Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 6


    "అయింది సార్."

 

    "ఇప్పుడు చెప్పు- ఏమర్థమైంది?"

 

    "అందరూ సప్లయ్ చెయ్యలేరని."

 

    "ఇందులో ఏదో తిరకాసు వుంది" అంటూ కీచైన్ వేగంగా తిప్పడంతో, అది చేతిలోంచి ఎగిరిపోయి, ఆడపిల్లల బెంచీవైపు దూసుకెళ్ళింది.

 

    "నా కీచెయిన్..... కీచెయిన్...... చూడమ్మా ఆండాళ్ళు...... ఆ కీ చెయిన్ నీవైపే పడింది" అంటూ ముందుకెళ్లాడు నారాయణ.

 

    జవాబు చెప్పకుండా, ఆండాళ్ళు ఒక్కసారిగా మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడిపోసాగింది.

 

    "కీచెయిన్ ఇమ్మంటే...... సిగ్గు పడతావేం..... క్లాస్ రూంలో సిగ్గుపడకూడదు. రేపు పెళ్ళయ్యాక బెడ్ రూంలో సిగ్గుపడు..... మీ ఆయన ఝడుసుకుంటాడు........" అన్నాడు నారాయణ.

 

    "అది కాదు సార్! కీ చెయిన్ పడగూడని చోట పడిందండీ....." అంది పక్కనున్న అమ్మాయి.

 

    "ఎక్కడ" కంగారుగా అడిగాడతను. ఇక్కడ అంటూ గుండెల వేపు చూపించింది ఆండాళ్ళు.

 

    "అంతేనా..... జాకెట్లో బాంబేవీ పడలేదు కదా..... కీ చెయిన్  కదా..... తీసిచ్చెయ్....." అంటూ, అబ్బాయిలూ! ఇవాళ క్లాస్ కాన్సిల్. మీరందరూ బయటకెళ్ళి- మన ఆండాళ్ళు నాకు కీచెయిన్ ఇచ్చేస్తుంది..... పదండి....... అంటూ అందర్నీ బయటకు తోలేశాడు నారాయణ.

 

    "మీరు కూడా..... మాలాంటి పురుష పుంగవుడే కదా - మీరు కూడా  బయటికి రండి....." ఎవరో స్టూడెంట్స్ అరిచాడు.

 

    "అవును! పురుష పుంగవుణ్ణే..... మహా పురుష పుంగవుణ్ని...." అంటూ బయటకు నడిచి డోర్ దగ్గర నిలబడ్డాడు. మూడు నిమిషాల తరువాత ఆండాళ్ళు, కీ చెయిన్ ని తెచ్చి, నారాయణ చేతిలోపెట్టి, తుర్రున బయటకు పరుగెత్తింది.

 


                                            *    *    *

 

    డైనింగ్ టేబుల్ ముందు, ఎదురెదురుగా కూర్చున్నారు నారాయణ, మధు.

 

    "నేను టేబుల్ ముందు, సైకిల్ మీద కాలేసుకుని, శివ సినిమాలో నాగార్జున టైపులో నిలబడితే, ఏ ఆడపిల్ల కూడా కన్నెత్తి చూడదని....." ఉపోద్ఘాతంలా అన్నాడు నారాయణ.

 

    నిజమే అనుకున్నాడు మధు. అయినా ఆ విషయాన్ని ఇప్పుడు తనకెందుకు చెబుతున్నట్టు? ఏమిటో...... ఒక మాటకీ మరో మాటకీ లింకు వుండదు. ఎప్పుడు, ఏది , ఎందుకు మాట్లాడుతాడో ఏమీ అర్థమైచావదు. ఏ ఆడపిల్ల కూడా నన్ను కన్నెతి చూడలేదు- అని తనంటే, ఆయన మాటలకి అర్థముండేది.

 

    "రేపట్నించి నువ్వు లేటెస్ట్ బ్రాండ్ కారులో కాలేజీకి వస్తేనే..... ఏ ఆడపిల్లయినా చటుక్కున నీ వలలో పడిపోద్ది - నా వలలో మా ఆవిడ పడిపోయినట్టు....." గర్వంగా, విచిత్రంగా నవ్వుతూ అన్నాడు మైదానం నారాయణ.

 

    "నేనెప్పుడు వలలో పడ్డాను? అంతా బడాయి....." నారాయణ పెళ్ళాం అంది- అప్పుడే టీ తీసుకుని వంటగదిలోంచి వస్తూ.

 

    "పడ్డావు! అప్పుడు నీకా విషయం తెలీదు" భార్యని దబాయించేశాడు మైదానం నారాయణ.

