Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 7


    ముత్యాల్రావు కాస్త సిగ్గుపడ్డాడు. వేదవతి తననుకున్నంత సామాన్యురాలు కాదనీ ఆమె తననుకున్నంత సులభంగా శీలాన్ని నిర్లక్ష్యం చేయదనీ అతడు గ్రహించాడు. తనామెను మోసం చేయాలని అనుకుంటే ఆమె తన స్వార్ధాన్ని బయటపెట్టే పథకం వేసింది.
    ఆ రోజు తనకేమయింది? తన్ను తాను అర్పించు కొనడానికి సిద్దపడిన వేదవతి అక్కడ నిర్జీవంగా పడివుంటే ఆమె గురించి ఆలోచించకుండా, వ్యధపడకుండా అక్కణ్ణించి పారిపోయి ఆమె దృష్టిలో చులకన అయిపోయాడు.
    "ఆ రోజు నా ప్రవర్తన విషయమై చాలా సిగ్గు పడుతున్నాను వేదా! ఏమిటో ఆ క్షణంలో అంతులేని భయం నన్నావహించింది...." అన్నాడు ముత్యాల్రావు.
    "ఆ రోజు సంగతి సరే....ఆ తర్వాత మాత్రం నువ్వేం చేశావు? క్షణం కూడా నా గురించి దిగులుపడలేదు. పైగా నా చావుని ఉపయోగించుకుని మోహన్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నావు! డబ్బు సంపాదించాలనుకున్నావు..."
    "నువ్వు పొరపాటు పడుతున్నావు..." అన్నాడు ముత్యాల్రావు తడబడుతూ.
    "ఇన్నాళ్ళూ నేను మోహన్ ఇంట్లోనే ఉన్నాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాటా అక్షరం పొల్లుపోకుండా విన్నాను. నువ్వు చాలా సామాన్యుడివి. మోహన్ ఇలాంటి విషయాల్లో అఖండుడు. ఉత్తరం రాగానే అది నీ నుంచేనని గ్రహించాడు. వెంటనే అక్కడ డబ్బు పాతిపెట్టించాడు. ఆ తర్వాత నీకూ ఉత్తరం వచ్చిందంటూ తనవద్దకు రాగానే నీ పథకం సులభంగా తెలుసుకోగలిగాడు. నువ్వు చాలా చచ్చుపథకంవేశావు. మోహన్ లాంటి వాళ్ళతో నువ్వలాంటి పథకాలు వేయకూడదు. నా గురించి కానీ లేకపోతే అతడు నిన్ను పులుసులోకి ఎముకల్లేకుండా తన్నించేవాడు.
    ఈ రోజు నేను నిన్ను కలుసుకుని మాట్లాడుతానంటే మీ అమ్మకు త్వరగా నిద్ర వచ్చే ఏర్పాటు చేశాడు. భోజనానికి ముందు ఆమె వేసుకునే మాత్రల సీసాలో నిద్రమాత్రలు మార్చాడు. రెండు మాత్రలూ ఒకే రకంగా ఉండడంవల్ల ఆమెకు తేడా తెలిసి ఉండదు" అంటూ ఆమె అతడి చేతికి ఓ పొట్లం అందించి-"ఆ మాత్రల సీసాలో నిద్రమాత్రలు తీసేసి మళ్ళీ ఇది పోసేయ్..." అంది.
    ముత్యాల్రావు ఆశ్చర్యంగా ఆమె చెప్పేది వింటున్నాడు. మాట్లాడుదామంటే అతడికి నోట మాట రావడం లేదు.
    "మోహన్ గురించి విన్నావు కదా....అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను లేనిదే బ్రతకలేనంటున్నాడు.." అంది వేదవతి మళ్ళీ.
    "ఇదంతా నాకెందుకు చెబుతున్నావ్?" అన్నాడు ముత్యాల్రావు.
    "ఎందుకో ఊహించుకో!" అంది వేదవతి.
    "ఏమో- నాకు తెలియదు...." అన్నాడు ముత్యాల్రావు.
    వేదవతి కిలకిలా నవ్వింది-"సాయంత్రం కూడా నువ్విలాగే ముఖం పెట్టావు మోహన్ ఇంట్లో అప్పుడూ నాకు చాలా నవ్వొచ్చింది. అసలు నువ్వేమీ ఊహించలేవు..." అంది.
    "అక్కడ మోహన్ ఏం చేశాడో నేనూహించాను" అంటూ వాసు తనకు చెప్పింది అతడామెకు చెప్పాడు.
    "చాలా గొప్ప విశేషం అనుకున్నావు. తెలివైన వాడివే...అది సరే....మరి మోహన్ అలాంటి నాటకమెందుకాడాడో ఊహించగలిగేవా?"
    "లేదు...."
    "వేదవతి చచ్చిపోయిందన్న భావం అతడు నీలో ప్రవేశ పెట్ట్దదల్చుకున్నాడు..."
    "అందుకు నువ్వు అతడికి సహకరిస్తున్నావు...." అన్నాడు ముత్యాల్రావు కోపంగా.
    "కానీ నాకంటే ఎక్కువగా నువ్వే అతడికి సహకారిస్తున్నావు..." అంది వేదవతి.
    "అంటే?"
    "నేను నీ గొప్పతనం గురించి మోహన్ కు ఋజువు చేయాలనుకుంటూంటే నువ్వు నాకు కాక మోహన్ కే సహకరిస్తున్నావు...."
    "నేను నీ కెందుకు సహకరించాలి?" అన్నాడు ముత్యాల్రావు.
