"నీకు హస్తసాముద్రికం తెలుసా ?" అన్నాడు మోహనుడు ఆశ్చర్యంగా. రాజకుమారుడు అవునని చెప్పగా అతడు తన భార్య చంద్రికను కూడా పిలుచుకుని వచ్చాడు. రాజకుమారుడు చంద్రిక చేయిచూసి ఆమె మహారాణి కాబోతున్నదని చెప్పాడు. అతడి మాటలకు చంద్రిక ఎంతగానో సంతోషించింది.
చంద్రికను దగ్గర్నుంచి చూడగానే రాజకుమారుడు పిచ్చి పట్టినట్లే అయింది. ఎలాగైనా సరే ఆమెను తన దాన్ని చేసుకోవాలని అతననుకున్నాడు. మోహనుడిని మోసగించి చంద్రికను ఎత్తుకు తీసుకుపోవాలని అనుకున్నాడు. ఈలోగా చంద్రిక ఎలాంటిదో తెలుసుకోవాలని కూడా అతననుకున్నాడు. అందుకని మర్నాడు మోహనుడు బయటకు వెళ్ళినపుడు చంద్రికను పిలిచి పలకరించి, నువ్వు చూడ్డానికి దేవకాంతవలె ఉన్నావు. సామాన్యుడైన ఈ మోహనుడు నీకు భర్త ఎలా అయ్యాడు ?" అనడిగాడు.
"నాకు తెలియదు. నా తండ్రి నన్నాయనకిచ్చి పెళ్ళి చేసాడు " అంది చంద్రిక.
తండ్రి బలవంతం మీదనే చంద్రిక ఈ పెళ్ళి చేసుకుందని రాజకుమారుడు భావించాడు.
"నువ్వు ఊ అంటే నీకు ఏడువారాల నగలిచ్చి దాసీ జనాల్నేర్పాటు చేసి, హంసతూలికా తల్పాల పైన పరుండబెట్టి రాజకుమారుడే పెళ్ళి చేసుకుంటాడు. ఒప్పుకుంటావా ?" అన్నాడు రాజకుమారుడు.
చంద్రిక కోపంగా అతడి వంక చూసి , "ఒక పెళ్లై పోయాక మళ్ళీ పెళ్ళేమిటి? నువ్విలాటి మాటాలాడావంటే నేను నీతో మాట్లాడను" అంది.
"నీ అందం ఎంత గొప్పదో చెప్పునా నీక్కోపం వస్తుందంటే ఇంకెప్పుడూ అలా మాట్లాడను ' అన్నాడు రాజకుమారుడు.
"మోహనుడు నా భర్త. ఆయనే నా దైవం అంది చంద్రిక.
రాజకుమారుడు అక్కణ్ణించి తిన్నగా ఆ గ్రామంలో వైద్యుడింటికి వెళ్ళి, "నీ దగ్గరేమైనా వశీకరణ మూలిక ఉన్నదా! ఉంటే ఎంత డబ్బైనా ఇచ్చి కొంటాను " అన్నాడు.
ఆ వైద్యుడి వద్ద వశీకరణ మూలిక ఉన్నది- అది ఒకసారి వాసనా చూపిస్తే దాని ప్రభావం వారం రోజులుంటుంది. ఒక మూలిక ఒకసారికి మాత్రమే పనిచేస్తుంది. వైద్యుడు దాని వెల పది బంగారు కాసులని చెప్పాడు.
"ఒక చిన్న మూలికకు అంత ధర అన్యాయం" అన్నాడు రాజకుమారుడు.
"ఈ మూలికను సంపాదించడం చాలా కష్టం. అడవి మధ్యలోకి వెళ్ళి వెతుక్కోవాలి. అప్పుడైనా మూలికలు మరీ ఎక్కువ దొరకవు. అందుకే నేను వీటిని ఎవరికీ అమ్మను. నాకోసమని తెచ్చుకుంటాను." అన్నాడు వైద్యుడు.
"చూడ్డానికి ముసలాడిలాగున్నావు . నీకు వశీకరణ మూలికలెందుకు ?" అన్నాడు రాజకుమారుడు.
"నేను ముసలాడినే అయినా నా పెళ్ళాం పడుచుది. అది నేను చెప్పినట్లు వినదు. ఈ మూలిక సాయంతోటే దాన్ని నా చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నాను. ఇంట్లో ఇదొక్కటే మూలిక ఉంది. పాతమూలిక ప్రభావం రేపటితో అయిపోతుంది. ఇది నీకిచ్చానంటే నేను రేపే అడవికి పరుగెత్తాలి ." అన్నాడు వైద్యుడు.
రాజకుమారుడు పది బంగారు కాసులిచ్చి ఆ మూలిక కొనుక్కుని జాగ్రత్తగా తన అంగీలో భద్రపరిచాడు.
