ఆఫీసు నుంచి అతను తిన్నగా డిటెక్టివ్ వెంకన్న ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే కనబడిన వెంకన్న అసిస్టెంట్ ను చూసి అతను తెల్లబోయాడు. వారిద్దరూ ఇంచుమించు ఒకలా ఉండడం సంగతటుంచితే --?" ఇతర విషయాలన్నీ మరిచిపోయి -- "మీలో సుజాత ఎవరు?' అన్నాడతను.
"నా పేరు సీతమ్మ - ఈమె పేరు రాజమ్మ ...." అంది సీతమ్మ.
రాజమ్మ అతడి వంకే పరీక్షగా చూస్తూ "మైగాడ్ ...." అంది.
"ఏం -- పిలిచావు -" అంటూ పలికాడు వెంకన్న. పిలిస్తే పలికే దేవుణ్నని బయట కూడా అంటుంటాడతను.
"ఇతను ధరించిన బట్టలు సూర్యనారాయణని...."అంది రాజమ్మ.
ఆ బట్టలు తనవి కాదని తెలిసిన శరభయ్య గతుక్కుమన్నాడు.
"నన్ను కూర్చోమంటే నా వివరాలు చెబుతాను ..." అన్నాడతను.
"సరే మీరలా కూర్చుని మీ వివరాలన్నీ చెప్పండి-" అన్నాడు వెంకన్న. శరభయ్య సుజాత తన గదికి రావడం దగ్గర్నుంచీ జరిగిన కధంతా చెప్పాడు. సుజాత అక్కడున్న అమ్మాయిల్లో వున్నదని కూడా అన్నాడు.
వెంకన్న ఆశ్చర్యంగా రాజమ్మను చూస్తూ -- "అయితే నిన్న సెలవు తీసుకుని నువ్వు చేసిన పని ఇదన్న మాట--" అన్నాడు.
"ఇంతకాలం మీకు చెప్పనందుకు మన్నించండి. నా కధ కూడా వినండి -- " అంటూ రాజమ్మ మొదలు పెట్టింది.
సూర్యనారాయణ అనే అతను ప్రేమ పేరుతొ రాజమ్మ వెంట పడ్డాడు. తనతన్ని ప్రేమించకపోయినా రాజమ్మ అతన్ని చాలా పర్యాయాలు ఏకాంతంగా కలుసుకొంది. ఒక రోజు సూర్యనారాయణ రాజమ్మతో ఒక పార్కులో ఏదో మాట్లాడుతుండగా అతనికోసం రమేష్ అనే మనిషి వచ్చాడు. సూర్యనారాయణ రాజమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ అతను కనబడలేదు. అతనేమయ్యాడో కూడా తెలియదు. అతని గురించి ఎవరూ పట్టించుకోలేదు. తనకేవ్వరూ లేరని అంటుండే సూర్యనారాయణ ఉద్యోగ మేమిటో , అతని ఇల్లెక్కడో కూడా ఆమెకు తెలియదు. కొంత కాలం గడిచాక ఆమె ఆ విషయాన్ని మరిచిపోయింది.
అనుకోకుండా మొన్న ఆమెకు రమేష్ కనిపించాడు. చూస్తూనే అతడి నామే గుర్తు పట్టింది. పలకరించి సూర్యనారాయణ గురించి అడిగింది. అతను కాసేపు ఆలోచిస్తే గానీ ఏమీ చెప్పలేకపోయాడు. తర్వాత - మర్నాడోచ్చి చిన్న నాటకమాడితే సూర్యనారాయణ వివరాలు తెలుస్తాయని చెప్పాడు. రాజమ్మ సరేనని నిన్న నాటకంలో రమేష్ కు సహకరించింది. రమేష్ ఎంతవరకు నిజం చెప్పాడో తెలియదు కానీ ఇప్పుడు శరభయ్య ధరించిన బట్టలు నిశ్చయంగా సూర్యనారాయణని.
"ఏమి విశేషాలు లేవనుకున్నానీ రోజు చూస్తుండగా ఓ పెద్ద మిస్టరీ డెవలప్పయింది -- " అన్నాడు వెంకన్న- "మిస్టర్ శరభయ్యా! మీకు నాతొ రాగల ధైర్య ముందా ?"
"ఎక్కడికో చెప్పండి!" అన్నాడు శరభయ్య.
"మృత్యుమందిరానికి ...."
శరభయ్య ఓ పర్యాయం రాజమ్మ వంక చూశాడు. నన్ను రక్షించరూ అంటూ తనవంక దీనంగా చూసిన ఆ యువతీ, ప్రమాదం ముంచు కోస్తుందంటూ తన ఎదుటే బట్టలు మార్చుకొని తన్ను రెచ్చగొట్టిన జాణ - ఇప్పుడు కొత్త రకంగా చూస్తోంది. ఆ చూపులతనికి సవాలుగా నిలిచాయి. వెంటనే తలాడించాడు.
