Previous Page Next Page 
పాదాభివందనం పేజి 76

"రుక్కూ!" మంచంపై కూర్చుంటూ పిలిచాడు పరమశివంముప్పై సంవత్సరాలు కలిసిచేసిన దాంపత్యస్నేహ పరిమళం ఆ కంఠంలో ధ్వనించింది వియోగ వేలలోపలికే అపశ్రుతిలోని విషాదం మనస్సుని కదిలించింది ఎదలోపల సన్ననిసితారా ధ్వని లాంటి దుఃఖ సంగీతం.
కానీ పిలుపుక్కోసం ఎదురుచూస్తున్న రుక్మిణి మనస్సు ఆ పిలుపుకి స్పందించలేదు. ఆమె కళ్ళుమళ్ళీ ఓ మారు అందరినీ పరీక్షగా చూశాయి.
తనుకోరుకున్న ముఖం లేదు. తమ మనస్సు ఎన్నుకున్న మనిషి కనిపించలేదు. తన ఎద తపించే ఆ చూపు తన చూపుతో కలవటం లేదు. ఆమె కళ్ళు మూసుకుంది.   
గుండెల్లో ఏదో కదలిక. ఏవో జ్ఞాపకాలు.   
"మినీ!"   
కొండలుకోనలు ఆడవి సంగీతంతో ప్రతిధ్వనించినట్టు ఆ పిలుపుకి ఆమె శరీరంలోని రక్తరేణువులన్నీ ప్రేమతో తడిసిపోయాయి. 'ఉ' అంది జీవన సంగీతం పలికినట్టు.  
ఆమెచేతిని మెల్లగాస్పృశించాడతను. సన్నజాజితీగకి తొలిసారిగా మృదువుగా- ప్రేమగా నరాలన్నీ చిక్కువిడిన దారపుపోగుల్లాగా ప్రేమ ప్రవాహంతో నిండిపోయాయి.   
"రఘూ!"   
అద్దంలా ప్రతిబించే ఆమె హృదయం నించివెలువడింది.   
'ఎలా బ్రతుకుతున్నాంమనం శరీరం రెండుగా విడిపోయినట్టు-వీణ రెండు ముక్కలైనట్టు-'   
అతని పెదాలపై ఆమె తలిరాకు జొంపం వంటి అంగుళికదలాడింది. 'వద్దు-మనకి వియోగంలేదు-అలా అనద్దు' అతనితొడపై తల ఆన్చుతూఅంది. సింహాసనంపై విశ్రాంతి తీసుకున్నట్టుగా వుంది.   
గుండె ప్రశాంతంగా వుంది రక్తం నెమ్మదిగా ప్రవహిస్తోంది. శరత్ కాలంలో తేరుకున్న జీవప్రవాహంలాగా వలపువాగు.   
'ఎలావుంది ఈరోజు కండిషన్'   
ఆమెకళ్ళు తెరిచింది మదిలో మెదిలేజ్ఞాపకాలు మళ్ళీ చెదిరాయి. డాక్టరు పరీక్ష చేస్తున్నాడు. పరమశివం ఆత్రంగా, ఆరాటంగా అడుగుతున్నాడు. చుట్టూ వున్న అందరి కళ్ళలో అదేభావం.   
'ప్చ్! అంతు పట్టడం లేదు. శరీరంలో ఏ శక్తీ లేదు. ఏ క్షణంలోనే ఎన్నడోయీ గుండె ఆగిపోయి వుండాలి. కానీ ఏదో బలమైన శక్తి ఆపుతోంది. ఎవరి కోసమో ఈ ప్రాణాలు నిలిచిఎదురుచూస్తున్నాయి. ఆమె యిష్టపడే వ్యక్తిరావాలి. అంతే! అంతదాకాయీ యాతన తప్పదు. 'డాక్టరుగారి మాటలు ఎవరికీ అర్ధం కాలేదు.   
పరమశివంగారి ముఖంలో నరాలు కదలీ కదలని చలనం. దవడకండరం బిగిసీ బిగియకుండా ఆగింది.   
ఆయనేం సమాధానం చెబుతారో అని 'ఆశగా' వుందామె ఆయనజవాబివ్వలేదు. ఆమె మళ్ళీ కళ్ళుమూసుకుంది.   
'మినీ!'   
'అలా పిలుస్తారేం! లోకంలో అంతా రుక్మిణిని రుక్కు అంటారు. దేవీ అంటారు. మీరేమిటిలా -'   
'నా ప్రత్యేకమైన దేవతాహానం - అనంతకోటి నామాల్లో ఒకటి కాదు -'   
'ఎందుకింత ఆరాధన!'   
