Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 8

 

    వశీకరణ మూలిక గురించి తెలియని మోహనుడందుకు ఎంతో కలవరపడినప్పటికీ భగవంతుడు చంద్రికను ఏదో విధంగానే తనదాన్ని చేసినందుకు సంతోషించాడు.
    రాజకుమారుడికి కొలను దగ్గర ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తను బుద్ది మార్చుకోకపోతే విచిత్రమైన అనుభవాలు జరుగుతాయని అన్నాడు. అయితే ఇది శుచీంద్రుని ప్రభావమా? తను వశీకరణ మూలికతో చంద్రికను వశపరచుకొన్నాడు. ఐతే ఆ అనందం ఎంతో సేపు దక్కలేదు. తనకిప్పుడు మోహనుడి రూపు వచ్చేసింది. చంద్రిక మళ్ళీ మోహనుడి దగ్గరకే వెళ్ళిపోయింది.
    రాజకుమారుడి కి చంద్రికంటే పిచ్చి మోహంగా వుంది. ఆమె అందంగా దూరమై పోతున్న కొద్ది అతడిలో పట్టుదల పెరుగుతోంది.
    వశీకరణ మూలిక ప్రభావం వారం రోజులు మాత్రమే వుంటుంది. ఆ తర్వాత చంద్రిక రాజకుమారుడి రూపాన్ని ప్రేమించదు. అప్పుడామే తిరిగి మోహనుడిని ప్రేమిస్తుంది.
    ఇదీ ఒకందుకు మంచిదే! తమకీ రూపాలు శాశ్వరంగా వుండిపోతే తనకు రాజ్యం పోవచ్చు, సంపదలు పోవచ్చు కానీ చంద్రిక శాశ్వతంగా దక్కుతుంది.
    మోహం నాశన హేతువు. మోహిని మీద మోహంతో దానవులు అమృతం కోల్పోయారు. భస్మాసురుడు తన్ను తాను కాల్చుకున్నాడు. సీత పట్ల మోహంతో రావణుడు తనూ, తన సామ్రాజ్యంతో సహా నాశానమైపోయాడు.
    ఇప్పుడు రాజకుమారుడు మోహంలో పడ్డాడు. అతడికి చంద్రిక తప్ప మరే ఆలోచన లేదు. అందుకోసం ఏం చేయడాని కైనా పోగొట్టుకోడాని కైనా సిద్దపడుతున్నాడు.
    అంతా కలిసి మళ్ళీ ప్రయాణమయ్యారు. రాజకుమారుడు గుర్రం ఎక్కబోతే అతన్ని పడగోట్టేసింది. మోహనుడు దాన్ని సమీపిస్తే ఎంతో మచ్చిక ఉన్నదానిలా ప్రవర్తించింది. ఆ కారణంగా చాలా దూరం మోహనుడు, చంద్రిక కలిసి గుర్రం మీద ప్రయాణించారు. రాజకుమారుడు వారితో పాటే నడిచి వచ్చాడు. అతడు దగ్గర అడుగు పెడితే చాలు- గుర్రం తన్నడానికి సిద్దమయ్యేది.
    మోహనుడు గుర్రాన్ని నెమ్మదిగా పోనిచ్చేవాడు- రాజకుమారుడు తమతో నడిచేందుకు వీలుగా. అయితే గుర్రం అప్పుడప్పుడు దానంతటదే పరుగెడుతుండేది. చంద్రికను వదిలి ఉండడం ఇష్టం లేని రాజకుమారుడు వగరుస్తూ గుర్రంతో పాటు పరుగులెత్తేవాడు. ఆ విధంగా గుర్ర మతన్ని చాలా ఏడిపించింది. అయితే అది మోహనుడు కావాలని చేస్తున్న అగడంలా రాజకుమారుడు భావించాడు. చంద్రికపై మోజుతో ఆ అవమానాన్ని మౌనంగా భరించాడు.
    ఇలా వారం రోజులు గడిచాక మోహనుడింకో విచిత్రం గమనించాడు. ఇప్పుడు రాజకుమారుడు ఇదివరకటి రాజకుమారుడిలాగే కనబడుతున్నాడు. మోహనుడికి కూడా యధారూపు వచ్చేసింది.
    ఈ రూపాల మార్పు చంద్రికలో ఎంత మార్పు తీసుకొస్తుందోనని భయంతో మోహనుడు - ఆశతో రాజకుమారుడు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రిక పై వశీకరణ మూలిక ప్రభావం పోయింది. ఆమె మోహనుడిని ప్రియా అనటం మానేసి భర్తగా గౌరవిస్తుంది. మూలికా ప్రభావం ఉన్నప్పటి ఆమె ప్రవర్తన గురించి ఆమెకు గుర్తున్నట్లు లేదు.
