శరభయ్య కన్నులు మూత పడలేదు. అప్రయత్నం గానే అతనామెను మరోసారి చూశాడు. ఆ నైట్ గౌను వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే! ఒక కన్నెపిల్ల తన పక్కన నగ్నంగా పడుకున్నట్లే ఉంది. తను ఆడదని భ్రమ పడకపోతే ఏ ఆడపిల్లా అలా పక్కన పడుకోడు.
శరభయ్య త్వరగానే తమాయించుకుని తన మీద నున్న ఆమె చేయి క్రింద పెట్టి -- "మనిషికి మనిషి దగ్గరగా పడుకుంటే నాకు నిద్ర పట్టదు--" అని దూరంగా జరిగాడు.
కాస్సేపటికి పార్వతి నిద్రపోయింది. కానీ శరభయ్య కు నిద్ర పట్టలేదు. అప్పుడప్పుడతనామే వంక చూసి మనసు చెదర గోట్టుకుంటున్నాడు. వళ్ళు వేదేక్కించుకుంటున్నాడు. అంతరాత్మ మాత్రం అతన్ని అదేపనిగా హెచ్చరిస్తోంది- "శరభయ్య!నువ్వు చిన్నప్పట్నించీ యెలా పెరిగావు? నీ గోప్పతనానికిది ఒక పరీక్ష. నువ్వామేను చూసి చలిస్తే అది మృగ లక్షణమే అనిపించుకుంటుంది -"
అడదానికీ మగవాడికి ఉన్న అనుబంధం మృగ లక్షణమా?
"కానీ ఆ ఆడది నీ చేల్లెలైతే?"
"చెల్లెలైతే అన్న పక్కన ఇలా పడుకుంటుందా- ఈ వయసొచ్చాక?"
"కానీ నువ్వు అన్నవి కాదు. అక్కవి...."
ఉలిక్కిపడ్డాడు శరభయ్య. తను అన్నయ్య కాదు. అక్కయ్య . తన పక్కన పడుకున్న పార్వతి తన చెల్లెలు. ఒక్కసారిగా శరభయ్య లోని సంస్కారం ఆవులించి నిద్రలేచింది.
అప్పటికప్పుడు నిద్రపోతున్న పార్వతీ నతడు తట్టి లేపాడు.
పార్వతీ ఆవులిస్తూ - "ఏమిటీ?' అంది. మత్తు విడి అమెకన్నుల్లో ఏదో అనుమానం తొంగి చూస్తొంది. శరభయ్య కు అర్ధం కాని మార్పు ఆ కన్నుల్లో చోటు చేసుకుంటోంది.
"చెల్లాయ్ " అన్నాడు శరభయ్య స్త్రీ కంఠంతో.
పార్వతి ఉలిక్కిపడి -- "ఏమన్నావ్!" అంది.
"అవునమ్మా -- నిన్నలాగే పిలుస్తాను...." అన్నాడు శరభయ్య.
"సరే - ఈ సంగతి చెప్పడానికింత రాత్రి లేపాలా! అంది విసుగ్గా ఆవలిస్తూ పార్వతి.
"అది కాదమ్మా- వయసొచ్చిన ఆడపిల్లవు. మరీ ఇల్లా పడుకోవడం బాగుండదు. ఈ నైట్ గౌన్ నాకు నచ్చలేదు. చీరా, జాకెట్టు వేసుకుని పడుకో --" అన్నాడు శరభయ్య.
"మనింట్లో మనం యెలా పడుకుంటే నేం ?" అంది పార్వతి పెంకెగా.
"నీకు స్వతంత్రం లేని ఈ ఇల్లు నీదేలా అవుతుంది? ఈ ఇంట్లో ఎవరి మీదా నీకు అదుపు లేదు. ఏ మూల నుంచి ఎవరు చూస్తున్నారో తేలియాడు కదా - నా మాట విను. కనీసం నీ పక్కన పడుకున్నంత కాలమైన నేను చెప్పి నట్లు విను...." అన్నాడు శరభయ్య.
"వినకపోతే --"
"నేను క్రింద పడుకుంటాను ...." అన్నాడు శరభయ్య.
"పడుకుంటే పడుకో -- నేను ఇలాగే పడుకుంటాను అంది పార్వతి.