 

    "ప్రేమను చీటింగ్ తో మొదలెట్టమంటారా? అయినా ఇంతవరకూ నేనెప్పుడూ ప్రేమ గురించి ఆలోచించలేదు."

 

    "తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు, ఎవరైనా, ఎవరో ఒకరితో, ప్రేమలోపడి తీరాల్సిందే. లేదంటే జీవితానికి అర్థం వుండదు. అర్థమైందా?"

 

    మరో పావుగంటసేపు ప్రేమ గురించి నారాయణ మధుకి హితబోధ చేశాడు. ఇప్పుడు తన ప్రేమ గురించి ఈయనెందుకు వర్రీ అయిపోతున్నాడు?

 

    మధుకి ఒక్క ముక్క కూడా అర్థమై చావలేదు.

 


                                            *    *    *    

 

    ఉదయం పదిగంటల ముప్ఫై నిమిషాలు.......

 

    సరిగ్గా అదే సమయంలో కాలేజీ మెయిన్ గేటులోంచి సర్రుమని దూసుకువచ్చిన వైట్ కలర్  టాటాసుమో వాళ్ళకి కొంచెం దూరంలో ఆగింది.

 

    "ఎవరిదిరా...... టాటాసుమో......" ఎలుగెత్తి అన్నాడు గుండు.

 

    "కొత్తది! న్యూ బ్రాండ్ అంటే..... అంటే న్యూబ్రాండ్ అమ్మాయి...... ఆహా! ఏమి నా అదృష్టమూ.... ఫలించెను గదా....." అంటూ ఎడా పెడా కాళ్ళూపసాగాడు రమణ. మిగతా మిత్రులందరూ కళ్ళప్పగించి చూస్తున్న సమయంలో డోరు తెరుచుకోవడం, అందులోంచి నాజూకు, బంగారు తీగలాంటి అమ్మాయి దిగడం, వాళ్లందరివేపు చూడడం జరిగిపోయింది. ఆ నాజూకు సుందరి పేరు నిఖితాఖేడియా- ఆ అమ్మాయి రవీంద్రనాధ్ టాగూర్ గీతాంజలికి మానవాకృతిలా బ్లౌజ్...... కళ్ళకి రేబాన్ కూలింగ్ గ్లాసెస్.

 

    నేలమీద కాలుపెట్టిన నిఖితా ఖేడియా ముఖమ్మీద పడుతున్న జుట్టును పక్కకు తీసుకుని అప్రయత్నంగా ఎదురుగా నుంచున్న కుర్రాళ్ళవేపు చూసింది. తమవేపే వస్తున్న నిఖితావేపు దిగ్భ్రాంతిగా నరాలు తెగిపోయేటంత టెన్షన్ తో చూస్తున్నారు తేజ, గుండు, మధు తదితరులు. తేజ జేబులోంచి చిన్న దువ్వెన తీసి తల దువ్వుకోవాలనుకుని, ఆ ప్రయత్నాన్ని విరిమించేసుకుని ముందుకి ఒకడుగు వేసి నుంచున్నాడు.

 

    నిఖిత డైరెక్ట్ గా మధు ముందుకొచ్చి నిలబడి నవ్వింది. ఆ నవ్వు ఒకేసారి పూచిన వేయి పారిజతా పుష్పాల వికసనంలా వుంది.

 

    "హలో..... అయామ్ నిఖిత...... నిఖితా ఖేడియా..... న్యూ కమర్ టు దిస్ కాలేజ్....."

 

    "అయామ్..... మ..... మధు....." తడబడ్డాడు మధు.

 

    "సీ...... యూ.... అండ్ థాంక్ యూ....." మిగతా వాళ్లెవరివైపూ చూడకుండా ముందుకెళ్లిపోయింది నిఖిత.

 

    ఆమె వెళుతున్న వేపే అందరూ బొమ్మల్లా చూస్తూ వుండిపోయారు.

 

    "బంగారు కాంతి...... మన ముందు నుంచి వెళ్ళిపోయినట్టుగా లేదూ అన్నాడు గుండు.

