అప్పుడతడికి కుర్చీలోంచి నవ్వు వినబడింది. ఆ నవ్వు వింటూంటే వేదవతి కుర్చీలో కూర్చుని ఉండి నవ్వుతున్నదనే అనిపిస్తుంది.
ఇందులో ఏదో మోసముంది! వేదవతి మోహన్ కలిసి ఏదో నాటకమాడుతూండి ఉండాలి. లేదా ఆమె దెయ్యమై వచ్చి మోహన్ మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉండిఉండాలి. తను దెయ్యమై వచ్చానన్న విషయం తెలియడంకోసం తనకు కనబడంలేదు.
అయితే ఇందులో ఓ తిరకాసున్నది. వేదవతిని మోహన్ హత్య చేసివుంటే, లేదా చేయించి వుంటే-ఆమె తిరిగిరావడాన్ని అతడు అనుమానించాడా? తనను భ్రమలో ఉంచడానికి అతడేదో నాటకమాడుతున్నాడా?
అంతా అయోమయంగా ఉంది-"నేను వెళ్ళి పోతాను-" అన్నాడు ముత్యాల్రావు.
"సరే-ముత్యం....నేను వచ్చి నిన్ను కలుసుకుని మాట్లాడతాగా-" అన్న వేదవతి గొంతు వినిపించింది. ఆ గొంతు వింటూంటే అతడికి భయం వేసింది. చరచరా అడుగులు వేశాడు. మోహన్ చటుక్కున అతడిననుసరించి అందుకుని-"నిజంగా మీకు వేదవతి కనబడ్డంలేదా?" అన్నాడు.
"నాకు అబద్దాలాడే అలవాటు లేదు..." అన్నాడు ముత్యాల్రావు.
"ఆ విషయం నాకు తెలుసులెండి..." అన్నాడు మోహన్.
అప్రయత్నంగా మోహన్ ముఖం వంక చూశాడు ముత్యాల్రావు. తను మోహన్ కుత్తరం వ్రాయడం, తనకూ ఉత్తరం వచ్చినట్లు చూపించడం, క్రోటన్సు మొక్క కింద డబ్బు పాతడం కోసం మోహన్ సాయం కావాలని అర్ధించడం....ఇవన్నీ ఏమిటి....అబద్ధాలు కావా? అని అతడు ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించిందతడికి.
"మరెందుకీ ప్రశ్న వేశారు?"
"ఆమె కట్టుకున్న లేత నీలం షిఫాన్ చీర, అదే రంగు బ్లవుజు, గులాబి రంగులోని ఆమె శరీరఛాయ, చెవులకు వ్రేలాడే పెద్ద పెద్ద రింగులు....ఇందులో ఏమీ మీకు కనబడలేదా?"
ముత్యాల్రావు అదోలా అతడి వంక చూసి బదులేమీ ఇవ్వకుండా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. అతడు వేదవతి నెందుకు వర్ణించాడో అప్పుడు తెలియలేదు ముత్యాల్రావుకు.
7
ముత్యాల్రావు తిన్నగా తన స్నేహితుడు వాసు ఇంటికి వెళ్ళి-"నీకు తెలిసిన గొంతు ఒకటి కుర్చీలోంచి వినిపిస్తుంది. మనిషి కనబడడు. నువ్వడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు వస్తూంటాయి. అప్పుడా కుర్చీలో దెయ్యమున్న దనుకోనా లేక దీనికి సైన్సు ఏమైనా బదులివ్వగలదా?" అనడిగాడు.
వాసు సైంటిస్టు స్నేహితుడి ప్రశ్న విని అతడు నవ్వి "దెయ్యాలు లేవని నేను అనలేదు. నా జ్ఞానం పరిమితం. ఆ కుర్చీలో దెయ్యం లేదని నేను చెప్పలేను. కానీ సైన్సు అలాంటి ఏర్పాటు చేయగలదు. నువ్వు వాకీటాకీల గురించి వినే ఉంటావు. మినీ రేడియో స్టేషన్ అనుకో! కుర్చీలో స్పీకరు బిగించి ఉండవచ్చు. పక్క గదిలోంచి రహస్యంగా నిన్ను గమనిస్తూ, నీ మాటలు వింటూ ట్రాన్సిమీటర్ ద్వారా నీకు బదులిస్తూంటే-విజయవాడ రేడియో స్టేషన్ లోని సినిమా పాటలు-నీ యింట్లో రేడియోలో వినబడినట్లే-పక్క గదిలోని మాటలు ఆ కుర్చీలోంచీ వస్తాయి. కావాలంటే నీకది చూపించగలను కూడా-..." అన్నాడు.
"ఇలాంటిదేదో జరిగి ఉండవచ్చునని నేనూ ఊహించాను. ఓసారి నా కళ్ళతో నేను చూస్తాను....చూపించు..." అన్నాడు ముత్యాల్రావు.
వాసు అతడి యెదురుగా ఉన్న కుర్చీలో ఓ రేడియో ఉంచాడు. దాన్ని ఆన్ చేసి ఓ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేశాడు. అప్పుడు ముత్యాల్రావుకు ట్రాన్సిమీటర్ చూపించాడు. అది ఒక చిన్న మైక్రోఫోన్ లాగున్నది అప్పుడతడు పక్క గదిలోకి వెళ్ళాడు.