'అదినాకేం తెలుసు - నిన్ను చూసిన తోలిక్షణంలోనే నీ పాదాలకి వందనం చేశాను. నీ అందానికి అభినందన చెప్పాను. నీ ప్రేమ కాసారాల్లాటి కనులకి నీరాజనంపట్టాను.'   
'అంతా మీ భావనలోని రమ్యత-'   
'ఉహూ నీ గొప్పతనం - ఒక దేవత ఒక మనిషి కోసం మానవరూపంలో వచ్చింది. అనుగ్రహించింది. వలపు గ్రహించింది."   
"మనం యిలా కలుసుకుంటామనుకోలేదు. ఎన్నడూయిలా తప్పిపోయిన ఆ జీవిత నేస్తం కనబడతాడనుకోలేదు. రుతువైపోయాక వర్షంవచ్చినట్టు."   
"మినీ- అతని కంఠంలో ఎనలేని తృప్తి - నేను జీవితంలో తల్లి ప్రేమ ఎరగను- నిన్ను చూశాక జగన్మాతనిదర్శించినట్టు అనుభూతి చెందాను- నీ లాలనలో తరించి- "సిగ్గుతో తలవంచుకుందామె.   
'మినీ - నాకు అక్క చెల్లెళ్ళులేరు. ఆరేడు జన్మలుగా సోదరి ప్రేమ తెలియని వ్యక్తికి అది లభించినట్లయింది. ఆ ప్రేమనంతా అలాగేవర్షించాలని వుంది.   
ఆమెకళ్ళు శరదాకాశంలో విరిసిన జాబిల్లిజంటలయ్యాయి.   
"నాకూ కూతురుంది. ఆమెని నీలా పెంచాలి. నీ ధైర్యం నీ తెలివీ, నీ ఆలోచన, అన్నీ నీలా -'   
'వద్దు రఘూ- నా శాప జీవితం మాత్రంవద్దు-'   
'మనం ఉత్తమ స్నేహితులం నా కింతవరకూ యీ ఆత్మీయత ఎక్కడా లభ్యం కాలేదు. నీవునా తల్లివి. నా చెల్లివి- నా దేవతవి- నాకూతురివి- నా సరసానివి-'   
'నీవే తల్లివి తండ్రివి.....నిజముగా సామీ-' మెత్తని కంఠంలో లోగొంతుకలో మధుర మధురంగా చదివింది-'   
'అవును-'   
"నాన్నా-" పరమశివం పిలిచాడు రుక్మిణి ఊహలు మళ్ళీ చెదిరిపోయాయి. కళ్ళు తెరిచింది.   
తండ్రిపిలుపుకి మురళి దగ్గరగా వచ్చాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. కోడలు, మనవలు, మనవరాళ్ళు కూతురు అల్లుడు అంతా అవతలి గదికి వెళ్ళిపోయారు. వారం రోజులుగా ఇదేజరుగుతోంది.   
సీరియస్ గా వుందని టెలిగ్రాంయిచ్చాడు పరమశివం అంతా వచ్చారు. అంతదాకా ఒక పూవులో రెండు దళాలపై విడివిడిగా వుండే బొమ్మల్లాగా అంతటి గృహంలో కలిసి వున్నా ఎవరికివారుగా వున్నారిద్దరూ. ఇప్పుడు మళ్ళీ జనసందోహం. బంధువులకదలికలు, ఇల్లంతా సందడి.   
'ఏమిటి నాన్నగారూ!'   
'టెలిగ్రాం యిస్తావా!'   
'ఎవరికీ నాన్నగారూ!'   
పరమశివంభార్యవైపు చూశాడు. పాతిక సంవత్సరాలుగా చూసే చూపే అయిష్టత-కోపం- అసూయ ప్రతి బింబించే చూపులు. రుక్మిణీదేవికళ్ళల్లో ఆ భావాలని చదివిన పరిచయం.   
'అతనికే- రాఘవరావు- ఎస్టేట్ ఆఫీసర్.....'   
మురళి- ముఖంలో కండరాలు కదిలాయి. అదే అయిష్టత అదే కోపం అదే అసూయ. అచ్చం పరమశివం ప్రతిబింబం మురళి రూపులోనేకాదు మనస్సులోనూ ఈ కుటుంబం ఇంతే అనుకుందామె.   
ఆమెకళ్ళు మూసుకపోయాయి.

 Previous Page Next Page