Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 7

 

    "మంచి వాసన వస్తోంది. ఇవి చాలా రుచికరామైన మామిడి పళ్ళులా వున్నాయి. కొలనులో చేతులు మొఖం కడుక్కొని ఫలలారాగిద్దాం" అన్నాడు రాజకుమారుడు.
    ఇద్దరూ చేతులు ముఖం కడుకున్నారు. కొలనులోని జలము కొబ్బరి నీళ్ళువలె వున్నది. కడుపారా నీరు త్రాగి -- "ఇప్పుడు ప్రాణం ఎంత హాయిగా వున్నది ?" అన్నాడు రాజకుమారుడు. తరువాత తను చెట్టు పై కెక్కి పళ్ళు కోయబోయాడు. ఆ సమయంలోనే "పాము - పాము !" అని అరిచింది చంద్రిక. రాజకుమారుడు కంగారుగా చెట్టు దిగి - ఏది పాము ? ఎక్కడ పాము ?" ఆడిగాడు.
    "నువ్వు కోయ్యబోతుంటే చెట్టు కున్న ఫలం పడగ విప్పిన పాములాగా కనబడింది నాకు ' అంది చంద్రిక.
    "మరి నాకలా కనబడలేదే ?" అన్నాడు రాకుమారుడు.
    "నువ్వు చెయ్యి చాపెవరకూ పండులాగే వుంది కాని చెయ్యి చాపగానే అది పడగ విప్పిన పాములా మారిపోయింది. ఇది భ్రమ కాదు- నిజం !" అంది చంద్రిక.
    రాకుమారుడు తిరిగి చెట్టెక్కబోతూన్నా చంద్రిక వారించింది. ఇద్దరూ ఆ విషయమై వాదాలు పడుతున్నారు.
    "నేను చెప్పినట్టల్లా నువ్వు వినాల్సిందే అన్నాడు రాజకుమారుడు.
    "నిన్నే నమ్ముకుని వచ్చాను. నువ్వుంటే ప్రాణం . నువ్వు లేనిదే నేను బ్రతకలేను. పండు కోశావంటే నువ్వు బ్రతకవు" అంది చంద్రిక ఏడవసాగింది.
    సరిగ్గా ఆ సమయంలో అక్కడికి ఓ ముని వచ్చాడు. తగువు పడుతున్న ఈ జంటను అయన పలకరించి వివరమడిగాడు. రాజకుమారుడు తనుగా జవాబు చెప్పి , "చూడండి - మునీశ్వరా ! అనవసరపు బ్రాంతులతో దొరికిన ఆహారాన్ని కాలదన్నుకుంటే ఎలా - చెప్పండి! మళ్ళీ ఎక్కడ ఏం దొరుకుతుందో ఏమో?" అన్నాడు.
    ముని రాజకుమారుడి వంక చూసి - "చూడటానికి నువ్వు ఉన్నత కుటుంబీకుడి లాగా వున్నావు. అలాంటి నిన్ను మోసగాడని అనుకునేందుకు మనసొప్పటం లేదు , కానీ....." అని ఆగిపోయాడు.
    "నేను మోసగాడినన్న అనుమానం మీకెందుకు వచ్చింది. స్వామీ ?" అన్నాడు రాకుమారుడు ఆశ్చర్యంగా.
    "నీకీ కొలను మామిడి చెట్టు గురించి చెపుతాను - విను?" అంటూ మునీశ్వరుడు రాకుమారుడికి యీ విధంగా చెప్పాడు.
