వీరబుడతడు గట్టిగా నవ్వి -- "నా జుత్తు చూడు - ఏమైనా తెల్లబడిందా?" అనడిగాడు.
మోహనుడు బుడతడి జుత్తు దగ్గర పెట్టుకుని చూసి - "ఒక్క వెంట్రుక కూడా ఉన్నట్లు లేదే ! ఇంతకీ నీ వయసెంత ?" అనడిగాడు.
బుడతడు నవ్వి , - "మీరు నూరేళ్ళు బ్రతికితే మేము వెయ్యేళ్ళు బ్రతుకుతాం. మీరు పదేళ్ళు మాకు ఒక్క ఏడు. మా లెక్క ప్రకారమూ రాకుమారీ , నేనూ విడిపోయి రెండు సంవత్సరాలయింది. ఈ రెండు సంవత్సరాలేలా నివసించానో తెలియదు. ఇప్పుడు నువ్వు గుర్తు చేయగానే విరహ బాధతో నా శరీరం తపించి పోతుంది. మీ దంపతులు నాతొ వచ్చి నన్ను రక్షించరా ?" అనడిగాడు.
"రాత్రికి ప్రసన్నుడితో మాట్లాడి ఏ విషయమూ చెపుతాను " అన్నాడు మోహనుడు.
"ప్రసన్నుడు నాకు సాయపడతాడని తోచదు" అన్నాడు బుడతడు విచారంగా.
"నేను మాట్లాడుతాను గదా!" అంటూ మోహనుడు బుడతడికి ధైర్యం చెప్పాడు.
ఆరోజు ప్రసన్నుడు గుహలోకి రాగానే మోహనుడతన్ని బుడతడి గురించి అడిగాడు.
"అయితే నీకు సంస్కృతం వచ్చునా ? వాడి కధంతా చెప్పాడా ?" అన్నాడు ప్రసన్నుడు కంగారుగా.
"అవును" అన్నాడు మోహనుడు.
"వెర్రి వాడా! జీవితంలో ఒకసారి దెబ్బ తిన్నావు. నీకింకా బుద్ది లేదా ? ఇప్పుడు బుడతడ్ని రక్షించి వాడి రాజ్యానికి వాడ్ని పంపిస్తే మనకీ సదుపాయాలన్నీ ఎక్కడ నుంచీ వస్తాయి? నమ్మకద్రోహం చేయని ఇంతటి మంచి వాడు. శక్తి మంతుడు , మనుషుల్లో నీకెక్కడ దొరుకుతాడు? వాడి ఖర్మం కాలి నాకు దొరికాడు . వాడిది వెయ్యేళ్ళ ఆయుష్షు. తరతరాలు మన కుటుంబాలకు సేవలు చేసుకుని బ్రతుకుతాడు. కొంత స్వార్ధం గురించి కూడా ఆలోచించటం నేర్చుకుంటే తప్ప నీ జీవితంలో సుఖ ముండదు" అన్నాడు ప్రసన్నుడు.
"ఇది చాలా అన్యాయం. ఏది ఏమైనా సరే నేను వీరబుడతడికి సాయం చేస్తాను. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు" అన్నాడు మోహనుడు.
ఈ విషయమై కొంత వాదోప వాదాలు జరిగాయి. మోహనుడు బుడతడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానన్నాడు.
"బుడతడు నా బానిస నేను చెప్పినట్లు చేస్తానని వాడు నాకు మాటిచ్చాడు. అదికాదని వాడు నీతో రాడు." అన్నాడు ప్రసన్నుడు. అది నిజమేనని బుడతడు ఒప్పుకున్నాడు.
అప్పుడు మోహనుడు - "నీవు నన్ను బయటకు పంపటానికి ఒప్పుకొనకపోతే నేను ఈ కొండ రాళ్ళకు నా తల పగలకోట్టుకుని చచ్చిపోతాను " అన్నాడు.
అయినా ప్రసన్నుడు చలించక పోయేసరికి అతడన్నంతపనీ చేయబోయాడు. బుడతడతన్ని బలంగా పట్టుకుని ఆపేశాడు.
అప్పుడు ప్రసన్నుడు మొహనుడి భుజం పై తట్టి, "శభాష్ మోహనా! నువ్వు నా పరీక్షలో నేగ్గావు. నేను నువ్వనుకున్నంత మూర్ఖుడ్ని కాదు. బుడతడి పట్ల నాకు జాలి ఉంది. ఈరోజు నుంచి బుడతడు నా బానిస కాదు. అతడిని నేను వదిలి పెడుతున్నాను అన్నాడు.