మర్నాడు మోహనుడికి అజగరపర్వతానికి వెళ్ళే దారి తెలిసింది. అతను ఉత్సాహంగా యింటికి వచ్చి చంద్రికకు విషయం చెప్పాడు. ఇద్దరూ వెంటనే ఆ ఊరొదిలి బయల్దేరడానికి సిద్దపడ్డారు.
వారితో రాజకుమారుడు -- "అజగర పర్వతం పైన మీరెం సాధిస్తారో నాకూ చూడాలని ఉంది. నేను వివిధస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన వాణ్ణి. మీకు సాయంగా ఉండగలను. నన్నూ మీతో తీసుకుని పొండి " అన్నాడు.
"రావాలనుకుంటే మాతోరా ! మాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు మోహనుడు.
ముగ్గురూ కలిసే ఆరోజే బయల్దేరారు. రాజకుమారుడు కూడా గుర్రాన్ని తీసుకురావడం చంద్రిక, మోహనుడు ఆశ్చర్యంగా -- "నీకు గుర్రముందా మరి మాతో కలిసి ఎలా వస్తావు ?" అన్నాడు.
"మీరు నడిచి వెడుతున్నప్పుడు నేనూ అంతే! అప్పుడప్పుడు మనలో ఎవరైనా అలసిపోతే గుర్రం మీద కూర్చో వచ్చును " అన్నాడు రాజకుమారుడు.
"మా కోసం నువ్వు అనవసరంగా శ్రమ పడుతున్నావు" అన్నాడు మోహనుడు నొచ్చుకుంటూ.
"మీతో రావడం నా అదృష్టం " అన్నాడు రాజకుమారుడు.
ముగ్గురూ కలిసి కొంత దూరం ప్రయాణించేక రాజకుమారుడు బలవంత పెట్టి చంద్రికను గుర్రం ఎక్కించాడు. కాసేపు చంద్రిక గుర్రం మీద ప్రయాణం చేసేక రాజకుమారుడున్నట్లుండి తనూ గుర్రం ఎక్కి గుర్రాన్ని అదిలించాడు. వెంటనే గుర్రం పరుగు లంకించుకుంది.
చంద్రిక వెంటనే కెవ్వుమని కేకపెట్టి గుర్రం క్రిందకు దూకేసింది. మోహనుడాత్రుతగా ఆమెను సమీపించాడు. చంద్రిక తలకు గట్టి దెబ్బ తగిలినట్లుంది. రక్తం కారుతోంది. ఆమెకు స్పృహ లేదు.
అంతలో రాజకుమారుడు కూడా గుర్రాన్ని వెనక్కు మళ్ళించి - "మొత్తానికి నీ భార్య చిత్రమైన మనిషి. నేను తనను ఎత్తుకు పోతున్నాననే అనుకున్నట్లుంది." అన్నాడు.
'ఆమె సంగతి తెలియదు కానీ నేనలాగే అనుకున్నాను" అన్నాడు మోహనుడు.
"ఈ ప్రపంచంలో మిత్రద్రోహం అంత మహా పాపం లేదు. నేను చిన్న తమాషా చేయాలనుకున్నాను. అదే ప్రమాదమైంది ." అంటూ రాజకుమారుడాత్రుతగా అటూ ఇటూ తిరిగాడు. అతడికి గాయాల కుపయోగించే మొక్కలేవో తెలుసునట వాటి కోసం వెతుకుతున్నాడు చుట్టుపక్కల.
అతడలా వెతుకుతుండగా మోహనుడి భార్య చెంగుకు కట్టి ఉన్న బుడతడిని తన చేతుల్లోకి తీసుకుని "బుడతా! దెబ్బలేమైనా తగిలాయా ?" అనడిగాడు.
"ఆకాశం మీంచి విసిరేసినా నాకు దెబ్బలు తగలవు. దానికేం భయం లేదు గానీ ఇప్పుడేమైంది అనడిగాడు బుడతడు.
క్లుప్తంగా జరిగింది బుడతడికి చెప్పి - "ఈ యువకుడి పైన నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు ఇతడికీ, ఇతడి గుర్రానికి కూడా మెత్తటి బంధాలు విధించు" అన్నాడు.
'అలాగే చేస్తాను . కానీ రెండో కొస దేనికి కట్టేది ?" అన్నాడు బుడతడు.
"వీరబుడతా! రెండో కొస నాపగల శక్తి నీకు తప్ప ఇంకెవరి కుంది ? అవి నీ దగ్గరే ఉంచుకుని నువ్వు నా జేబులో ఉండు " అన్నాడు మోహనుడు.
ఇంతలో రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఏవో అకులున్నాయి. అతడా ఆకులను పిండి పసరు చంద్రిక తలపైన పూసాడు. కాసేపు శీతలోపచారాలు చేయగా చంద్రిక కళ్ళు తెరిచింది. అప్పుడు రాజకుమారుడు తన వద్దనున్న మూలిక తీసాడు.