    "ఒకా నొకప్పుడు శుచీంద్రుడనే ముని ఈ కొలను ఒడ్డునే ఘోర తపస్సు చేశాడు. అతడి వల్ల తన ఇంద్ర పదవికి భంగం వస్తుందని దేవేంద్రుడు భయపడ్డాడు. అప్సరసలను పంపాడు. శుచీంద్రుడు చలించలేదు. అప్పుడు దేవేంద్రుడు మాయ మాటలతో శుచీంద్రుడి భార్య బిడ్డలను ప్రలోభ పెట్టాడు. వాళ్ళకు బొందితో స్వర్గాన్నిస్తానాని ఆశ పెట్టాడు. వాళ్ళు దేవేంద్రుడి మాటలు విన్నారు. ప్రతిరోజూ ఉదయం శుచీంద్రుడు స్వచ్చమైన పాలు, తేనే కొద్దిగా సేవిన్చేవాడు. సాయం సమయంలో కొద్దిగా ఫలాలు అరగించేవాడు. పాలూ, తేనే ను శుచీంద్రుడు భార్య రంగరించేది. ఫలాలను ముక్కలుగా కోసి వాటితో రుచికరమైన పదార్ధం తయారు చేసేది ఆమె బిడ్డలు. ఇంద్రుడి మాటాలు విన్నాక శుచింద్రుడి భార్య బిడ్డలు - పాలూ, తేనే లలో మద్యాన్ని ఫలాలలో మాంసాన్ని కలిపి ఆయనకు ఇవ్వడం ప్రారంభించారు. ఏకాగ్రతతో తపమాచరించే మునికి రుచులు తెలిసేవి కావు. అలా కొంతకాలం జరిగేసరికి మధ్య మాంసాదుల కారణంగా అయన తమసుడై పోయాడు. ఆయనలోని ఏకాగ్రత నశించింది. క్రమంగా ఆయనకు తపస్సు పై ఏకాగ్రత క్షీణించింది. సంసార సుఖాల పట్ల మమత పెరిగింది. అప్పుడే అయన తనకు మధ్య మాంసాదులు అందుతున్నాయని తెలుసుకున్నాడు. మోసం గ్రహించాడు. తను నమ్మిన భార్యా బిడ్డలే తనను మోసగించడం వల్ల ఎన్నో ఏళ్ళ తన కృషి వృధా అయ్యింది . ఈ ప్రపంచంలో మోసానికి మించిన అన్యాయం లేదని మోసగాళ్ళను శిక్షించాలని ఆయనకు బుద్ది పుట్టింది. అప్పుడాయన ఈ కొలను ఒడ్డున ఈ మామిడి చెట్టును సృష్టించాడు. ఈ చెట్టున ఎప్పుడూ పండిన మామిడికాయలు ఉంటాయి. మంచి వాసనలతో ఆకర్షిస్తుంటాయి. కొలను జలాలు తియ్యగా ఉంటాయి. ఈ కొలను జలాలు త్రాగి ఈ మామిడిపళ్ళు తింటే మనిషి అప్పటికప్పుడు చచ్చిపోతారు. ఆ రెండూ కలిసి విషంలా పనిచేస్తాయి. ఈ విష ఫలాన్ని కోయబోతే మంచివారికి విష సర్పాల్లా కనపడి హెచ్చరిస్తాయి. మోసగాళ్ళకు మాత్రం అవి మంచి ఫలాల్లాగేనే కనబడతాయి."
    ఈ కధ వింటూనే రాజకుమారుడి ముఖం పాలిపోయింది. 'తను మోహనుడి ని మోసగించి అతడి భార్యని ఎత్తుకుని వచ్చాడు. తను మోసగాడు ! అందుకే ఈ చెట్టు పళ్ళు తనని బలిగినాలనుకున్నాయి. కానీ పండు విష సర్పంగా మారటంతో తన ప్రాణాలు రక్షించ బడ్డాయి. మోసానికి ఎంత చక్కటి శిక్ష?
    'అప్పట్నించి ఎందరో మోసగాళ్ళు కొలను ఒడ్డున చచ్చిపోయారు. నీ అదృష్టమే నిన్ను రక్షించింది. ఇక్కడకు వచ్చి బ్రతికావు. కాబట్టి నువ్వు మోసాలను వదిలిపెట్టి మంచిగా జీవించు ! సుఖపదతావు. ఇక్కడకు వచ్చి వెళ్ళేక కూడా నీవు మారకపోతే నీకు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి. ముందే హెచ్చరిస్తున్నాను." అని చెప్పి ముని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    రాజకుమారుడికి భయం వేసింది. అతడు వెనక్కు వెళ్ళి మోహనుడికి అతడి భార్యను అప్పగించి వేడ్డామనుకున్నాడు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఈ ప్రపంచంలో ఇంకా ఎందరు శుచీంద్రులున్నారో ! వారింకా ఇలాంటి కొలను లెన్ని సృష్టించారో!
    "ఏమిటి ప్రియా ఆలోచిస్తున్నావు ? ముని మాటలకు భయపడ్డావా? నాకు నువ్వంటేనే ఇష్టం. నేనుండగా భయం లేదు నీకు. మనమిద్దరం హాయిగా కలిసి జీవిద్దాం " అంది చంద్రిక.
    చంద్రిక ఇలా అనగానే రాజకుమారుడి ఆలోచనలు మళ్ళీ మారిపోయాయి. 'తను మోసగాడు కావచ్చు. కానీ చంద్రిక మోసగత్తె కాదు. ఆమె తనకు తోడుండగా తనకే ప్రమాదమూ వుండదు. అందులోనూ ఆమె ఇప్పుడు తననే కోరుకుంటున్నది!"
    ఈ ఉద్దేశ్యంతో రాజకుమారుడు చంద్రికను గుర్రం ఎక్కించాడు. ఇంక దేశాటనం ఆపివేసి తన రాజ్యం చేరుకొని చంద్రికతో హాయిగా రోజులు గడపాలని అతడికి కోరికగా ఉంది.
