ఇదియును దైవ నిర్ణయము. మనము నిమిత్త మాతృలము. ఈ విషయముపై రేపు సావధానముగా చర్చించుకుందాము" అన్నాడు రామకృష్ణ.
"ఆన్నియు రేపు రేపు అని వాయిదా వేస్తారేమిటి? ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి?" సీత చిరుకోపంతో అడిగింది.
"ప్రతిదానికి సమయా సమయములు తగిన సమయములలో వుంటాయి. ఏవి ఎప్పుడో అప్పుడే చూడాలి. ఇప్పుడు మనం చేయవలసింది ప్రయోగము."