"అయితే ఇక్కడికెందుకొచ్చావ్?"
"నా పదివేలూ తీసుకుని పోవడానికి...."
"ఏ పదివేలు?"
"బుకాయించకు. అంతా నాకు తెలుసు...."
"నిజంగా నాకేమీ తెలియదు-" ఆనందు ముత్యాల్రావు.
"నేను హత్యలు చేసేవాడినే కావచ్చు. కానీ అనవసర రక్తపాతం నాకిష్టముండదు. అందుకని మర్యాదగా అడుగుతున్నాను. లేని పక్షంలో నీ వద్దనుంచి డబ్బు తెచ్చుకునే మార్గం నాకు తెలుసు...." అన్నాడతడు.
ముత్యాల్రావు ఆలోచిస్తున్నాడు. ఎవరితడు? తనవద్ద పదివేలూ ఉన్నట్లు ఇతడికెలా తెలుసు?
"వేదవతి చనిపోయి ఉంటే ఆమెను మోహన్ చంపి వుండాలి. నువ్వామెను చంపి ఉంటావంటే నేను నమ్మలేకపోతున్నాను...." అన్నాడు ముత్యాల్రావు.
"మోహన్ చంపమన్నాడు. నేను చంపాను. మోహన్ డబ్బు పాతిపెట్టమన్నాడు. నేను పాతిపెట్టాను. ఇప్పుడు మోహన్ డబ్బు తెమ్మన్నాడు. నేను తెస్తున్నాను...."
"అంటే?" ముత్యాల్రావు బుర్ర చురుగ్గా పనిచేస్తోంది.
మోహన్ చాలా తెలివైనవాడు. తెగించినవాడు. అతడి జోలికి తనవంటి సామాన్యుడు వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు.
"వేదవతి చనిపోతే-ఆమె శవం ఏమైంది?" అన్నాడు ముత్యాల్రావు.
"చంపడం నా వంతు అంతే!" అన్నాడతడు.
ముత్యాల్రావు వందరూపాయల నోట్ల కట్ట అతడికిచ్చి "ఇది నాకు క్రోటన్సు మొక్కక్రింద దొరికింది. అక్కడి కెలా వచ్చిందో నాకు తెలియదు...." అన్నాడు.
"నువ్వు చాలా బుద్దిమంతుడివి. వస్తాను...." అని అతడు వెళ్ళిపోయాడు.
"ఎవర్రా అతడు?" అంది ముత్యాల్రావు తల్లి.
"నా స్నేహితుడమ్మా!" అన్నాడు ముత్యాల్రావు.
"ఎందుకొచ్చాడు?" అంది తల్లి.
"ఎందుకా?" అని-"ఎందుకో నీ కెందుకులే అమ్మా-తర్వాత చెబుతాను. ఇప్పుడు నిద్రవస్తోంది-" అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ముత్యాల్రావు.
నిద్రవస్తోందని తల్లితో అయితే చెప్పాడుగానీ ఆ రాత్రి యెంతసేపటికీ అతడికి నిద్రపట్టలేదు. పదివేల రూపాయలు చేతికి దొరికినట్లే దొరికిపోయాయి. వేదవతి హత్య గురించిన వివరాలూ తెలిశాయి. కానీ హంతకుడిని తానేమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. తను వేదవతి శవాన్ని మాత్రం చూశాడు. ఆ శవం ఏమైందో కూడా తెలియదు.
6
ఆరోజు మోహన్ ఇంటికి వేదవతి రావలసిన రోజు.
అతడిని మళ్ళీ కలుసుకుని మాట్లాడాలంటే ముత్యాల్రావుకు భయంగా ఉన్నది. అయితే ఉత్తరం గురించి ఏమీ తెలియనట్లు నరించిన మోహన్ ముందు తనూ నటించలేడా?
సాయంత్రం ఆఫీసునుంచి ఫోన్ చేశాడు ముత్యాల్రావు.
"వేదవతి వచ్చిందండీ-" అన్నాడు మోహన్ ముత్యాల్రావుకు ఆశ్చర్యంలో నోట మాట రాలేదు.
"ఎప్పుడు?" అన్నాడతడు.
"ఓ గంటయింది. తిన్నగా మాయింటికే వచ్చింది.....
"ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందా?" అన్నాడు ముత్యాల్రావు ఆత్రుతగా.
"ఆఁ" అన్నాడు మోహన్.
"ఓ అరగంటలో వస్తున్నాను. మీ రక్కడే ఉండండి-..." అని ఫోన్ పెట్టేశాడు ముత్యాల్రావు.
ముత్యాల్రావుకి మనసు మనసులో లేదు. వేదవతి చనిపోలేదా? అయితే ఆ రోజు తను చూసిన శవం సంగతి ఏమిటి?
ఏదో నాటకం జరిగింది. అది తెలుసుకోవాలంటే తను ఆమెను కలుసుకుని మాట్లాడాలి.