ఆమె అలా అన్నదే తడవుగా శరభయ్య మంచం దిగి క్రింద పడుకున్నాడు. తలగడ కూడా తీసుకోలేదతను. కానీ ఓ రాత్రి వేళ లేచి చూస్తె అతని తల క్రింద దిండు ఉన్నది. వంటి మీద దుప్పటి కప్పి వుంది. మంచం మీద దుప్పటీ కప్పుకుని ఉన్న పార్వతి కనిపించింది. నైట్ గౌన్ మంచం పక్కన పడి వుంది. తొలగిన దుప్పటి క్రింద చీరలో కప్పబడి వున్న ఆమె కాళ్ళు కనపడుతున్నాయి.
శరభయ్య తృప్తిగా నిట్టూర్చాడు. అతడి మనసిప్పుడెంతో తేలిగ్గా వున్నది.
8
శరభయ్య అలా ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు గానీ -- పార్వతీ తట్టి లేపెవరకూ అతనికి మెలకువ రాలేదు. ముసుగులోంచే "ఊ" అన్న శరభయ్య కు వాస్తవం అర్ధం కావడానికి కొన్ని క్షణాలు మాత్రమే పట్టింది.
అతడొక పర్యాయం బుగ్గలు తడుముకున్నాడు. మరీ అంత గరుకుగా లేవు. అదృష్టవశాత్తు తనకు గెడ్డం మయడానికి మూడు రోజులైనా పడుతుంది. ఎటొచ్చీ అడవేశంలో వున్నాడు కాబట్టి రోజుకొకసారైనా గీయక తప్పదు.
"టైము తొమ్మిదయింది --" అంది పార్వతి.
ముసుగులోంచే అన్నీ సవరించుకుని లేచాడు శరభయ్య.
"త్వరగా కాలకృత్యాలు ముగించండి మేస్టారూ! టిఫిన్ సిద్దంగా వుంది-" అంది పార్వతి.
"మీ మామయ్య గోవిందరావు గదేక్కడమ్మా -" అన్నాడు శరభయ్య.
'అది మగాళ్ళ గది, అదెందుకు మీకు?" అంది పార్వతి.
"నేనక్కడే స్నానం చేస్తాను...." అన్నాడు శరభయ్య. పార్వతీ అతడి వంక విచిత్రంగా చూసి - " సరే పదండి-" అంటూ ఓ గదిలోకి తీసుకు వెళ్ళింది...." ఇదే మా మామయ్యా గది -- బాత్రూం దీన్నానుకునే వుంది.
శరభయ్య ఆ గదిని చూశాడు. సినిమాలో విలన్ల గదిలా వుందది. మంచం పక్కన ఓ బల్ల. బల్ల మీద భయంకరంగా నోరు తెరచిన పులి బొమ్మ. మంచాన్నానుకుని వున్న గోడకు బుస కొడుతున్న నాగుల బొమ్మలు తగిలించి వున్నాయి. గది గోడలకు శృంగార చిత్రాలున్నాయి.
"ఇన్నాళ్ళని చెప్పలేను కాని మామయ్యా మీరు ఈ గదిలో కనీసం ఒక్క రోజైనా వుంటారు --" అంది పార్వతి. ఆ మాటలు వింటూనే శరభయ్య శరీరం జలదరించింది. అతను వెంటనే బాత్ రూమ్ లోకి దూరి తలుపులు వేసుకొన్నాడు.
ఈ గదిలో శరభయ్య కు చాలా ఫ్రీగా వుంది. ముఖ ప్రక్షాళన చేసుకొన్నాడు. అక్కడ వున్నా షేవింగ్ పెట్టె ఉపయోగించి గెడ్డం గీసుకున్నాడు. హాయిగా స్నానం చేసుకున్నాడు. స్నానం అయ్యాక బాధగా, దీనంగా తను వేసుకోవలసిన బట్టలు వంక చూశాడు- "ఇంకా ఎన్నాళ్ళీ వేషం?'అనుకుని నిట్టూర్చి బట్టలు వేసుకుంటుండగా అతనికి రెండు విషయాలు గుర్తుకొచ్చాయి! తనీరోజు వ్యాయామం చేయలేదు, తనకు ఆఫీసుకు టైమైంది.
అవును....తను ఆఫీసు సంగతి ఇంతవరకూ ఎలా మర్చిపోయాడు?
తనకు క్యాజువల్ సెలవులు చాలా వున్నాయి. కానీ ఈ భవనం లో ఎన్నాళ్ళు చిక్కుబడి వుంటాడు? ఇక్కణ్ణించి పోయే ప్రయత్నమేదైనా చేయవద్డా?