కొద్ది క్షణాల్లో రేడియో నుంచి వాసు గొంతు వినబడింది.
"అలా కూర్చోండి పోయావేం? లేచి నిలబడు.....నేను నీ స్నేహితుణ్ణి గదా-నా కాలిలో ముల్లు దిగితే తీయడానికి కాస్త సయం చేయవచ్చుగా..."
ముత్యాల్రావుకి అంతా అర్ధమయింది. అతడు వాసుకు ధన్యవాదాలు చెప్పుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు.
"ఏరా-ఈ రోజు ఆలస్యమైంది?" అనడిగింది తల్లి. ముత్యాల్రావు బదులివ్వలేదు. అతడు వేదవతి గురించే ఆలోచిస్తున్నాడు.
వేదవతి ఏమైంది? బ్రతికి ఉందా, లేదా? ఆమె తనను కలుసుకుంటానంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకుంటుంది? కలుసుకుని ఏం మాట్లాడుతుంది?
రాత్రి భోజనాలు కాగానే అతడి తల్లి-"ఏమిటోరా-ఈ రోజు వళ్ళు తెలియని నిద్ర వచ్చేస్తోంది-" అని వెళ్ళి నిద్రపోయింది.
ముత్యాల్రావుకు చాలా ఆశ్చర్యం కలిగింది. తల్లి ఎప్పుడూ అలా చేయలేదు. సాధారణంగా తను నిద్రపోయినాకనే ఆమె నిద్రపోతుంది.
ఓ పట్టాన అతడికి నిద్ర రాలేదు. రాత్రి పదిన్నరకు కాబోలు యెవరో అతడి ఇంటి తలుపు తట్టారు. వెళ్ళి తలుపు తీశాడు ముత్యాల్రావు.
వేదవతి!
లేత నీలం రంగు షిఫాన్ చీర, అదే రంగుబ్లవుజూ, గులాబి రంగు శరీర ఛాయ, చెవులకు వ్రేలాడుతున్న పెద్ద పెద్ద రింగులు...
ఆమె వేదవతి మాత్రమే కాదు....పూర్తిగా మోహన్ వర్ణించిన విధంగానే ఉన్నది. ముత్యాల్రావుకు కొద్ది క్షణాలు నోట మాట రాలేదు.
"నీకోసం వచ్చాను ముత్యం. సాయంత్రం మోహన్ ఎదురుగా నీతో యెక్కువగా మాట్లాడ్డం ఇష్టంలేక పోయింది. అందుకే మీ యింటికే స్వయంగా వచ్చాను. అత్తయ్య నిద్రపోతున్నారా?" అంది వేదవతి.
"ఊఁ" అంటూ ఆమెకు దారి ఇచ్చాడు ముత్యాల్రావు.
వేదవతి తనే తలుపులు వేసింది తిన్నగా. అతడి పడకగదిలోకి దారితీసింది. ముత్యాల్రావు ఆమెను అనుసరించాడు. అతడి మెదడంతా అయోమయంగా ఉన్నది.
ఇద్దరూ గదిలో కూర్చున్నారు. వేదవతి మంచంమీద కూర్చున్నది. ముత్యాల్రావు ఆమెకు ఎదురుగా ఓ స్టూలు మీద కూర్చున్నాడు.
"ఇప్పుడు చెప్పు ముత్యం.....ఆ రోజు నువ్వు మన ప్రోగ్రాం ఎందుకు పాడు చేశావు?"
"ఏ రోజు?"
"అదే...పెళ్ళికి ముందే నువ్వు నన్ను నీ దాన్ని చేసుకోవాలనుకున్న రోజు..."
"ఆ రోజా?.... ఆ రోజు....ఆ రోజు..." ముత్యాల్రావు కొద్ది క్షణాలు తడబడి-"ఆ రోజు నేను వచ్చాను. నీ శవాన్ని చూశాను..." అన్నాడు.
వేదవతి కిలకిలా నవ్వి-"అంతా మోహన్ చెప్పినట్లే చేశావు...." అంది.
"అంటే?"
"మోహన్ నన్ను ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అతడికది ఇష్టంలేకపోవడం సహజమే కదా! నీ గురించి ఎన్నో అన్నాడు. తనైతే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాట్ట. నువ్వేమో పిరికివాడివట స్వార్ధపరుడివట. నన్ను మోసం చేయాలనుకుంటున్నావుట. నేను అన్నింటికీ ఖండిస్తే తనన్నాడూ-ఓసారి ఆశపెట్టి అతడిని నీ గదికి ఆహ్వానించు. అక్కడ నువ్వు హత్యచేయబడినదానిలా పడివుండు. అప్పుడతడు నీ చావుకు విలపిస్తాడో, హత్యా నేరానికి భయపడి పారిపోతాడో చూడు. పారిపోయినవాడు స్వార్ధపరుడు.లేనిపక్షంలో అసలైన ప్రేమికుడు!
ఈ మాటల్ని నేనో సవాలుగా తీసుకుని నిన్ను పరీక్షించాను. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి నాలో ఇంకా కొస ప్రాణం ఉన్నదేమోనని పరీక్షిస్తావనుకున్నాను. అలా చేస్తే అప్పుడే నీ వశం కావాలనుకున్నాను. కానీ అలా జరుగలేదు. నువ్వు పారిపోయావు" అని నిట్టూర్చింది వేదవతి.