Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 9

 

    మాంత్రికుడు ప్రతిరోజూ వచ్చి ఆమెను వివాహం చేసుకోమని వేధిస్తున్నాడు. ఆమె కాదంటుంటే రకరకాలుగా బెదిరిస్తున్నాడు. కొంతకాలం ఆమె చుట్టూ భూత ప్రేత పిశాచాలు నృత్యం చేసేలా చేశాడు. కొంతకాలం భయపడినా రాజకుమారి క్రమంగా వాటిని చూడ్డానికి, ఆ శబ్దాలు వినటానికి అలవాటు పడింది. ఆ తర్వాత మాంత్రికుడామెను కొరడాలతో కొట్టి హింసించాడు. కొంతకాలం తిండీ తిప్పలూ లేకుండా చేశాడు. అయితే ఆమె చావటం వాడికి ఇష్టం లేదు. అందువల్ల మళ్ళీ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తున్నాడు. వాడిప్పుడు ప్రక్క గదిలో పడుకుని నిద్రపోతున్నాడు.
    'అయితే వాడిపని పడదాం --- ముందు నువ్వు బయటకు పద ! అన్నాడు బుడతడు.
    "నువ్వున్నావు కాబట్టి బయటకు రావటానికి ఇప్పుడు నాకేం భయం లేదు. భవనం దాటి బయటకు వెళితే ఈ మనుషుల రాజ్యంలో నేనేమై పోతానని భయపడుతున్నాను " అంటూ అతనిని అనుసరించింది రాజకుమారి.
    బుడతడు, బుడత రాజకుమారీ చెట్టా పట్టాలు వేసుకుని బయటకు వచ్చి మోహనుడు, చంద్రికలను కలిసారు. ఈ జంటను ముచ్చటగా చూశారు ఆ దంపతులు. వారిద్దరినీ అరిచేతుల్లో వుంచుకుని , "చూడ ముచ్చటైనది మీ జంట!" అన్నాడు మోహనుడు.
    "వీళ్ళు కలకాలం మనతో వుండిపోతే బాగుండును. చక్కగా బొమ్మల్లా ఉన్నారు " అంది చంద్రిక.
    బుడతడు మోహనుడితో - " చంద్రికను సిద్దంగా వుండమను. నేను వెళ్ళి మాంత్రికుడిని బయటకు తీసుకొస్తాను. బయటికి రాగానే ఆమె వాడిని తాకితే చాలు - వాడే చచ్చిపోతాడు " అన్నాడు. మోహనుడు బుడతడిని క్రింద వదిలి పెట్టి చంద్రికను సిద్దంగా వుండమన్నాడు.
    వీరబుడతడు భవనంలో ప్రవేశించాడు.
    "నా గుండెలు కొట్టుకుంటున్నాయి " అంది బుడత రాజకుమారి.
    అంతా భవనం వైపే దృష్టిని కేంద్రీకరించారు.
    బుడతడు లోపలకు వెళ్ళి నిద్రపోతున్న మాంత్రికుడ్ని తట్టి లేపాడు. మాంత్రికుడు ఉలిక్కిపడి లేచి -- "నువ్వా!" ఇక్కడికెలా రాగలిగావు ?" అనడిగాడు.
    "నేను వచ్చాను- నీ చావును కొని తెచ్చాను . పద బయటికి !" అన్నాడు బుడతడు.
    "బయటకెందుకు ? నిన్నిక్కడ ఈ భవనంలో బలి చేస్తాను " అంటూ మాంత్రికుడేదో అనేలోగా బుడతడు బయటకు పరుగెత్తాడు. మాంత్రికుడు తరుముకుంటూ భవనం లోంచి బయటకు వచ్చాడు.
    భవనద్వారం వంకనే దీక్షగా చూస్తున్న చంద్రిక ముందు బుడతడు, అవెనుకనే మాంత్రికుడు భవనం లోంచి బయటకు రావడం చూస్తూనే చంద్రిక చేయి జాపి మాంత్రికుడినందుకుంది.
    "మంటలు ....మంటలు ....వళ్ళంతా మంటలు " అంటూ పెద్దగా అరిచాడు మాంత్రికుడు.
    వాణ్ణి పరిశీలించి చూసేలోపునే మాంత్రికుడు భగ్గుమని మండాడు. భయపడి వెంటనే వదిలేసింది చంద్రిక. మాంత్రికుడు క్రిందపడి పిడికెడు బూడిదగా మారిపోయాడు.
    బుడతడు, బుడత రాజకుమారి మోహనుడిని ఎంతగానో పొగిడారు.
    మాంత్రికుడి భవనం గాలిలో ఎగురుతుందని దాన్ని తను నడపగలనని తిరిగి మా రాజ్యం చేరగలననీ బుడత రాజకుమారి అన్నది. ఏనాటికైనా బుడతడు తనవద్దకు వస్తే తిరిగి పోవటానికి వీలుగా వుంటుందని ఆమె ఒకరోజున మాంత్రికుడిని బులిపించి ఈ విద్య నేర్చుకున్నదట.
    బుడతడు మొహనుడికి ఒక చిన్న త్రాడు ఇచ్చి, "గొప్పగా భవనాలు నిర్మించాలన్నా, కొండలు బ్రద్దలు కొట్టాలన్నా , బలవంతుల్ని చంపాలన్నా ఈ త్రాడుని వ్రేలుకి కట్టి లాగు. నేను వెంటనే నీ దగ్గరకు వచ్చి సాయం చేస్తాను " అన్నాడు.
    తర్వాత మాంత్రికుడి భవనంలో ఇద్దరూ ప్రవేశించారు. చూస్తూ వుండగా ఆ భవనం గాలిలో లేచి మాయమైంది.
    