అదెలా సాధ్యం -- ఇది మృత్యుమందిరం!
శరభయ్య స్నానాల గదిలోంచి బైటకు వచ్చి పార్వతి గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే - "మళ్ళీ అదే బట్టలు వేసుకోచ్చారా మేస్టారూ!" అంది పార్వతి.
"అవును...."అన్నాడు శరభయ్య.
"నేనిస్తాను మంచి బట్టలు , మార్చుకోండి...."
"నేను మార్చుకోను. నేనిప్పుడిక్కడినుంచి వెళ్ళి పోబోతున్నాను...."అన్నాడు శరభయ్య.
"వెళ్ళిపోతారా....ఎలా?" అంది పార్వతి ఆశ్చర్యంగా.
"ఎలా వచ్చానో - అలాగే !" అన్నాడు శరభయ్య.
"మీ ప్రాణాలకే ప్రమాదం!' అంది పార్వతీ.
'అయినా ఫరవాలేదు. గోవిందరావు వచ్చేలోగా వెళ్లిపోవాలనే నా ప్రయత్నం....."
"మీరు ప్రమాదం లేకుండా వెళ్ళ గలిగితే ....నాకు ప్రమాదం ...." అంది పార్వతి.
"పార్వతీ -- నువ్వు ప్రమాదంలోనే పుట్టి పెరిగావు. చేతనైనంత లో నాకు సాయపడు. నేను బైటపడితే నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తాను...."అన్నాడు.
పార్వతి క్షణం అలోచించి -- "ఈ ఇంట్లోంచి స్త్రీ లెవ్వరూ బైటకు పోలేరు. మా మామయ్య బట్టలు వేసుకుని పురుష వేషంలో బయట పడడానికి ప్రయత్నించండి. ఆపైన మీ అదృష్టం ఎలా వుంటే అలా జరుగుతుంది-' అంది పార్వతి.
శరభయ్య తిరిగి గోవిందరావు గదిలోకి వెళ్ళాడు. ఒక బీరువా తెరచి బట్టలు బైటికి తీశాడు. ఒక పాంటు అతనికి చాలా పొడుగైనది. మరొకటి చాలా పొట్టిదయింది. ఒకటి బాగా బిగుతయింది. ఒకటి మరి లూజుగా వుంది. ఇలా అన్నీ తలో రకంగా ఉండడం అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం మీద ఒక జతను అతను ధరించి మలేలే పార్వతీ దగ్గరకు వెళ్ళాడతను.
"అచ్చం మగవాడి లాగున్నారు..." అంది పార్వతి అతన్ని అబ్బురంగా చూస్తూ.
"రాత్రి నీకు అక్కను, ఇప్పుడు నీకు అన్నను...." అన్నాడు శరభయ్య స్త్రీ కంఠన్ని వదలకుండా.
'అయితే ఇంక వెళ్ళండి మేస్టారూ!" అంది పార్వతి.
శరభయ్య పార్వతి గదిలోంచి హాల్లోకి వచ్చాడు. అదృష్టవశాత్తు అతని నెవరూ అడ్డగించ లేదు.
టాక్సీ కనబడితే ఎక్కాడు. ఆఫీసు దగ్గరే దిగాడు. జేబులో డబ్బుల్లేవు. ఆఫీసులో ఎవర్నో అడిగి ఇచ్చేశాడు.
అయితే తనకేమీ కానందు కూ , తను మృత్యుమందిరం లోంచి బైటపడి ఇంకా జీవించే ఉన్నందుకూ అతని కెంతో ఆశ్చర్యంగా వుంది. ఆ ఆశ్చర్యనుంచి సాయంత్రం వరకూ బైట పడలేకపోయాడతను. అప్పటికతను ఈ లోకంలోకి వచ్చి - "పార్వతీని రక్షించాల్సిన బాధ్యత ఒకటి నా పైన ఉంది-" అనుకున్నాడు.
అయితే ఈ విషయం ఎక్కడ చెప్పాలి? పోలీసులకు చెబితే ....? అతని ఆలోచన ఇంకా తేలకుండానే డిటెక్టివ్ వెంకన్న పెరతనికి గుర్తుకొచ్చింది. ఈ విషయంలో అయన సలహా తీసుకొంటే మంచిదనిపించింది.