    "ఎందుకా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి" అంది వేదవతి.
    "ఇంకానా?" అన్నాడు ముత్యాల్రావు అప్రయత్నంగా.
    వేదవతి-నవ్వి-"ఇంకానా అనేశావు అనుకోకుండా! అంటే నువ్వు నా ప్రేమకు అర్హుడివి కాదని నీ మనసు నీకు చెబుతుంది. కానీ ముత్యం....ఈ ప్రపంచంలో మగాడు ఆడదాన్ని అర్ధం చేసుకోవడమన్నది యుగాంతానికి కూడా జరుగదు. నువ్వు గొప్పవాడివని నేను నిన్ను ప్రేమించడం లేదు. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు నాకు గొప్పవాడివి. ఆ విషయం నీకూ అర్ధంకాదు. మోహన్ కూ అర్ధంకాదు. అందుకే తన గొప్పతనం ఋజువు చేసుకోవాలని అతడు ప్రయత్నిస్తున్నాడు. నువ్వు తక్కువేమోనని నువ్వనుకుంటున్నావు. మోహన్ ఈ ప్రపంచానికే ఏలిక అయినప్పటికీ నేనతన్ని పెళ్ళి చేసుకోలేను. ప్రేమించలేను. నువ్వింకా ఘోరంగా ప్రవర్తించినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అది నా బలహీనత..." అంది.
    ముత్యాల్రావు ఆలోచిస్తున్నాడు. తన తప్పుల్ని కూడా మన్నించి ఆమె తనను ప్రేమిస్తున్నది. అలాంటి వనిత తనకు భార్య అయితే జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. ఆమెను తను వదులుకోరాదు. కానీ....
    "మోహన్ నా గురించి సవాలుచేస్తే నువ్వతనికే సహకరించి నన్నో వెర్రి వెధవను చేసి ఆడించావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు ఎలా నమ్మేది?" అన్నాడు ముత్యాల్రావు.
    "నేను మోహన్ కు సహకరించడానికి బలమైన కారణముంది. నేను నీకు మోహన్ శక్తిసామర్ద్యాలు ఋజువు చేయదల్చాను. అలాంటి మోహన్ ని కాదని నిన్ను చేసుకోబోతున్నానన్న విషయం నీకు స్పష్టంగా చేసి నా ప్రేమ బలాన్ని నిరూపించుకోవాలని తాపత్రయ పడ్డాను. అందుకే అతడికి సహకరించాను...." అంది వేదవతి.
    ముత్యాల్రావు ఆమె ముఖం వంక చూశాడు. ఆమె కళ్ళలో నిజాయితీ కనబడుతోంది. అప్పుడతడు నెమ్మదిగా "నీ ప్రేమ బలాన్ని నువ్వు నిరూపించుకున్నావు. కానీ నా ప్రేమ బలాన్ని నేనూ నిరూపించుకుంటే తప్పు నాకు తృప్తిగా ఉండదు. అందుకు నువ్వే నాకో అవకాశమివ్వాలి...." అన్నాడు.
    "ఏమిటది?"
    "సాధారణంగా పురుషుడు ఏం చేస్తాడు? ఆడదాన్ని అనుభవించేక-నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంటాడు. లేదా నువ్విలా ఎందరితో తిరిగావో అంటాడు. నువ్వు నాకు అలా అనే అవకాశం ఒకటివ్వు. అప్పుడు నేను నిన్ను భార్యగా స్వీకరించి నా ప్రేమ బలాన్ని ఋజువు చేసుకుంటాను...."
    కధ మళ్ళీ మొదటికి వచ్చింది. అతడామెతో పెళ్ళికి ముందే అనుభవాన్ని కోరుతున్నాడు. దానికి పేమ బలాన్ని పరీక్షించుకోవడం అనే ముసుగు వేస్తున్నాడు. వేదవతి అదే అతడికి చెప్పి-"పరీక్ష పేరుతో మరోసారి నీ స్వార్ధాన్ని బయటపెట్టావు. అయినప్పటికీ నీకు సహకరించి నా ప్రేమ బలాన్ని ఋజువు చేసుకుంటాను...." అంది.
    ముత్యాల్రావు వళ్ళు పులకరించింది-"ఇప్పుడే?" అన్నాడు ఉత్సాహంగా.
    "ఇప్పుడూ కాదు, ఇక్కడా కాదు..." అంది వేదవతి.
    "మరి?"
    "నాకు కొన్ని ఆదర్శాలున్నాయి. ఆశయాలున్నాయి. పెళ్ళికి ముందు మగవాడికి శరీరం అర్పించడం నాకిష్టం లేదు. అందుకని ఓ పని చేయి. ఓ తాళిబొట్టు కొని తీసుకుని రా! నా ఇంట్లో నేను పెళ్ళి మంత్రాల టేపు సిద్దంగా ఉంచుతాను. ఏకాంతంలో మనిద్దరం ఉండగా ఆ మంత్రాలు వస్తూండగా నా మెడలో తాళిబొట్టు కట్టు. మన పెళ్ళి జరిగిపోయిందన్న తృప్తి నాకు ఉంటుంది. రహస్యం ఎవరికీ తెలియదు కాబట్టి-నన్ను అవుననడానికీ కాదనడానికీ నీకు అవకాశమూ ఉంటుంది. అప్పుడు నువ్వు నీ ప్రేమ బలాన్ని ఋజువు చేసుకొనవచ్చును...." అంది వేదవతి.

 Previous Page Next Page