Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 7

 

    "ఏం జరిగింది?" అనడిగాడు వెంకన్న.
    శరభయ్య అతనికి మౌనంగా ఒక వుత్తరం అందించాడు.
    అదొక పెద్ద లేఖ. పార్వతి శరభయ్య కు రాసింది.
    సంపన్న కుటుంబానికి చెందిన పార్వతి తల్లి దండ్రుల మధ్యకు విష కీటకంలా ప్రవేశించాడు సూరిబాబు. పార్వతి తల్లి జగదాంబ మీద అతను కన్ను వేశాడు. జగదాంబ చూచాయిగా అతడి దురాశను తెలుసుకున్నప్పటికీ స్త్రీ సహజమైన క్షమాగుణం తో మందలించి ఊరుకుంది. దీన్ని అలుసుగా తీసుకొని ఇంకో పర్యాయం వాడామే ఇష్టానికి వ్యతిరేకంగా అత్యాచారం చేయబోయాడు.
    అనుకోకుండా అప్పుడు పార్వతి తండ్రి రావడం జరిగింది. వాళ్ళిద్దరి కీ పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో సూరిబాబు పార్వతి తండ్రిని చంపేసి పారిపోయాడు. తనది హత్యగా ఎవరికీ చెప్పవద్దని, సూరిబాబు అత్యాచారం గురించి ప్రచారం కానివ్వద్దని ఒట్టు వేయించుకుని కన్ను మూశాడు పార్వతి తండ్రి. ఆ హత్య ఆవిధంగా రహస్యంగానే ఉండిపోయింది.
    ఆ తర్వాత సూరిబాబు మళ్ళీ ఆ ఇంట జేరాడు. తనకోసమే జగదాంబ తన భర్తను హత్య చేసిందన్న ప్రచారాన్ని లేవదీస్తానని భయపెట్టి ఆమె దగ్గర డబ్బు గుంజడం మొదలు పెట్టాడు. ఆ కుటుంబానికి వచ్చే అపనిందకు భయపడి జగదాంబ అతనడిగిన డబ్బు ఇచ్చేది. పార్వతికి పన్నెండేళ్ళు వచ్చేవరకూ ఈ వ్యవహారం కొనసాగింది.
    క్రమంగా సూరిబాబు ఆశ పెరిగిపోయింది. అతడు జగదాంబ కో పీడా అయ్యాడు. జగదాంబ తనకు లొంగిపోతే సూరిబాబు డబ్బు అడగనని చెప్పాడు.
    ఈ పరిస్థితుల్లో జగదాంబ పార్వతిని కూర్చోబెట్టి తన కధంతా చెప్పింది. ఆ కధ వింటుంటే పార్వతి రక్తం మరిగింది. ఆ సూరిబాబుని చంపేయాలని ఆవేశంగా అంది. జగదాంబ కూ సూరిబాబును చంపేయాలని వుంది. అయితే ఇందులో మూడో వ్యక్తీ ప్రమేయముండడం ఆమె కిష్టం లేదు. ఇంటి పరువుకు సంబంధించిన విషయం తమ మధ్యనే వుండాలని ఆమె వుద్దేశ్యం.
    తల్లి కూతుళ్ళు ఇద్దరూ బాగా అలోచించి ఓ పధకం వేశారు. ఆ ప్రకారం ఓ రోజున జగదాంబ సూరిబాబును తన చేతుల్లోకి ఆహ్వానించింది. ఆమె కౌగిలి లో వున్న సూరిబాబును పార్వతి వీపులో పొడిచి చంపింది. తర్వాత తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కలిసి సూరి బాబును ఇంటి దొడ్లోనే పాతి పెట్టారు.
    అయితే ఆ హత్య పార్వతిని మానసికంగా దెబ్బ  తీసింది. హత్య తర్వాత రెండు రోజులామెకు జ్వరం కూడా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమెలో విచిత్రమైన కోర్కె! మగవాళ్ళను కౌగిలిలోకి ఆహ్వానించి చంపాలన్నది ఆమె విచిత్రమైన కోరిక! ఈ కోరికను చంపుకోలేక, తల్లికి చెప్పుకోలేక ఆమె చాలా మదనపడింది. చూస్తుండగా ఏళ్ళు గడిచి ఆమె యుక్త వయస్కురాలైంది. ఒక కారు ప్రమాదంలో జగదాంబ చనిపోగా మేనమామ నన్న పేరుతొ గోవిందరావా యింట చేరాడు.
