Previous Page Next Page 
హిమసుందరి పేజి 86

    సీత ఆటో చేసుకుని స్టేషనుకి వచ్చింది.

    సీత అదృష్టం మూడు గంటలు ఆలశ్యంగ  వచ్చిన ఓ ట్రైన్ రెడీగ స్టేషనులో వుంది.

    మరో పది నిమిషాల తర్వాత.

    సీత ఎక్కిన ట్రైను బరువుగ భారంగ ముందుకు సాగింది.

   
                                        35


    ఆ ఉదయం.

    సీత క్షేమంగ యింటికి వచ్చింది.

    నిజం చెప్పి తల్లీ తండ్రిని బాధ పెట్టటం యిష్టం లేక తన ప్రయాణం బాగా జరిగిందని ఏవేవో చెప్పింది సీత.

    కుశల ప్రశ్నలు ప్రయాణం విషయం అడిగారు గాని రామకృష్ణ గురించి కబురు గాని లెటర్ విషయం గాని ఏది సీతతో మాట్లాడలేదు. చివరికి వుండబట్టలేక సీతే అడిగింది. "వారేం లెటరు రాయలేదా?" అని.

    "రాయలేదు మనూ! అదే నేనూ చూస్తున్నాను!" అన్నారు రావుగారు.

    రామకృష్ణ లెటర్ రాయకపోటం సీతకి పిచ్చి పట్టినట్లు అయింది. భోజనం అయిందాకా మామూలుగ వున్న సీత మధ్యాహ్నం తనగదిలో పడుకుని తనివితీర ఏడవటం మొదలుపెట్టింది.

    తను బాధ పడుతున్నట్లు గాని ఏడుస్తున్నట్లు గాని తల్లీ తండ్రికి తెలియకూడదని దిండులో ముఖం నొక్కుకుని కన్నీరు కారుస్తున్నది సీత.

    సక్కుబాయమ్మ నెమ్మదిగ గదిలోకి వచ్చి సీత పక్కనే కూర్చుని తలమీద చేయివేసింది. సీత చటుక్కున తల్లి వడిలో తల దూర్చుకుని చిన్నపిల్లలా బేర్ మంది.

    సక్కుబాయమ్మ మౌనంగ తల నిమరటం తప్ప మాట్లాడలేదు.

    "ఏం జరిగిందో తెలుసా అమ్మా!" వెక్కుతూ అడిగింది సీత.

    "మా కంతా తెలుసు మనూ!" ఈ మాట అన్నది సక్కుబాయమ్మ కాదు రావుగారు.

    సీత చివ్వున తలపైకి ఎత్తింది. "నాన్నగారూ!" అంది.

    "మనూ! లేచి సరీగ కూర్చో. కళ్ళు తుడుచుకో, నే చెప్పేది జాగ్రత్తగ విను" రావుగారు గంభిర్యంగ ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో అన్నారు.

    సీత లేచి సరీగ కూర్చుంది.

    "మనూ! నీవు వచ్చిన మూడోరోజు రామకృష్ణ నుంచి నాకు వివరంగ లెటర్ వచ్చింది. అక్కడేం జరిగిందో ప్రతిమాట రాశాడు. సీత అమాయకురాలు సీత యింకా చిన్నపిల్ల. సీతనేమి అడగవద్దు అనొద్దు. కోపం చల్లారిం తరువాత సీత మళ్ళి నా దగ్గరకు వస్తుంది. ఓ వేళ రాకపోతే ఓ నెల ఆగి నేనే అక్కడికి వస్తాను. అంటూ రామకృష్ణ రాశాడు.

    రామకృష్ణ మంచివాడు కాబట్టి నీ మనసు నొచ్చుకోకుండా వుండటానికి జరిగింది దాయటానికి ప్రయత్నించాడు. అది తప్పు అయిందా మనూ! నా ఇష్టం నా సంపాదన నేను మగవాడిని తాగుతాను తందనాలాడుతాను. నీ యిష్టమైతే వుండు పోతే ఫో అంటే ఏం చేయగలవు?"

    అవును. తను చేయగలదు? పుట్టింటికి రాగలదు. చావగలదు. లేకపోతే ధైర్యంగ ఏ ఉద్యోగమో చేసుకుంటూ బతకగలదు. ఈ సమాజంలో వెంకట్రావులు దశరధరామయ్యలు, పుల్లారావులు, జోగారావులు. ఎన్ని నర పశువులు. వాళ్ళందరి మధ్య రామకృష్ణ ఎంత మంచివాడు. అలాంటి భర్తని తను......

 Previous Page Next Page