శరభయ్య , వెంకన్న అక్కణ్ణించి బయల్దేరి మృత్యుమందిరం చేసుకోవడానికి అర్ధగంట పట్టింది. కారు వెంకన్నే డ్రైవ్ చేశాడు.
9
మృత్యుమందిరం లోకి అడుగు పెడుతుంటే శరభయ్య కు గుండె ఝల్లుమంది. నిన్న రాత్రి తన అనుభవాలు, పార్వతీ చెప్పిన కధ, గోవిందరావు గది - ఒక్కటొక్కటిగా గుర్తుకు వచ్చాయతనికి.
హల్లో ఎవరూ లేరు. ఇల్లంతా నిర్మానుష్యంగా వున్నట్లుంది. ఆశ్చర్యంగా ఇద్దరూ ముందడుగు వేశారు. శరభయ్య వెంకన్న ను పార్వతి గదిలోకి నడిపించాడు.
అక్కడ మంచం మీద పడి వున్నదొక శవం! కత్తి తిన్నగా ఆమె పొట్టలోకి దిగి వుంది. రక్తంతో మంచం మీద దుప్పటీ తడిసిపోయింది.
"పార్వతీ!" అన్నాడు శరభయ్య . అప్రయత్నంగా అతడి కళ్ళ ముందు నైట్ గౌన్లో తన పక్కన పడుకొన్న పార్వతి మెరుస్తోంది. తనకు విషాదంగా వీడ్కొలిస్తోన్న పార్వతి మెదుల్తోంది - "చెల్లాయ్!" అనుకున్నాడతను" రాత్రి ఆమెతో తన ప్రవర్తన గుర్తుకు వచ్చి.
వెంకన్న హడావుడిగా చుట్టూ గమనించాడు. తన పద్దతిలో ఏవేవో పరీక్షించాడు. కాసేపటికి - "సందేహం లేదు. ఇది ఆత్మహత్యే అయుండాలి-"అన్నాడు.
"ఎలా నిర్ణయించారు?" అన్నాడు శరభయ్య.
"గదిలో పెనుగులాడిన లక్షణాలు లేవు. ఈమె పడివున్న తీరు - కత్తి పొట్టలోకి పొడుచుకుని ఉన్న తీరు- ఇది ఆత్మహత్యే నని చెప్పక చెబుతాయి-"అన్నాడు వెంకన్న.
అయితే అక్కడ ఇంకే ఆధారాలు లభించలేదు.
'మనకీ కేసులో ఆధారం రమేష్ ఒక్కడే ననుకుంటాను ..." అన్నాడు శరభయ్య.
'అవును, ఇంకా సావిత్రి , వీరేశ్వర్రావు ఉన్నారు. కానీ నాటకమాడింది రమేష్ కాబట్టి అతనికే ఎక్కువ తెలుసుండాలి...." అన్నాడు వెంకన్న.
"ఈ హత్య గోవిందరావు చేయించి వుంటాడంటారా " అన్నాడు శరభయ్య.
"ఇది హత్య కాదన్నాను గదా!" అన్నాడు వెంకన్న.
"కానీ ఉదయం పార్వతీ భయపడింది. నేనీ ఇంట్లోంచి బైటకు వెళ్ళడం వల్ల తన ప్రాణాలే పోవచ్చునెమోనని అంది..." అన్నాడు శరభయ్య.
వెంకన్న శరభయ్య మాటలు విని "ఊహూ!" అన్నాడు. తర్వాత వాళ్ళా ఇల్లంతా వెదికారు. అంత పెద్ద ఇంట్లో ఇంకెవ్వరూ మనుషులు లేకపోవడమూ సరైన సాక్ష్యాధారాలు దొరక్క పోవడమూ వెంకన్న కు ఆశ్చర్య మెననిపించింది.
"మనమిప్పుడెం చేయాలి?" అన్నాడు శరభయ్య.
"పోలీసులకు సమాచారం యివ్వడం మంచిది...."
"ఎందుకని?" అన్నాడు శరభయ్య కంగారుగా.
"పార్వతి వంటి మీద ఖరీదైన నగలున్నాయి. ఏ దొంగైనా కాజేయవచ్చు" అన్నాడు వెంకన్న. అయితే వెంకన్న తన యొక్క, శరభయ్య యొక్క ఉనికి తెలీకుండా పోలీసులకు సమాచారం అందించాడు.
10
"సార్ - ' అంది రాజమ్మ కంగారుగా.
"ఏం జరిగింది?' అన్నాడు వెంకన్న తలెత్తి చూసి.
"నేను రాత్రి రమేష్ గదికి వెళ్ళాను...." అంది రాజమ్మ.
వెంకన్న రకరకాల భావాలు మిశ్రమం చేసిన చూపు చూశాడామే వంక.
"గదికి వెళ్ళానంటే రమేష్ వుండగా కాదు. అతడు లేనప్పుడు...మారు తాళంతో తెరచి వెళ్ళాను...." అంది రాజమ్మ.
"రమేష్ గది నీకెలా తెలుసు?"
