Previous Page
హిమసుందరి పేజి 88

    "ప్రయోగమా?"

    "ఎస్, అనుమానాలు అపార్దాలతో విడిపోయి. ఆ తర్వాత నిజం తెలుసుకుని భార్యాభర్తలు కల్సుకుంటే ఆ కలయికలోని మధురిమ మాటలతో వర్ణింపజాలము. ఆ అనుభూతి మధురిమ ఏ జంట కా జంట తెలుసుకోవాల్సిందేనని ఓ నవలలో ఓ రచయిత్రి రాస్తే ఓ నాడు మనం చదివి అదెట్లా వుంటుందో చూద్దామనుకున్నాము కదా! అనుమానం అపార్ధం విడిపోవటం కల్సుకోటం అయింది. ఇహ ప్రయోగములోకి ప్రవేశించి చూడనా హిమసుందరీ!" రామకృష్ణ తొందర పడిపోతూ అడిగాడు.

    "హిమసుందరా! ఆవిడేవరు?" సీత అడిగింది.

    "నువ్వే."

    "నా పేరు సీతామనోహరి కదా!"

    "అవుననుకో, నిన్ను చూస్తుంటే అలా పిలవబుద్ది వేసింది పిలిచాను. హిమము అన్నా హిమ, అన్నా మంచు కదా! మంచు చల్లగా వుంటుంది కదా! ప్రస్తుతం అమ్మాయిగారు చల్లబడి తిరిగి వచ్చారు కదా! అందుకని హిమ అన్నాను. అందంగ కనిపించేసరికి సుందరి అన్నాను. వెరసి హిమసుందరీ! అన్నాను తప్పా?"

    "తప్పో వప్పో నన్ను కాస్త ఆలోచించనీయండి" అంది సీత.

    "ఆలోచిస్తూ కూర్చుంటే అవతల తెల్లారిపోతుంది." అన్నాడు రామకృష్ణ.

    సీత ఏదో మాట్లాడబోయింది.

    రామకృష్ణ మాట్లాడనివ్వలేదు.

    అంతే.


                                            ___:సమాప్తం:___

          
                              ENDING COVER PAGE

                                        హిమసుందరి 

                                  కురుమద్దాలి విజయలక్ష్మి

    ఏ రచననైనా తేలికగా రాయొచ్చుగాని, క్రైం రచన చేయటం మహాకష్టం. పదినెలలు మోసి పండంటి బిడ్డను కనడం తేలిక. పసిపిల్లలను సాకటం తేలిక ఏటికి ఎదురీదటం మహాతేలిక. అజ్ఞాతవాసంలో ఉన్న హంతకున్ని పట్టుకోవటం తేలికే కాని ఒక క్రైం రచన చేయటం మటుకు చాలా కష్టం.

    ఓ పెద్ద రచయిత్రి వ్రాసిన నాలుగొందల పేజీల పెద్ద నవల చదివిన సీత రచయిత్రిని కావాలనుకోవడం, అనుకోవటమే తడవుగా ఓ పెన్ నేమ్ ఆలోచించటం "అగ్నిపుత్రి అంటే సీత-సీత అంటే తనే! ఎంత మంచి పెన్ నేమ్ దొరికింది!.

    సీతకి చాలా సంతోషం కలిగించి ఆ సంతోష సమయంలో చదివిన క్రైం సాహిత్యాన్ని ప్రక్కకునెట్టి సాంఘికం వ్రాయటానికి ఆయిత్తమైంది.

    నవల చదవటం వేరు వ్రాయటం వేరు, వ్రాసే విధానం ఎదుర్కొనే పాత్రల చిత్రణకు ప్రతిరూపము కురుమద్దాలి విజయలక్ష్మిగారి నవలలు.

 Previous Page