    అతడు పక్కా వ్యభిచారి. తాగుబోతు, అతడికి నా అన్నవాళ్ళు ఎవ్వరూ వున్నట్లు లేరు. పార్వతీ అతడిని వుండమనలేక పొమ్మనలేక నానా అవస్తా పడింది. అండలేని అడదానికో తోడు అవసరమని గ్రహించి గోవిందరావామే భరించింది. గోవిందరావు పార్వతిని తనకు భార్యను చేసుకోవాలను కున్నాడు గానీ అసలుకే మోసమని గ్రహించి నిగ్రహించుకున్నాడు.
    పార్వతికి డ్యాన్సు నేర్పాలన్న మిషతో అతను కొంత మంది ఆడవారిని ఇంటికి రాప్పించుకుంటూ ఉండేవాడు. ఆ ఏర్పాట్లన్నీ అతడికి రమేష్ అనే ఆటను చేస్తుండేవాడు. అప్పుడే రమేష్ కూ పర్వటికీ పరిచయ మైంది. రమేష్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు కానీ అతగాడికి పురుషత్వం లేదు. ఆడవాళ్ళ ననుభవించే ఆవేశం, శక్తి అదృష్టం- అతడికి లేవు. అందుకే అతడికి వయసులో ఉన్న పురుషులంటే అసూయ. ఈ సందర్భంలో పార్వతి రమేష్ కీ అభిప్రాయాలు కలిశాయి. అప్పుడే పార్వతి మనసులోని కోరిక పురి విప్పింది. రమేష్ అందుకు తన సహకారాన్ని వాగ్దానం చేశాడు.
    ఆరునెలల క్రితం హత్యా కాండ! ప్రారంభమై ఏదో రూపంలో మోసం చేసి మగవాళ్ళను మూడో వాడికి తెలీకుండా పార్వతీ దగ్గరకు రప్పించేవాడు రమేష్. పార్వతీ తెలివిగా ప్రవర్తించి తన కసి తీరా హత్య చేసేది. దాన్ని పక్క గదిలోంచి సినిమాలుగా తీశాడు రమేష్, అది తన ఆనందానికే అని అతను చెప్పినా -- ముందు ముందు తన్ను తన గుప్పెట్లో ఉంచుకోడాని కేనని పార్వతి గుర్తించింది. అయినా ఆమె బాధ పడలేదు. పురుషులంటే ఒక విధమైన ద్వేషం ఏర్పడి పోయిన ఆమెకు స్త్రీ త్వానికి సంబంధించిన కోర్కెలు లేవు. రమేష్ ను వివాహం చేసుకునేటందుకు కూడా ఆమెకు అభ్యంతరం లేదు.
    ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం గోవిందరావు పార్వతి వద్ద హద్దు మీరాడు. అతడు తనకిక లొంగదని , తన మాట వినదని గ్రహించిన పార్వతి మంచిగా నటించి కౌగిలిలోకి ఆహ్వానించి అతన్నీ చంపేసింది.
    అయితే గోవిందరావు అంటే యింట్లో ని నౌకర్లకు కొందరికి చాలా అభిమానం. వారికి అతడి చావు గురించి తెలీకుండా ఉండడం కోసం, అతడింకా బ్రతికున్నట్లు వారిని నమ్మించడం కోసం  శరభయ్య ను అడ వేషంలో ఇంటికి రప్పించడం జరిగింది. అందువల్ల రెండు ప్రయోజనాలు. గోవిందరావు కోసం ఆడపిల్ల వచ్చినట్లు అవుతుంది. పార్వతి చేతిలో చావడానికి ఓ మగాడూ దొరుకుతాడు.