    మూలికా ప్రభావం అయిపోగానే తమ రూపం యధాప్రకారంగా మారిపోగానే ఇదంతా శుచీంద్రుని ప్రభావమేననీ రాజకుమారుడు గ్రహించాడు. చంద్రిక ఎప్పటికీ తన వశం కాదని అతను హతాశుడయ్యాడు. ఆమె పై ఆశలు వదిలిపెట్టి ఇంకా తన రాజ్యానికి పోవటం మంచిదని కూడా అతననుకున్నాడు. అయితే ఇక్కడ కూడా రాజకుమారుడు దురదృష్టమే ఎదురైంది. చిన్నతనం నుండి అతని చేత మచ్చిక చేయబడిన గుర్రం ఇప్పటికీ అతనిని గుర్తించక కనిపిస్తే చాలు తన్నుతుంది. అది మోహనుడీకే మచ్చికగా ఉంటుంది.
    ఇలా మరి వారం రోజులు ప్రయాణం చేశాక వారు అజగర పర్వతం చేరుకున్నారు. అంతవరకూ వచ్చేక రాజకుమారుడు  - "మిత్రమా! నీ భార్యను నేను వశం చేసుకోవాలని విఫలుడనయ్యాను. పైగా నా ఆశ్వమే నీకు వశమైంది. నేనింక నీ దగ్గిర శెలవు పుచ్చుకుంటాను. నువ్వు తలపెట్టిన కార్యం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను...." అని మోహనుడితో చెప్పి వెళ్ళిపోయాడు.

                                      6
    అజగర పర్వతం చాలా ఎత్తుండి. దానిపై దట్టమైన అడవులున్నాయి. గొప్ప జలపాతాలు ఉన్నాయి. ఆ పర్వతంలో బుడత మాంత్రికుడి కోసం ఎక్కడెక్కడ వెతకాలో అర్ధం కాలేదు. మోహనుడు బుడతడినే సలహా అడిగాడు.
    "నేనూ అదే ఆలోచిస్తున్నాను. నా ప్రియురాలు రాజకుమారి రెండేళ్ళుగా అంటే నీ లెక్కలో ఇరవై ఏళ్ళుగా మాంత్రికుడి అధీనంలో ఉన్నది. వాడికి లొంగకుండా ఏదైనా ఉపాయం పన్ని ఉండాలి. అదే విధంగా నాకు తన ఉనికి తెలిసే ఉపాయం కూడా వుండాలి" అన్నాడు బుడతడు.
    "అదేమిటై వుంటుంది ?" అన్నాడు మోహనుడు.
    బుడతడు ఉన్నట్లుండి గట్టిగా ఊదాడు. అలా ఉదగానే మొత్తం అరణ్యంలోని చెట్లన్నీ ఊగి శబ్దమయ్యింది. అది వినలేక మోహనుడు, చంద్రిక గట్టిగా చెవులు మూసుకున్నారు.
    "నువ్వేమిటి చేశావు ?" అన్నాడు మోహనుడు.
    "ఇది మా దేశంలో ప్రేమికుల కొకరికరి సంకేతాలు పంపుకునే పద్దతి. రాజకుమారికి పంపుకుంటున్న తొలి ప్రేమ సందేశమిది అన్నాడు బుడతడు. ఇప్పుడు బుడతడి కళ్ళు మెరుస్తున్నాయి. ఉత్సాహంగా చెవులు రిక్కించి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు.
    ఇంతలో వాళ్ళకు ఏదో పిడుగు పడ్డ శబ్దం వినపడింది. అప్రయత్నంగా మోహనుడు, చంద్రిక చెవులు మూసుకుంటే , బుడతడు మాత్రం నేలమీద నిలబడి గంతులు వేయసాగాడు.
    "ఏమయింది బుడతా?" అడిగాడు మోహనుడు బుడతడిని దగ్గరగా తీసుకుంటూ.
    "నా ప్రియురాలు ప్రేమ సందేశం పంపింది . ఆమె క్షేమంగా వుంది. ఆమెకు నాపై ప్రేమ వుంది. నాకోసం ఎదురు చూస్తోంది...." అన్నాడు బుడతడు.
    "మీ ప్రేమ సందేశాలు మాంత్రికుడు కూడా వినే వుంటాడు " అన్నాడు మోహనుడు.
    "ఆ దుర్మార్గుడికి ప్రేమ సందేశాలు కూడా తెలుస్తాయా?" అన్నాడు బుడతడు పళ్ళు పటాపట కొరుకుతూ.