                                     7
    మోహనుడు, చంద్రిక అజగర పర్వతం మీంచి దిగగానే క్రింద కొందరు రాజభటులు వాళ్ళని చూశారు. "అరె - రాజకుమారుడు !' అంటూ అరిచారు వాళ్ళు. వాళ్ళతన్ని చుట్టూ ముట్టి ఏం చెప్తున్నా వినిపించుకోకుండా ఆ దంపతులిద్దర్నీ ఒక రధంలో ఎక్కించుకుని రాజ భవనానికి తీసుకెళ్ళి పోయారు.
    అక్కడి రాజు, రాణి మోహనుడి ని చూస్తూనే బ్రహ్మానందపడి , "నాయనా! నువ్వు ప్రాణాలతో వున్నవనుకోలేదు. ఈ కళ్ళతో నిన్ను చూస్తానని అనుకోలేదు " అన్నారు.
    మోహనుడి కీ మాయ ఏమిటో అర్ధం కాలేదు. 'అసలేం జరిగింది ? నన్నిక్కడి కేందుకిలా బలవంతాన తీసుకు వచ్చారు?" అనడిగాడతడు.
    ఆదేశపు రాజకుమారుడు మలయుడు దేశాటనానికని వెళ్ళి ఎంతకూ తిరిగి రాలేదు. గతదినం ఒక యువకుడు వచ్చి తనే మలయుడినని చెబుతున్నాట్ట. రాజు వెంటనే వాణ్ణి కారాగారంలో వేయించి నాలుగు తన్నగా -- అజగర పర్వతం మీద అసలు మలయుడున్నాడని చెప్పాడట. భటులు అక్కడకు వచ్చి మలయుడిని కనుగొన్నారు. తీసుకొచ్చారు.
    మోహనుడు మలయుడి చిత్రపటాలేమైనా ఉంటే చూపమన్నాడు. అవి చూసేక అంతకాలము తనతో వుండి, తనను మోసం చేయాలనుకున్న యువకుడే రాజకుమారుడు మలయుడని మోహనుడు గ్రహించాడు. మరి రాజు, రాణీ అంతా తనను మలయుడని భ్రమ పడడానికి కారణమేమిటి?
    చంద్రిక కూడా ఆ చిత్ర పటాలను చూసి మోహనుడికి, మలయుడికీ ఎక్కడా రూపు రేఖల్లో పోలికలు లేవని అన్నది.
    అప్పుడు కారాగారానికి వెళ్ళి మలయుడిని చూశాడు. ముమ్మూర్తులా చిత్రపటాన్ని పోలీ ఉన్న అతడి దుస్థితికి మోహనుడికి జాలి వేసింది.
    "ఏమిటీ విచిత్రం? ఇక్కడున్న వారందరూ నన్ను మలయుడని అనుకుంటున్నారు. నాకు నువ్వు మలయుడిగా కనబడుతున్నావు?" అన్నాడు మోహనుడు.
    మలయుడు మోహనుడికి శుచీంద్రుడి కొలను, మామిడి చెట్ల గురించి చెప్పి -- "మునీ నన్నెంతగా వారించినా వినకుండా నేను నా దుర్బుద్దిని వదలలేదు. అందుకే అనుభవిస్తున్నాను. న=నన్నెరిగిన వారందరి కళ్ళకు నేను మలయుడిగా కాక నీ రూపులో కనబడుతున్నాను. ఒక చిత్రకారుడిని నా రూపం గీయమంటే నీ రూపం గీశాడు. వారందరికీ నువ్వు మలయుడివిగా కనిపిస్తావని అర్ధమై తన్నులు భరించలేక నువ్వు అజగర పర్వతం మీద ఉన్నావని చెప్పాను. నేను కోరుకున్న చంద్రికకు నేను మోహనుడిలా కన్పడడం లేదు. నువ్వు కూడా మలయుడిని కాదనకు. అలా అంటే నీకు నేనేదో మందు పెట్టాననుకుని నన్నురితీయించినా తీయించగలరు. నువ్వు రాజువై నన్ను రక్షించి, క్షమించి వదిలిపెట్టు. నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. నువ్వు హాయిగా రాజ్యాన్నెలుకో !" అన్నాడు.
    జరిగిన విశేషానికి మోహనుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. మలయుడి పై అతడికి ఎంతో జాలి ఉన్నప్పటికీ తను మలయుడిని కాదంటే పిచ్చి పట్టిందని రాజు అనుకోవచ్చు. అసలు మలయుడిని ఉరి తీయించవచ్చు. అందువల్ల ఇద్దరికీ నష్టం కాబట్టి మలయుడు చెప్పిన విధంగానే చేయాలని అతననుకున్నాడు.
    కారాగారం నుంచి వచ్చేటప్పుడు అక్కడ మోహనుడికి తన అన్నలిద్దరూ కనబడ్డారు. వారిని చూసి అతడాశ్చర్యపడి - "మీరిక్కడి కెలా వచ్చారు ?" అనడిగాడు.
    మహారాజు వేషంలో ఉన్న మోహనుడిని అన్నలిద్దరూ గుర్తు పట్టలేదు -- "మహా ప్రభూ ! మా తండ్రి మాకు చెప్పనే చెప్పాడు. డబ్బు ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నవాడు పతనమవుతాడని మేము దానగుణం పూర్తిగా వదిలిపెట్టి డబ్బు కోసం ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేశాం. మా ఆగడాలు భరించలేక ఊరంతా ఒక్కటై మాకు ఎదురు తిరిగింది. ఫలితమే ఈ కారాగార వాసం. ప్రభువులు దయతల్చి మమ్మల్ని వదిలిపెడితే ఇకమీదట బుద్దిగా మాత్రం బ్రతుకుతాం" అన్నారు శరభుడు, రమణుడు ఏక కంఠంతో.
    "మరి మీ తమ్ముడు మోహనుడు ఒకడుండాలి -- వాదేమయ్యాడు ?" అనడిగాడు మోహనుడు.
    "మేము వాడికి చేసిన అన్యాయమే మాకీ పద్దతి కలిగించింది ప్రభూ! తమకు వాడి గురించి ఎలా తెలుసు ?" అనడిగారు శరభుడు, రమణుడు ఆశ్చర్యంగా.
    "మోహనుడిప్పుడో రాజ్యానికి రాజు. మిమ్మల్నిద్దరినీ కారాగార విముక్తుల్ని చేయవలసిందిగా అతను నాకు కబురు పంపాడు. మిమ్మల్ని వదిలిపెడతాను . ఇకమీదట బుద్దిగా మసలండి!" అన్నాడు మోహనుడు. తానేవారైనదీ వాళ్ళకి చెప్పదల్చుకోలేదు.