సరిగ్గా అర గంటలో అతడు మోహన్ ఇంట్లో ఉన్నాడు.
తలుపులు తెరిచే ఉన్నాయి. మోహన్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. గదిలో ఇద్దరి మాటలు వినిపిస్తున్నాయి. ఒకడు మోహన్ రెండో కంఠం వేదవతిది. అందులో ఏమీ సందేహం లేదు. అయితే....
అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు ముత్యాల్రావు.
మోహన్ కుర్చీలో కూర్చుని ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతడి మాటలకు ఎదుటి వ్యక్తి నుంచి బదులువస్తున్నది. కానీ....
ఆ గదిలో మోహన్ ఒక్కడే వున్నాడు.
ఉన్నట్లుండి మోహన్ ముత్యాల్రావును చూశాడు.
"హలో-రండి.....రండి.....వేదా....ముత్యాల్రావు గారొచ్చారు...." అంటూ అతడిని సాదరంగా ఆహ్వానించాడు.
"రా....నీ గురించే మాట్లాడుకుంటున్నాం...." అంది వేదవతి.
ఆమె మాటలు వినబడ్డాయి. కానీ ఆమె అతఃడికి కనబడలేదు.
"ఆమె ఎక్కడ?" అన్నాడు ముత్యాల్రావు.
"ఆమె అంటే?" అన్నాడు మోహన్.
"వేదవతి...."
"నీ ఎదురుగా ఉంటే ఎక్కడని అడుగుతావేమిటి? ముత్యం-నీకు గానీ మతిపోయిందా?" మందలింపు స్వరం వేదవతిది వినిపించింది.
"నాకు మతిపోయినట్లే ఉంది. మాటలు వినబడుతున్నాయి గానీ ఆమె నాకు కనబడ్డంలేదు..." అన్నాడు ముత్యాల్రావు.
"ముందు-మీరిలా వచ్చి కూర్చోండి...." అన్నాడు మోహన్.
మోహన్ కి పక్కగా కూర్చున్నాడతడు.
"కనపడక పోవడానికి నేనేమైనా దెయ్యాన్నా, భూతాన్నా-" అంది వేదవతి.
అప్పుడు ముత్యాల్రావుకు అనిపించింది. ఆ కంఠస్వరం కూడా సినిమాల్లో దెయ్యాలకులా సన్నగా ఉన్నది. కానే ఎఅది వేదవతి కంఠమేనని అతడికి కచ్చితంగా తెలుసును.
"మీకు ఇంకా వేదవతి కనబడ్డం లేదా?" అన్నాడు మోహన్ నవ్వుతూ.
"మీకూ కనబడుతున్నదని అనుకోను. మీరు నన్నేదో ఆటపట్టిస్తున్నారు...." అన్నాడు ముత్యాల్రావు.
"మిమ్మల్ని ఆటపట్టించడం నాకేమవసరం...." అన్నాడు మోహన్.
ముత్యాల్రావు ఆలోచిస్తున్నాడు.
మోహన్ ఎందుకో తనతో ఆటలాడుతున్నాడు. ఎదురుగా వేదవతి లేదన్న విషయం తథ్యం. కానీ ఆమె మాటలు ఎలా వస్తున్నాయి? తన ప్రశ్నలకామె బదులెలా ఇవ్వగలుగుతున్నది? కచ్చితంగా అది టేపురికార్డరు వ్యవహారం కాదు.
మరి?
ఇంతకీ ఈ నాటకం ప్రయోజన మేమిటి?
"ఏమిటి ముత్యం - అలా మౌనంగా ఉంటావ్? ఏమైనా మాట్లాడు..."
అది వేదవతి కంఠం. సందేహం లేదు. కుర్చీలోంచే వస్తున్నది. అందుకూ సందేహం లేదు. అయితే ఆమె కనబడదేం?
ఒకవేళ....ఆమె చచ్చి దెయ్యమయిందా?
ముత్యాల్రావు లేచి కుర్చీని సమీపించాడు. అందులో తడమబోగా ఏమీ తగలేదతడికి. ఈలోగా మోహన్ అతడిని సమీపించి పక్కకు లాగి-మిష్టర్ ముత్యాల్రావ్! మీరు ప్రేమించినట్లే నేనూ ఈమెను ప్రేమించాను. మనిద్దరిలో ఎవరినామె వివాహం చేసుకుంటుందో తెలియదు. కానీ అంతవరకూ మనం ఒకరి ఎదుట ఒకరు ఆమెతో చనువుగా ఉండరాదు. నేనామెను తాకను. మీరూ ఆమెను తాకరాదు-...." అన్నాడు.
"ఆమె నాకు కనబడనప్పుడు తాకడం ప్రసక్తి ఎక్కడ?" అన్నాడు ముత్యాల్రావు నీరసంగా. ఇదంతా ఏమిటో అతడికి అర్ధంకాకుండా ఉన్నది.