    చంద్రిక గుర్రం ఎక్కగానే రాజకుమారుడు తనూ గుర్రం ఎక్కబోయాడు. కానీ వెంటనే పడిపోయాడు. ఎవరో తనను గట్టిగా లాగినట్లయింది.
    ఈలోగా గుర్రం కూడా ఎవరో లాగుతున్నట్లుగా వెనక్కు నడవసాగింది.

                                      5
    చాలాసేపు రోదించాక మోహనుడు మనసు ధైర్యం చిక్కబట్టుకుని ముందు కర్తవ్యమేమిటా అని ఆలోచించాడు. అతడికేమీ తోచలేదు. అప్పుడతడు జేవులోని బుడతడిని బైటకు తీసి జరిగింది చెప్పాడు.
    "దీనికింత విచారించడమెందుకు ? ఆ యువకుడు గుర్రాన్ని నేను నా మెత్తటి తాటితో బంధించి కొసలు నా దగ్గరుంచుకున్నాను. అవింకా నా ఆధీనంలోనే ఉన్నాయి. వీటి పొడవు నాలుగు యోజనాలు ఉంటుంది. అనగా వాళ్ళింకా నాలుగు యోజనాల దూరం వెళ్ళలేదన్న మాట. నేను తాటి కొసలు లాగేనంటే కాసేపటిలో వాళ్లిక్కడుంటారు " అన్నాడు బుడతడు.
    "బుడతా! నువ్వెంత మంచివాడివి !" అన్నాడు మోహనుడానందంగా.
    "ఇందులో మంచితనానిదేముంది ? ప్రియురాలి ఎడబాటు లోని బాధ తెలిసిన నేను నీ బాధ అర్ధం చేసుకోగలను ?" అన్నాడు బుడతడు గంబీరంగా.
    అంత విషాదం లోనూ అప్పటి బుడతడి ముఖ భావాలు చూసిన మోహనుడికి నవ్వొచ్చింది. వ్రేలేడు లేని ఆ మనిషి హృదయంలో ప్రేమ, ప్రియురాలి ఎడబాటు, విరహం ఉన్నాయి.
    కాసేపటికి బుడతడు గుర్రాన్నీ, రాజకుమారుడిని అక్కడకు లాగేశాడు. వాళ్ళక్కడకు రాగానే చంద్రిక గుర్రం మీద నుంచి ఒక్క దూకు దూకి, "ప్రియా !' అంటూ మోహనుడిని సమీపించింది.
    తన భార్య తన దగ్గరకు వచ్చినా తనతో ప్రేమగా ఉండదనుకున్న మొహనుడి విపరీతానికి ఎంతగానో సంతోషించి , "అమ్మయ్య! నువ్వు మళ్ళీ మామూలు మనిషివయ్యావన్న మాట!" అన్నాడు.
    రాజకుమారుడు అంత దూరం ఎంతో కష్టపడి వచ్చి అలసిపోయాడు. తన కలికి ఏదో మెత్తటి తాడు చుట్టుకున్నదనీ , అదే తనను లాగుతున్నదనీ అతడు గ్రహించేక , తాడు లాగుతున్న దిక్కుగానే నడవడం వల్ల ఒంటికి దెబ్బలు తప్పాయి. ఎటొచ్చీ గుర్రం మీద పెట్టిన పరుగు కాలినడకగా మారింది. అందువల్ల అతను బాగా అలసిపోయాడు.
    "మోహనా! నా వల్ల తప్పయింది. నన్ను క్షమించు !" అన్నాడు రాజకుమారుడు నీరసంగా.
    మోహనుడు రాజకుమారుడిని సమీపించి ఏదో అనబోయి ఆశ్చర్యంతో అతన్నే చూస్తుండి పోయాడు. రాజకుమారుడు కూడా మోహనుడి వంక ఆశ్చర్యంగా చూశాడు.
    రాజకుమారుడు ముమ్మూర్తులా మోహనుడిలా ఉన్నాడు.
    మోహనుడు ముమ్మూర్తులా రాజకుమారుడిలా ఉన్నాడు.
    ఇద్దరి రూపాలు మారిపోయాయి.
    తన రూపం ఎప్పుడు మారిపోయిందో మోహనుడికి తెలియదు. ఎందుకు మారిందీ కూడా తెలియదు. కానీ అతనికి తెలిసిన ఘోరమైన సత్యం చంద్రిక ఇప్పుడు ప్రేమించేది రాజకుమారుడు రూపాన్నే గానీ, తన రిఇపాన్నీ కాదు. ఆమె రాజకుమారుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడదే రూపంలో ఉన్న తనను ప్రియా అని పిలుస్తుంది.

 Previous Page Next Page