ప్రసన్నుడు తన పరీక్షకు కారణం చెప్పాడు.
బుడతడి కధ వినగానే ప్రసన్నుడికి మనుషుల్లో అంత మంచి వాళ్ళుంటారన్న నమ్మకం కలగలేదు. తనే ఒక బిడ్డను కని వాడిని మనుషులకు దూరంగా పెంచాలనుకున్నాడట. అయితే దురదృష్టవశాత్తూ అతనికి కొడుకు బదులు కూతురు పుట్టింది. ఇదీ ఒకందుకు మంచిదేననుకున్నాడు ప్రసన్నుడు. అతను రోజూ సమీప ప్రాంతాలకు వెళ్ళి మంచి మనుషుల గురించి వెతుకుతున్నాడు. అలాంటి వాడికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేద్దామని ప్రసన్నుడి ఉద్దేశం .
'పోనీ నువ్వే మంచి మనిషిగా మార్చొచ్చుగా " అన్నాడు మోహనుడు.
'అలా కుదరదు. మనిషికి స్వతహాగా బుద్ది వుండాలి కాని మంత్రికుడ్ని చంపటం కోసం అది తెచ్చు కోకూడదు. అప్పుడు శాపమైనా, వరమైనా ఫలించదు. నా అదృష్టం కొద్ది నువ్వు దొరికావు. నీమీద ఏ కాస్తయినా అభిమానముంటే అది ఈ నాటితో తీరిపోయింది. ఇప్పుడు నాకే బెంగా లేదు. మిమ్మల్ని బుడతడికి సాయపడ్డానికి పంపడమే కాదు. ఇదో నేనూ మనుష్యుల మధ్యకు వెళ్ళి జీవిస్తాను " అన్నాడు ప్రసన్నుడు.
బుడతడి గురించి ప్రసన్నుడు చాలా లోతుగా ఆలోచించాడనీ కన్న కూతుర్ని అందుకోసమే తన లాంటి వాడికిచ్చి వివాహం జరిపించాడని అర్ధం కాగానే ప్రసన్నుడెంత మంచివాడో మోహనుడికి అర్ధమైంది. అతను క్షమించమని ప్రసన్నుడి కాళ్ళ మీద పడ్డాడు.
"నువ్వు నా కాళ్ళ మీద పడి అడగాల్సింది క్షమార్పణలు కాదు -- దీవెనెలు " అన్నాడు ప్రసన్నుడు.
3
మోహనుడు, చంద్రిక అరణ్యం దాటివచ్చి ఓ గ్రామంలో మకాం పెట్టారు. చంద్రిక బుడతడిని జాగ్రత్తగా కొంగున ముడి వేసుకొన్నది. మోహనుడు రోజూ ఉళ్ళో తిరిగి అజగర పర్వతం గురించి వాకబు చేస్తుండేవాడు.
ఆ ఉళ్ళో ఓ ముసలాయన ఉన్నాడు. అతడు పట్నం వెళ్ళాడట. అజగర పర్వతం గురించి అప్పుడప్పుడు అతడు చెబుతుంతాడట. అతను వారం రోజుల్లో వచ్చేస్తాడనీ , అంతవరకూ వేచి ఉండమనీ అయన మోహనుడి కి చెప్పాడు. అందుకని మోహనుడు పూట కూళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులుండవలసి వచ్చింది.
ఇలా ఉండగా ఆ దేశపు రాజకుమారుడు దేశ సంచారం చేస్తూ మారువేషంలో ఆ గ్రామం చేరి పూట కూళ్ళ ఇంటికి వచ్చాడు.
"ఉన్నదల్లా ఒక్కటే గది బాబూ! మరో ఇల్లు చూసుకో !" అంది పూటకూళ్ళమ్మ.
రాజకుమారుడు వెళ్ళి పోదామనుకుంటుండగా ఏదో పని మీద చంద్రిక అలా ఒసారీ వచ్చి వెళ్ళింది. మెరుపులా వచ్చి వెళ్ళిపోయిన ఆమె అందచందాలు రాజకుమారుణ్ణి ముగ్ధుణ్ణి చేసాయి.
"ఆమె ఎవరు అవ్వా?" అనడిగాడు రాజకుమారుడు.
"మా ఇంట్లో దంపతులు దిగారు. భర్త ఉళ్ళోకి వెళ్ళాడు. ఈమె అతడి భార్య" అంది పూట కూళ్ళమ్మ.