"మొన్న అంత నాతకమాడాక - అతడి నివాసం తెలుసుకోకుండా ఎలా వదుల్తాను? నేను మీ అసిస్టెంట్ ని కదా!' అంది రాజమ్మ.
"అయితే?"
"అతని గదిలో సినిమా రీళ్ళు దొరికాయి. మొత్తం అరున్నాయి. ఎందుకైనా మంచిదని తీసుకువచ్చాను...." అంది రాజమ్మ.
అంతవరకూ రాజమ్మ చేతిలోని బ్యాగును చూడనే లేదు. "వెరీ గుడ్!" అన్నాడు వెంకన్న.
ఆ రీళ్ళను తీసుకొని వెంకన్న - అసిస్టెంట్ - ఓ గదిలోకి వెళ్ళారు. గదిలో ప్రొజెక్టర్ వుంది. వెంకన్న రాజమ్మ తెచ్చిన రీళ్ళను ప్రొజెక్టర్ కు ఫిక్స్ చేశాడు.
కొద్ది క్షణాల్లోనే సినిమా ఆరంభమైంది.
ఉలిక్కిపడ్డాడు వెంకన్న. మాటలు లేని ఆ మూకీ సినిమాలో పార్వతీ ఉంది. శరీరపు వంపు సొంపులను స్పష్టంగా ప్రదర్శించే నైట్ గౌన్లో వున్నదామె మంచం మీద ఒక పురుషుడు కూర్చుని వున్నాడు. అతనామే వంక కసిగానే చూస్తున్నాడు. ఆమె, అతను ఏమేమి మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదు. కానీ చూపులను బట్టి ఆమె అతన్ని రెచ్చగొడుతోందనే అనుకోవచ్చు. అతను రెచ్చిపోతున్నాడని తెలుసుకోవచ్చు.
కాసేపు తర్వాత అతని పక్క నుంచే మంచా మెక్కిందామె. అతనామే పక్కకు తిరిగాడు. ఆమె మీద చేయి వేసి ఆమె శరీరపు వంపుల్ని తడుముతున్నాడు. ఆమె కదలికలు పరవశాన్నె సూచిస్తున్నాయి. కానీ ఉన్నట్లుండీ ఆమె లేచి కూర్చుంది. అతని వంక అదోలా చూసి మంచం మీంచి ఉరికింది. అతను కూడా మంచం మీంచి దిగాడు. ఇప్పుడామె అతన్నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అతడామెను మీద పడడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలా అయిదు నిముషాలు జరిగింది. హటాత్తుగా ఆమె మంచం దగ్గరకు చేరి తలగడ క్రింద నుంచి ఏదో తీసి చేతులో వెనక్కు పట్టుకుంది. అతడి వంక ఆహ్వాన సూచకంగా చూసింది. అతను సంతోషంగా ఆమెను సమీపించి , ఆమెను కౌగలించు కున్నాడు. ఆమె చేతులు అతడి వీపు వెనక్కు వచ్చాయి. అ చేతుల్లో పదునైన కత్తి వున్నది. అది బలంగా అతడి వీపులోకి దిగబడింది. తర్వాత అతన్నామే ఒక్క తోపు తోసింది.
ఇప్పుడామె చూపులు భయంకరంగా వున్నాయి. ఆమె సౌందర్యదేవతలా కాక మహంకాళిలా వుంది....
సరిగ్గా అక్కడే సినిమా ఆగిపోయింది.
రెండో రీలు కూడా అలాగే వుంది. మంచం మీద యువకుడు మాత్రం మారాడు.
మూడో రీల్లో రాజమ్మ - "అతడే సూర్యనారాయణ!" అని అరిచింది.
సూర్యనారాయణ వేసుకున్న బట్టలు నిన్న శరభయ్య ధరించినవె అనడంలో సందేహం లేదు. అతడు వాటిని విప్పి ఓ పక్కన పెట్టి పార్వతి విప్పిన చీరను లుంగీలా కట్టుకున్నాడు. పార్వతీ చేతిలో తర్వాత ఘోరంగా హత్య చేయబడ్డాడు.
ఒకటి కాదు... రెండు కాదు....మొత్తం ఆరు హత్యలు చేసింది పార్వతి.
ఎందుకు?
ఆరు రీళ్ళు చూసిన వెంకన్న కు ఓ అనుమానం వచ్చింది. అసలీ రీళ్ళు ఎందుకు, ఎలా తయారయ్యాయి. పార్వతి కోరికపై ఇవి తయారయ్యాయా - లేక రమేష్ వీటి సాయంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?....అసలీ కధలో రమేష్ స్థానం ఏమిటి?
వెంకన్న ఆలోచిస్తూనే అక్కణ్ణించి లేచి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అతనాలోచిస్తుండగానే అక్కడికి శరభయ్య వచ్చాడు. కంగారుగా "సార్! మీరూహించింది కరెక్టే.... పార్వతి ఆత్మహత్య చేసుకుంది. అందుకు నేనే కారకుడ్ని-" అన్నాడు.