 

    "ఒరేయ్! మాన మధు లక్కీ ఫేలోరా. లక్కీ ఫెలో సంవత్సరాల తరబడి ఈ గేటు దగ్గర కాపలా కాస్తున్నాం. ఒక్క ఏడాది కూడా ఒక్క బ్యూటీక్వీన్ మాన  దగ్గరకొచ్చిందా? పలకరించిందా? మధు లక్కీ ఫెలో...... మాధురీ దీక్షిత్ ఇలా కాలేజీలోకి అడుగుపెట్టిందో లేదో అలా  మధుగాడి చూపుల వలలో పడిపోయింది....." అందరూ మధుని కంగ్రాట్స్ చేసేస్తున్నారు. మధుకి కూడా ఆ  సన్నివేశం చాలా ఇన్ స్పయిరింగ్ గా  వుంది. అతని హృదయంలో ప్రేమజలపాతాలు వడివడిగా పరుగెడుతున్నాయి...... నోట మాట రాలేదు. గుండుబాబు మాత్రం పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. 'నాకిలాంటి పిల్లే కావాలి' అని మనసులో అనేసుకున్నాడు.

 


                                             *    *    *    

 

    పదినిమిషాల తర్వాత సీన్, కాలేజీ క్వాంటీమ్ లోకి మారింది.

 

    "వీజీగా కోటి రూపాయలుంటుంది........" అన్నాడు రమణ కూల్ డ్రింక్ ను సిప్ చేస్తూ.

 

    "ఏమిటి! ఆ అమ్మాయి రేటా?"

 

    "ఛీ! అదికాదు. ఆమె ఆస్తి..... నీ ఆస్తి ఎంతరా......?" అడిగాడు మధుని రమణ.

 

    "ఇప్పుడు ఆస్తుల గొడవెందుకురా?" మధు చిరాకు పడ్డాడు.

 

    "ఆ అమ్మాయి మాకందరకూ నచ్చింది. కానీ లిటిగేషన్ ఏంటంటే, ఆ అమ్మాయి నిన్ను మొదట విష్ చేసింది- దగ్గరగా వచ్చి మరీ..... అంచేత న్యాయశాస్త్రం ప్రకారం..... ఆమెను ప్రేమించడానికిగానీ, పెళ్ళి చేసుకోడానికి గానీ...... నీకే ఫస్ట్ ఎలిజిబులిటీ వుంది. నువ్వు కాదంటే, నేను లైన్ వేసుకుంటాను. కానీ కొంచెం కాస్ట్ లీ  వ్యవహారం...." చెప్పుకుపోయాడు తేజ.

 

    "ప్రేమ గురించి నా అబ్జర్వేషన్స్ వినండి.....

 

    ఒకప్పుడు ప్రేమ వేరు, పుస్తకాల్లో చాదస్తపు ప్రేమ. రొమాన్స్ గీతాలకూ, యువతీ, యువకుల విరహాలకూ ఆ ప్రేమ నిదర్శనంలా వుండేది. ప్రస్తుతం మనం అణ్వాయుధాల యుగందాటి, లేసర్ కిరణాలను దాటిపోయాం. కంప్యూటర్ యుగంలో వున్నాం..... కొత్త సహస్రాబ్దంలోకి మనం వెళుతున్నాం..... ఇప్పటి యువతీ యువకులకు ప్రేమ, ప్రణయం సూపర్ మార్కెట్ లో దొరికే కమ్మోడిటీ. అంటే ఇంతకు ముందు ప్రేమ, ఇచ్చి పుచ్చుకునే హృదయాల అనుభూతి. ఇప్పుడు కొనుక్కునే, మార్కెట్ లో లభ్యమయ్యే ఖరీదైన వస్తువు. ఇప్పటి ప్రేమకు పెట్టుబడి కావాలి -  ప్రేమించడం, ప్రేమించబడటం అంతా ఖరీదైన వ్యవహారం..... క్షణికమైన ఫాస్ట్ ఫుడ్ లాంటిది ఇప్పటి లవ్. జీవితం అనే మార్కెట్ లో ప్రేమ రోజు రోజుకీ రేటు మారిపోయే విలువైన బ్రాండ్ లాంటిది. రేబాన్ కళ్ళజోళ్ళు, ఉడ్ లాండ్ షూస్, రాడో వాచీలు, హెన్రీ హిల్ షర్ట్స్, ప్లైయర్స్ ఫ్యాంట్స్, కోకాకోలా, పెప్సీకోలా, బర్గర్స్, సిజలర్స్ లాంటి బ్రాండ్స్ లాంటివి నేటి ప్రేమ. నువ్వొక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు. ఎందుకంటే ఆ ప్రేమకు నువ్వెంత పెట్టుబడి పెట్టగలవాని ఆలోచిస్తుంది. నీదే ప్రేమని నువ్వనుకుంటాను. కానీ ఆ అమ్మాయికి ప్రేమంటే-

 