"అవ్వా -- అవ్వా! నాకూ నీ యింట్లో నే మకాం చూడవ్వా ! ఎక్కడో అక్కడ ఇంత చాప పరిచేవంటే చాలు- నిద్రపోతాను. నీదగ్గర దొరికే భోజనం మరెక్కడా దొరకదని ఊరంతా చెప్పుకుంటున్నారు." అన్నాడు రాజకుమారుడు.
"భోజనం పెట్టడానికి అభ్యంతారం లేదు కానీ, ఇంట్లో మకాం కుదరదు" అని నిక్కచ్చిగా చెప్పిందిదవ్వ.
అప్పుడు రాజకుమారుడు రెండు బంగారు కాసులు తీసి చూపించి , "ఇప్పుడూ కుదరదా ?" అన్నాడు.
బంగారు కాసులు చూడగానే అవ్వ కళ్ళు మెరిశాయి. ఎన్ని రోజులు ఎంతమంది ఉండి వెడితే అన్ని బంగారు కాసులు సంపాదించగలదు తను? అందుకని ఆమె -- "ఏదో పోరాపాటన్నాను బాబూ ! ఈ దంపతులు దిగి అప్పుడే చాలా రోజులయింది. ఎక్కువ అద్దె వస్తే నాకేమైనా చేదా ? వాళ్ళనే ఇంకో చోటికి పోమ్మంటాను " అంది.
రాజకుమారుడు కంగారుపడి - "పాపం వాళ్ళను పొమ్మనవద్దవ్వా! నేను సద్దుకుంటాను " అన్నాడు.
"రెండు బంగారు కాసులిచ్చి సర్దుకుని ఉండాల్సిన ఖర్మ నీకేం పట్టింది బాబూ! నువ్వోప్పుకున్నా వాళ్లిక్కడుండడానికి నేనే ఒప్పుకోను . కావాలంటే ఉళ్ళో కెళ్ళి అడుగు - డబ్బు తీసుకున్నాక మర్యాద చేయడంలో ఈ ఉళ్ళో ఎవరైనా నా తర్వాతే !" అంది అవ్వ.
రాజకుమారుడెంత చెప్పినా అవ్వ ససేమిరా అనడంతో "అవ్వా! వాళ్ళను కూడా ఉండనిస్తే నేనింకో బంగారు కాసు కూడా ఇస్తాను. అలా కుదరదన్నావా నాకూ నీ యిల్లక్కర్లేదు " అన్నాడు చిరాగ్గా.
"నువ్వు సర్దుకుంటానంటే నాదెం పోయింది. అలాగే ఉండు" అంటూ అవ్వ రాజకుమారుడి దగ్గర మూడు బంగారు కాసులు తీసుకుని ఉన్న నడవలో ఓ చాప పరిచి -- "గదిలో అయితే మంచముంది. ఇక్కడైతే యింతే !" అంది.
రాజకుమరుడా చాప మీదే విశ్రమించి మళ్ళీ చంద్రిక కనబడుతుందే మోనని ఎదురు చూడసాగాడు. ఆ తర్వాత చంద్రిక గదిలోంచి బయటకు రాలేదు కానీ ఉళ్ళోకి వెళ్ళిన మోహనుడు తిరిగి వచ్చాడు.
రాజకుమారుడు మోహనుడితో పరిచయం చేసుకుని అతడి కధ అడిగాడు. మోహనుడు మొత్తమంతా వివరంగా చెప్పకుండా , "అజగర పర్వతం పైన ఒక విశేషం సాధించాల్సి ఉండి మేమిద్దరమూ బయల్దేరాం. అయితే ఆ పర్వతం ఆజా- పజా ఇంతవరకూ తెలీలేదు " అన్నాడు.
"నువ్వు సాధించాల్సిన ఆ విశేషమేమిటో అన్నాడు రాజకుమారుడు.
'అది రహస్యం " అన్నాడు మోహనుడు. అజగర పర్వతం గురించి తెలుసుకోవడం కోసం తానక్కడ మకాం పెట్టాననీ, ఒకటి రెండు రోజుల్లో తనకు విషయం తెలియవచ్చుననీ చెప్పాడు. వెంటనే రాజకుమారుడు మొహనుడి చెయ్యి చూసి , "నువ్వు అనుకున్న పని తప్పక త్వరలోనే సాధిస్తావు. అంతేకాదు, నీకు మహారాజ యోగం కూడా ఉంది. నీ జాతకం గొప్ప మలుపు తిరగబోతున్నదని అన్నాడు.