    "అయితే మనమిప్పుడు ఎలా వెళ్ళాలి ?"  అని అడిగాడు మోహన్.
    ముగ్గురూ పర్వతం ఎక్కసాగారు. కొంత దూరం వెళ్ళేసరికి వారికీ ఓ పెద్ద శిల అడ్డొచ్చింది.
    "శిల అడ్డొచ్చింది. చుట్టూ తిరిగి వెళదాం అన్నాడు మోహనుడు. అయితే బుడతడందుకు అంగీకరించలేదు. వాడు నేలమీదకు దిగి కొన్ని క్షణాల్లో ఆ శిల నుంచి దారి చేశాడు. తను ముందుగా నడుస్తానని వారిని తనను అనుసరించమనీ చెప్పాడు బుడతడు. వారలాగే చేశారు.
    బండరాయి దాటి కొంచెం ముందుకు వెళ్ళారు. బుడతడు ఆగిపోయాడు. మోహనుడు వంగి వాడిని చేతుల్లోకి తీసుకుని ఏమయింది ?" అని అడిగాడు.
    "నీళ్ళు....నీళ్ళు .... జల ప్రవాహం " అన్నాడు.
    పరీక్షించి చూడగా వారికీ అడ్డంగా చీమల బారంతటి వెడల్పున సన్నని జలధార ప్రవహిస్తోంది. పరీక్షింఛి చూస్తె తప్ప అక్కడ జలధార వున్నదన్న విషయం తెలుసుకోవడం సాధ్యపడదు. మనిషి చేయలేని పనిని అవలీలగా క్షణ కాలంలో పూర్తీ చేయగల బుడతడు - ఈ జల ధారకే భయపడటం ఆశ్చర్యమే! కానీ ఈ సృష్టీ లోని అనేక వింతల్లో అదీ ఒక వింత.
    మోహనుడు నవ్వుకొని ముందుకు కొనసాగాడు. ఎపప్తికప్పుడు విశేషాలన్నీ చంద్రికకు చెపుతూనే వున్నాడు. కొంతదూరం వెళ్ళాక పెద్దగా అరిచాడు . "అదే మాంత్రికుడి భవనం !"
    మోహనుడు చుట్టూ చూశాడు. ఎక్కడా అతనికి భవనం వంటిదే కనబడలేదు.
    "అక్కడ ఆ చెట్ల మధ్యన చూడు !' అన్నాడు బుడతడు.
    అప్పుడు గుర్తించాడు మోహనుడు. రెండు చెట్ల మధ్యన ఒక చిన్న భవనం ఉంది. ఆ భవనం ఎత్తు మోహనుడి మోకాలు దాటి వేళ్ళదేమో! అయితేనేం అది ఎంతో అందంగా వున్నది. మహారాజులు గొప్ప భవనములు నిర్మించాలని సంకల్పించినప్పుడు ముందుగా శిల్పులు 'మాదిరి భవనాలు' తయారు చేసి చూపిస్తారు. అటువంటి మాదిరి భవనం వలె వున్నది.
    బుడతడు మోహనుడి చేతిని వంచి ఉరికాడు. చకచకా భవనంలో ప్రవేశించాడు. భవనంలో ఒక మూల గదిలో రాజకుమార్తెను వాడు చూశాడు. ఆమె మాసిన బట్టలు కట్టుకుని వున్నది. కళ్ళలో దిగులు, మనసులో ఆలోచనలో వున్నది. వీర బుడతడు ఆమెని సమీపించి - "రాజకుమారి క్షేమమా?" అన్నాడు.
    రాజకుమార్తె ఉలిక్కిపడి వీరబుడతడిని చూసి "నువ్వా - వీరబుడతా కొద్ది సేపటి క్రితం నీ ప్రేమ సంకేతం విని నా ఆనందానికి అవధులు లేకపోయాయి. అయితే అదేదోలె కానీ నిజమముండదనిపించింది. నిన్ను చూస్తున్నా నాకింకా నమ్మకం కలగడం లేదు. ఈ జన్మకు నిన్ను చూడ్డం సాధ్యపడుతుందనుకోలేదు." అంది . ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. గొంతు పుడుకుపోయి , తర్వాత కాసేపు మాట రాలేదామెకు.
    "మాంత్రికుడెక్కడ ?" అనడిగాడు బుడతడు.
    మాంత్రికుడి పేరు వింటూనే రాజకుమారి వణికిపోయింది. అంతకాలం వాడు పెట్టిన బాధలన్నీ ఆమెకు గుర్తొచ్చాయి.

 Previous Page Next Page