    'తూ నహీతో ఔర్  నహీతో ఔర్ నహీ' అంటే దానర్ధం నువ్వు కాకపొతే మరొకరు.... మరొకరు కాకపొతే మరొకరు...... అంచేత నేటి లవ్ కి నిర్వచనం..... ఒక యువతికి యువకుడిచ్చే అత్యాధునికమయిన సౌకర్యాలు..... ఆమెను నువ్వు అలా సియోలో కారులో తిప్పాలి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో బర్త్ డేలు జరపాలి. డిస్కోథెక్ క్లబ్స్ లో ఆమెకు, ఆమె ఫ్రెండ్స్ కూ హాట్ హాట్ పార్టీలివ్వాలి. నేటి మోడ్రన్ లవ్ యువతీ, యువకుల లగ్జరీలకు పునాది...... జిమ్, స్విమ్మింగ్స్, హార్స్ రైడింగ్ సింగపూర్, మలేషియాల్లో సైట్ సీయింగ్, స్విట్జర్ లాండ్ లో షాపింగ్.....

 

    ఇప్పటి ప్రేమకు లవ్ లెటర్స్ అక్కర్లేదు. వీడియో కౌన్సిలింగ్స్ లోంచి నేటి అల్ట్రా మోడ్రన్ లవ్ పడుతోంది. లేజర్ డిస్క్ ల మీద పురులు విప్పుకుంటున్న నేటి లవ్, వీడియో ఫోన్స్ లో సరాగాలాడుతూ, శాటిలైట్ ఛానెల్స్ లింక్స్ లో దూరాలను మటుమాయం చేస్తోంది.

 

    "నిన్ను ప్రేమిస్తే నాకేమిస్తావ్. నీ వెనుక హీరోహోండా ఎక్కి కూర్చుంటే నాకేం వస్తుంది? కారైనా లేకపోతే కాలక్షేపం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే గుడ్ బై...." అని అమ్మాయిలంటే-

 

    అందుకోసం అబ్బాయిలు, ఆ రోమాంటిక్ విలాసాల అనుభూతల కోసం తల్లిదండ్రుల్ని మభ్యపెడుతున్నారు. ప్రేమించే ప్రేయసి లేదా ప్రియుడు వేరు, కామించే ప్రేయసి లేదా ప్రియుడు వేరు. పెళ్ళి కోసం కరెన్సీతో కాంక్రీట్ పునాదుల్ని వేసుకుంటున్నారు. కట్టే తాళిని తూకం వేస్తూ ఒక పక్క విదేశీ ఉద్యోగావకాశాలు, రెండోపక్క  అత్యాధునిక సౌకర్యాలు వుండేటట్టుగా చూసుకుంటున్నారు. అంచేత నేటి ప్రేమకు సిన్సియారిటీ అక్కర్లేదు. 'పెట్టుబడి కావాలి.

 

    ఎందుకంటే- ప్రేమ...... హృదయాలతో బిజినెస్ చేసే మల్టీ క్రోర్ ప్రాజెక్టు అయిపోయింది. అండర్ స్టాండ్ మైడియర్ ఫ్రెండ్?" దీర్ఘోపన్యాసం యిచ్చాడు తేజ.

 

    ప్రేమ గురించి తేజకి అంత అవగాహన వుందని తెలియని మధు, కొద్దిక్షణాలు బిత్తరపోయాడు. అంతకంటే ఎక్కువగా షాక్ కూడా తిన్నాడు. ప్రేమ గురించి కొత్త కొత్త విషయాలు తెలియడంతో.


    
    సరిగ్గా అదే సమయంలో క్యాంటీన్ లోకి వచ్చింది సుష్మా ఫ్రాంక్లిన్. "

 

    "ఏయ్ సుష్మా ఇదరావ్! ఏంటీ ఈ మధ్య కనిపించటం లేదు?" అడిగాడు రమణ - ఆమెకేసి కాంక్షగా చూస్తూ.

 

    సుష్మకు పాతికేళ్లుంటాయి. వరసగా డిగ్రీలు, డిప్లమాలు చేయటం ఆవిడ హాబీ. ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది.

 

    "చూడండీ ఫ్రెండ్స్! మీవల్ల నాకేం ఉపయోగం లేదు. మీరంతా కూతల మనుషులే తప్ప చేతల మనుషులు కారు  లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో ఫర్ మి! ఎంజాయ్ అండ్ ఎంజాయ్. ఇదే ఫిలాసఫీ నాది. కాలచక్రంలో దాగుండే క్షణాలనీ, నిమిషాలనీ, గంటలనీ రోజుల్నీ కొందరు డబ్బుకోసం, మరికొందరు పేరుప్రతిష్టలకోసం, ఇంకా కొందరు అధికారం కోసం వృధా చేసుకుంటారు. అది నాకు నచ్చదు."

 Previous Page Next Page