                                                *    *    *    *

    మోహనుడికి ఘనంగా రాజ్యాభిషేకం జరిగింది. చంద్రిక మహారాణి అయింది.
    తన అత్త ,మామలైన ప్రసన్నుడు, భానుమతిలను రాజభవనానికి రప్పించి అక్కడ వారికి శాశ్వత నివాసం కల్పించాడు మోహనుడు.
    చెరసాలలో ఉన్న మలయుడికి, తన అన్నలకు విముక్తి కలిగించాడు.
    బుడతడి సాయంతో దేశంలో అద్భుతమైన కట్టడాలూ, రాచమార్గాలనూ, అనకట్టలను నిర్మించి ప్రజారంజకంగా రాజ్యం చేసి చరిత్రలో ఓ గొప్ప ప్రభువుగా నిలచిపోయాడు.
    తన దయా గుణాన్ని, దాన గుణాన్ని మోహనుడు వదిలిపెట్టలేదు. అయితే తండ్రి సలహా పాటించి అతను తన హద్దులు కూడా గుర్తుంచుకున్నాడు. అందువల్ల అతనిది తరగని సంపద అయింది. సమర్ధుడైన రాజు అని కూడా అనిపించుకున్నాడు.
    మితిమీరిన స్వార్ధపరత్వం వల్ల వచ్చే నష్టాలనూ, మోసగాళ్ళకు చివరకు కలిగే దుస్థితీ , దయాగుణం కలుగజేసే ప్రయోజనాలు అందరికీ తెలిసే విధంగా మోహనుడు వీరబుడతడి కధను, కధలు, కావ్యాలు పాటల దూపంలో దేశమంతటా ప్రచారం చేయించాడు.

                         ---అయిపొయింది ------

 Previous Page Next Page