'అదేమిటి?" అనడిగాడు మోహనుడు.
"మన అదృష్టం కొద్దీ దొరికింది. ఇది వాసన చూస్తె అన్ని జబ్బులూ నయమవుతాయి " అంటూ రాజకుమారుడా మూలికను ఆమెకు వాసన చూపిస్తూ 'చంద్రికా జాగ్రత్తగా వాసనా చూడు. నీ ఆరోగ్యం దీనితో కుదుట పడుతుంది " అన్నాడు. చంద్రిక అతడి కళ్ళలోకే చూస్తూ ఆ మూలికను వాసన చూసి మత్తుగా కళ్ళు మూసుకుంది.
అప్పుడు మోహనుడు కంగారుగా ఆమెను కుదిపి 'చంద్రికా ! నీకెలా గుంది?" అన్నాడు.
చంద్రిక బరువుగా కళ్ళు తెరిచి మోహనుడిని చూసింది. ఆమె కళ్ళలో ఏ భావమూ లేదు. తర్వాత ఆమె రాజకుమారుడి వంక చూసి చటుక్కున - కూర్చుని - "ప్రియా నాకేమైంది ?" అంది.
ఆమె పిలుపు రాజకుమారుడి కెంతో సంతోషం కలిగించింది. మోహనుడు మాత్రం చంద్రిక ప్రవర్తన లోని మార్పు అర్ధం చేసుకోలేక -- "చంద్రిక నేను నీ భర్తని. ఆ యువకుడు నా స్నేహితుడు అన్నాడు.
చంద్రిక చిరాగ్గా -- అదంతా నాకు తెలీదు. నాకీ యువకుడంటేనే ఇష్టం" అంది.
మోహనుడు కంగారుగా - "మిత్రమా! ఈమెకి మతి చలించినట్లుంది " అన్నాడు.
"ఈమెకు మతి చలించడమేమిటి? ఇప్పుడే స్థిరంగా ఉంది. ఈమె నన్ను ప్రేమిస్తోంది. ఈమెను నేను తీసుకుని వెళ్ళిపోతాను " అన్నాడు రాజకుమారుడు.
"దుర్మార్గుడా! నా భార్యకేం మందు పెట్టావు? ఆమెను మోసం చేసి ఎత్తుకు పోవాలనుకుంటున్నావా ? నేనది సాగనివ్వను. ఇప్పటికే నిన్ను మాకూడా రానివ్వటం తప్పయిపోయింది. నీ పాడు ఉహా గురించి ముందే తెలుసుకుని ఉండాల్సింది " అంటూ మోహనుడు రాజకుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు.
రాజకుమారుడు కోపగించుకోలేదు. "నే నెవరికీ ఏ మందూ పెట్టలేదు. నీ భార్య సౌందర్యవతి . నువ్వమెకు తగ్గవాడివి కావు. రూపంలో, శౌర్యంలో, సంపదలో నువ్వు నాకు సాటి రావు. అందుకే నీ భార్య నన్ను ప్రేమించి నాతొ వచ్చేస్తానంది. కోరి వస్తున్న ఆడదాన్ని తిరస్కరించడం మగవాడికి- అందులోనూ బలవంతుడికి తగదు. నేను బలవంతంగా తీసుకుపోతే అది నా తప్పు. కానీ ఇష్టపడి వస్తుంటే తీసుకెళ్ళడం తప్పు కాదు" అని చంద్రిక వంక తిరిగి, 'చంద్రికా ! మన ఆనందానికి అడ్డు రావద్దనీ , మన దారిన మనను పోనీమ్మనీ మోహనుడికి చెప్పు " అన్నాడు.
చంద్రిక భర్తకు అలాగే చెప్పింది. మోహనుడు నివ్వెరపడిపోయాడు. కట్టుకున్న భార్య అలా అనేసరికి అతడికి మతి పోయినట్లయింది.
అతడు దిగాలుపడి చూస్తుండగా చంద్రిక గుర్రం ఎక్కింది. తర్వాత రాజకుమారుడు ఎక్కాడు. గుర్రం కదిలింది. క్రమంగా అది దూరం కాసాగింది.
"చంద్రికా!' అని పెద్దగా అరిచాడు మోహనుడు. కానీ చంద్రిక అతడి పిలుపు అందనంత దూరంగా వెళ్ళిపోయింది అప్పటికే!
4
గుర్రాన్ని కొలను గట్టున ఆపి "మనం కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామా ?" అన్నాడు రాజకుమారుడు. చంద్రిక ఉత్సాహంగా తల ఊపింది.
ఇద్దరూ గుర్రం దిగారు.
కొలను గట్టున ఒక మామిడి చెట్టు ఉంది. చెట్టుకి పండిన మామిడి కాయలున్నాయి.