    శరభయ్య మగాడని తెలిసీ తెలియనట్లు నటించింది పార్వతీ. అందువల్ల అతన్ని రెచ్చ గొట్టడం మరింత సులభమయిందామెకు. అయితే శరభయ్య తన్ను తానూ నిగ్రహించుకున్నాడు. అతని సచ్చీలత, మనోనిగ్రహం పార్వతినీ ముగ్ధురాల్ని చేశాయ్. ఆహ్వానించే చూపులతో పక్కన పడుకున్న ఆడదాన్ని చెల్లీ అని పిలవగలిగిన సహృదయతకు ఆమె చలించిపోయింది. మొదట్లో అతని చూపుల్లోని వాడిని, ఒంటి వేడినీ ఆమె స్పష్టంగా తెలుసుకో గలిగింది. అతడు తన్ను తాను నిగ్రహించుకుందుకు చేసే ప్రయత్నాలన్నీ గమనించి ఆమె ఆశ్చర్యపోయింది. పక్కన ఉంటె నిగ్రహించుకోలేని క్రింద పడుకున్నప్పుడామే మనసు పాడై పోయింది.
    పురుషులలో మహాత్ము లున్నారనీ , యెవడో సూరి బాబును దృష్టిలో ఉంచుకుని తను చేస్తున్న హత్యలు ఘోరాతీఘోరమైనవని గ్రహించిందామె. జీవితం మీద విరక్తి కలిగింది. శరభయ్య ను వెళ్ళనిచ్చి -- అతని పేర ఓ ఉత్తరం రాసింది. రమేష్ ద్వారా అతని చిరునామా సంపాదించి రమేష్ కు తెలీకుండా ఉత్తరాన్ని పోస్టు చేసింది. తర్వాత ఆత్మహత్య చేసుకుని జీవితాన్నంతం చేసుకుంది-
    ఇదీ ఆ ఉత్తరంలోని సారాంశం. ఆ ఉత్తరం చదవడం అయ్యేక వెంకన్న లేచి శరభయ్య కు షేక్ హ్యాండిచ్చి "గౌతముడు మనిషిని రాయి చేస్తే రాముడు రాయిని మనిషిగా మార్చాడు. నువ్వు చెప్పిన కధను మొదట నేను పూర్తిగా నమ్మలేదు. నావంటి వెయ్యి డిటెక్టివ్ లు కలిసినా చేయలేని ఒక గొప్ప పని నీ సచ్చీలత చేయగలిగింది. ప్రపంచానికి ఒక దారుణ హంతకురాలి పీడ విరగడ చేశావు. ఓ మృత్యుమందిరాన్ని నాశనం చేశావు. నిన్ను నేను అభినందించక తప్పదు-" అన్నాడు.
    రాజమ్మ వెంకన్న వంక అదోలా చూస్తూ -" బాస్ ! నాదో చిన్న అనుమానం. ఒకవేళ ఈయన కూడా రమేష్ లాగే ...." అని కిసుక్కున నవ్వింది.
    "మిస్ సుజాతా! మీ అనుమానాన్ని మీలో అలాగే ఉంచుకోండి. కానీ మళ్ళీ నాకు పరీక్షలు మాత్రం పెట్టకండి. ఘోష యాత్రలో కారావు లోడించ లేని గంధర్వుల్నీ , ఉత్తర గోగ్రహణంలో భీష్మ ద్రోణాదుల్నీ అవలీలగా ఓడించిన అర్జునుడు కురుక్షేత్రం వచ్చేసరికి నానా యాతనలు పడ్డాడు..."  అన్నాడు శరభయ్య.
    "అయితే ....." అని రాజమ్మ ఏదో అనబోగా -- "
    "మిస్ రాజమ్మా -- శరభయ్య గారి మీద జోక్స్ వేస్తె నేను సహించలేను. ఐ అడ్మైర్ హిమ్-- " అన్నాడు వెంకన్న సీరియస్ గా.
    "జోక్ కాదు బాస్ ....చిన్న రిక్వస్ట్ ...." అంది రాజమ్మ.
    "ఏమిటది?" అనడిగాడు వెంకన్న.
    "మా వీధిలో ఓ నాటకం వేస్తున్నారు. హీరోయిన్ వేషానికి యెవ్వరూ దొరక్క నానా అవస్థా పడుతున్నారు. శరభయ్య గారోప్పుకుంటే ...." అని ఇంకా ఏదో అనబోయి ఆగిపోయింది రాజమ్మ.
    ఒప్పుకోవడానికి శరభయ్య అక్కడ లేడు.

                         ----అయిపొయింది ---- 

 Previous Page Next Page